breaking news
employment fraud
-
రెయిన్బో టెక్నాలజీస్ పేరుతో ఘరానా మోసం
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని 100 మందిని నమ్మించి మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెబ్ టెక్నాలజీ, వెబ్ డిజైనింగ్లలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగ యువతకు వల వేసింది ఓ ముఠా. రెయిన్బో టెక్నాలజీస్ పేరుతో దాదాపు వంద మందిని రిక్రూట్ మెంట్ చేసుకుంది. శిక్షణ ఇప్పించేందుకు డిపాజిట్ చేయాలంటూ ఒక్కొక్కరి నుంచి రూ.9వేల నుంచి 15 వేల వరకూ వసూలు చేసింది. సుమారు వంద మంది నుంచి 10లక్షల రూపాయలు వసూలు చేసింది. మూడు నెలలు గడిచినా నిర్వాహకులు ఏ ఒక్కరికి ఉద్యోగాలు కల్పించలేదు. దీంతో అనుమానం వచ్చి బాధితులంతా విశాఖ త్రీ టౌన్ పోలీసులను సంప్రదించారు. ఉద్యోగాల పేరుతో తమను మోసం చేశారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్త ప్రారంభించారు. -
ఉద్యోగాల పేరుతో.. విదేశాల్లోని వ్యభిచార గృహాలకు
చిత్తూరు: ఉద్యోగాల పేరిట మహిళల్ని మోసం చేసి మలేషియాలోని వ్యభిచార గృహాలకు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు పోలీసు శాఖలోని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) రత్న బుధవారం స్థానికం పోలీసు అతిథిగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వివాహిత నుంచి తమకు ఫిర్యాదు అందిందన్నారు. ఉద్యోగం పేరిట మోసం చేసి తనను మలేషియాలోని వ్యభిచార గృహంలో అమ్మేసినట్లు తెలిపిందని, ఏడు నెలల పాటు వేశ్యగా మారి వచ్చిన డబ్బుతో అక్కడి వ్యభిచార గృహ నిర్వాహకులకు రూ.1.80 లక్షలు చెల్లించి భారత్కు తిరిగి వచ్చినట్లు ఫిర్యాదు రావడంతో కేసు దర్యాప్తు చేశామన్నారు. తమిళనాడులో చెన్నైలోని కొడుజూర్కు చెందిన ఎ.రఫి (41)ను తొలుత అరెస్టుచేసి విచారిస్తే ఓ ప్రైవేటు విమాన టికెట్ల బుకింగ్ సెంటర్ పెట్టుకున్నట్లు తెలిసిందన్నారు. ఇక్కడ దుబాయ్, మలేషియా, షార్జాకు వెళ్లే వాళ్లకు టికెట్లు, వీసా ఇపిస్తూ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళల్ని మధ్యవర్తుల ద్వారా గుర్తించి వీళ్లను మలేషియాలోని వేశ్య గృహాలకు తరలిస్తున్నట్లు తేలిందన్నారు. మలేషియాలోని ధను అనే మహిళకు చెందిన వేశ్య గృహంలో ఇప్పటి వరకు పెద్ద సంఖ్యలో మహిళల్ని విక్రయించినట్లు అంగీకరించాడు. తనకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో 19 మంది ఏజెంట్లు ఉన్నారని వీళ్ల ద్వార మహిళల్ని విదేశాలు పంపుతున్నట్లు ఒప్పుకున్నాడు. ఇతనితో పాటు ఈ అక్రమ రవాణాలో ఏజెంట్గా వ్యవహరిస్తున్న తమిళనాడులోని మధురై జిల్లా సెల్లూరుకు చెందిన పాండియరాజన్ (38) అనే వ్యక్తిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. సింగపూర్, మలేషియా ప్రాంతాల్లో పట్టున్న ఇతను రఫీకి పలువురు మహిళల్ని పరిచయం చేయించి వాళ్లను అక్రమంగా వేశ్య గృహాలకు విక్రయించడంలో తోడ్పడేవాడు. నిందితుల్ని న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని రత్న తెలిపారు.