breaking news
Employees Deposit Linked Insurance Scheme
-
ఎక్స్‌గ్రేషియా రూ.6 లక్షలకు పెంపు
కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: మరణించిన కార్మికుల కుటుంబాలకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ బీమా పథకం కింద ఇచ్చే పరిహారాన్ని రూ.6 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కేంద్ర ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ట్రస్టీల సమావేశం అనంతరం దత్తాత్రేయ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మికుల సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు వివరించారు. డిపాజిట్ లింక్డ్ బీమా పథకం ద్వారా ప్రస్తుతం కార్మికుల కుటుంబాలకు రూ.3.60 లక్షలు మాత్రమే అందుతోందని పేర్కొన్నారు. దీనివల్ల 4 కోట్ల మంది భవిష్యత్నిధి చందాదారులకు(ఈపీఎఫ్) లబ్ధి చేకూరుతుందన్నారు. సంవత్సరంపాటు తప్పనిసరిగా ఉద్యోగం చేసుండాలన్న నిబంధనను తొలగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. పారదర్శకతతో ఉద్యోగుల భవిష్యనిధి కార్యకలాపాలను నిర్వహించడానికి మొబైల్ అప్లికేషన్ రూపొందించామన్నారు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులందరికీ విశిష్ట ఖాతానంబర్, భవన నిర్మాణ కార్మికులందరికీ ఈపిఎఫ్ వర్తింపచేస్తున్నామన్నారు. కార్మికుల సంక్షేమనిధి వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలను పాటించని రాష్ట్రాల కార్మిక సంక్షేమ బోర్డులను రద్దు చేయడంతోపాటు, ఆయా రాష్ట్రాల నిధులను స్వాధీనం చేసుకుంటామని కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ కార్యదర్శి శంకర్ అగర్వాల్ తెలిపారు. -
వడ్డీ పెంపుతో ఆకర్షణీయంగా ఈపీఎఫ్
ప్రభుత్వం కానీండి... ప్రైవేటు కానీండి. ఉద్యోగులందరికీ పరిచయం అక్కర్లేని పేరు ఈపీఎఫ్. వివరంగా చెప్పాలంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్. రిటైరయ్యాకో... ఉద్యోగం మానేశాకో... పెద్ద మొత్తం చేతికొచ్చేదేమైనా ఉంటే అది ఈపీఎఫ్ నుంచే. అందుకే దీన్ని భవిష్య నిధిగా పిలుస్తుంటారు. దీన్నిపుడు మరింత పారదర్శకంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆ చర్యలేంటి? ఈపీఎఫ్‌లో ఎంత జమ చేయాలనేది పూర్తిగా యాజమాన్యం ఇష్టమేనా... లేక మనం కూడా మనకు నచ్చినంత దాన్లో జమ చేయొచ్చా? ఇపుడున్న వడ్డీ రేటును బట్టి చూస్తే అదనపు మొత్తం వేయటం కరెక్టేనా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ వారం ప్రాఫిట్ కథనం... ఇవీ తాజా చర్యలు... 1) ఇకపై శాశ్వతంగా పీఎఫ్ ఖాతా నంబరు ఒకటే ఉంటుంది. ఒకవేళ ఉద్యోగం మారినా సరే... అదే ఖాతా కంటిన్యూ అవుతుంది. ఖాతాలోని మొత్తాన్ని వేరే ఖాతాకు బదిలీ చేసుకోవటం వంటి ఇబ్బందులుండవన్నమాట. 2) ఖాతాలన్నిటినీ ఆన్లైన్ చేశారు. దీంతో ఎవ్వైరె నా, ఎప్పుడైనా తమ ఖాతాలోని బ్యాలెన్స్‌ను ఆన్లైన్లో చూసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా బదిలీ కూడా చేసుకోవచ్చు. 3) కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచబోతున్నారు. ప్రస్తుతం వ్యక్తి జీతం ఎంత ఉన్నప్పటికీ రూ.6,500 బేసిక్ శాలరీని పరిగణనలోకి తీసుకుంటే చాలు. దీన్నిపుడు రూ.15,000కు పెంచబోతున్నారు. 4) గతేడాది పీఎఫ్ ఖాతాలోని మొత్తంపై 8.5 శాతం వడ్డీ ఇచ్చారు. ఈ ఏడాది దాన్ని మరో 0.25 శాతం... అంటే 8.75 శాతానికి పెంచారు. ఇరవై మంది కన్నా ఎక్కువ ఉద్యోగులున్న ప్రతి సంస్థా తప్పనిసరిగా పీఎఫ్ పథకాన్ని అమలు చేయాలి. దీని ప్రకారం మీ జీతంపై (బేసిక్ శాలరీ + డీఏ) 12 శాతం సంస్థ చెల్లించాలి. దానికి సమానంగా ఉద్యోగి జీతం నుంచి మరో 12 శాతం ఈపీఎఫ్ ఖాతాకి జమ చేస్తాడు. ఉదాహరణకి మీ జీతం (బేసిక్ + డీఏ) రూ.20,000 అనుకుంటే ప్రతినెలా కంపెనీ రూ.2,400, మీరు రూ.2,400 జమ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ సంస్థలు ఇలా జమ చేస్తున్నా, ప్రైవేటు సంస్థల్లో చాలావరకూ ఇలా చేయటంలేదు. జీతం ఎంత ఉన్నప్పటికీ కనీసం రూ.6,500 బేసిక్ శాలరీపై 12 శాతాన్ని జమ చేయాలని చట్టం చెబుతుండటంతో దాన్ని మాత్రమే జమ చేస్తున్నాయి. అంటే రూ.20,000 జీతం ఉన్నప్పటికీ రూ.780 మాత్రమే జమ చేస్తాయన్న మాట. మరికొన్ని కంపెనీలైతే రెండు పీఎఫ్లనూ (ఉద్యోగి వాటా + యాజమాన్య వాటా) ఉద్యోగి నుంచే వసూలు చేస్తున్నాయి. దీని కోసం ఆయా కంపెనీలు కాస్ట్ టు కంపెనీ(సీటీసీ) విధానాన్ని అమలు చేస్తున్నాయి. దీని ప్రకారం కంపెనీ చెల్లించాల్సిన పీఎఫ్ వాటాను కూడా ఉద్యోగి వార్షిక ప్యాకేజీలో కలిపేసి ఒక ఉద్యోగి మీద ఇంత వ్యయం చేస్తున్నట్లు చూపిస్తున్నాయి. ఉదాహరణకు మీ వార్షిక జీతం రూ.5,00,000 అనుకుందాం. దీని ప్రకారం కంపెనీ పీఎఫ్ ఖాతాకు సంవత్సరానికి రూ.60,000 కేటాయించాల్సి ఉంటుంది. కాని సీటీసీ విధానంలో కంపెనీలు మీ వార్షిక జీతాన్ని రూ.5,60,000గా చూపించి రెండు పీఎఫ్‌లను మీ నుంచే జమ చేయిస్తాయి. దీని వల్ల మీ చేతికి వచ్చే జీతం తగ్గిపోతుంది. అదనంగా కేటాయించొచ్చా?.... ఇపుడు బ్యాంకుల్లో చూసినా డిపాజిట్లపై కాలపరిమితిని బట్టి 7 నుంచి 8.5 శాతం వరకు మాత్రమే వడ్డీ వస్తోంది. మిగిలిన ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో కాస్త ఎక్కువ వడ్డీ వచ్చేవి ఉన్నా... వాటిలో ప్రధాన సమస్య సెక్యూరిటీ. మనం పెట్టిన పెట్టుబడికి కూడా భద్రత సమస్యగానే ఉంటోంది. అదే పీఎఫ్‌లో అయితే భద్రత సమస్యే కాదు. ఎందుకంటే ఇది ప్రభుత్వ కనుసన్నల్లో నడిచే ట్రస్టు. 5 కోట్ల మందికిపైగా ఖాతాదారులున్నారు. పెపైచ్చు ఈ ఏడాదికి (2012-13) వడ్డీరేటును 8.50 శాతం నుంచి 8.75 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వీటన్నిటికీ తోడు పీఎఫ్ మీద వచ్చే వడ్డీపై పన్ను కూడా ఉండదు. అందుకే దీన్లో అదనపు మొత్తాన్ని కూడా జమ చేసుకుంటే లాభమన్నది నిపుణుల సలహా. చట్ట ప్రకారం పేర్కొన్న 12 శాతం కాకుండా అదనంగా కూడా పీఎఫ్ ఖాతాలో ఉద్యోగులు జమ చేసుకోవచ్చు. దీనిపై ఎలాంటి పరిమితులూ లేవు. అవసరమైతే మీ జీతం మొత్తం కూడా పీఎఫ్‌కి కేటాయించుకోవచ్చు. ఇలా కేటాయించిన అదనపు మొత్తంపై కూడా ఇదే వడ్డీ రేటు, పన్ను రాయితీలు లభిస్తాయి. దీన్ని వాలంటరీ కంట్రిబ్యూషన్‌గా పిలుస్తారు. అయితే దీన్ని మీరు నేరుగా చేయలేరు. పని చేస్తున్న కంపెనీ నుంచి ప్రతిపాదన వెళ్లాలి. ఇందుకోసం మీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ను సంప్రదించాలి. అదనంగా ఎంత మొత్తం కేటాయించాలనుకున్నారో చెప్పి, దానికి సంబంధించిన పత్రాన్ని పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా అదనంగా కేటాయించడం వల్ల మీ చేతికి వచ్చే జీతం తగ్గినా, ఉన్న ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో ఇది అత్యుత్తమమైనదన్న విషయం మర్చిపోవద్దు. ఇదే కోవకు చెందిన ఇతర సేవింగ్ పథకాలతో పోలిస్తే ప్రస్తుతం ఈపీఎఫ్ వడ్డీనే ఆకర్షణీయంగా ఉంది. 15 ఏళ్ల కాలపరిమితి ఉన్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై 8.7 శాతం, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ (ఎన్ఎస్సీ)పై ఐదేళ్లకు 8.5 శాతం, పదేళ్లకు 8.8 శాతం వడ్డీ వస్తుండగా, బ్యాంకుల ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్లపై 8 నుంచి 9 శాతం వరకు వడ్డీ వస్తోంది. కాని బ్యాంకు డిపాజిట్లు, ఎన్ఎస్ఈలపై వచ్చే వడ్డీ... పన్ను భారానికి గురవుతుంది. అదే ఈపీఎఫ్‌లో అయితే అన్ని దశల్లో అంటే ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, ఏటా వడ్డీ వస్తున్నప్పుడు, వెనక్కి తీసుకున్నప్పుడు కూడా ఎటువంటి పన్ను భారం ఉండదు. ఇక కనీస పీఎఫ్ రూ.1,800! పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని కనీస పీఎఫ్ మొత్తాన్ని పెంచే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం కనీస జీతం రూ.6,500పై పీఎఫ్‌ను లెక్కిస్తుండగా, ఇప్పుడా మొత్తాన్ని రూ.15,000కి పెంచే ప్రతిపాదన చేశారు. ఇది అమల్లోకి వస్తే ఇక నుంచి ప్రతి నెలా కనీస పీఎఫ్ కింద కంపెనీ రూ.1,800, ఉద్యోగి రూ.1,800 చొప్పున రూ.3,600 పీఎఫ్ ఖాతాకి జమ అవుతాయి.