breaking news
employee suspension
-
ఇంత ‘పచ్చ’పాతమా?
ఈ ఫొటోను బాగా పరిశీలించండి. ఇక్కడ ప్రచారం చేస్తున్న వ్యక్తి మొన్న ఎన్నికల్లో టీడీపీ తరుపున కదిరి నియోజకవర్గ బరిలో నిలిచిన అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్. ఆయన పక్కనే కనిపిస్తున్న వ్యక్తి పేరు సుధాకర్ యాదవ్. ఈయన వయోజన విద్య కదిరిని నియోజకవర్గ సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. ఇలా బాహాటంగానే టీడీపీ తరుఫున ప్రచారం చేశాడు. సీ–విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు రావడంతో విచారించి సస్పెన్షన్‌కు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీరపాండియన్ సిఫార్సు చేశారు. కానీ నేటికీ ఆయనపై కనీస చర్యలు లేవు. అనంతపురం ఎడ్యుకేషన్ : ఓ వైపు ప్రతిపక్ష నేత ఇచ్చిన హామీని హర్షిస్తూ మాట్లాడిన ఉద్యోగిని సస్పెండ్ చేశారు. మరో పక్కేమో ఏకంగా టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసిన ఉద్యోగిపై కనీస చర్యలు తీసుకోకుండా అధికారులు ద్వంద వైఖరి అవలంభించడాన్ని ఉద్యోగ వర్గాలు తప్పుపడుతున్నాయి. టీడీపీకి కొందరు అధికారులు ఏకపక్షంగా పని చేశారనేందుకు ఈ ఉదంతమే నిదర్శనంగా నిలుస్తోంది. రిటర్నింగ్ అధికారి వద్దే బ్రేక్ టీచరుగా పని చేస్తున్న సుధాకర్‌యాదవ్ వయోజన విద్యశాఖకు బదిలీ అయి అక్కడ సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ రిటర్నింగ్ అధికారి కూర్మనాథ్... డీఈఓకు సిఫార్సు లేఖ పంపారు. సదరు ఉద్యోగి తమశాఖలో లేరని ప్రస్తుతం పని చేస్తున్న వయోజన విద్య డీడీకి డీఈఓ ఉత్తర్వులు పంపారు. వయోజన విద్య డీడీకి సస్పెండ్ చేసే అధికారం లేకపోవడంతో తిరిగి రిటర్నింగ్ అధికారి కూర్మనాథ్‌కు వివరణ లేఖ ఇచ్చారు. సుధాకర్‌యాదవ్ తమ శాఖలోనే పని చేస్తున్నాడంటూ లేఖలో స్పష్టం చేశారు. అంతే ఈ తతంగం అంతటితో ఆగిపోయింది. ‘కందికుంట’ ఒత్తిళ్లు టీడీపీ అధికారంలో ఉండటంతో కందికుంట వెంకటప్రసాద్ ఆర్ఓ కూర్మనాథ్పై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. సుధాకర్‌యాదవ్ మరో పదిమంది వచ్చి నేరుగా ఆర్‌ఓతో మాట్లాడినట్లు సమాచారం. దీంతో సస్పెన్షన్ ఉత్తర్వులు ఇక్కడితో ఆగిపోయాయి. దీని వెనుక కొందరి మధ్య డబ్బులు చేతులు మారినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీరపాండియన్ దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. వయోజన విద్య డీడీ రమణ ఏమంటున్నారంటే... సుధాకర్‌యాదవ్‌పై చర్యలు తీసుకోవాలంటూ డీఈఓ నుంచి మాకు ఉత్తర్వులు వచ్చాయి. సస్పెన్షన్ చేసే అధికారం లేకపోవడంతో సదరు ఉద్యోగి మా శాఖలోనే పని చేస్తున్నారంటూ ధ్రువీకరిస్తూ రిటర్నింగ్ అధికారికి లేఖ ఇచ్చాను. ఏమి జరిగిందో ఏమో నాకు తెలీదు. సుధాకర్‌యాదవ్‌ను మాత్రం సస్పెండ్ చేయలేదు. -
సీతారాములకే శఠగోపం..?
► మాయమైన ఆభరణాలు లభ్యం ► రాముడి ఆభరణాలు నృసింహుడి బీరువాలో ప్రత్యక్షం ► పరిపాలనా విభాగంలో మాయాజాలం ► నివ్వెరపోతున్న యంత్రాంగం ► ఉద్యోగి సస్పెన్షన్‌తో బయటపడ్డ వైనం వేములవాడ: సీతారాములకే శఠగోపం పెట్టాలని చూశారు ఉద్యోగులు. తమ మొక్కులు తీరిన తర్వాత భక్తులు భక్తితో స్వామివారికి సమర్పించిన వెండి ఆభరణాలను చాకచక్యంగా కాజేయాలని యత్నించి పట్టుబడ్డ వైనం ఉద్యోగి సస్పెన్షన్‌తో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఓదెలు కుటుంబసభ్యులతో కలసి వచ్చి మామిడిపల్లి సీతారామచంద్రస్వామివార్లకు వెండి ఆభరణాలు బహూకరించారు. అవి మాయం కావడంతో అక్కడ విధులు నిర్వహించే ప్రశాంత్‌బాబు అనే ఉద్యోగిని ఈనెల 25న సస్పెండ్ చేస్తూ ఆలయ ఈవో దూస రాజేశ్వర్ ఉత్తర్వులు వెలువరించారు. ఈనెల 28లోగా సంజాయిషీ ఇవ్వకుంటే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించడంతో అసలు కథ బయటపడింది. ఆలయ పరిపాలనా విభాగం కార్యాలయంలోని నాంపల్లి నర్సింహాస్వామి ఆలయానికి చెందిన బీరువాలో మామిడిపల్లి సీతారామచంద్రస్వామివారికి భక్తులు సమర్పించిన వెండి శంఖు, నామాలు రూ.50వేల విలువైన ఆభరణాలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఆలయ అధికారుల్లో తర్జనభర్జన మొదలైంది. రాజన్న ఆలయంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని స్థానికంగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అసలేం జరిగింది వేములవాడ రాజన్న ఆలయ అనుబంధ దేవాలయమైన మామిడిపల్లి సీతారామచంద్రస్వామివారి ఆలయానికి హైదరాబాద్‌కు చెందిన ఓదెలు అనే భక్తులు ఇటీవలే వెండి శంఖు, నామాలతోపాటు కూడిన ఆభరణాలను బహూకరించారు. అయితే ఈ ఆభరణాలను సదరు ఉద్యోగి ప్రశాంత్‌బాబు ఆలయానికి అప్పగించకుండా కాలయాపన చేస్తున్నారు. ఈ క్రమంలో భక్తుడే స్వయంగా మరోసారి వేములవాడకు చేరుకుని తనకు రశీదు ఇవ్వాలని పట్టుబట్టడంతో ఈ అంశం మరింత వెలుగుచూపింది. భక్తులు సమర్పించిన వెండి ఆభరణాలను అప్పగించాలని, లేకుంటే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని ప్రశాంత్‌బాబును సస్పెండ్ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడంతో సీతారామచంద్రుడికి సంబంధించిన ఆభరణాలు నాంపల్లి లక్ష్మీనర్సింహుడి బీరువాలో బుధవారం ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఆలయ అధికారులు కంగుతిన్నారు. పరిపాలనా విభాగంలో మాయాజాలం వేములవాడ రాజన్న ఆలయంతోపాటు అనుబంధ, దత్తత దేవాలయాలకు సంబంధించిన పరిపాలనా విభాగం ఆలయంలోని ప్రధాన కార్యాలయంలో జరుగుతుంటుంది. ఇందుకు సిబ్బంది, మందీమార్బలం అంతా ఉంటారు. ఇంతేకాకుండా ఇటీవలే ఈ కార్యాలయంలోకి వచ్చేవారి వివరాలు నమోదు చేసేందుకు రక్షణ సిబ్బందిని సైతం నియమించారు. ఇన్ని ఉన్నా రూ.50వేల విలువ చేసే వెండి ఆభరణాలను ఎవరు తీసుకొచ్చి నాంపల్లి నర్సింహాస్వామి దేవస్థానానికి చెందిన బీరువాలో పెట్టారన్నది ఆలయ ఉద్యోగుల్లో చర్చ సాగుతోంది. రూ.కోట్ల ఆదాయం వస్తున్న ఈ ఆలయంలో ఇంతటి భద్రత లోపం జరుగుతుందంటూ స్థానికంగా ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగుల మధ్య లడాయి మామిడిపల్లి సీతారామచంద్రస్వామివారి ఆలయంలో ఇటీవల ఉద్యోగుల బదాలాయింపు జరిగింది. దీంతో ఇరువురు ఉద్యోగుల మధ్య లడాయి జరగడం, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకోవడం లాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో అసలు కథ బయటికి పొక్కింది. ఆభరణాలు దొరికాయి హైదరాబాద్‌కు చెందిన ఓదెలు అనే భక్తుడు సీతారామచంద్రస్వామికి బహూకరించిన వెండి ఆభరణాలు నాంపల్లి నర్సింహాస్వామి ఆలయానికి చెందిన బీరువాలో దొరికాయి. ఈ అంశంలో తనకు సైతం చార్జిమెమో ఇచ్చారు. – గౌరీశంకర్, పర్యవేక్షకుడు -
మంత్రి పర్యటనకు గైర్హాజరు.. అధికారిని సస్పెండ్
అశ్వరావుపేట(ఖమ్మం): రాష్ట్ర మంత్రి పర్యటనకు హాజరుకాని ప్రభుత్వ అధికారినిపై సస్పెన్షన్ వేటు పడింది. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలంలో శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పర్యటించారు. ఈ పర్యటనకు ఐసీడీఎస్ సీడీపీఓగా విధులు నిర్వహిస్తున్న అన్నపూర్ణ అనే ఉద్యోగిని గైర్హాజరయ్యారు. దీంతో ఆగ్రహించిన మంత్రి సీడీపీఓను సస్పెండ్ చేయాలని కలెక్టర్ రాజీవ్‌కు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.