‘మహిళలు కూడా తలాక్ చెప్పొచ్చు’
న్యూడిల్లీ: ముస్లింలో వివాహం అనేది ఒక కాంట్రాక్ట్ వంటిదని, అయితే, వారి హుందాతనాన్ని, అవసరాలకు భద్రత కల్పించేందుకు నిఖానామాలో కొన్ని క్లాజులు కూడా ఉన్నాయని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ట్రిపుల్ తలాక్‌పై పెద్ద మొత్తంలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఏఐఎంపీఎల్బీ తరుపున వాదనలు వినిపిస్తున్న ఎజాహ్ మక్బూల్ ఈ మేరకు ప్రతిపాదనను సుప్రీంకోర్టు ముందు ఉంచారు.
ముస్లిం మహిళ వివాహ ప్రక్రియలోకి అడుగుపెట్టే సమయంలో వివాహ నమోదుతో సహా ప్రత్యేక వివాహ చట్టం 1954 ప్రకారం వారికి నాలుగు రకాల ప్రత్యమ్నాయాలు ఉంటాయని పేర్కొంటూ రాజ్యాంగ ధర్మాసనానికి కొన్ని పత్రాలు అందజేశారు. ముస్లిం మహిళలకు కూడా ట్రిపుల్ తలాక్ చెప్పే హక్కు ఉందని వారు సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు.