2.11లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు ఓకే!
• 29 ప్రతిపాదనలకు ఆమోదం
• 2016 వార్షిక నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిత్వశాఖ నియంత్రణలో పనిచేసే వ్యయ వ్యవహారాల ఆర్థిక సంఘం (ఈఎఫ్సీ) గత ఏడాది 29 పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. వీటి మొత్తం విలువ దాదాపు రూ.2.11 లక్షల కోట్లు. దీనితోపాటు వ్యయ కార్యదర్శి నియంత్రణలో పనిచేసే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ (పీఐబీ) మరో 12 ప్రతిపాదనలను క్లియర్ చేసింది. వీటి విలువ రూ.28,673 కోట్లు. ఆర్థికశాఖ పరిధిలో పనిచేసే వ్యయ నిర్వహణా శాఖ తన 2016 వార్షిక సమీక్షా నివేదికలో ఈ అంశాలను తెలిపింది.
‘‘జనవరి 1 నుంచి నవంబర్ 30వ తేదీ మధ్య వ్యయ కార్యదర్శి నేతృత్వంలోని ఈఎఫ్సీ రూ.2,11,049 కోట్ల విలువచేసే 29 పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది’’ అని ఈ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వ ఆర్థిక నిర్వహణా వ్యవస్థ (పీఎఫ్ఎంఎస్)కు సంబంధించి వివరిస్తూ, అన్ని ప్రణాళిక, ప్రణాళికేత పథకాల నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో వెబ్–బేస్డ్ ఆన్లైన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నట్లు వివరించింది. కేంద్రీయ ప్రజా సమస్యల పరిష్కారం, నిర్వహణా వ్యవస్థ (సీపీజీఆర్ఏఎంఎస్) సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తెలిపింది. 4,508 ఫిర్యాదులు నమోదుకాగా 4,475 ఫిర్యాదులను విజయవంతంగా ఈ వ్యవస్థ ద్వారా పరిష్కరించినట్లు నివేదిక పేర్కొంది.