breaking news
Ebola disease
-
గాంధీ, కింగ్‌జార్జి ఆస్పత్రుల్లో ఎబోలాకు చికిత్స
ఎబోలా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రులను కేంద్రం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖలోని కింగ్‌జార్జి ఆస్పత్రిని, తెలంగాణలో గాంధీ ఆస్పత్రిని ఈ వ్యాధి చికిత్స కోసం గుర్తించినట్టు తెలిపింది. రాజ్యసభలో ఆరోగ్య మంత్రి జె.పి.నడ్డా ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ సంగతి తెలిపారు. -
విమానాశ్రయంలో ఎబోలా పరీక్షలు
శంషాబాద్: ఆరు నెలలుగా పశ్చిమ ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ఎబోలా వ్యాధితో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో వైద్యబృందాలు ప్రయాణికులకు నిరంత పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల దేశరాజధానిలోని ఢిల్లిలో ఓ ప్రయాణికుడి వ్యాధి లక్షణాలు కనిపించడంతో విమానాశ్రయాల్లో వైద్యపరీక్షలు మరింత పకడ్భందిగా నిర్వహిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఇరవైనాలుగగంటల పాటు 28 మంది వైద్య బృందంతో పశ్చిమాఫ్రికా, గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రధాన వైద్యాధికారి మహేష్ ‘సాక్షి’కి తెలిపారు. జులై నుంచి కొనసాగుతున్న వైద్య పరీక్షల్లో ఇప్పటి వరకు 2500 మంది ప్రయాణికులకు స్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు ఆయన వివరించారు. పదిహేను రోజుల కిందట కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వైద్య పరీక్షలకు సంబంధించిన ఉన్న సదుపాయాలను కూడా పరిశీలించింది. ప్రధానంగా ఒళ్లునొప్పులు, వాంతులు, దగ్గు, ర్యాష్ వంటి లక్షణాల తీవ్రత ఉన్న వాళ్లను పరీక్షించి వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఎబొలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే ఇంతవరకు తీవ్ర ఉన్న కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదన్నారు. -
ఎల్లలెరుగని ఎబోలా!
ఆమధ్య పశ్చిమ ఆఫ్రికాలో బయటపడి అందరినీ భీతావహుల్ని చేస్తున్న ఎబోలా వ్యాధి అడ్డూ ఆపూ లేకుండా విస్తరిస్తున్నది. ఇప్పటికి 10,141 కేసులు నమోదుకాగా అందులో 4,922 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. నమోదుకాని కేసుల సంఖ్య అంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందంటున్నారు. ప్రధానంగా గినియా, లైబీరియా, సియెర్రా లియోన్ దేశాలు ఈ వ్యాధితో అల్లాడుతున్నాయి. నిర్ధారిత వ్యాక్సిన్ ఏదీ అందుబాటులో లేని ప్రస్తుత స్థితే కొనసాగితే డిసెంబర్‌కల్లా మరో 10,000మంది ఈ వ్యాధి బారిన పడే అవకాశమున్నదని నిపుణులు చెబుతున్న మాట. అంతేకాదు, ఇది యూరప్, అమెరికా, ఇతర దేశాలకు కూడా విస్తరించవచ్చునని వారు అంచనావేస్తున్నారు. యేల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, లైబీరియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు వెల్లడిస్తున్న అంచనాలు ఇంతకన్నా భయంగొలిపేవిగా ఉన్నాయి. డిసెంబర్ మధ్యకల్లా ఒక్క లైబీరియాలోనే 90,000 మంది మరణించే ప్రమాదమున్నదని వారు చెబుతున్నారు. వ్యాధి పుట్టి విస్తరిస్తున్నది ఇప్పటికైతే మారుమూలనున్న నిరుపేద దేశాల్లో గనుక సంపన్న దేశాలు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయని, మాటలు చెప్పినంత స్థాయిలో వాటి చేతలు ఉండటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాధిని అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి వంద కోట్ల డాలర్లు (సుమారు రూ. 6,000 కోట్లు) అవసరమవుతాయని ఐక్యరాజ్యసమితి వేసిన అంచనాలో ఇంతవరకూ నాలుగో వంతు కూడా సమకూరలేదంటే ఈ ఆరోపణల్లో వాస్తవమున్నదని అనుకోవాల్సి వస్తున్నది. ఒకపక్క ఉగ్రవాదంపై పోరాటమంటూ వేలకోట్ల డాలర్లు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుచేస్తున్న పాశ్చాత్య దేశాలు అంతకు మించి ఎన్నోరెట్లు ప్రమాదకరమైన ఎబోలాను విస్మరించడం ఆందోళనకరం. డబ్ల్యూహెచ్ఓ ‘గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ’గా ప్రకటించిన వ్యాధి విషయంలోనే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం క్షంతవ్యంకాని నేరం. ప్రపంచీకరణ పెరిగిన ప్రస్తుత తరుణంలో ఏ దేశమూ వ్యాధిబారిన పడకుండా... కనీసం దాని ప్రభావమైనా పడకుండా సురక్షితంగా ఉండే అవకాశం లేదు. వ్యాపారం కోసం, బతుకుదెరువు కోసం ఎంతదూరమైనా, ఎక్కడికైనా వెళ్తున్న ప్రస్తుత తరుణంలో ఎబోలా వ్యాధి విస్తరణకు హద్దులుండవు. భిన్న రంగాలపై అది కలగజేసే ప్రభావమూ ఎక్కువగానే ఉంటుంది. వ్యాధిగ్రస్త దేశాల్లో దేశీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) క్షీణ దశలో ఉన్నదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ దేశాల్లో ఆర్థిక వనరులన్నీ ఎబోలా వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి కేంద్రీకరించాల్సివస్తున్నది. అంతేకాదు, సామాన్యులు ఈ వ్యాధిబారిన పడటంవల్ల వారు వేతనాలు కోల్పోవడమే కాదు... ఉత్పాదకత మందగిస్తున్నది. కాఫీ, కోకో, పామాయిల్, రబ్బర్ వంటి ఎగుమతులు గణనీయంగా పడిపోయాయి. నిర్మాణ రంగమైతే పూర్తిగా పడకేసింది. పర్యాటకరంగంపైనే ప్రధానంగా ఆధారపడే దేశాలకు ఈ వ్యాధి వ్యాప్తి శాపంలా మారింది. ఇది కేవలం వ్యాధిగ్రస్త దేశాలకు మాత్రమే పరిమితమయ్యే ఇబ్బంది కాదు. ఆ దేశాలతో ఆర్థికబంధం ఉండే దేశాలన్నిటికీ దీని సెగ తగులుతుంది. వ్యాధిని అరికట్టడానికి చురుగ్గా చర్యలు తీసుకోనట్టయితే విపత్కర పరిణామాలు ఏర్పడటం ఖాయమని ప్రపంచబ్యాంకు తాజాగా హెచ్చరిస్తున్నది. ఇంతటి ప్రాణాంతక వ్యాధి విషయంలో సంపన్న దేశాల నిరాసక్తత కేవలం ఆర్థిక సాయం విషయంలో మాత్రమే కాదు...ఇతరత్రా కూడా కనిపిస్తున్నది. 1976లో ఈ వ్యాధి తొలిసారి బయటపడినప్పుడు అమెరికా, కెనడా వంటి దేశాల్లో పరిశోధనలపై దృష్టిపడింది. ఆ రంగంలో కృషిచేసిన శాస్త్రవేత్తలు దశాబ్దంక్రితం ఎబోలాకు ఔషధాన్ని కనుగొన్నామని, దాన్ని వానరాలపై ప్రయోగించి చూశాక అది వంద శాతం వ్యాధి కారక వైరస్‌ను అరికట్టగలదని తేలిందని ప్రకటించారు. కానీ, అటు తర్వాత దానికి సంబంధించి ఎలాంటి ప్రగతీ లేదు. వ్యాధిపై పరిశోధనకయ్యే వ్యయం కంటే మనుషులపై ఔషధాన్ని ప్రయోగించడానికి, అనంతరం దాన్ని ఉత్పత్తి చేయడానికి అనేక రె ట్లు ఎక్కువ ఖర్చవుతుంది. లాభార్జనే ధ్యేయంగా పనిచేసే వ్యాపార సంస్థలు...వ్యాధి ఆచూకీ కనిపించని పరిస్థితుల్లో ఆ ఔషధంపై భారీయెత్తున ఖర్చుచేయడానికి సుముఖంగా ఉండవు. కనుకనే ప్రాణాంతక ఎబోలా తిరిగి తలెత్తిన సమయానికి ఔషధమే లేకుండా పోయింది. మూడు దేశాల్లోనూ ఆ ఔషధాన్ని వ్యాధిగ్రస్తులపై ప్రయోగించి చూడటానికి ఇంకో నెలన్నర సమయం పడుతుందని, అటు తర్వాత వచ్చే ఏడాది జూన్‌కల్లా అందరికీ అందుబాటులోకి తీసుకురావడం సాధ్యమవుతుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతున్నది. అయితే, ఈ వ్యాధి విషయంలో కేవలం అల్లోపతి వైద్య విధానంలో మాత్రమేకాక ఇతరత్రా మార్గాల్లో అరికట్టడానికి వీలుంటుందేమో చూడాల్సిన బాధ్యత డబ్ల్యూహెచ్ఓపై ఉన్నది. ఔషధం అందుబాటులోకి రావడానికి ఏడెనిమిది నెలల సమయం పడుతుందని ఆ సంస్థ చెబుతున్నది గనుక ఇది అవసరం. ఎబోలా వ్యాధిని అరికట్టడానికి నిర్దిష్టమైన ఔషధం లేదు గనుక ఆ వ్యాధిగ్రస్తుల్లో కనబడుతున్న భిన్న లక్షణాలకు వేర్వేరు మందులు అందజేస్తున్నారు. ఆ వరసలోనే ఇతరత్రా వైద్య విధానాలను అనుసరించడంలో తప్పేమీలేదు. గతంలో మెదడువాపు వ్యాధి, డెంగ్యూ, చికున్గున్యావంటివి తలెత్తినప్పుడు హోమియో ఔషధాలను ఉపయోగించి మంచి ఫలితాలు రాబట్టిన సందర్భాలున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కోణం నుంచి ఎందుకు ఆలోచించలేకపోతున్నదో అర్ధంకాని విషయం. ఎబోలా వైరస్‌కంటే దాన్ని అరికట్టడంలో ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం, ప్రత్యామ్నాయ వ్యూహాలను రూపొందించలేని అశక్తత భయంకరమైనవి. ముందు వీటినుంచి విముక్తి సాధిస్తేనే ప్రాణాంతక ఎబోలావంటివి పలాయనం చిత్తగిస్తాయి.