breaking news
eastern peripheral expressway
-
కాంగ్రెస్ ఆలోచన సంకుచితం
బాగ్పత్: దళితులపై అత్యాచారాల దగ్గర్నుంచి రైతుల వరకు ప్రతి అంశంలోనూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అసత్యాలను ప్రచారం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. సంకుచిత ఆలోచలనతో నిండిన కాంగ్రెస్ నేతలకు ఒక కుటుంబాన్ని గౌరవించటం అలవాటైందని.. వారు ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని గౌరవించలేకపోతున్నారని విమర్శించారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో రూ.11వేల కోట్లతో నిర్మించిన ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేను, ఢిల్లీ–మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే తొలిదశను జాతికి అంకితం చేసిన ప్రధాని.. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘మోదీని వ్యతిరేకించాలనే ఆలోచనలో దేశాన్నే వ్యతిరేకిస్తారని అస్సలు అనుకోలేదు. ప్రజలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అటువైపు ఓ కుటుంబాన్నే దేశంగా చూస్తున్న వారున్నారు. కానీ నాకు మాత్రం దేశమే నా కుటుంబం’ అని మోదీ పేర్కొన్నారు. ‘సుప్రీంకోర్టు, న్యాయవ్యవస్థను అగౌరవపరిచేలా అనిశ్చితి సృష్టించాలని ప్రయత్నించారు. రిజర్వ్ బ్యాంకు, ఎన్నికల సంఘం, ఈవీఎంలనూ అనుమానించారు’ అని మండిపడ్డారు. 70 ఏళ్లుగా మోసం చేస్తున్నారు ‘కాంగ్రెస్, వీరి మిత్ర పక్షాలు పేదలు, దళితులు, గిరిజనుల కోసం చేసే పనులను అవహేళన చేస్తున్నారు. వారికి దేశాభివృద్ధి ఓ జోక్. స్వచ్ఛ భారత్, పేద మహిళలకు ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ల పంపిణీ, మరుగుదొడ్ల నిర్మాణం, పేదలు బ్యాంకు అకౌంట్లు తెరవటం వంటివి వారికి జోక్‌గానే అనిపిస్తున్నాయి. తరతరాలుగా అధికారంలో ఉన్నవారికి (రాహుల్ ను పరోక్షంగా ప్రస్తావిస్తూ) పేదల కోసం చేసే పనులు జోక్ లాగే అనిపిస్తాయి. కేబినెట్ నోట్‌ను చించేసిన వారికి పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన చట్టాన్ని గౌరవించటం ఎలా తెలుస్తుంది’ అని ప్రధాని ప్రశ్నించారు. ఎక్స్‌ప్రెస్‌వేల ప్రత్యేకతలు ఢిల్లీ–మీరట్ ఎక్స్‌ప్రెస్ వే తొలిదశ ► దేశంలోనే తొలి 14 లేన్ ఎక్స్‌ప్రెస్‌వే. 2.5 మీటర్ల సైకిల్ ట్రాక్, 1.5 మీటర్ల ఫుట్‌పాత్ కూడా ఉంటాయి. తొలిదశ నిజాముద్దీన్ నుంచి ఉత్తరప్రదేశ్ సరిహద్దు వరకు. ► తొలి దశ 18 నెలల రికార్డు సమయంలోనే పూర్తిచేశారు. రూ. 841 కోట్లు ఖర్చుచేశారు. ► గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చు. ► సోలార్ ప్యానెళ్లతో అటోమేటిక్ లైటింగ్ వ్యవస్థ, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థతో మొక్కలకు నీరు. ► రెండో దశ పూర్తయితే, ఢిల్లీ– మీరట్ మధ్య ప్రయాణానికి 45 నిమిషాలే. ప్రస్తుతం రెండున్నర గంటలకు పైనే పడుతోంది. ► రోడ్లకు ఇరువైపులా చారిత్రక కట్టడాల నమూనాలు ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే ► ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే (ఈపీఈ)కు 2015 నవంబర్‌లో మోదీ శంకుస్థాపన. కుండ్లీ నుంచి పల్వాల్ వరకు నిర్మించారు. ఈ రెండూ హరియాణాలోనే ఉన్నాయి. కానీ, హరియాణా, యూపీలోని ఆరు పార్లమెంటు నియోజవర్గాలగుండా ఈ రోడ్డు వెళ్తుంది. ► ఈ ప్రాజెక్టు నిర్మాణం 500 రోజుల్లో (రికార్డు సమయం) రూ.11వేల కోట్లతో పూర్తి. ► ఈపీఈపై ఎనిమిది సోలార్ప్లాంట్లున్నాయి. వీటి ద్వారా 4 మెగావాట్ల విద్యుదుత్పత్తి. ► ఈ ప్రత్యేకమైన రహదారిపై అధిక వేగంతో వెళ్లే వాహనాలను గుర్తించేందుకు ప్రత్యేక కెమెరాలు, ఆటో చలాన్ వ్యవస్థ ఏర్పాటుచేశారు. ► ప్రయాణించిన దూరానికే టోల్ టాక్స్ కట్టే సదుపాయం కూడా ఉంది. ► రోడ్లకు ఇరువైపులా 2.5లక్షల చెట్లను నాటారు. ఇందులో 8–10 ఏళ్ల చెట్లు కూడా ఉన్నాయి. వీటికి బిందుసేద్యం ద్వారా నీరందుతుంది. ► ఈ రోడ్డు నిర్మాణానికి 9,375 మందికి 50 లక్షల పనిదినాల అవకాశాన్ని కల్పించారు. ► ఈపీఈ ద్వారా ఢిల్లీలో ట్రాఫిక్, కాలుష్యాన్ని గరిష్టంగా తగ్గించవచ్చు. ► ఈపీఈలో నాలుగు పెద్ద వంతెనలు, 46 చిన్న వంతెనలు, 3 ఫ్లైఓవర్లు, 221 అండర్‌పాస్‌లు, 8 ఆర్వోబీ (రోడ్ ఓవర్ బ్రిడ్జెస్)లున్నాయి. ► అక్కడక్కడ పెట్రోల్ పంపులు, హోటళ్లు, దుకాణాలున్నాయి. చార్మినార్, ఎర్రకోట వంటి పలు చారిత్రక కట్టడాల నమూనాలున్నాయి. దళితుల విషయంలో అసత్య ప్రచారం ఎస్సీ, ఎస్టీ (వేధింపుల నిరోధక) చట్టంపై సుప్రీంకోర్టు ఆర్డరు విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఈ ఆర్డర్‌ను నిలిపివేసేందుకు ప్రభుత్వం చాలా ప్రయత్నించింది. కానీ వారు దీన్ని అర్థం చేసుకోకుండా దేశంలో అనిశ్చితి నెలకొనేలా ప్రయత్నించారు. చట్టం విషయంలో, దళితులపై జరుగుతున్న అత్యాచారాల విషయంలో.. రిజర్వేషన్ల అంశంలో.. ఇలా ప్రతి దాంట్లోనూ అసత్యాలను, వదంతులను ప్రచారం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించారు’ అని ప్రధాని మండిపడ్డారు. తమ ప్రభుత్వం నాలుగేళ్లలో దళితులకు అవకాశాలను సృష్టించడంతోపాటు వారికి భద్రత, సామాజిక న్యాయం అందిస్తోందని మోదీ వెల్లడించారు. వెనుకబడిన ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం, ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇవ్వాలని తాము చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్, దీని మిత్రపక్షాలు పార్లమెంటులో మోకాలడ్డుతున్నాయన్నారు. అయినా అనుకున్నది చేసి తీరతామని ధీమా వ్యక్తం చేశారు. 28వేల కిలోమీటర్ల హైవేల నిర్మాణానికి రూ. 3లక్షల కోట్లను ఖర్చుపెట్టినట్లు ఈ సందర్భంగా మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఢిల్లీ–మీరట్ ఎక్స్‌ప్రెస్ వే రెండో దశను వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తిచేస్తామని గడ్కరీ పేర్కొన్నారు. -
ప్రధాని కోసం ఆలస్యం చేస్తారా..?: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ఢిల్లీపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించడానికి నిర్మించిన ఈస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వేను మే 31లోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎక్స్‌ప్రెస్ వేను ఏప్రిల్ 20 నాటికి ప్రారంభిస్తామని చెప్పినా ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడంపై ఎన్హెచ్ఏఐను ప్రశ్నించింది. ఏప్రిల్ 29న ప్రధానితో రహదారిని ప్రారంభించాలనుకున్నా ఆయన బిజీ షెడ్యూల్ వల్ల కుదరలేదని ఎన్హెచ్ఏఐ వివరించగా.. ‘ప్రధాని సమయం కోసం ఎందుకు ఆలస్యం చేస్తున్నారు. మీరే ఎందుకు ప్రారంభించకూడదు’ అని ప్రశ్నించింది. మే 31లోపు ప్రారంభించకపోతే, ఇక ప్రారంభించినట్లేనని జస్టిస్ మదన్ లోకుర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం పేర్కొంది. 135 కిలోమీటర్ల ఈ అత్యాధునిక ఎక్స్‌ప్రెస్ వే ద్వారా ఘజియాబాద్, ఫరీదాబాద్, గౌతమ్ బుద్ధ నగర్ (గ్రేటర్ నోయిడా) పల్వాల్‌లకు సిగ్నల్ రహిత కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. ఢిల్లీ మీదుగా వెళ్లే ట్రాఫిక్‌ను మళ్లించేందుకు రాజధాని వెలుపల రింగ్ రోడ్ నిర్మించాలని సర్వోన్నత న్యాయస్థానం 2006లో ఆదేశించగా ఈస్ట్రన్, వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ వేలు నిర్మించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. -
ఈపీఈకి ఎనిమిదేళ్ల తర్వాత మోక్షం
ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాల రద్దీ కారణంగా జాతీయ రాజధాని రహదారులు ఇరుకుగా మారుతున్న నేపథ్యంలో భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఎనిమిది సంవత్సరాల క్రితం ఈస్ట్రన్ పెరిపెరల్ ఎక్స్‌ప్రెస్‌వే (ఈపీఈ) ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. అప్పటినుంచి వాయిదాల మీద వాయిదాలు పడుతున్న ఈ ప్రాజెక్టు పనులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. గ్రేటర్ నోయిడా: ఈస్ట్రన్ పెరిపెరల్ ఎక్స్‌ప్రెస్‌వే (ఈపీఈ) ప్రాజెక్టుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఎనిమిది సంవత్సరాల క్రితం ఈఈపీ నిర్మాణానికి గ్రేటర్ నోయిడా అధికార యంత్రాంగం ప్రణాళికలను రూపొందించింది. ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లోని వివిధ నగరాలను అనుసంధానం చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టుకు అప్పట్లో రూపకల్పన చేశారు. ఇది జాతీయ రాజధాని మీదుగా సాగుతుంది. దీని పొడవు 135 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే జాతీయ రాజధానిలోని రహదారులపై ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాల రాకపోకలు బాగా తగ్గిపోతాయి. ఇందువల్ల ఢిల్లీ వాసులకు ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయి. కాగా ఈపీఈ ప్రాజెక్టుకు భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఇటీవల టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టువల్ల గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, సోనిపట్, ఫరీదాబాద్, పల్వాల్లతోపాటు ఢిల్లీ రహదారులకు వాహనాల రద్దీ నుంచి కొంతమేర విముక్తి లభిస్తుంది. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే దీని వెంబడి వాణిజ్య భవనాలతోపాటు టౌన్‌షిప్‌లు అభివృద్ధి చెందే అవకాశముంది. ఇందువల్ల అనేకమందికి ఉపాధి లభిస్తుంది. ఆరు ప్యాకేజీలుగా విభజన ఈస్ట్రన్ పెరిపెరల్ ఎక్స్‌ప్రెస్‌వే (ఈపీఈ) పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్న భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) దీనిని మొత్తం ఆరు ప్యాకేజీల కింద విభజించింది. ఆరు సంస్థలనుంచి టెండర్లను స్వీకరించింది. వచ్చే నెల నాలుగో తేదీలోగా వీటిని ఖరారు చేయనుంది. ఈ మార్గం ఢిల్లీ నగరానికి తూర్పు దిశగా ముందుకుసాగుతుంది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ప్రతిరోజూ దాదాపు లక్షమంది వినియోగించుకుంటారని సంబంధిత అధికారులు అంచనా వేశారు.