breaking news
East Coast Thermal Power Plant
-
‘థర్మల్’పై అచ్చెన్న అసంతృప్తి!
కోటబొమ్మాళి : కాకరాపల్లి ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ యాజమాన్యంపై రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసంతృప్తితో ఉన్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ప్లాంటు చుట్టూ ఉన్న పంట పొలాలకు సంబంధించి రైతులకు నష్టపరిహారం చెల్లింపులోనూ, ఉపాధి కల్పనలోనూ ప్లాంటు అధికారులు స్థానిక యువతకు మొండిచెయ్యి చూపి ఇతర రాష్ట్రాల నుంచి స్థానికేతరులకు అవకాశం కల్పించడ ంపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో పవర్‌ప్లాంట్ చుట్టూ ఉన్న గ్రామాలకు సంబంధించిన కొంతమంది టీడీపీ సర్పంచ్‌లు, ఎమ్పీటీసీలు, ముఖ్యమైన కార్యకర్తలతో చర్చించి పవర్‌ప్లాంట్ పనులకు సహాయ నిరాకరణ చేయాలని సూచించినట్టు భోగట్టా. పవర్‌ప్లాంట్ నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడిన సమయంలో మంత్రిని, తెలుగుదేశం నాయకులను పావులుగా వాడుకొని, ఇప్పుడు స్థానికులను, రైతులను విస్మరించడం ఏమిటని పలువురు దేశం నాయకులు ఆక్షేపిస్తున్నారు. వడ్డితాండ్ర గ్రామం వద్ద మత్స్యకారులు రిలే నిరాహార దీక్ష శిబిరం ఏర్పాటు చేసి థర్మల్ వాహనాలను అడ్డుకుంటుండగా, కోటబొమ్మాళి, కొత్తపేట మీదుగా భారీ వాహనాలు తరలించి ఆ రెండు గ్రామాలను దుమ్ము ధూళితో ఇబ్బంది పాలు చేస్తున్నా అభ్యంతరం చెప్పక పోవడానికి కారణం మంత్రిపై ఉన్న గౌరవమేనని కోటబొమ్మాళికి చెందిన దేశం నాయకులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో థర్మల్‌ప్లాంట్ అధికారులపై మంత్రి ఆగ్రహంతో ఉన్నారన్న విషయం తెలియడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
పోలీసుల మోహరింపు-ప్రజల భయాందోళన
శ్రీకాకుళం: సంతబొమ్మాళి మండలం కాకరాపల్లి గ్రామంలో నిర్మిస్తున్న ఈస్ట్‌కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ బాధిత గ్రామాలలో పోలీసులు భారీస్థాయిలో మోహరించారు. ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హనుమంత నాయుడుపేట, కోచునాయుడుపేట, ఆకాశలక్కవరం గ్రామాలలో పోలీసులు మోహరించారు. 9 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాము 1232 రోజుల నుంచి దీక్షలు చేస్తున్నట్లు ఆందోళనకారులు తెలిపారు. నిద్రిస్తున్న ప్రజలను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారని ఆందోళనకారులు చెప్పారు. జిల్లాలోని కాకరాపల్లి థర్మల్ పవర్‌ప్లాంట్ పరిసరాల్లో గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతుండడంతో సంతబొమ్మాళి మండలం పరిధిలోని గ్రామస్థులు మళ్లీ ఉద్యమబాట పట్టారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లేవని కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించడంతో ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకులు వెనకడుగు వేశారు. దాంతో ఇక్కడ నిర్మాణ పనులు ఒక్కొక్కటిగా పునర్ ప్రారంభమయ్యాయి. దాంతో ఈ ప్రాంత ప్రజలు తమ డిమాండ్లు పరిష్కరించకుండా పనులు ప్రారంభించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ వాహనాలను వారు అడ్డుకుంటున్నారు. వారి ఆందోళనను అణచడానికి భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.