breaking news
Dust center
-
ఢిల్లీని చెత్త నగరంగా మార్చారు: సుప్రీం
న్యూఢిల్లీ: ఢిల్లీలో భారీగా పేరుకుపోయిన ‘చెత్త పర్వతాలు’ నగరం ఎదుర్కొంటున్న అధ్వాన పరిస్థితిని సూచిస్తున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి తగు చర్యలు చేపట్టకపోవడంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డంపింగ్ యార్డులైన ఘాజీపూర్, ఓక్లా, బల్స్‌వాల్లో పెద్ద ఎత్తున పేరుకుపోయిన చెత్త పర్వతాలను ప్రస్తావిస్తూ.. అధికారులు గానీ, లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయ అధికారులుగానీ ఘన వ్యర్థాల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోకపోవడంతోనే నగరం ఈ దుస్థితిని ఎదుర్కొంటోందని పేర్కొంది. ఘన వ్యర్థాల నిర్వహణ బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్‌దేనని ఢిల్లీ ప్రభుత్వ, గవర్నర్ కార్యాలయ అధికారులు కోర్టుకు తెలుపగా.. ఇది బాధ్యతను మరొకరిపై తోసెయ్యడం తప్ప మరొకటి కాదని అసంతృప్తి వ్యక్తం చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన వివరాలతో కూడిన అఫిడవిట్‌ను దాఖలు చేయనందుకు 10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు జరిమానా విధించింది. -
సమస్య: చెత్త.. పరిష్కారం: కంపోస్టు
ప్రతి కుటుంబం పాల్గొన్నప్పుడే ‘స్వచ్ఛ భారత్’ పేరిట ప్రారంభమైన ప్రజాఉద్యమం విజయవంతమవుతుంది. ప్రతి ఇల్లూ చెత్త ఉత్పత్తి కేంద్రమే! వంట చేస్తూ ఉండే ఇంట్లో రోజుకు 750 గ్రాముల నుంచి 1500 గ్రాముల తడి/పొడి చెత్త(కూరగాయలు, పండ్ల తొక్కలు వగైరా) తయారవుతుంది. ఇది చక్కని కంపోస్టుగా మార్చదగిన ప్రకృతి వనరు! కుళ్లే అవకాశం ఉన్న (సేంద్రియ) చెత్తలో 60% నీరే ఉంటుంది. కానీ, సాధారణంగా ఏ ప్లాస్టిక్ కవర్లోనో, చెత్తబుట్టలోనో వేసి అవతల పడేస్తుంటాం. ఇందుకోసం బోలెడంత మంది సిబ్బంది, డీజిల్.. ప్రజాధనం ఎంతో వృథా అవుతోంది. అందువల్లే ఇది సమాజానికి సమస్యగా మారుతోంది. వట్టి సేంద్రియ చెత్త అయితే నేలలో కలిసిపోతుంది. కానీ, బాటిల్స్, ప్లాస్టిక్, ట్యూబ్‌లైట్లు, కాలం చెల్లిన మందులతో సేంద్రియ చెత్తను కలిపి పారేస్తుండడం వల్లనే నగరాలు, పట్టణాల వెలుపల చెత్తకుప్పలు పర్యావరణానికి గొడ్డలిపెట్టులా తయారవుతున్నాయి. ఆ చుట్టుపక్కల మనుషులకు, జీవజాలానికి పెనుసమస్యగా మారుతోంది. మన వల్ల తయారవుతున్న చెత్త సమస్యను పరిష్కరించే బాధ్యతను మనమే తీసుకుందాం. ప్రతి ఆవాసంలోనూ కంపోస్టు తయారీ యూనిట్లు విధిగా ఏర్పాటు చేయాలని బిల్డర్లు, ప్లానర్ల మీద వత్తిడి తెద్దాం. వాన నీటి సంరక్షణకు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు తీయించమని అడుగుదాం. మనలో ఈ చైతన్యం రాకపోతే నగరాలు కుప్పకూలే రోజెంతో దూరంలో లేదు. తడి చెత్తను ఇంటి దగ్గరే కంపోస్టు చేసుకుంటూ.. పొడి చెత్తను మాత్రమే మున్సిపాలిటీ వాళ్లకివ్వాలి. ఈ పని చేయడం వల్ల భూమిలో కలవని చెత్తలోంచి పనికొచ్చే వాటిని ఏరుకొని బతికే పేదల పని సులువవుతుంది. కంపోస్టు తయారీ కోసం సిద్ధం చేసిన మట్టి కుండల్లో సేంద్రియ చెత్తను వేయడం అలవాటు చేసుకుందాం.. మూడు నెలలకు అది చక్కని కంపోస్టుగా మారుతుంది. కాలనీ స్థాయిలో పెట్టుకునే కంపోస్టు యూనిట్లలో మరింత త్వరగానే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. పంటల ద్వారా మనకు కూరగాయలు, పండ్లు, ధాన్యాలను ఇస్తున్నది నేలతల్లి. వంటింటి వ్యర్థాల్లోని పోషకాలను తిరిగి నేలతల్లి ఒడికి చేర్చడం మన కనీస బాధ్యత. ‘స్వచ్ఛ భారత్’కు మన వంతు తోడ్పడదాం. మీకు కిచెన్ గార్డెన్ లేకపోయినా సరే కంపోస్టు చేయడం మొదలుపెట్టండి! చెత్త ఒక సమస్య.. కంపోస్టు ఒక పరిష్కారం. కంపోస్టు పద్ధతులపై అదనపు సమాచారం కోసం www.dailydump.org/ వెబ్సైట్ చూడండి!