breaking news
Dr B. R. Ambedkar
-
నిల్వ పెంపే.. ‘ప్రాణ’హితం!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : డాక్టర్. బీఆర్.అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా జిల్లాలో సాగులోకి వచ్చే ఆయకట్టు స్థిరీకరణకు రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం పెంపు కీలకం కానుంది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో మొత్తం 2.29లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు గాను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఈ మేరకు మన జిల్లాకు 16వ ప్యాకేజీ కింద సాగునీరు అందించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే, జిల్లాలో ప్రాణహిత-చేవెళ్ల నీటిని నిల్వ చేసేందుకు గాను రూపొందించిన భువనగిరి సమీపంలోని బస్వాపురం రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో ఇదే తరహాలో రిజర్వాయర్ సామర్థ్యం పెంపునకు అనుమతినిచ్చిన నేపథ్యంలో జిల్లాలోని రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు కింద ఉన్న చెరువుల సామర్థ్యాన్ని పెంచాలని జిల్లా ప్రజానీకం కోరుతుంది. తద్వారా జిల్లాలోని మునుగోడు, నకిరేకల్, ఆలేరు, సూర్యాపేట, భువనగిరి నియోజకవర్గాల రైతాంగానికి మేలు జరుగుతుందని, 120 రోజులకు అవసరమయ్యే నీటిని నిల్వచేసుకునే అవకాశం ఉంటుందని కోరుతూ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సీఎంకు లేఖ రాశారు. ప్రాజెక్టు తీరిది... వాస్తవానికి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా మొత్తం 16.40 లక్షల ఎకరాలకు సాగునీరందించడం లక్ష్యం కాగా, అందులో జిల్లా వాటా 2.29లక్షల ఎకరాలు. ప్రాజెక్టును ప్యాకేజిలుగా విభజించగా, 14, 15 ప్యాకేజిల్లో కొంత, 16వ ప్యాకేజి పూర్తిగా జిల్లాలోని ఆయకట్టు స్థిరీకరణ పనులకు కేటాయించారు. మొత్తం ఐదు నియోజకవర్గాల్లోని 11 మండలాల్లో గల 171 గ్రామాలకు ఈ నీరందుతుంది. ఇందుకోసం తిప్పారం చెరువు ద్వారా ఓ చీలికను మన జిల్లాకి మళ్లిస్తారు. మెదక్జిల్లాలోని తిప్పారం చెరువు నుంచి ములకలపల్లి వరకు 33 కిలోమీటర్లు గ్రావిటీ కాల్వల ద్వారా బస్వాపురం ట్యాంకుకు అక్కడి నుంచి మళ్లీ గ్రావిటీ ద్వారానే 45.70 కిలోమీటర్లు కాల్వల ద్వారా జిల్లాలోని ఐదు నియోజకవర్గాలను తాకుతూ చిట్యాల వరకు నీరు వస్తుంది. అదే తిప్పారం ట్యాంకు నుంచి మరో చీలకగా వెళ్లే పాములపర్తి ట్యాంకు సామర్థ్యాన్ని పెంచేందుకు సీఎం ఇటీవల అనుమతినిచ్చారు. దీంతో గజ్వేల్, సిద్దిపేట పట్టణాలకు తాగునీరు, ప్రాజెక్టులో డిజైన్ చేసిన విధంగా ఆయకట్టుకు 120 రోజుల పాటు నీరిచ్చే ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ లభించినట్టయింది. అయితే, పాములపర్తి ట్యాంకు ద్వారా నీరు ఎత్తిపోతల ద్వారా వెళ్లాల్సి ఉండగా, మన జిల్లాలో మాత్రం అంతా గ్రావిటీ ద్వారానే నీరు పొలాలకు చేరే అవకాశం ఉండడం గమనార్హం. కాగా, మిడ్‌మానేరు ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ఎస్సారెస్పీ ఫేజ్-2 చివరి భూములకు కూడా నీరందుతుంది. జిల్లాలో ఎస్సారెస్పీ ఫేజ్-2 కింద గతంలో కాల్వలు తవ్వి వదిలివేశారు. దీంతో ఏఎమ్మార్పీ తరహాలోనే చెరువుల నుంచి ఆయకట్టుకు నీటి విడుదల జరుగుతోంది. అయితే, మిడ్‌మానేరుతో పాటు ఎస్సారెస్పీ ఫేజ్-2ను పూర్తి చేస్తే జిల్లాలో మరింత ఆయకట్టు పెరిగే అవకాశం ఉంది. పంట సమయం 120 రోజులు.. అయితే, జిల్లాలో ప్రాణహిత- చేవెళ్ల ద్వారా సాగులోనికి వచ్చే ఆయకట్టును స్థిరీకరించే ప్రతిపాదనలో మరో అంశం ఇమిడి ఉంది. కేవలం 90 రోజుల పాటు వరదనీటిని (వరదలు వస్తేనే) వినియోగించుకునేందుకు గాను ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. అయితే, బస్వాపురంలో రిజర్వాయర్ సామర్థ్యం పెంచి, దాని కింద ఉన్న మేజర్, మైనర్ చెరువుల సామర్థ్యాన్ని పెంచితే నీటిని నిల్వ ఉంచుకోవడం ద్వారా 90 రోజులు కాకుండా 120 రోజులు పంటలకు అందించవచ్చనేది తాజా ఆలోచన. కానీ, చాలా ఏళ్లుగా వర్షపాతం తక్కువగా నమోదవుతున్న కారణంగా ఈ చెరువుల్లో అస లు నీరే నిల్వ ఉండడం లేదు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు పరిధిలోనికి వచ్చే రిజర్వాయర్లు, ట్యాంకుల సామర్థ్యాన్ని పెంచాలనే డిమాండ్ రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. మరి సీఎం కేసీఆర్ దశాబ్దాలుగా ఫ్లోరోసిస్ పీడనకు గురవుతున్న జి ల్లాపై దయచూపి గోదావరి నీరు అందించేందు కు పూనుకుంటారా లేదా అన్నది చూడాల్సిందే. -
డిగ్రీ సప్లిమెంటరీ ఫలితాల విడుదల
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్ : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ తృతీయ సంవత్సరం అడ్వాన్స్ సంప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ శుక్రవారం తన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన ఈ పరీక్షలకు 2,897 మంది విద్యార్థులు హాజరుకాగా 1179 మంది ఉత్తీర్ణులయ్యారు. బీఏలో 393 మందికి 156(39.69 శాతం) మంది, బీఎస్సీలో 2025 మందికి 807(39.85), బీకాంలో 470 మందికి 208(44.26) బీబీఎంలో 9 మందికి 8(88.89)మంది ఉత్తీర్ణత సాధిం చారు. మార్కుల జాబితాలను త్వర లో కళాశాలలకు అందజేస్తామని వీసీ చెప్పారు. రీవేల్యుయేషన్ కోసం 15 రోజుల్లోగా దరఖాస్తు చేసుకో వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజి స్ట్రార్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. షెడ్యూల్ ప్రకారం బీఈడీ పరీక్షలు బీఈడీ థియరీ పరీక్షలను ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19వ తేదీ నుంచి నిర్వహిస్తామని వీసీ లజపతిరాయ్ చె ప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా పరీక్షలను వాయిదా వేస్తే విద్యార్థుల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దిబ్బదింటాయన్నారు.


