breaking news
donakonda airport
-
విమానం ఎగరావచ్చు..!
సాక్షి, ఒంగోలు సిటీ: జిల్లాలో మళ్లీ విమానం ఎగరనుందా..? దొనకొండలో ఎయిర్‌పోర్టు అభివృద్ధికి అడుగులు పడుతున్నాయా..? జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఆకాశయాన స్వప్నం సాకారం కాబోతోందన్న భావన వ్యక్తమవుతోంది. ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జిల్లాలో విమానం రాకపోకలు సాగించిన ఆనవాళ్లున్నాయి. ఆ తర్వాత పాలకులు విమానాశ్రయం అభివృద్ధికి చర్యలు తీసుకోలేకపోయారు. దొనకొండ కేంద్రంగా విమానాలు ఎగిరిన చరిత్రకు ఆనవాలుగానే మిగిలింది. ఇప్పుడు రవాణా వ్యవస్ధ మరింత అభివృద్ధి చెందింది. సుదూర ప్రాంతాలకు నిముషాలు, గంటల వ్యవధిలోనే చేరుకుంటున్నారు. ఆకాశయానం సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేస్తోంది. టికెట్ ధరలు అంత బరువనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. విమానాలు దిగేందుకు అనువైన నెలవులు ఏర్పడుతున్నాయి. ఒకప్పుడు షిరిడీ వెళ్లాలంటే రెండున్నర రోజులు ప్రయాణం చేసే వారు. రెండు మూడు రైళ్లు, బస్సులు ఎక్కాల్సి వచ్చేది. ఇప్పుడు దగ్గరలోని విమానాశ్రయాల నుంచి షిరిడీ, కాశీ వంటి ప్రదేశాలకు గంట వ్యవధిలోనే ప్రయాణించే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. జిల్లాకు దగ్గరలోని గన్నవరం విమానాశ్రయం నుంచి మహా నగరాలకు, యాత్రా ప్రదేశాలకు విమానయానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక జిల్లాలో విమానం ఎగిరే రోజులు దగ్గర పడ్డాయన్న సంకేతాలు వస్తున్నాయి. త్వరలోనే జిల్లా ప్రజలకు విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని అధికారుల సర్వేలే విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి. జిల్లాలో దొనకొండ కేంద్రంగా విమానాశ్రయం 1934లో నిర్మించారు. అప్పట్లో బ్రిటిష్ పాలకులు తమ రాకపోకలను వేగంగా నిర్వహించుకొనేందుకు దొనకొండ అనుకూలమని భావించి విమానాశ్రయాన్ని నిర్మించారు. రైల్వే లైన్లను వారి హయాంలోనే అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు నెల్లూరు పరగణాలో దొనకొండ ఉండేది. నెల్లూరు కేంద్రంగా పరిపాలన సాగేది. 1934లో 136.52 ఎకరాల్లో విమానాశ్రయాన్ని నిర్మించారు. చిన్న విమానాలు ఇక్కడికి రాకపోకలు సాగించేవి. మహారాష్ట్రలోని మిలటరీ రెజిమెంట్ కొద్ది కాలం ఈ విమానాశ్రయాన్ని ఉపయోగించుకుంది. రెండో ప్రపంచ యుద్ధం జరిగే రోజుల్లో విమనాలు అధికంగా దొనకొండకు వచ్చాయి. ఇక్కడ విమానాలకు అవసరమైన ఇంధనం నింపుకొనే వారు. బ్రిటీష్ ఉన్నతాధికారులు ఇక్కడే సమావేశాలను నిర్వహించుకొనే వారు. విందులు, వినోదాలు, విహారాలకు దొనకొండకు వచ్చే వారు. 1965–70 ప్రాంతంలో చిన్న విమానాలు రాకపోకలు జరిగాయి. ఆ తర్వాత పాలకులు విమానాశ్రయాన్ని పట్టించుకోలేదు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా దొనకొండ విమానాశ్రయం నిర్లక్ష్యానికి గురయింది. 1971 తర్వాత విమానాశ్రయం స్ధలం అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఎయిర్‌పోర్టు అధారిటి ఆఫ్ ఇండియా పరిధిలోకి విమానాశ్రయం నిర్వహణ బాధ్యతలు తీసుకుంది. అయితే అభివృద్ధి విషయంలో పలు మార్లు ప్రభుత్వానికి విన్నవించిన అప్పటి పాలకులు విమనాశ్రయానికి నిధులు ఇవ్వలేదు. స్థలం అన్యాక్రాంతం కాకుండా ఉండడానికి అధారిటి అధికారులు పంపిన ప్రతిపాదనలపై కేవలం రూ.43 లక్షల నిధులను విడుదల చేసింది. వీటితో విమానాశ్రయం స్థలం అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు ఇనుప తీగలతో కంచె ఏర్పాటు చేశారు. ఇంతకు మించి అభివృద్ధిలో అడుగు ముందుకు వేయలేదు. దివంగత నేత వైఎస్సార్ కల.. దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి జిల్లాలో విమానాశ్రయం నిర్మాణానికి సానుకూలంగా ఉన్నారు. అప్పట్లో జిల్లా కేంద్రం వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విమానాశ్రయం నిర్మించాలని తలచారు. ఆయన పాలనలోనే భూసేకరణకు చర్యలు తీసుకున్నారు. జిల్లాకు పలు సందర్భాల్లో పర్యటనకు వచ్చిన వైఎస్సార్ ఒంగోలు కేంద్రంగా విమానాశ్రయం నిర్మించే అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. జిల్లా నుంచి పారిశ్రామిక రాబడి అధికంగా ఉంది. గ్రానైట్ ఇతర దేశాలకు ఎగుమతి జరుగుతున్నందున విదేశీ మారకద్రవ్యమే అప్పట్లోనే రూ.2 వేల కోట్ల వరకు ఏటా వచ్చేది. మత్స్య సంపద లావాదేవీలతో ఏటా రూ.1500 కోట్లకుపైగా లాభం వచ్చేది. ఇక వాణిజ్య పంటల ద్వారా రూ.వందల కోట్లలోనే లావాదేవీలు, రాబడులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లా నుంచి ప్రవాసాంధ్రులు పెరుగుతున్నారు. విదేశాలకు వెళ్లే వారు, అక్కడ వ్యాపారాలు చేసేవారు అధికమయ్యారు. దీంతో జిల్లా కేంద్రంగా ఇక్కడ ప్రజలకు అవసరాన్ని తీర్చే విధంగా విమానాశ్రయం నిర్మించాలని వైఎస్సార్ బలంగా ప్రయత్నం చేశారు. పలు జిల్లాల్లోనూ ఆయన పర్యటన సందర్భంగా ప్రకాశంలో విమానాశ్రయంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో ఎయిర్ క్రాఫ్ట్ నిలిచే విధంగా శాశ్వత ప్రాతిపదికన హెలీప్యాడ్లను నిర్మించాలని ప్రతిపాదించారు. అప్పట్లో ప్రభుత్వ కోటరిలోని ముఖ్యులతో ఈ విషయాలపై చర్చించారు. ఆ తర్వాత దివంగత నేత ప్రతిపాదనలను పాలకులు పక్కన పెట్టేశారు. అయినా పలు దఫాలుగా ఈ అంశం చర్చకు వస్తూనే ఉంది. దఫ దఫాలుగా సర్వేలు.. జిల్లాలో విమానాశ్రయం అంశంపై దఫా దఫాలుగా సర్వే జరిగింది. రెండేళ్ల నుంచి సర్వేలు విపరీతంగా జరిగాయి. దొనకొండ కేంద్రంగా పారిశ్రామికవాడ అభివృద్ధికి ప్రతిపాదనలు ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ ఇప్పటికే ఉన్న విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి సాధ్యాసాధ్యాలపై సర్వేలు చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా జాయింట్ డైరెక్టర్ రాజ్‌కిషోర్ నేతృత్వంలో అధికారుల బృందం ఎస్.మకేజా, ఎంజీఎం గుప్తా, ఎంజీఎం సుధీప్వర్మ తదితరుల బృందం పర్యటించింది. ఆదివారం దొనకొండలో తాజాగా ధిల్లిలోని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టరేట్‌లోని అధికారులు, ఎం పవర్ ఇండియా లిమిటెడ్ సంస్థకు చెందిన ప్రతినిధులు బుల్, పవన్ తదితరులు పర్యటించారు. పూర్వం ఇక్కడ నుంచి తయారు చేసిన నివేదికలను స్వయంగా పరిశీలించారు. జిల్లా కేంద్రం నుంచి దొనకొండ 103.6 కిమీ దూరంలో ఉంది. కర్నూలు జిల్లాకు 103.8 కిమీ, కడప జిల్లా 133.6 కిమీ, మహబూబ్‌నగర్ జిల్లా 160.9 కిమీ దూరంలో ఉంది. జిల్లాలో బేస్తవారపేటకు 17.1 కిమీ, మార్కాపురం 31.51 కిమీ, నంధ్యాల 59.8 కిమీ, వివిధ తీర ప్రాంతాలు 300 కిమీలోపు ఉన్నాయి. ఒక వేళ దొనకొండ అభివృద్ధికి చర్యలు తీసుకుంటే ప్రయోజనాలు, ఇతర అంశాలపై దృష్టి పెట్టారు. వాన్‌పిక్ పరిధిలో బీరంగుంట స్ధలం.. ఒంగోలుకు దగ్గరంలో విమానాశ్రయం నిర్మాణానికి బీరంగుంటలో భూసేకరణ జరిపారు. అయితే 2009లో వాన్‌పిక్ కోసం సేకరించిన భూమి విస్తీర్ణంలోనే విమానాశ్రయానికి కేటాయించారు. ప్రతిపాదిత స్ధలం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఆ తర్వాత వెంటనే విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి అనువైన ప్రదేశాల ఎంపికక చర్యలు తీసుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి వద్ద రుద్రకోట ప్రాంతంలో విమానాశ్రయం వల్ల జిల్లా ప్రజలకు సౌకర్యంగా ఉంటుందా అని పరిశీలించారు. ఆ తర్వాత సర్వే చేసి విరమించుకున్నారు. ఒంగోలు మండంలోని చెరువుకొమ్ముపాలెం, వల్లూరు ప్రాంతంలో ప్రతిపాదించారు. 132 కేవీ విద్యుత్తు లైన్లు పెద్ద పెద్ద టవర్లు ఉన్నందున విమానాలు దిగేందుకు ఇబ్బంది ఉందని ఏవియేషన్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇక్కడ ప్రతిపాదన విరమించుకున్నారు. ఇప్పుడు తిరిగా తాజాగా దొనకొండ విమానాశ్రయం అభివృద్ధి ముందుకు వచ్చింది. కేంద్రం ఇప్పటికే నివేదిక ఇచ్చింది. విమానాశ్రయం నిర్మాణం వల్ల ప్రకాశానికి ప్రయోజనంగా భావిస్తున్నారు. దీంతో కేంద్రం వద్ద విమానాశ్రయ దస్త్రం కదిలింది. త్వరలోనే జిల్లాలో ఎగిరేందుకు రూట్ క్లియర్ కానుందన్న అంచనాలు నెలకున్నాయి. -
స్వలాభాపేక్షే
► జిల్లా అభివృద్ధి గాలికి... ► జనం బాధలు పట్టించుకోని టీడీపీ నేతలు ► బాబు ఇచ్చిన హామీలకే బడ్జెట్లో నిధులు కరువు ► వెలిగొండకు మొక్కుబడి విదిలింపులు ► రామాయపట్నం పోర్టు,నిమ్జ్ ఊసే మరిచిన బాబు ► వందలాది హామీలు గాలికి.. ► నోరు మెదపని జిల్లా నేతలు జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీకి తాజా బడ్జెట్లో చంద్రబాబు నిధులు కేటాయించకపోయినా జిల్లా అధికార పార్టీ నేతలు నోరు మెదపడం లేదు. వెలిగొండ పూర్తి చేసేది మేమే... అదిగో నిమ్జ్... ఇదిగో దొనకొండ... కనుచూపు మేరలో రామాయపట్నం పోర్టు, లక్షల కోట్ల పెట్టుబడులు,లక్షలాది మందికి ఉద్యోగాలు... అంటూ ఇన్నాళ్లు ఊదరగొట్టిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు మౌనం దాల్చారు. జిల్లాకు సంబంధించిన ఏ ఒక్క అభివృద్ధి పనికి చంద్రబాబు నిధులు కేటాయించకపోయినా ఇక్కడి టీడీపీ నేతలు బాబును అడిగే పరిస్థితి లేదు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్ర బడ్జెట్లో నిధుల కేటాయింపుల్లేకపోవడంతో జిల్లా అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. కనీసం వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి గుక్కెడు నీళ్లయినా ఇస్తారనుకుంటే ఆ ప్రాజెక్టుకు కూడా మెయింటెనెన్స్ ఖర్చులు తప్ప పనులు ముందుకు సాగేందుకు నిధులివ్వలేదు. అయినా అధికార పార్టీ నేతలు నోరు మెదపకపోవడంపై జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ క్షేత్రస్థాయి కేడర్ సైతం జిల్లా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల తీరును తప్పుబడుతున్నారు. నేతలు స్వలాభాపేక్షతో సొంత పనుల కోసం పాకులాడటం తప్ప జిల్లా అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల నాటి నుంచి నేటి వరకు జిల్లాకు సంబంధించి చంద్రబాబు వందలాది హామీలిచ్చారు. ప్రధానంగా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానంటూ ప్రగల్భాలు పలికారు. మూడేళ్ల పాలన ముగుస్తున్నా... ప్రాజెక్టు పనులు ముందుకు సాగే పరిస్థితి లేదు. తాజా బడ్జెట్లో రూ.200 కోట్లు మాత్రమే కేటాయించటంలో ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. ఈ ప్రాజెక్టు పైనే జిల్లా వాసులు ఆశలు పెట్టుకొని ఉన్నారు. తాగు, సాగునీరు అందించేందుకు ఏకైక మార్గం వెలిగొండ ప్రాజెక్టు. కానీ నిధుల్లేకపోవడంతో ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇక జిల్లాను పారిశ్రామికంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి పదే పదే చెబుతూ వస్తున్నారు. కనిగిరిలో దాదాపు లక్ష కోట్లతో నిమ్జ్ ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ బాబు పలుమార్లు ప్రకటించారు. ఆయన మాటలు చూసి జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం నిమ్్జను పూర్తి చేసినంతగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికీ భూసేకరణ కూడా పూర్తి కాలేదు. తాజా బడ్జెట్లో నిమ్స్ కు నిధుల కేటాయింపుల్లేవు. చంద్రబాబు దాని ఊసే మరిచారు. దొనకొండ పారిశ్రామికవాడదీ ఇదే పరిస్థితి. ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తున్నాయని, ఉద్యోగాలు లభిస్తున్నాయని ప్రభుత్వం ప్రచారం చేసింది. మూడేళ్ల పాలనలో దొనకొండకు ఏ ఒక్క పరిశ్రమ తరలిరాలేదు, వస్తుందన్న ఆశ కూడా లేదు. రామాయపట్నం పోర్టు సంగతిని అధికార పార్టీ నేతలు దాదాపు పక్కనపెట్టారు. ఆది నుంచి జిల్లా అభివృద్ధి కోసం రామాయపట్నం పోర్టును నిర్మించాలన్న డిమాండ్ ఉంది. కానీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆలోచనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం నెల్లూరు జిల్లాలోని దుగరాజుపట్నం పోర్టుకే ప్రాధాన్యతనిచ్చారు. అయితే ఇటీవల దుగరాజుపట్నం పోర్టు నిర్మాణానికి ప్రతికూలతలు ఎదురయ్యాయి. అక్కడ పోర్టు నిర్మాణం సరికాదంటూ కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. ఈ దశలో గట్టిగా ప్రయత్నిస్తే రామాయపట్నం పోర్టు వచ్చే అవకాశం ఉంది. కానీ తాజా బడ్జెట్లో బాబు పోర్టు ఊసే ఎత్తలేదు. పోర్టు ఉంటేనే పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉంటుందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం దాని సంగతి ఆటకెక్కించింది. ► జిల్లాలో తీరప్రాంతంతో పాటు కర్నూలు, కడపను కలిపే ప్రధాన రహదారులను రూ.50 వేల కోట్లతో నిర్మించనున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. అవి ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. ► హైదరాబాద్ స్థాయిలో ఒంగోలులో శిల్పారామం అన్నారు. దాని ఊసే లేదు. వెటర్నరీ యూనివర్సిటీ, మైనింగ్ యూనివర్సిటీ ఇస్తామని ఇచ్చిన హామీ ఇచ్చినా బడ్జెట్లో దాని ప్రస్తావన లేదు. ►తాళ్లూరు మండలంలో మొగలిగుండాల రిజర్వాయర్ పూర్తి చేసి తాళ్లూరు, మద్దిపాడు, అద్దంకి, చీమకుర్తిలకు దీని ద్వారా తాగు, సాగు నీరు ఇచ్చే ప్రతిపాదనను సర్కారు పట్టించుకోలేదు. ► బల్లికురవలోని భవనాశి రిజర్వాయర్, యర్రం చినపోలిరెడ్డి రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా నిధుల కేటాయింపుల్లేవు. ► గిద్దలూరు పట్టణానికి దూపాడు ప్రాజెక్టు నుంచి రూ.350 కోట్లతో పనులు పూర్తి చేసి నీళ్లిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నల్లమల అడవుల్లోని బైరేనిగుండాలు ద్వారా గిద్దలూరు పరిధిలోని 14 గ్రామాలకు నీళ్లిస్తామన్నారు. దాని సంగతీ పట్టించుకోలేదు. ► సోమశిల ఉత్తర కాలువ రాళ్లపాడు ప్రాజెక్టు వరకు తవ్వాల్సి ఉంది. తద్వారా ప్రాజెక్టు రాళ్లపాడుకు నీళ్లిస్తామన్నారు. రామాయపట్నం పోర్టు, రాళ్లపాడు ఎడమ కాలువ పొడిగింపు పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా నిధులివ్వలేదు. కొండపిలోని సంగమేశ్వరం ప్రాజెక్టును రూ.50.50 కోట్లతో పూర్తి చేసి తద్వారా 9,500 ఎకరాలకు సాగు నీరు, 4 మండలాల పరిధిలో తాగునీరు అందిస్తామన్నారు. కానీ నిధుల కేటాయింపుల్లేవు. ఇవి కాకుండా జిల్లావ్యాప్తంగా రోడ్లు, తాగునీటి పథకాలు, చిన్న పరిశ్రమలు అంటూ అటు ప్రభుత్వం, జిల్లా అధికార పార్టీ నేతలు వందలాది హామీలు గుప్పించారు. కానీ ఏ ఒక్కదానికీ బడ్జెట్లో సర్కారు పైసా నిధులు కేటాయించలేదు. అయినా జిల్లా నేతలు ఏ మాత్రం స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా వ్యక్తిగత స్వార్థాన్ని పక్కనపెట్టి టీడీపీ నేతలు జిల్లా అభివృద్ధికి నిధుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.