వరంగల్– హన్మకొండ
ప్రస్తుత కార్యాలయాలన్నీ హన్మకొండ జిల్లాకు
వరంగల్ జిల్లాకు తాత్కాలిక భవనాలు
వరంగల్ కలెక్టరేట్‌గా సాగునీటి శాఖ కార్యాలయం
నాలుగు జిల్లాలపై పూర్తి స్థాయిలో స్పష్టత
సాక్షిప్రతినిధి, వరంగల్ : జిల్లాల పునర్విభజన చివరి దశకు చేరింది. ఆగస్టు 22న ప్రభుత్వం జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారమే జిల్లాల పునర్విభజన ఉండనుందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో నిర్ణయాలు, జిల్లా పరిపాలన యంత్రాంగం చేస్తున్న ఏర్పాట్లు దీన్నే స్పష్టం చేస్తున్నాయి. పునర్విభజనలో భాగంగా వరంగల్ జిల్లాను... వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి(జయశంకర్), మహబూబాబాద్ జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్లో పేర్కొంది. గ్రేటర్ వరంగల్ నగరం మొత్తం ఒకే జిల్లాలో ఉండాలని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయాలను అన్వేషించింది. గ్రేటర్ వరంగల్ నగరం మొత్తం ఒకే జిల్లాలో ఉండేలా... వరంగల్, వరంగల్ రూరల్(కాకతీయ) జిల్లాల ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీనిపై కూడా వ్యతిరేకత వచ్చింది. వరంగల్ నగరాన్ని ఆనుకుని ఉండే మండలాలను ఇతర జిల్లాలో చేర్చడంపై విమర్శలు వచ్చాయి. వరంగల్ రూరల్ జిల్లాకు కేంద్రం ఎక్కడ అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చివరికి వరంగల్, హన్మకొండ జిల్లాలుగానే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
రెండు జిల్లాల పరిపాలన కేంద్రాలను గ్రేటర్ వరంగల్ పరిధిలోనే ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాలు ప్రస్తుతం హన్మకొండలోనే ఉన్నాయి. వీటన్నింటినీ హన్మకొండ జిల్లా కార్యాలయాలుగా మార్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ జిల్లా కార్యాలయాలను వరంగల్ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం మాత్రం తాత్కాలికంగా హన్మకొండలోనే ఉండనుంది. జిల్లాల పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పడబోయే వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సాగునీటి శాఖ శాఖ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. జిల్లాల పునర్విభజన ప్రక్రియ అనంతరం దసరా రోజు నుంచి వరంగల్ జిల్లా కలెక్టర్ ఈ కార్యాలయంలోనే విధులు నిర్వహించనున్నారు. ఇలా హన్మకొండలోనే... రెండు జిల్లాల కలెక్టర్ల కార్యాలయాలు ఉండనున్నాయి.
జిల్లాల పునర్విభజనలో ఏర్పడబోయే వరంగల్ జిల్లా కలెక్టరేట్‌ను సాగునీటి శాఖ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నీటిపారుదల శాఖ ఉద్యోగులు సంతకాలు సేకరించి ఆ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుకు, ముఖ్య కార్యదర్శికి, ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ)కు వినతి పత్రాలు ఇచ్చారు. శనివారం జిల్లా కలెక్టర్ వాకాటి కరుణను కూడా కలిసి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. సాగునీటి శాఖ సర్కిల్ కార్యాలయం తాత్కాలికంగానే వరంగల్ జిల్లా కలెక్టరేట్‌గా ఉంటుందని.. వరంగల్‌లో కొత్త భవనం నిర్మాణం పూర్తి కాగానే మళ్లీ సాగునీటి శాఖకే అప్పగిస్తామని కలెక్టర్ కరుణ వారికి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియకు సహకరించాలని ఉద్యోగులను కోరారు. దీంతో సాగునీటి శాఖ సర్కిల్ కార్యాలయంలోనే వరంగల్ జిల్లా కలెక్టరేట్ ఏర్పాటయ్యే విషయంలో స్పష్టత వచ్చినట్లయింది. మరోవైపు మహబూబాబాద్, భూపాలపల్లి(జయశంకర్) జిల్లాల కేంద్రాల్లో కలెక్టరేట్లు, ఇతర కార్యాలయాల ఏర్పాటు ప్రక్రియ ముగింపు దశకు చేరింది.