breaking news
DIG rupa maudgil
-
ఆ చిత్రం.. ఆసక్తికరం
సాక్షి, బెంగళూరు: బహుభాషా నటుడు కమల్ హాసన్‌తో రాష్ట్ర డీఐజీ రూపా మౌద్గిల్ తీసుకున్న ఫోటో ఆమె ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. కమల్ హాసన్‌తో ఫోటో ఎందుకూ? అని కొందరు నెటిజన్లు విమర్శించగా, మరికొందరు అభినందించారు. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో జరిగిన అక్రమాల ను బయటకి తీయడం, తరువాత ఆమె ట్రాఫిక్ విభాగానికి బదిలీ కావడం తెలి సిందే. కమల్ ఫోటోపై వచ్చిన వ్యతిరేక కామెంట్లపై రూపా స్పందిస్తూ ‘మనిషి సంఘజీవి, సోషల్ మీడియాలో ఉన్నప్పుడు, అందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. కమల్‌హాసన్‌తో నేను దిగిన ఫోటో గురించి అనసవరమైన చర్చలు పెట్టవద్దు’ అని ఆమె అన్నారు. -
డీఐజీ రూపపై బదిలీ వేటు
► శశికళకు జైలులో రాజభోగాలను బయటపెట్టిన అధికారిణిని బదిలీ చేసిన ప్రభుత్వం ► పరిపాలనాపరమైన నిర్ణయమన్న కాంగ్రెస్... విపక్షాల ఆగ్రహం బెంగళూరు: అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే (అమ్మ) వర్గ నేత వీకే.శశికళకు జైలులో రాజభోగాలు లభిస్తున్న విషయాన్ని బయటపెట్టిన కర్ణాటక జైళ్లశాఖ డీఐజీ రూపా మౌద్గిల్‌పై బదిలీ వేటుపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెను ట్రాఫిక్, రోడ్డు భద్రతా విభాగానికి డీఐజీ, కమిషనర్‌గా సోమవారం బదిలీచేసింది. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో జరుగుతున్న అక్రమాలను బయటపెట్టిన రూపను బదిలీ చేయడంపై ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరోవైపు రూపతోపాటు జైళ్లశాఖ డీజీపీ హెచ్.ఎన్ సత్యనారాయణ రావు, బెంగళూరు కేంద్ర కారాగార చీఫ్ సూపరింటెండెంట్ క్రిష్ణ కుమార్‌లను కూడా ప్రభుత్వం బదిలీచేసింది. కేసు విచారణలో ఉండగానే రూప, సత్యనారాయణలు విషయాన్ని మీడియాకు వెల్లడించి అఖిల భారతస్థాయి అధికారుల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనీ, వారి బదిలీ పరిపాలనాపరమైన నిర్ణయమని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఐదు గదులకు రూ.2 కోట్లు! శశికళకు లభిస్తున్న రాచమర్యాదలపై ఓ నివేదికను సత్యనారాయణకు రూప జూలై 12న సమర్పించారు. ప్రత్యేక సౌకర్యాల కోసం శశికళ రూ.2 కోట్ల లంచం ఇచ్చారని ఆమె తన నివేదికలో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు శశికళకు ఐదు గదులు, పరుపులు, టీవీ, ఎసీ, నడవడానికి పొడవైన కారిడార్, ప్రత్యేక దుప్పట్లు, వంటగది తదితరాలతో స్టార్ హోటల్ స్థాయిలో సౌకర్యాలు కల్పించిన విషయాన్ని రూప నివేదికలో ప్రస్తావించారు. ఈ అంశంలో సత్యనారాయణపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నట్లు ఆమె నివేదికలో పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన సత్యనారాయణ, విషయాన్ని మీడియా వద్ద ప్రస్తావించారు. అనంతరం రూప కూడా ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ నిజాలు తెలియాలంటే పారదర్శకంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కాగా, బదిలీల విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ అది పరిపాలనా సంబంధమైన విషయమన్నారు. ‘మేం ఏం చేయాలి? బదిలీ చేయకూడదా? మంచి పరిపాలన కోసమే మేం బదిలీ చేశాం. ఇదంతా విలేకరులకు వివరిస్తూ కూర్చోగలమా?’ అని సిద్ధరామయ్య అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప మాట్లాడుతూ ‘అధికారిణి నివేదిక ఆధారంగా జైలులో ప్రక్షాళన చేపట్టాల్సిందిపోయి ఆమెపై బదిలీ వేటు వేయడం పద్ధతి కాదు. ఇది ఓ రకంగా ఆమె నిజాయితీకి శిక్ష వేయడం లాంటిదే’ అని అన్నారు. వివరాలను బహిర్గతం చేసి నిబంధనలను ఉల్లంఘించడంపై సంజాయిషీ ఇవ్వాల్సిందిగా కూడా ప్రభుత్వం రూపకు నోటీసులు ఇచ్చింది.