breaking news
differently
-
ఇదో టైపు ఇంటరాగేషన్ !
పోలీసు ఇంటరాగేషన్ ఎలా ఉంటుందో దాదాపు అందరికీ తెలిసిందే! థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, నిందితులను కొట్టడం, వారి పట్ల అమానుషంగా ప్రవర్తించడం వంటివి కూడా తెలిసిందే! హైదరాబాద్ గోకుల్‌చాట్, లుంబినీపార్క్ పేలుళ్లు జరిగాయి. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ (సిక్) అధికారులు ఒక పేలుడు పదార్థాల తయారీ కంపెనీ యజమానికి రొటీన్‌కు భిన్నంగా ఇంటరాగేట్ చేశారు. పోలీసు రికార్డులకెక్కని ఈ ఉదంతంతో సంబంధం ఉన్నవారి పేర్లు గోప్యంగా ఉంచడం అనివార్యం.హైదరాబాద్ మక్కామసీదులో 2007 మే 18 మధ్యాహ్నం బాంబు పేలుడు జరిగింది. శుక్రవారం ప్రార్థనలను లక్ష్యంగా చేసుకుని, ఉగ్రవాదులు రెండు బాంబులు ఏర్పాటు చేశారు. వాటిలో ఒకటి పేలింది. మరోదాన్ని పోలీసులు నిర్వీర్యం చేశారు. ఈ సంఘటనలో 11 మంది మరణించారు, 19మంది గాయపడ్డారు. దీనిపై హుస్సేనీ ఆలం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఈ కేసు హైదరాబాద్ సీసీఎస్ అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి, తర్వాత సీబీఐకి బదిలీ అయింది. ఈ పేలుడు కోసం గ్రెనేడ్స్ డిజైన్‌లో పోతపోసి ప్రత్యేకంగా తయారు చేసిన షెల్స్‌ను వినియోగించారు. ఇందులో నింపిన పేలుడు పదార్థం ఆర్డీఎక్స్‌గా తేలింది. అదే ఏడాది ఆగస్టు 25 సాయంత్రం కోఠీలోని గోకుల్‌చాట్, లుంబినీపార్కు లేజేరియంలో రెండు బాంబులు పేలాయి. దిల్‌సుఖ్‌నగర్‌లోని వెంకటాద్రి థియేటర్ వద్ద ఫుట్ఓవర్ బ్రిడ్జి సమీపం నుంచి పేలని బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ పేలుళ్లలో 42 మంది మరణించగా, 68 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులు చెక్కపెట్టెలో అమోనియం నైట్రేట్ స్లర్రీని నింపి పేల్చినట్లు ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది. ఈ పేలుళ్లకు, పేలని బాంబులకు సంబంధించి సుల్తాన్‌బజార్, సైఫాబాద్, మలక్‌పేట పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులు కొన్నాళ్లకు జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్ఐఏ) బదిలీ అయ్యాయి. ఈలోగా ఈ కేసుల దర్యాప్తుకు హైదరాబాద్ పోలీసులు ‘సిక్’ ఏర్పాటు చేశారు.‘సిక్’ అధికారులు వివిధ కోణాలను విశ్లేషిస్తూ ముందుకు వెళ్లారు. మక్కా మసీదులో పేలిన బాంబులో ఉగ్రవాదులు ఆర్డీఎక్స్ వినియోగించారు. అది కేవలం పాకిస్తాన్ నుంచి సరఫరా కావడానికి, రక్షణ శాఖ నుంచి అక్రమంగా బయటకు రావడానికి మాత్రమే అవకాశం ఉండటంతో ఆర్డీఎక్స్ సరఫరాలో స్థానిక సహకారం ఉంటుందని పోలీసులు అనుమానించలేదు. అయితే, జంట పేలుళ్లకు వినియోగించిన బాంబులు అమోనియం నైట్రేట్‌తో తయారు చేసినవి కావడంతో ‘సిక్’ అప్రమత్తమైంది. క్వారీల్లోను, నిర్మాణరంగంలోను వినియోగించడానికి అమోనియం నైట్రేట్ తయారు చేసే కంపెనీలు రాష్ట్రంలో ఉన్నాయి. గతంలో మావోయిస్టులు సైతం విధ్వంసాల కోసం దీనినే వాడారు. అందువల్ల అమోనియం నైట్రేట్ సరఫరాలో ‘సిక్’ అధికారులు స్థానికుల పాత్రను అనుమానించారు.ఈ కేసుల దర్యాప్తులో వందల సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. కొందరిని ప్రశ్నించి విడిచిపెట్టగా, మరికొందరిని లోతుగా ఇంటరాగేట్ చేశారు. ఇందులో అనేకం అక్రమ నిర్బంధాలు కావడంతో, ఇలా కస్టడీలోకి తీసుకున్న వారిని రహస్య ప్రదేశాల్లో ఉంచి విచారించారు. రహస్య విచారణ కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఫామ్‌హౌస్‌లు, గెస్ట్ హౌస్‌లు, ఖాయిలా పరిశ్రమలు, మూతపడిన కంపెనీలను వినియోగించారు. అప్పట్లో అలా వినియోగించిన ఓ కంపెనీ హైదరాబాద్‌కు దక్షిణ దిక్కులో ఉంది. నగర శివార్లలో ఉంటూ, శివారు జిల్లాలో అమోనియం నైట్రేట్ స్లర్రీ తయారీ కంపెనీ నిర్వహిస్తున్న ఒక బడా వ్యాపారి అప్పట్లో ‘సిక్’ విచారణ ఎదుర్కొన్న వారిలో ఉన్నారు. ఆయన వయసు, ప్రొఫైల్ తదితరాలను పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు రొటీన్ కు భిన్నంగా, ఏమాత్రం హింసకు తావు లేకుండా అతడి నోరు విప్పించాలని భావించారు.ఓ రోజు ఉదయం ఆ వ్యాపారి ఇంటికి వెళ్లిన సిక్ బృందం, అతణ్ణి అదుపులోకి తీసుకుని, దక్షిణాన ఉన్న కంపెనీకి తీసుకువచ్చింది. అక్కడ ఒక గదిలో నిర్బంధించింది. దాదాపు 15 రోజుల పాటు ఇలా ఉంచినా, కనీసం ఒక్కరోజు కూడా ఏ పోలీసూ అతనితో మాట్లాడలేదు. ఈ పక్షంరోజుల్లో రెండుసార్లు మాత్రమే బ్రష్ చేసుకునే అవకాశం ఇచ్చారు. కోటీశ్వరుడైన ఆ వ్యాపారిని అన్ని రోజులు స్నానం చేయనీయలేదు. ఎలాంటి అఘాయిత్యం చేసుకోకుండా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగం నుంచి ఒక గార్డును ఏర్పాటు చేశారు. అతడితో మాట్లాడకూడదని సిక్ అధికారులు నిర్ణయించుకున్నారు. గార్డులకూ ఇదే ఆదేశాలు జారీ చేశారు. ఒకటి రెండు రోజుల తర్వాత గార్డుకు అతనితో పరిచయం ఏర్పడి, మాట్లాడే అవకాశం ఉంటుందని అధికారులు అనుమానించారు. దీంతో ప్రతి రోజూ అక్కడ పనిచేసే గార్డును మార్చేవారు. కేవలం ఆహారం అందించడం, కాలకృత్యాలకు తీసుకువెళ్లడమే అతడి డ్యూటీ. ఇలా ఈ ‘ఇంటరాగేషన్ ’ నాలుగు రోజులు సాగిన తర్వాత ఆ వ్యాపారి పోలీసులను బతిమాలుకోవడం మొదలెట్టాడు. ఎవరైనా వచ్చి తనతో మాట్లాడాలని, ఏవైనా ప్రశ్నలు అడగాలని, అవసరమైతే కొట్టాలని వేడుకున్నాడు. ఈ మౌనం కంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించినా తట్టుకోగలనంటూ నెత్తినోరు బాదుకున్నాడు. అతడు ఉన్న గది నుంచి ఆ కంపెనీ వెనుక వైపు కొండపై ఉన్న ఓ చిన్న దేవాలయం కనిపిస్తుండేది. శారీరక, మానసిక వైకల్యం లేకుండా అక్కడ నుంచి బయటకు వస్తే ఆ దేవాలయాన్ని పెద్దగా కడతానంటూ దాన్ని చూస్తూ మొక్కుకునే వాడు. ఒక దశలో తనంతట తానే పెద్దగా అరుస్తూ, గతంలో మావోయిస్టుల నుంచి బెదిరింపులు రావడంతో తప్పనిసరై వారికి అమోనియం నైట్రేట్ అక్రమంగా సరఫరా చేశానని, ఈ పేలుడుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మొత్తుకున్నాడు. ఇలా పక్షం రోజుల తర్వాత సదరు వ్యాపారి ఆ కంపెనీ నుంచి, సిక్ కస్టడీ నుంచి బయటకు రాగలిగాడు. నెల రోజులకే తాను మొక్కుకున్నట్లు ఆ దేవాలయం అభివృద్ధి పనులు ప్రారంభించాడు.ఈ జంట పేలుళ్ల కేసుల్ని దర్యాప్తు చేసిన ఎన్ ఐఏ అధికారులు పేలుడు పదార్థమైన స్లర్రీ కర్ణాటకలో ఉగ్రవాదులకు అందినట్లు తేల్చారు. అక్కడే బాంబుల్ని తయారు చేసిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది రియాజ్ భత్కల్ బస్సులో ఇక్కడకు పంపినట్లు నిర్ధారించారు. ఈ విధ్వంసానికి సూత్రధారులైన రియాజ్ భత్కల్, అమీర్ రజా ఖాన్ ఇప్పటికీ పరారీలోనే ఉండగా, మిగిలిన నిందితులకు 2018లో న్యాయస్థానం శిక్ష విధించింది. -
గంజాయి తాగితే వింతగా ఎందుకు ప్రవర్తిస్తారంటే..?
గంజాయిపై భారత్‌తో సహా చాలా దేశాల్లో నిషేధం విధించారు. అక్రమంగా వినియోగిస్తే కఠిన శిక్షలు విధిస్తున్నారు. గంజాయిని తాగిన తర్వాత మనుషుల్లో అసాధారణ చేష్టలు కనిపిస్తాయి. కొందరు బిగ్గరగా నవ్వుతారు. మరికొందరు బిగ్గరగా ఏడుస్తుంటారు. అసలు ఎందుకని ఈ విపరీత ధోరణి? గంజాయిలో ఏముంది..? అది ఏ విధంగా హానికరం..? గంజాయిని తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఇది నేరుగా మనిషి మెదడుపై ప్రభావం చూపుతుంది. నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. గంజాయి తీసుకున్న కొన్ని నిమిషాల్లోనే శరీరంపై అది పనిచేయడం ప్రారంభిస్తుంది. అందుకే అసాధారణ స్వభావంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. ఎన్నో అబద్ధాలను అలవోకగా చెబుతుంటారు. గంజాయి తాగిన తర్వాత ఎందుకు మితిమీరిన ఆనందాన్ని పొందుతుంటారు. దీనికి కారణం డొపమైన్ అనే హార్మోన్. దీన్ని హ్యాప్పీ హార్మోన్ అని కూడా అంటారు. ఈ హార్మోన్ హెచ్చుతగ్గులు అయ్యే కొద్ది మనంలో ప్రవర్తన తీరు మారుతుంది. గంజాయి సేవించినప్పుడు ఈ హార్మోన్ విడుదలవుతుంది. అందుకే మితిమీరిన సంతోషం లేదా దుఖాన్ని ప్రదర్శిస్తారు. నాడీ వ్యవస్థ మీద దీని ప్రభావం ఉండటం వల్ల మెదడు మన ఆధీనంలో ఉండదు. దీని వల్ల ఏం చేస్తున్నారో? ఎందుకు చేస్తున్నారో తెలియకుండా ప్రవర్తిస్తారు. క్రమంగా ఇది వ్యసనంగా మారుతుంది. గంజాయి సేవిస్తే గుండెపోటుతో పాటు అనేక ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని వైద్యులు చెబుతున్నారు. మత్తుని ఇచ్చే అన్ని పదార్థాలతోనూ ఇలాంటి ప్రభావాలే కనిపిస్తాయని వెల్లడించారు. ఇదీ చదవండి: Dress Code: కట్టు..బొట్టు తీరు.. కాస్త డ్రస్ కోడ్‌గా మారింది!..ఆ విధంబెట్టిదనినా.. -
ఆ గొడవల్లో పురుషులు, స్త్రీల స్పందనల్లో తేడా..
లండన్: ఉద్యోగ జీవితంలో బాస్‌తో, సహచరులతో గొడవలు పడే అలవాటు ఉందా. ఒకవేళ ఉంటే.. తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. వర్క్ ప్లేస్‌లో గొడవల విషయంలో మహిళా ఉద్యోగులు, పురుష ఉద్యోగుల స్పందించే తీరు వేరు వేరుగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. వర్క్ ప్లేస్‌లో గొడవలు పడే పురుష ఉద్యోగులు ఆ ఉద్యోగాన్నే వదిలేయడానికి మొగ్గుచూపుతారని.. అదే మహిళలు మాత్రం కొన్నాళ్లు సిక్ లీవ్‌లో వెళ్లడం లేదా ఒత్తిడిని తగ్గించుకోవడానికి యాంటీ డిప్రెసెంట్స్‌ను వాడటం చేస్తుంటారని డెన్మార్క్‌కు చెందిన అర్హస్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే సుమారు 3000 మంది అభిప్రాయాలు తీసుకోగా.. వీరిలో ఏడు శాతం మంది తాము వర్క్‌ప్లేస్‌లో గొడవల బాధితులమే అని వెల్లడించారు. ఈ బాధితుల్లో 43 శాతం మంది పురుషులు ఉన్నారు. కాగా.. వర్క్ ప్లేస్‌లో గొడవలు పురుషుల ప్రమోషన్లు, జీతాలపై ప్రభావం చూపుతాయని పరిశోధనలో పాల్గొన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ముంజెర్గ్ ఎరిక్సన్ వెల్లడించారు. గొడవలతో పురుషులు సిక్ లీవ్‌లకు వెళ్లడం మాత్రం జరగదని ఆమె పేర్కొన్నారు. వర్క్‌ప్లేస్‌లో గొడవల మూలంగా కీలకమైన బాధ్యతలు కాకుండా అంతగా ప్రాధాన్యత లేని బాధ్యతలు ఉద్యోగులు పొందుతారని పరిశోధనలో గుర్తించారు. -
మీరు మొహంలో ఎటువైపు చూస్తున్నారు?
లండన్: మీరు ఎదురుగా నిల్చున్న వారి మొహం లోకి చూస్తూ మాట్లాడుతున్నారా. అయితే ఆ మొహంలో మీరు ఎటువైపు చూస్తున్నారు. అంటే కుడివైపు చూస్తున్నారా.. ఎడమవైపు చూస్తున్నారా. ఎటు చూస్తే ఏంటి.. ఇవేం ప్రశ్నలు అనుకోకండి. పురుషులు, స్త్రీలు తమ ఎదురుగా ఉన్నవారి మొహాల్లోకి చూసే తీరులో స్పష్టమైన తేడా ఉంటుందని క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. లింగపరమైన భేదాలపై అధ్యయనంలో భాగంగా జరిపిన పరిశోధనలో.. పురుషులు, స్త్రీలు చూసే విధానంలో తేడా ఉంటుందని గుర్తించారు. సుమారు 500 మందిపై ఐదువారాల పాటు నిర్వహించిన పరిశీలనలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. ‘ఐ ట్రాకింగ్ డివైస్’ సహాయంతో నిర్వహించిన ఈ పరిశోధనలో మహిళలు కంప్యూటర్ తెరపై ఎదురుగా ఉన్న మొహంలో ఎక్కువగా ఎడమ వైపు చూస్తున్నారని తేలింది. ముఖ్యంగా ఎడమ కంటి భాగంలో వారి ఫోకస్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అయితే.. వేరువేరు కల్చర్లు దీనిపై ప్రభావం చూపుతున్నాయా అనేది తెలుసుకోవడానికి సుమారు 60 దేశాలకు చెందిన వారిని తీసుకొని పరిక్షించినా ఇవే ఫలితాలు వచ్చాయి. ఎదురుగా ఉన్న స్క్రీన్‌పై చూసే విధానాన్ని బట్టి.. ఆ వ్యక్తి జెండర్‌ను చెప్పడానికి 80 శాతం అవకాశం ఉందని పరిశోధనకు నేతృత్వం వహించిన ఆంటోని కౌట్రోట్ తెలిపారు.