breaking news
Dhanvantri temple
-
ఆంధ్రదేశంలో ఆది వైద్యుడి ఆలయం..!
ధన్వంతరి... నారాయణాంశ సంభూతుడు. మానవజాతికి చికిత్సా విధానాన్ని అనుగ్రహించిన ఆదివైద్యుడు. శ్రీభాగవతం సహా వివిధ పురాణాల్లో ధన్వంతరి ప్రస్తావన ఉంది. అనేక ప్రాంతాల్లో ఆ ఆరోగ్య ప్రదాతకు గుడికట్టి పూజిస్తున్నారు. అందులో ఒకటి తెలుగు నేల మీదా ఉంది.ఒకవైపు దేవతలూ మరోవైపు రాక్షసులూ – క్షీరసాగర మథనం ఓ యుద్ధంలా మహా తీవ్రస్థాయిలో జరుగుతోంది. కల్పవృక్షం, కామధేనువు, లక్ష్మీదేవి... ఆ వరుసలో పదకొండవవాడిగా పాలకడలిలోంచి స్ఫురద్రూపి అయిన ఓ పురుషుడు పుట్టుకొచ్చాడు. పెద్దపెద్ద కళ్లూ, ఒత్తయిన కేశాలూ, అంతెత్తు ఆకారం, చిరుదరహాసం... ఆ రూపాన్ని ముక్కోటి దేవతలూ రెప్పవాల్చకుండా చూశారు. అతను ధగ ధగ మెరిసే పీతాంబరాన్ని కట్టుకున్నాడు, మణికుండలాలు ధరించాడు, మెడలో దివ్యమాల మెరిసి΄ోతోంది. ఓ చేతిలో అమృతభాండం ఉంది. మరో చేతిలో వనమూలికలున్నాయి. అచ్చంగా శ్రీమన్నారాయణుడిలా ఉన్నాడు – కాదు కాదు, సాక్షాత్తూ నారాయణుడి అంశే! బ్రహ్మాదులు అతనికి ధన్వంతరి అని నామకరణం చేశారు. పురాణగాథలు... ఓసారి, దుర్వాస మహాముని శాపం కారణంగా... ముక్కోటి దేవతలూ ముక్కుతూ మూలుగుతూ మూలన పడాల్సిన పరిస్థితి వచ్చిందట. ఆ సమయంలో ధన్వంతరి అరుదైన వనమూలికలతో చికిత్సలు చేసి... అమరుల్ని ఆరోగ్యవంతుల్ని చేశాడని ఐతిహ్యం. ధన్వంతరి ప్రస్తావన ఒక్కో పురాణంలో ఒక్కోలా కనిపిస్తుంది. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం...ధన్వంతరి సూర్యనారాయణుడి ప్రియశిష్యుడు. ఆయన దగ్గరే ఆయుర్వేదం నేర్చుకున్నాడు. విష్ణుమూర్తి ఆదేశం ప్రకారం... ద్వితీయ ద్వాపరయుగంలో కాశీ రాజ్యాన్ని పాలించిన చంద్రవంశ రాజు ధనపాలుడి కొడుకుగా అవతరించిన ధన్వంతరి... ఆయుర్వేదాన్ని శాస్త్రంగా మలిచి శుశ్రుతుడితో సహా ఎంతోమందికి బోధించాడనీ... అనేక సంవత్సరాల పాలన తర్వాత.. తిరిగి దైవత్వాన్ని పొందాడనీ పురాణ కథనం. ఆయుర్వేద వైద్యులకు ధన్వంతరే తొలిదైవం. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ధన్వంతరి ఆలయాలున్నాయి. చింతలూరు గ్రామాన... తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని చింతలూరు గ్రామంలో ధన్వంతరి స్వామి ఆలయం ఉంది. గౌతమీ తీరాన, పచ్చని పంటపొలాల మధ్య, సుమారు రెండెకరాల సువిశాల ఆవరణలో స్వామివారు కొలువుదీరి ఉన్నారు. ఆ ఆలయంలో అడుగు పెట్టినంత మాత్రానే... సమస్త రోగాలూ నయమైపోతాయని భక్తుల నమ్మకం. ఆలయ ప్రాంగణంలో ఎత్తయిన ధ్వజస్తంభం కనిపిస్తుంది. విశాలమైన ముఖ మండపం ఉంది. గర్భాలయంలో ధన్వంతరి దివ్య మంగళరూపం దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. కాశీలో ఏకశిలతో మలచిన పాలరాతి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. నాలుగు హస్తాలతో...ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో అమృతకలశం, ఒక చేతిలో జలగతో స్వామి దర్శనమిస్తాడు. ప్రాచీన ఆయుర్వేదంలో జలగ చికిత్స ఓ భాగం. చెడురక్తాన్ని పీల్చుకునే శక్తి ఉందా జీవికి. చింతలూరు వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం వ్యవస్థాపకులు ద్విభాష్యం వెంకటేశ్వర్లు 1942లో ఈ ఆలయాన్ని నిర్మించారు. పూజాదికాలకు ఏ లోటూ లేకుండా శాశ్వత ప్రాతిపదికన గ్రామంలోనే పద్దెనిమిది ఎకరాల భూమిని కేటాయించారు. ఆయన వంశీకులైన ద్విభాష్యం వెంకట శ్రీరామమూర్తి చలువరాతితో సర్వాంగ సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఈ గుడి రాజమండ్రి నుంచి 35 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఏటా కార్తిక బహుళ త్రయోదశినాడు ధన్వంతరి జయంతిని వైభవంగా నిర్వహిస్తారు. తమిళనాట... ఇతర ప్రాంతాల్లో.,, తమిళనాడులోని సుప్రసిద్ధ వైష్ణవక్షేత్రం శ్రీరంగం. అక్కడున్న రంగనాథ స్వామి ఆలయంలో ధన్వంతరి ఉపాలయం ఉంది. ఏ గుడిలో అయినా తీర్థంగా అభిషేక జలం ఇస్తారు. మహా అయితే, పంచామృతం పోస్తారు. ఇక్కడ మాత్రం వనమూలికలతో కూడిన కషాయాన్ని ఇస్తారు. ఆ తీర్థాన్ని తీసుకుంటే మొండివ్యాధులు సైతం మటుమాయమైపోతాయని ఓ నమ్మకం. కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయ ఆవరణలోనూ ఆ ఆరోగ్యదేవుడి విగ్రహం ఉంది. కేరళలోని గురువాయూర్ సమీపంలో కూడా ధన్వంతరి ఆలయాన్ని నిర్మించారు. కొత్తగా ఆయుర్వేద వైద్యవృత్తిని చేపట్టేవారు...ముందుగా స్వామిని దర్శించుకుని పూజాదికాలు నిర్వహించడం ఇక్కడి సంప్రదాయం. కాలికట్ దగ్గర్లోనూ ఓ ధన్వంతరి క్షేత్రం ఉంది. ధన్వంతరి అంటే... మనసుకు పట్టిన జాడ్యాల్నీ, శరీరాన్ని కమ్ముకున్న వ్యాధుల్నీ తొలగించేవాడనీ ధన్వంతరి అనే పదానికి అర్థం. పురాణాల ప్రకారం...ధన్వంతరి ఆరోగ్యానికి అధిపతి. పరిపూర్ణ ఆయువు కోసం ఘనంగా ధన్వంతరీ వ్రతం చేయడం ్ర΄ాచీన సంప్రదాయం. ధనత్రయోదశినాడు లక్ష్మీదేవితో ΄ాటూ ధన్వంతరినీ పూజిస్తారు. ఏటా కార్తికమాసంలో ధన్వంతరి జయంతిని జరుపుకుంటారు. సముద్ర తీరంలోనో స్వగృహంలోనో వైద్యశాలలోనో కలశాన్ని స్థాపించి...పురాణాంతర్గతమైన ధన్వంతరి మహామంత్రాన్ని పఠించి... వైద్యులకూ సంపూర్ణ ఆరోగ్యవంతులకూ తాంబూలాలు ఇచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. పెసర పులగాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం– డి.వి.ఆర్. -
ఆరోగ్యప్రదాతకు అద్భుత ఆలయం
దేవ దానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు ముందుగా హాలాహలం ఉద్భవించింది. పరమేశ్వరుడు దానిని మింగి గరళకంఠుడయ్యాడు. ఆ తరువాత కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, కల్పవృక్షం, పారిజాతం, అప్సరసలు ఆవిర్భవించారు. తరువాత లక్ష్మీదేవి, ఆ తరువాత అరచేత అమృతకలశాన్ని పట్టుకుని విష్ణుమూర్తి అంశతో ఒక దివ్యపురుషుడు ఆవిర్భవించాడు. ఆయనే ధన్వంతరి. మంచి హస్తవాసి గల వైద్యులను ధన్వంతరితో పోలుస్తారు. ఎందుకంటే మొట్టమొదటి వైద్యుడు ధన్వంతరే కాబట్టి. ఆయన దేవ వైద్యుడు. దీపావళికి రెండురోజుల ముందు మనం జరుపుకునే ధన్‌తెరాస్ పండుగలో ధన్ అనేది ధన్వంతరికి సంబంధించినదే. ధన్వంతరి సాక్షాత్తూ విష్ణుమూర్తి అంశ. దేశవ్యాప్తంగా ధన్వంతరికి ఆలయాలున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్లేముందు అసలు ధన్వంతరి ఎవరో, ఆయన ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకుందాం.. ఆయుర్వేదానికి ఆదిపురుషుడైన ధన్వంతరికి ఉత్తరాదిన వారణాసిలోనూ, దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్‌లోని చింతలూరుతో పాటు తమిళనాడు, కేరళలలో ఆలయాలు ఉన్నాయి. ప్రకృతి రమణీయతకు చెరగని చిరునామా, అటవీ సంపదకు పుట్టినిల్లు అయిన కేరళలో ఈ ఆరోగ్యదేవుడికి అత్యధికంగా ఆలయాలున్నాయి. మున్నువరువట్టం, గురువాయూర్, నెల్లువాయ్... ఇలా అనేక చోట్ల ఆలయాలున్నాయి. నెల్లువాయ్లోని ధన్వంతరిని సాక్షాత్తు అశ్వినీదేవతలు ప్రతిష్టించారని ప్రతీతి. దన్వంతరి ఆలయాల్లో అత్యంత పురాతనమైనది నెల్లువాయ్లోని ఆలయమే. ఈ ఆలయం వైద్యానికి మూలస్థానం. ధన్వంతరి ఆలయాల్లో పూజావిధానాలు కూడా ఆరోగ్యాన్ని కాపాడడమే ప్రధానంగా ఉంటాయి. ధన్వంతరికి రోజూ నైవేద్యంగా ‘ముక్కిడి’ అనే ద్రవాన్ని నివేదన చేసి దానిని ప్రసాదంగా భక్తులకు పంచుతారు. ముక్కిడి అనేది 35 ఔషధాల మిశ్రమం. ముక్కిడి తయారు చేసేవారిని ‘కుట్టంజరిమూస్’ అంటారు. ముక్కిడి ప్రసాదాన్ని ఆవుపెరుగు, మిరియాలు, ఉప్పుతోపాటు దివ్యౌషధాన్ని కలిపి చేస్తారు. ఈ దివ్యౌషధం ఔషధవృక్షాల నుంచి సేకరించిన వేర్లు, బెరడులతో చేస్తారు. దీనిని నంబూద్రి కుటుంబీకులు ఏడాదికోసారి మాత్రమే ఇస్తారు. కుట్టింజర్మూస్లు దానిని నిల్వ ఉంచి రోజూ కొంత ఔషధాన్ని ఆవుపెరుగు మిశ్రమంలో కలుపుతారు. దివ్యౌషధం సమ్మేళన రహస్యాన్ని అశ్వినీదేవతలు అష్టవైద్యులకు ప్రసాదించారని ఇక్కడి వారి నమ్మకం. ఈ ప్రసాదం కడుపును ప్రక్షాళన చేస్తుంది. సరైన ఔషధంతో జీర్ణవ్యవస్థను కాపాడుకుంటూ ఉంటే అనేక దీర్ఘకాలిక రోగాలను నివారించవచ్చని ఇక్కడి పూజారులు, ఆలయ ధర్మకర్తలు చెబుతారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆలయం ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు ద్విభాష్యం వెంకటేశ్వర్లు 75 ఏళ్ల కిందట అంటే 1942లో చింతలూరులో ధన్వంతరి ఆలయాన్ని కట్టించారు. పచ్చటి పంటపొలాల నడుమ సువిశాలమైన స్థలంలో అత్యంత శోభాయమానంగా నిర్మించిన ఈ ఆలయంలోకి అడుగుపెడుతూనే మాటలకు అందని అద్భుతమైన అనుభూతి సొంతమవుతుంది. నిర్మాణ నాణ్యత, రమ్యత పెద్ద ఆలయాలకు ఏమాత్రం తీసిపోకుండా ఆరోజుల్లోనే లక్షలాది రూపాయల వ్యయంతో ఎక్కడెక్కడినుంచో శిల్పులను రప్పించి ఆలయ ముఖమంటపం మీద క్షీరసాగర మథన దృశ్యాలను కళ్లకు కట్టేలా చెక్కించారు. అలాగే గోడల మీద ఏర్పాటు చేసిన బ్రహ్మ, దక్షప్రజాపతి, అశ్వనీ దేవతలు, ఇంద్రుడు, భరద్వాజుడు, వాగ్భటుడు, ఆత్రేయుడు, శుశ్రుతుడు, చరకుడు తదితర వైద్యాచార్యుల శిల్పాలు అమితంగా ఆకట్టుకుంటాయి. ప్రాకారాలపై చెక్కిన అద్భుత శిల్పసంపద చూపరులను కట్టిపడేస్తుంది. గర్భాలయంలో పట్టుపీతాంబరాలు ధరించి ఒక చేత అమృత భాండాన్ని, మరో చేత ఔషధ కలశాన్ని ధరించి, మరోచేత శంఖు చక్రాలను ధరించి, అభయ ముద్రలో ఉన్న ధన్వంతరి నిలువెత్తు విగ్రహాన్ని చూస్తే భక్తులకు, రోగులకు కొండంత ధైర్యం కలుగుతుంది. లోపల ధన్వంతరి విగ్రహంతోపాటు శ్రీదేవీ భూదేవీ సమేత వేంకటేశ్వరస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, కాశీ అన్నపూర్ణా విశ్వేశ్వరుల విగ్రహాలు కూడా కనువిందు చేస్తాయి. స్వామికి నివేదించే ప్రసాదం అన్నవరం సత్యనారాయణస్వామి పొడిప్రసాదంలా అద్భుతమైన రుచితో ఉంటుంది. దేశవిదేశాలనుంచి ఎందరో రోగులు ఇక్కడకు వచ్చి, ఈ ఆరోగ్యప్రదాత నుంచి అభయం పొందుతుంటారు. ధన్వంతరి జన్మదినమైన ఆశ్వయుజ బహుళ త్రయోదశినాడు, కార్తీక మాసంలోనూ ఇక్కడ స్వామివారికి పెద్ద ఎత్తున ఉత్సవాలు, విశేషపూజలు జరుగుతాయి. ఈ ఆలయ వ్యవస్థాపకులు ద్విభాష్యం వెంకటేశ్వర్లు ఈ ఆలయానికి ధూపదీప నైవేద్యాల కోసం మాన్యాన్ని ఇచ్చారు. ఆయన తదనంతరం ఆయన కుమారుడు వెంకట సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఆలయం తుది మెరుగులు దిద్దుకుంది. ప్రస్తుత ధర్మకర్త ద్విభాష్యం వెంకట శ్రీరామమూర్తి ఆలయాన్ని అభివృద్ధిపరచి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ద్విభాష్యం కుటుంబం నెలకొల్పిన చింతలూరు వేంకటేశ్వర ఆయుర్వేద నిలయం ఆధ్వర్యంలోనే ఆలయ ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని చింతలూరు కాకినాడ నుంచి 47 కిలోమీటర్ల దూరంలో ఉంది. మండపేట, కొత్తపేట, రామచంద్రపురం, తణుకు ఇక్కడికి సమీపంలోని పట్టణాలు. ఈ అన్ని ప్రాంతాలలోనూ చూడదగ్గ ఆలయాలు అనేకమున్నాయి. ఎలా చేరుకోవాలంటే...? కాకినాడ నుంచి... రావులపాలెం మీదుగా వెళ్లే బస్సు ఎక్కి ఆలమూరు శివారు కొత్తూరు సెంటర్లో దిగితే, అక్కడ నుంచి కిలోమీటరు దూరంలోనే ఆలయం ఉంది. రాజమహేంద్రవరం నుంచి.. అమలాపురం, తణుకు, భీమవరం తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సును ఎక్కి జొన్నాడ సెంటర్లో దిగాలి. అక్కడ నుంచి మండపేట వైపు వెళ్లే బస్సు ఎక్కి కొత్తూరు సెంటర్ (చింతలూరు)లో దిగాలి. రాజమహేంద్రవరం, జొన్నాడలో ప్రతి 20 నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంది. రావులపాలెం నుంచి.. ఇతర జిల్లాల నుంచి కాని, ప్రాంతాల నుంచి కాని రావులపాలెం చేరుకుని మండపేట వైపు పల్లెవెలుగు బస్సు ఎక్కి కొత్తూరు సెంటర్ చింతలూరు దిగాలి. ఆటోలు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి. రైలుమార్గం: సికిందరాబాద్ లేదా విజయవాడ నుంచి కాకినాడ లేదా రాజమండ్రి వస్తే అక్కణ్ణుంచి బస్సులున్నాయి. - డి.వి.ఆర్. భాస్కర్ ఫొటోలు: నామాల ఏసురాజు, సాక్షి, ఆలమూరు