breaking news
DGP Sanjeev Dayal
-
షీనాబోరా కేసులో కీలక మలుపు
ముంబయి : మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యకేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న ఇంద్రాణీ ముఖర్జియా, మరో ఇద్దరు నిందితులపై సీబీఐ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పదిరోజుల కిందట మహారాష్ట్ర ప్రభుత్వం షీనాబోరా హత్య కేసును సీబీఐకి అప్పగించిన విషయం విదితమే. ఇంద్రాణీ, ఆమె మాజీ భర్త సంజయ్ ఖన్నా, అప్పటి వారి కారు డ్రైవర్ శ్యామ్ వర్ పింటురామ్ రాయ్ పేర్లను ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. అయితే, కిడ్నాప్, హత్య, సాక్ష్యాలు తారుమారు చేసినందుకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి తమ వద్ద ఉన్న రిపోర్టును రాష్ట్ర డీజీపీ సంజీవ్ దయాల్ సీబీఐకి అప్పగించారు. 2012, ఏప్రిల్ 24న షీనాబోరా హత్యకు గురైన విషయం విదితమే. -
ఆయుధాలు బయట పెట్టి రండి!
- పోలీసు శాఖ కార్యాలయానికి వచ్చే వారికి డీజీపీ ఆదేశం - సీనియర్ అధికారుల భద్రత కోసమేనని వెల్లడి - సీఎం అంగరక్షకులైనా ఆయుధాలతో అనుమతి నో.. సాక్షి, ముంబై: రాష్ట్ర పోలీసు శాఖ ప్రధాన కార్యాలయంలోకి ఎవరూ ఆయుధాలతో రాకూడదని డీజీపీ సంజీవ్ దయాల్ ఆదేశాలు జారీచేశారు. ఇక్కడ పనిచేసే సీనియర్ పోలీసు అధికారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ఆయన తెలిపారు. దీంతో ఇక నుంచి కార్యాలయానికి వచ్చే మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఇతర రంగాల ప్రముఖులు తమ వద్ద, అంగరక్షకుల వద్ద ఉన్న ఆయుధాలను ప్రవేశద్వారం దగ్గర ఇచ్చిన తర్వాతే లోనికి ప్రవేశం లభిస్తుంది. ఏటీఎస్, ఏసీబీ, సీఐడీ మినహా రాష్ట్రానికి నిఘా విభాగం మొదలుకుని పోలీసు శాఖకు చెందిన అన్ని ప్రముఖ విభాగాల సీనియర్ అధికారులు ఇక్కడ పనిచేస్తారు. అంతేగాక హోం శాఖ, వివిధ శాఖల మంత్రులు, సహాయ మంత్రులు, సీనియర్ అధికారుల సమావేశాలు తరుచూ జరుగుతూనే ఉంటాయి. పోలీసు అధికారులు, కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు భేటీ అయ్యేందుకు వస్తుంటారు. ప్రముఖులతో వారి అంగరక్షకులతో రివాల్వర్లు, ఎస్ఎల్ఆర్ తదితర ఆధునిక ఆయుధాలుంటాయి. ప్రధాన కార్యాలయానికి వచ్చే ముందు ప్రముఖులు, వారి అంగరక్షకుల మానసిక పరిస్థితి ఒకేలా ఉండదు. మానసిక ఒత్తిడికి గురై ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చెప్పడం కష్టం. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను పరిగణనలోకి తీసుకున్న దయాల్.. పోలీసు ప్రధాన కార్యాలయంలోకి ఆయుధాలతో అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. రాష్టంలోని 12 కోట్ల ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించేందుకు చేపట్టాల్సిన ప్రణాళికలను ఈ ప్రధాన కార్యాలయంలోనే రూపొందిస్తారు. అలాంటి కార్యాలయానికే భ ద్రత మరింత కట్టుదిట్టం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.