breaking news
Deo ravindranadhreddy
-
ఏపీకి ఖమ్మం డీఈవో బదిలీ
ఖమ్మం : రెండేళ్లుగా డీఈవోగా పనిచేస్తున్న రవీంద్రనాథ్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో డీఈవో బదిలీ అనివార్యమైంది. గతంలో ఇక్కడ పనిచేసిన డీఈవో వెంకటరెడ్డి జిల్లా నుంచి రాష్ట్ర పుస్తకాల విభాగం డిప్యూటీ డెరైక్టర్‌గా బదిలీ కావడంతో రవీంద్రనాథ్‌రెడ్డి డీఈవోగా వచ్చారు. 2013లో జిల్లాకు వచ్చిన ఆయన అప్పటి నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, ఏజెన్సీ ఉపాధ్యాయుల వివాదం పరిష్కారంలో తనదైన ముద్ర వేసుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన తర్వాత ఆంధ్రా కేడర్‌కు చెందిన రవీంద్రనాథ్‌రెడ్డిని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డీఈవో జిల్లా నుంచి బదిలీ అయ్యారు. పోస్టు కోసం పోటాపోటీ కాగా, ఖమ్మం జిల్లా డీఈవోగా వచ్చేందుకు పలువురు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ డీఈవోగా పనిచేస్తున్న విజయలక్ష్మీ బాయి, జిల్లాకు చెందిన రాజీవ్‌తోపాటు గతంలో జిల్లాలోని ఏజెన్సీ డీఈవోగా పనిచేసిన రాజేష్ మహబూబ్‌నగర్ డీఈవోగా పనిచేస్తూ ఇటీవల ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు. ఆయన కూడా జిల్లాకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. వీరితోపాటు జిల్లాకు చెందిన లింగయ్య, శ్రీనివాసచారి కూడా ఖమ్మం డీఈవోగా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిసింది. ఇది ఒకటి, రెండు రోజుల్లో తేలనుంది. కాగా, కొత్త డీఈవో నియామకం జరిగే వరకు జిల్లా విద్యాశాఖాధికారి బాధ్యతలను ఆర్జేడీ బాలయ్యకు అప్పగించారు. -
వియ్ మిస్ యూ కలాం
ఖమ్మం : మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం మృతితో జిల్లా దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన మృతికి సంతాప సూచకంగా జిల్లాలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవులు ఇచ్చారు. పాఠ శాలల విద్యార్థులు రోడ్లపైకి వచ్చి కలాం తాతయ్యకు నివాళులు అర్పించారు. వియ్ మిస్ యూ కలాం అని ఫ్లెక్సీలు చేతబూని ర్యాలీలు నిర్వహించారు. విద్యాసంస్థల్లో, జిల్లా అధికారుల కార్యాలయాల్లో అబ్దుల్ కలాం సంతాప సభలు ఏర్పాటు చేశారు. మహనీయుని ఆలోచనలు, ఆచరణ విధానం, స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. గొప్ప సైంటిస్టును కోల్పోయాం అబ్దుల్ కలాం అంటే భారత్, భారత్ అంటే అబ్దుల్ కలాం అన్నట్లుగా పేరు ప్రఖ్యాతులు ఘటించిన గొప్ప మేధావి అబ్దుల్ కలాం. శాస్త్రవేత్తగా, దేశ ప్రథమ పౌరుడుగా ఆయన దేశానికి అందించిన సేవలు మరువలేనివి. ఆయన మరణం భారత దేశానికి తీరని లోటు. విజ్ఞాన వంతమైన భారత్‌గా వెలుగొందేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలి. -ప్రొఫెసర్ కనకాచారి మార్గదర్శకుడు కలాం సార్ యువశాస్త్ర వేత్తలకే కాదు, దేశంలో ఏ రంగానికి చెందిన వారికైనా అబ్దుల్ కలాం సార్.. మార్గదర్శకుడు. హైదరాబాద్‌లో జరిగిన సైన్స్ కాన్ఫరెన్స్‌లో సార్‌తో పాటు పాల్గొన్నందుకు గర్వపడుతున్నా. ప్రపంచ దేశాల్లో మేధావిగా పేరున్న ఆయన నిరాడంబరంగా జీవించారు. భారత కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత ఆయనకే దక్కింది. -జి. పుల్లారావు, జిల్లా సైన్స్‌క్లబ్ అధ్యక్షుడు విజ్ఞానఖని కలాం అబ్దుల్ కలాం అంటే అసామాన్యమైన మనిషి. ఆయన ఒక విజ్ఞానఖని. ఎంత తవ్వినా తరగని జ్ఞానం ఆయనది. సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన ప్రతిభకు పేదరికం అడ్డుకాదని రుజువు చేసిన మహానుభావుడు. ఉపాధ్యాయులకే ఉపాధ్యాయుడుగా, పిల్లలకు ఇష్టమైన రీతిలో బోధించే గురువుగా, విశ్వ రహస్యాన్ని చేధించిన మహనీయుడు ఆయన. ఆయన మృతి ప్రపంచానికే తీరని లోటు. ఉపాధ్యాయులందరికి ఆయన ఆదర్శ ప్రాయుడు. -రవీంద్రనాధ్‌రెడ్డి, డీఈఓ దేశం గర్వించదగిన మహనీయుడు క్షిపణి ప్రయోగాల్లో భారత్ ఖ్యాతిని నలుదిశల చాటిన మేధావి. సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదిగారని, శాస్త్ర, సాంకేతిక రంగంలో భారత్ ప్రపంచ దేశాల సరసన నిలవడం ఆయన కృషి ఫలితమే. అటువంటి మహనీయుడు భారత దేశంలో పుట్టడం భారతీయులందరికి గర్వకారణం. -వినయ్‌కృష్ణారెడ్డి, ఆర్డీఓ