breaking news
Delhi MPs
-
పల్లెసీమలకు ఇక మంచి రోజులు
దత్తతలో మిగతావారికంటే ముందున్న ఢిల్లీ ఎంపీలు సాక్షి, న్యూఢిల్లీ: పల్లెలను దత్తత తీసుకునే విషయంలో ఢిల్లీ ఎంపీలు మిగతావారికంటే ముందున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన సంసద్ ఆదర్శ్ గావ్ యోజనకింద తమ నియోజక వర్గాల పరిధిలోని ఏదైనా ఒక గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు పార్లమెంటు సభ్యులకు తొలుతఇచ్చిన గడువు ముగిసింది. సగానికి పైగా ఎంపీలు ఇంకా గ్రామాలను ఎంపిక చేసుకోలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఢిల్లీకి చెందిన ఏడుగురు ఎంపీలు ఈ పథకం కింద గ్రామాలను దత్తత తీసుకున్నారు. తూర్పు ఢిల్లీ ఎంపీ మహేష్‌గిరి తన నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్ని దత్తత తీసుకున్నట్లు ప్రకటించి మిగతావారికి ఆదర్శంగా నిలిచారు. ప్రపంచంలోని ఎన్నదగిన మహానగరాలలో ఒకటిగా గుర్తింపు పొందిన ఢిల్లీ పరిధిలోనే ఉన్నప్పటికీ అనేక సమస్యలతో సతమవుతున్న ఈ గ్రామాల్లో పురోగతిపై ఆశలు పెరిగిపోయాయి. ఆదర్శ గ్రామం పథకం కింద చౌహన్పట్టీ, కాదీపుర్ గ్రామాలను దత్తత తీసుకున్నట్లు ఈశాన్య ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ ప్రకటించారు. న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షీ లేఖి ఐఎన్ఏ వద్దనున్న పిలంజీ గ్రామాన్ని, దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేష్ బిధూడీ భాటీ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. తూర్పు ఢిల్లీ ఎంపీ మహేష్ గిరి మొత్తం 44 గ్రామాలను దత్తత తీసుకున్నట్లు ప్రకటించినప్పటికీ సంసద్ ఆదర్శ్ గావ్ యోజనకింద తొలుత గాజీపుర్ సమీపంలోని చిల్లా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు. పశ్చిమ ఢిల్లీ ఎంపీ ప్రవేశ్ వర్మ నజఫ్‌గఢ్ శాసనసభ పరిధిలోని ఝాండోదా గ్రామంతో పాటు మటియాలా శాసనసభ పరిధిలోని దౌలత్పుర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. చాందినీచౌక్ ఎంపీ డా. హర్షవర్దన్ ధీర్‌పుర్ గ్రామాన్ని, వాయవ్య ఢిల్లీ ఎంపీ ఉదిత్‌రాజ్ జౌంతీ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ గ్రామాలు విద్యుత్ కొరత, నీటి సరఫరా సమస్యలతో పాటు రహదారులు, పాఠశాలలు, మురుగుకాల్వలు వంటి మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. -
‘లోకల్ పై' నిర్లక్ష్యం
లోక్‌సభ నియోజకవర్గాల అభివృద్ధి కోసం కేటాయించే స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులను (ఎంపీ ల్యాడ్ నిధులు) వెచ్చించడంలో ఢిల్లీ ఎంపీలు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. తూర్పుఢిల్లీ ఎంపీ జైప్రకాశ్ అగర్వాల్, పశ్చిమఢిల్లీ ఎంపీ మహాబల్ మిశ్రా మాత్రమే స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులను పూర్తిగా ఖర్చు చేసినట్టు తేలింది. దక్షిణఢిల్లీ ఎంపీ రమేశ్ కుమార్ అందరికంటే తక్కువగా నిధులను ఖర్చు చేసినట్టు వెల్లడయింది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వశాఖ గణాంకాల ద్వారా ఈ విషయం వెల్లడయింది. దీని నివేదిక ప్రకారం ఢిల్లీ లోక్‌సభ ఎంపీలకు స్థానిక ప్రాంత అభివృద్ధి నిధుల కింద రూ.93.75 కోట్లు కేటాయించగా, వాటిలో 70 శాతం డబ్బును మాత్రమే ఖర్చు చేశారు. మిగతా రూ.28.80 కోట్లు మురిగిపోయాయి. రాష్ట్రంలోని ఏడు లోక్‌సభ స్థానాల్లోనూ కాంగ్రెస్ నాయకులే ఎంపీలుగా గెలిచిన సంగతి తెలిసిందే. తూర్పుఢిల్లీ ఎంపీ జైప్రకాశ్ అగర్వాల్, పశ్చిమఢిల్లీ ఎంపీ మహాబల్ మిశ్రా స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులను పూర్తిగా ఖర్చు పెట్టారు. డీపీసీసీ మాజీ అధ్యక్షుడు కూడా అయిన అగర్వాల్‌కు రూ.18.39 కోట్లను స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులుగా కేటాయించగా, రూ.16.69 కోట్లు ఖర్చు చేసినట్టు తేలింది. మిశ్రా నియోజకవర్గానికి రూ.13.31 కోట్లు కేటాయించగా, రూ.10.26 కోట్లు వినియోగించారు. ఈ విషయంలో ఎంపీ రమేశ్ కుమార్ బాగా వెనకబడ్డారు. ఆయనకు మొత్తం రూ.10.32 కోట్లు కేటాయించగా, రూ.3.71 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఆఖరున నిలిచారు. అందుకే దక్షిణఢిల్లీ పరిధిలోని ప్రాంతాల్లో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు. ‘మాకు తెలిసి ఇక్కడ ఎంపీ స్థానిక ప్రాంత అభివృద్ధి నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మూత్రశాలలు, రోడ్లు, వీధిదీపాల వంటి కనీస సదుపాయాలు కూడా మా ప్రాంతాల్లో కనిపించవు’ అని ఛత్తర్పూర్వాసి ఆశిష్ బాత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తూర్పుఢిల్లీ ఎంపీ సందీప్ దీక్షిత్ పనితీరు కూడా మెరుగ్గా ఏమీ లేదు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం రూ.7.89 కోట్లను స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులుగా కేటాయించగా, కేవలం రూ.3.67 కోట్లు వినియోగించారు. కేంద్రమంత్రి, చాందినీచౌక్ ఎంపీ కపిల్ సిబల్‌కు రూ.18.24 కోట్లు ఇవ్వగా, 13.47 కోట్లు ఖర్చు చేసి చేతులు దులుపుకున్నారు. కాంగ్రెస్ మీడియా వ్యవహారాల ఇన్చార్జ్, న్యూఢిల్లీ ఎంపీ అజయ్‌మాకెన్ పనితీరు కాస్త మెరుగ్గానే ఉంది. ఆయన నియోజకవర్గానికి రూ.20.96 కోట్లు అందజేయగా, రూ.16.61 కోట్లు వినియోగించారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి, వాయవ్యఢిల్లీ ఎంపీ కృష్ణ తీరథ్‌కు రూ.9.99 కోట్లు స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులుగా కేటాయించగా, రూ.5.66 కోట్లను ఖర్చు పెట్టించగలిగారు. ఈమె నియోజకవర్గ పరిధిలోకి వచ్చే రోహిణి, రిఠాలా, నంగ్లోయి బన్వానా, నరేలా ప్రాంతాలవాసు లు కొందరు మాట్లాడుతూ నిధులు ఖర్చు చేసింది నిజమే అయినా, ఇందుకు సక్రమ విధానాన్ని అనుసరించలేదని విమర్శించారు. ‘డ్రైనేజీలను ఇప్పటికీ బాగు చేయకపోవడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. అందుకే ఏటా భారీగా మలేరియా, డెంగీ కేసులు నమోదవుతున్నాయి. పైప్లైన్లు వేయడానికి కార్పొరేషన్లు ఇష్టమొచ్చినట్టు రోడ్లు తవ్వుతున్నాయి. ఫలితంగా ఏర్పడే శిథిలాల ను ఎవరూ పట్టించుకోవడం లేదు’ అని రోహిణిలోని సెక్టార్ 3 నివాసి శిఖ అన్నారు. ఇక్కడి పార్కుల్లో రాత్రిపూట గూండాలు, తాగుబోతులు సంచరి స్తున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె ఆక్షేపించారు.