breaking news
Dangal film
-
కోడెవయసు రామ్మూర్తులు
దంగల్ దంగల్ సినిమా పుణ్యమా అని ఉత్తర భారతదేశంలో మళ్లీ కుస్తీలకు గిరాకీ పెరిగింది. పల్లెపట్టుల్లో ఇప్పటికే ఆదరణ ఉన్న ఈ క్రీడకు సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’, ఆమిర్‌ఖాన్ ‘దంగల్’ సినిమాల వల్ల భారీగా గ్లామర్ తోడయ్యింది. సుల్తాన్‌లో సల్మాన్‌ఖాన్ స్వయంగా ఒక మల్లయోధుడిగా నటిస్తే, దంగల్‌లో ఆమిర్‌ఖాన్ తన కూతుళ్లను తీర్చిదిద్దే మాజీ మల్లయోధుడిగా కనిపిస్తారు. స్త్రీలైనా పురుషులైనా పౌరుషంగా ప్రత్యర్థులను మట్టికరిపించవచ్చు అని నిరూపించిన ఈ సినిమాలతో ఒక్కసారిగా ఉత్తరాదిగా లంగోటీ బిగించే పిల్లల, కుర్రవాళ్ల శాతం పెరిగింది. అయితే దీనికి నేపధ్యం కూడా ఉంది. భారతదేశంలో మొదటి నుంచి ‘మల్లయుద్ధం’ ఉంది. భీముడు మల్లయోధుడే. అయితే మొఘలులు మన దేశానికి వచ్చాక వారికి తెలిసి ‘పహిల్వానీ’ క్రీడను వ్యాప్తి చేశారు. దేశీయంగా ఉన్న మల్లయుద్ధం, మొఘలులు తెచ్చిన పహిల్వానీ కలిసి ఇప్పటి ‘కుస్తీ’గా మారిందని కొందరి అభిప్రాయం. తెలుగునాట తొలిరోజుల్లో కోడి రామ్మూర్తి, ఆ తర్వాతికాలంలో నెల్లూరు కాంతారావు మల్లయోధులుగా ఖ్యాతి పొందారు. దేశవ్యాప్తంగా అయితే ధారాసింగ్‌కు ఉన్న పేరు తెలిసిందే. ఆ స్థాయిలో కాకపోయినా ఆ తర్వాత చాలామందే వచ్చారు. ఇప్పుడు దంగల్ పుణ్యమా అని రానున్న కాలంలో క్రికెట్లోనే కాదు కుస్తీలో కూడా అంతటి గ్లామర్ ఉన్న హీరోలను మనం చూడవచ్చు. ఇక్కడ చూస్తున్నది రెండురోజుల క్రితం అమృతసర్ శివార్లలో కుస్తీ ప్రాక్టీసు చేస్తున్న ఔత్సాహికుల చిత్రాలు. కుస్తీ కోసం గోదాలో ఉన్న మట్టిని నీళ్లు, తేనె కలిపి ప్రత్యేకంగా మెత్తగా చేస్తారు. అలాంటి మట్టిలోనే కుస్తీ ఆడాలి. అప్పుడే వాళ్లకు క్షేమకరం. మనకు నయనానందకరం. -
మల్లయోధుడిగా...
ఒకపక్కన ‘పీకే’ చిత్రం రికార్డులను తిరగరాస్తుంటే, హిందీ చిత్ర సీమలో ఇప్పుడు మరో చర్చ జరుగుతోంది. ఆమిర్‌ఖాన్ నటించే తదుపరి చిత్రం ఏమై ఉంటుందన్నదే ఆ చర్చ. ప్రస్తుతం వినవస్తున్న వార్తలు గనక నిజమైతే, ఆమిర్ తన తదుపరి చిత్రంలో మల్లయోధుడిగా కనిపించనున్నారు. నితేశ్ తివారీ రూపొందిస్తున్న ‘డంగల్’ చిత్రంలో నిజజీవితంలో ప్రసిద్ధ మల్లయోధుడైన మహావీర్ ఫోగత్ పాత్రను ఆమిర్ ఖాన్ పోషించనున్నట్లు సమాచారం. ప్రసిద్ధ భారతీయ మహిళా మల్లయోధులైన గీతా, బబితా కుమారి ఫోగత్ల తండ్రి మహావీర్. కుమార్తెలిద్దరినీ మల్లయుద్ధంలో ప్రోత్సహించిన ఆ తండ్రి నిజజీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోందట! ఈ పాత్ర కోసం ఆమిర్ ఖాన్ ఇప్పటికే ప్రతి రోజూ రెండేసి గంటల వంతున వ్యాయామం చేస్తున్నారట. వెండితెరపై అసలు సిసలు మల్లయోధుడి లాగా కనిపించడం కోసం ప్రత్యేకించి హాలీవుడ్ నుంచి ఒక ఫిట్నెస్ నిపుణుణ్ణి కూడా రప్పించారట. గతంలో క్రీడా నేపథ్యంలో వచ్చిన ‘చక్ దే ఇండియా’, ‘మేరీ కోమ్’, ‘భాగ్ మిల్ఖా భాగ్’ లాంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి, ఏ పాత్ర పోషించినా దానికి నూటికి నూరుపాళ్ళు న్యాయం చేసేందుకు ప్రయత్నించే ఆమిర్ ఈసారి తెరపై మల్లయోధుడిగా కూడా అదే స్థాయి అంకితభావం చూపడం ఖాయమేననిపిస్తోంది.