breaking news
dalit farmers Concerns
-
మా భూములు గుంజుకుంటారా?
గజ్వేల్: ‘చిన్నప్పటిసంది ఈ భూముల్లోనే తిరిగినం.. పశువులు మేపినం.. రాళ్లు, రప్పలు ఉండె..రెక్కలు ముక్కల్జేసి సాగుజేసినం. మా తాతలకెల్లి ఈ భూములతోనే మా బతుకు ముడిపడి ఉంది. సావనైనా సస్తం గాని...మా భూములను ఇడవం. ఈ సర్వేలెందుకు? మా బతుకులు బుగ్గి చేస్తరా? ఇన్ని ఏండ్లయినా మాకు పాసు పుస్తకాలు రాలే, ముందుగల్ల పట్టాలిచ్చి పాస్ పుస్తకాలివ్వండి. రాజకీయాల కోసం మమ్మల్ని బలి చేస్తారా?’అంటూ సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసరాల్లో గల 325 సర్వే నంబర్లోని 388 ఎకరాల్లో గురువారం ప్రారంభమైన రెవెన్యూ సర్వే ప్రక్రియ దళిత రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే వారు తమ భూముల వద్దకు చేరుకున్నారు. కొత్తగా ఈ సర్వేలు చేపట్టి ఏం చేస్తారని అధికారులను ప్రశ్నించారు. ఈ సర్వే నంబరులో ఉన్న 388 ఎకరాల భూములు 200 కుటుంబాలకు జీవనాధారంగా పేర్కొంటూ ప్రాణాలు పోయిన భూములివ్వం అంటూ తెగేసి చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. మా బతుకులు ఆగం చేస్తారా? ఈ సర్వే నంబరులో నాకు 2.5 ఎకరాల భూమి ఉంది. గతంలో మక్కజొన్న, పజ్జొన్న లాంటి మెట్ట పంటలు వేసుకొని బతికెటోల్లం. కేసీఆర్ సీఎం అయినంక... ఇక్కడ పాండురంగసాగర్ రిజర్వాయర్ కట్టించిండు. దీని తర్వాత వరి సాగు చేసుకుంటున్నం. ఇప్పుడు మా భూముల్లో ప్రభుత్వం చెప్పిందని అధికారులు సర్వే చేస్తుండ్రు. ఈ సర్వే ఎందుకు? మా భూములు వేరే వారికి ఇస్తారా? అలా చేసి మా బతుకులను ఆగం చేస్తారా ? – ముక్కిడి శ్రీనివాస్ ఈ పొలమే నా జీవనాధారం మా భూములల్ల సర్వే చేసి మమ్మల్ని ఆగం చేయొద్దు. నాకు 325 సర్వే నంబరులో ఎకరంన్నర పొలం ఉన్నది. ఈ పొలమే ఆధారం. సర్వే ద్వారా ఎన్నో ఏండ్ల సంది సాగు చేసుకుంటున్న మమ్మల్ని కాదని, వేరే వాళ్లకు భూములు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అట్ల చేసి మమ్మల్ని ఆగం చేస్తారా ? – బలింపురం యాదగిరి మేం దళితులమే కదా..మా భూములను గుంజుకుంటరా ? మేం కూడా దళితులమే కదా..మా భూములు గుంజుకుంటారా? మా తాతల కాలం నుంచి మేమే సాగుచేసుకుంటున్న భూములు. మాకు పట్టాలు పంచిన తర్వాత, మా గ్రామంలో ఇంక ఎవరైనా రైతులు మిగిలి ఉంటే వారికి భూములు ఇవ్వండి. కానీ మావి గుంజుకోవాలని చూడకండి. కేసీఆర్ వల్ల మాకు ఇక్కడ నీటి సౌకర్యం కలిగింది. వరి పంట వేసుకుంటున్నాం. కేసీఆర్ మా భూముల్లోకి రాలేదు. – ఎడమ కర్ణాకర్ రాళ్లురప్పల భూములను బాగు చేసుకున్నం నాకు తెలిసినకాడికి యాభై, అరవై ఏండ్ల సంది మేం ఈ భూములను సాగుచేసుకుంటున్నం. అప్పట్లో నీళ్లు లేక, బొబ్బర్లు, ఉలువలు సాగుచేసుకునే వారు. గిప్పుడు కాల్వలు, పాండురంగసాగర్ ద్వారా నీళ్లు వచి్చనయ్. వరి పంట చేసుకొని బతుకుతున్నం. గిప్పుడు మా భూములను గుంజుకోవాలని చూడొద్దు. – గీసు మల్లేశం అప్పుడు ఇవి గడ్డి మొలవని భూములు ఒకప్పుడు గడ్డి మొలవని భూములివి. మేం కష్టపడి బాగు చేసుకున్నం. నాకు ఇక్కడ ఎకరం భూమి ఉన్నది. కేసీఆర్ మాకు నీళ్లు అందించిండు. వరి పొలం సాగుచేసుకుంటున్న. మా తాతలు అప్పగించిన భూమి ఇది. ఎంతో ఇçష్టంతో వ్యవసాయం చేసుకుంటున్నం. – ఎడమ మల్లేశం ఈ భూములు మావే నేను చిన్నగున్నప్పటినుంచి నేను భూముల్లో పశువులు మేపుకుంటూ తిరిగిన. ఇవి పాడుపత్తర్ లెక్క ఉండే. మెల్లమెల్లగా మంచిగ చేసుకొని సాగుచేసుకుంటున్నం. కేసీఆర్ నీళ్లు ఇచ్చిండు. మంచి సౌలత్ చేసిండు. – ఎడమ చంద్రయ్య -
మా భూములు లాక్కోవద్దు
దూబచర్ల జంక్షన్లో దళిత రైతుల రాస్తారోకో దూబచర్ల (నల్లజర్ల రూరల్) : తాము చెమటోడ్చి అభివృద్ధి చేసిన పచ్చని పొలాలను పరిశ్రమల స్థాపన సాకుతో లాక్కోవద్దంటూ దూబచర్లలో దళిత రైతులు గురువారం ఆందోళనకు దిగారు.దూబచర్ల - జి.కొత్తపల్లి రహదారి పక్క ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం 450 ఎకరాల అసైన్డ్, 70 ఎకరాల జిరాయితీ భూములను సేకరించాలని నిర్ణయించడంతో నెల రోజులుగా రైతులు సర్వేను అడ్డుకుంటూ ఆందోళన చేస్తున్న విషయం విదితమే. అఖిల పక్ష కమిటీ ఆధ్వర్యంలో రైతులు, మహిళలు రాజమండ్రి - ఏలూరు జిల్లా ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ప్లకార్డులు చేతబూని గంటసేపు నిరసన వ్యక్తం చేశారు. పురుగు మందు డబ్బాలతో ఆత్మాహుతి చేసుకుంటామంటూ హెచ్చరించారు. ఏఎస్సై సోమరాజు తమ సిబ్బందితో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. సర్పంచ్ గంటా సుందర్రావు, వైస్ ఎంపీపీ ఈడే శ్రీను, కూచిపూడి ఉదయభాస్కరరావు, చావా సుధాకర్, మాజీ ఎంపీపీ చేబ్రోలు కొండ, తొమ్మండ్రు రవి, పంది సత్యనారాయణ, గంటాదాసు, బోడిగడ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రైతుల భార్యలు రిలే దీక్షలు రాస్తారోకో అనంతరం రైతుల భార్యలు అంబేడ్కర్, రాజీవ్‌గాంధీ విగ్రహాల వద్ద రిలే నిరాహార దీక్షలకు ఉపక్రమించారు. మీకు తెలియకుండా ఎటువంటి భూసేకరణ జరగదని జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావులు హమీ ఇచ్చారని మళ్లీ ఇపుడు సర్వే బృందాలు వస్తున్నాయంటే వారి హామీ ఏమైనట్టని వీరు ప్రశ్నిస్తున్నారు. తమకు స్పష్టమైన హమీ ఇచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. కొవ్వూరి నాగలక్ష్మి, కె.నాగమ్మ, కారెం శోభారాణి, మల్లి సరోజిని, బోడిగడ్ల సూర్యాకాంతం, చిన నాగమణి, కారెం గంగారత్నం, మల్లి లిల్లీ కుమారి, కారెం వెంకాయమ్మ పాల్గొన్నారు.


