breaking news
Current deduction
-
‘కోత’ వేస్తే కబురందిస్తారు
♦ ఎస్ఎంఎస్ రూపంలో విద్యుత్ కోతల వేళలు.. బిల్లింగ్ సమాచారం ♦ హైదరాబాద్ నార్త్ సర్కిల్లో ప్రయోగాత్మకంగా అమలు సాక్షి, హైదరాబాద్: కరెంట్ కోతల వేళల గురించి గ్రేటర్ వినియోగదారులకు సంక్షిప్త సమాచారం అందించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (సీపీడీసీఎల్) సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా హైదరాబాద్ నార్త్ సర్కిల్ పరిధిలో దీన్ని అమలు చేస్తోంది. తద్వారా ఈ సర్కిల్ పరిధిలోని సుమారు 8 లక్షల మంది వినియోగ దారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఏ రోజు.. ఏ సమయంలో కరెంట్ సరఫరా బంద్ అవుతుంది... తిరిగి ఎన్ని గంటలకు వస్తుందన్న సమాచారంతో పాటు నెలసరి బిల్లు.. చెల్లింపులకున్న తుదిగడువు వంటి వివరాలనూ అందించనుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే అమల్లో ఉన్న ఈ విధానాన్ని తాజాగా నగరంలో అమలు చేయాలని సీపీడీసీఎల్ నిర్ణయించింది. భవిష్యత్తులో మరిన్ని సర్కిళ్లకు... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 34 లక్షల గృహ, ఐదున్నర లక్షల వాణిజ్య, 40 వేల చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమల కనెక్షన్లున్నాయి. ట్రాన్స్మిషన్, సరఫరా వ్యవస్థలో నిత్యం ఏదో ఒక సాంకేతిక సమస్య తలెత్తుతుంది. ఈ సమయంలో ఆయా ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. పోయిన కరెంట్ మళ్లీ ఎప్పుడు వస్తుందో తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచి నీటి సరఫరా, రోజువారీ కార్యకలాపాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. అదే కోతల వేళలు ముందే తెలిస్తే వినియోగదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదే ఆలోచనతో 2012–13లోనే ఆయా ఫీడర్ల పరిధిలోని వినియోగదారుల ఫోన్ నంబర్లను సీపీడీసీఎల్ సేకరించింది. డిమాండ్‌కు తగిన విద్యుత్ సరఫరా కాకపోవడంతో అప్పట్లో ఇది సాధ్యం కాలేదు. ప్రస్తుతంఅవసరానికి మించి ఉత్పత్తి అవుతోంది. ఈ నేపథ్యంలో ఎస్ఎంఎస్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. తొలి దశలో హైదరాబాద్ నార్త్ సర్కిల్ పరిధిలోని బంజారాహిల్స్, అమీర్ పేట్, ఎర్రగడ్డ, బేగంపేట్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, గ్రీన్లాండ్స్, ప్యారడైజ్ ఫీడర్లలో ప్రయోగాత్మకంగా ఈ సేవలను అందిస్తోంది. గత రెండు రోజుల నుంచి ఆయా ప్రాంతాల్లో విద్యుత్ కోతల వేళలు.. బిల్లింగ్ వివరాలను వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపుతుంది. ఇక్కడ ఫలితాలను బట్టి భవిష్యత్తులో ఇతర సర్కిళ్లకు దీన్ని విస్తరింప జేయాలని నిర్ణయించింది. ఎస్ఎంఎస్ చూపిస్తే చాలు... తాజా సేవలతో విద్యుత్ రీడింగ్ నమోదు చేసిన వెంటనే వినియోగదారుని ఫోన్‌కు బిల్లు వివరాలు, గడువు తేదీ వంటివి చేరుతాయి. గడువుకు మూడు రోజుల ముందు కూడా అలర్ట్ వస్తుంది. చాలామంది ఇప్పుడు చివరి రోజు ఆన్లైన్లో బిల్లులు చెల్లిస్తున్నారు. ఇవి డిస్కం ఖాతాలో చేరే సరికి 48 గంటలు పడుతుంది. ఈలోపే స్థానిక లైన్మెన్లు వారి ఇంటి కనెక్షన్ కట్ చేస్తున్నారు. ఎస్ఎంఎస్ సేవలతో ఇలాంటి ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి. బిల్లు చెల్లించిన వెంటనే ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. సంబంధిత సిబ్బంది, లైన్‌మన్‌కు దాన్ని చూపిస్తే సరిపోతుంది. -
‘పస్తులే’ ప్రత్యామ్నాయం..!
శంకర్పల్లి: కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వర్షాభావ పరిస్థితులకుతోడు కరెంట్ కోతలతో కూరగాయల దిగుబడి ఒక్కసారిగా పడిపోయింది. దీంతో పది రోజుల వ్యవధిలోనే కూరగాయల ధరలు రెట్టింపై సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు విలవిలలాడిపోతున్నారు. వీటికి తోడు బియ్యం ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోవడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దినసరి కూలీలు కనీసం కూరగాయల వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు అలుగడ్డ, ఉలిగడ్డ తదితర కూరగాయలను బ్లాక్ చేయడంతో ధరలు మరింత రెట్టింపవుతున్నాయి. పది రోజుల క్రితం పాలకూర, కొత్తిమీర మూడు కట్టలు ఉంటే ఇప్పుడు రూ. 10కి కూడా ఒక కట్ట దొరకని పరిస్థితి. దీంతో కొందరు పచ్చళ్లతో కాలం వెళ్లదీస్తుండగా మరికొందరు కారం మెతకులతోనే కాలం గడపాల్సిన పరిస్థితి. ఇక కొందరు కూలీలైతే ఈ ధరలకు తాము ఏమీ కొనలేమని, పస్తులుండటమే ప్రత్యామ్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘాటెక్కిన పచ్చి మిర్చి అన్ని కూరగాయల్లోకెల్లా పచ్చి మిర్చిధర అమాంతం పెరిగింది. 10 రోజుల క్రితం రూ.30 ఉన్న కిలో పచ్చిమిర్చి ధర ఇప్పుడు రూ.80కు అమ్ముతున్నారు. దీంతో మిర్చి కొనాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. రూ. 300 తీసుకెళితే కనీసం వారానికి సరిపడా కూరగాయలు రావడం లేదని కొందరు వాపోతున్నారు. ధరలు మళ్లీ తగ్గే వరకు కూరగాయల జోలికి వెళ్లకపోవడమే మంచిదని వారు చెబుతున్నారు. -
మండే ఎండ
40.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ఉక్కపోతతో అల్లాడుతున్న జనం పెరుగుతున్న వడగాలులు సాక్షి, విశాఖపట్నం : ఎండ.. ఉక్కబోత.. వడగాలులు.. కరెంట్ కోత మూకుమ్మడిగా నగరవాసిపై దాడి చేస్తున్నాయి. దీంతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గతంలో ఎన్న డూ లేనంతగా.. దాహంతో గొంతు తడారిపోతోందని గగ్గోలు పెడుతున్నారు. వారం రోజులుగా పరిస్థితులే ఇలా ఉంటే.. రానున్న వేసవిలో మరెంత నరకం చవిచూడాల్సి వస్తుందోనని ఇప్పటి నుంచే భయపడుతున్నారు. వడగాలులు తీవ్రం : సోమవారం విశాఖ విమానాశ్రయంలో గరిష్ట ఉష్ణోగ్రత 40.6 డిగ్రీలుగా నమోదయినట్టు వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. గత రెండు రోజుల మాదిరిగానే ఉష్ణోగ్రతలున్నప్పటికీ వడగాలులు పెరగడం, గాలిలో తేమ(65 శాతం) కూడా ప్రభావం చూపడంతో ఉక్కబోత, గొంతు పొడిబారడం జరుగుతోందని వెల్లడించారు. రాత్రిపూట కంటే..పగటిపూట వీటి ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు. కోస్తాంధ్రలో పలు చోట్ల ఇవే పరిస్థితులున్నట్టు వెల్లడించారు.