breaking news
conjoined twins Veena and Vani
-
వీణావాణీలకు శస్త్రచికిత్స చేస్తాం...
హైదరాబాద్ : అవిభక్త కవలలు వీణావాణీకి శస్త్రచికిత్స చేసేందుకు ఆస్ట్రేలియా డాక్టర్ల బృందం సుముఖత వ్యక్తం చేసింది. హైదరాబాద్ చేరుకున్న ఆస్ట్రేలియా డాక్టర్లు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డితో పాటు ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ముందుకు వస్తే తాము వీణావాణీకి ఆపరేషన్ చేస్తామని తెలిపారు. దీనిపై ప్రభుత్వ నిర్ణయం ఇంకా ప్రకటించలేదు. కాగా వీణావాణిలను వేరు చేసే విషయంలో జరుగుతున్న అసాధారణ జాప్యంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. -
వీణావాణీలు ఇంటికే!
- శస్త్రచికిత్స చేయించలేమని చేతులెత్తేసిన సర్కారు - ఆర్థికసాయం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణావాణీలకు శస్త్రచికిత్స చేయించలేమని సర్కారు చేతులెత్తేసింది. శస్త్రచికిత్స చేయించడం వల్ల వారి ప్రాణాలకు ప్రమాదం ఉందని, అందువల్ల వారిని ఇంటికే పంపిస్తామని ప్రకటించింది. వీణావాణీలను వేరు చేస్తామని లండన్ వైద్యులు చెప్పినా.. కేవలం ఎయిమ్స్ నివేదికపై ఆధారపడి సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘ఎయిమ్స్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో వీణావాణీలకు ఆపరేషన్ చేయడం రిస్క్‌గా భావిస్తున్నాం. మరోసారి వైద్య పరీక్షల ఆలోచన సర్కారుకు లేదు. వారిని నీలోఫర్‌లో ఉంచడం కష్టం. కాబట్టి వారిని తల్లిదండ్రుల వద్దకు పంపిస్తాం. పిల్లలను చూసుకునే ఆర్థిక స్థోమత లేదని తల్లిదండ్రులు చెబుతున్నందున ముఖ్యమంత్రితో మాట్లాడి ఆర్థిక సాయం చేయాలన్న ఆలోచన చేస్తున్నాం. అలాగే వీణావాణీలకు ప్రత్యేకంగా పెన్షన్ ఇచ్చే ఆలోచన ఉంది. వారి చదువు, ఆరోగ్యం, వైద్యం కోసం కూడా సాయం చేస్తాం..’’ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శరీరం అతుక్కుని పుట్టి 14 ఏళ్లుగా ఎన్నో బాధలు అనుభవిస్తున్న వీణావాణీల కథ ఇంటికి చేరింది. హైదరాబాద్‌లోనే పరీక్షలు.. వీణావాణీలకు శస్త్రచికిత్స అంశంపై సర్కారు గతేడాది లండన్ వైద్యులను పిలిపించి హడావుడి చేసింది. అయితే రూ.10 కోట్లు ఖర్చవుతుందని వారు తేల్చగానే ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి సలహా అంటూ వెనక్కి తగ్గిందన్న ఆరోపణలున్నాయి. కానీ ఎయిమ్స్లోనైనా పరీక్షలు చేశారా అంటే అదీ లేదు. నీలోఫర్ ఆస్పత్రి పక్కనే ఉన్న ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో పరీక్షలు చేసి, వాటిని ఎయిమ్స్‌కు నివేదించారు. అంతర్జాతీయ స్థాయిలో చేయాల్సిన వైద్య పరీక్షలను ఇక్కడికే పరిమితం చేశారు. ఆ నివేదికలను పట్టుకుని ఎయిమ్స్ నిపుణులు ‘శస్త్ర చికిత్స చేయగలం. కానీ ప్రాణాలకు ప్రమాదం’ అని ప్రకటించారు. అసలు లండన్ వైద్యులు శస్త్రచికిత్స చేస్తామని చెప్పాక కూడా ఇలా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఆర్థికసాయం చేస్తే తీసుకెళ్తాం వీణావాణీల తల్లిదండ్రులు తాము కూలీ చేసి బతుకుతున్నామని, ఇప్పు డు తమ వద్ద ఉన్న ఇద్దరు పిల్లలనే కష్టపడి పోషిస్తున్నామని వీణావాణీల తండ్రి మురళి పేర్కొన్నారు. వీణావాణీలను తీసుకెళ్లాలని నీలోఫర్ వైద్యులు చెప్పారని.. తాము సమ యం కావాలని కోరామని చెప్పారు. వీణావాణీలను సరిగా చూసుకునే ఆర్థిక స్థోమత తమకులేదని.. వారికి మంచి ఆహారం, విద్య, వైద్యం అందించలేమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి, సదుపాయాలు కల్పిస్తే వీణావాణీలను తీసుకెళ్లి కంటికి రెప్పలా చూసుకుంటామని చెప్పారు. -
వీణా-వాణీలను విడదీస్తే ప్రాణగండం
హైదరాబాద్ : అవిభక్త కవలలు వీణా వాణీల శస్త్ర చికిత్స విషయంలో ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు చేతుతెల్తేశారు. తలలు అంటుకొని ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వీణా-వాణీలను విడదీయడానికి శస్త్రచికిత్స చేయడం అత్యంత ప్రమాదకరమని బ్రిటన్ కు చెందిన వైద్య బృందం తేల్చి చెప్పింది. ఆపరేషన్ చేస్తే వీణా-వాణీ బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. శస్త్రచికిత్స విజయవంతమైనా, నాడీ వ్యవస్థ కలిసి ఉండటంతో వాళ్లిద్దరూ కోమాలోకి వెళ్లడమో, నరాల క్షీణత, పక్షవాతం వచ్చే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. ఎయిమ్స్ వైద్యుల తాజా ప్రకటనతో నీలోఫర్ వైద్యులు డైలమాలో పడ్డారు. ఆపరేషన్ సంగతి పక్కన పెడితే ..ప్రస్తుతం నిలోఫర్ ఆసుపత్రిలో ఆశ్రయం పొందుతున్న చిన్నారులిద్దరి ఆలనాపాలన కూడా ప్రశ్నార్థకంగా మారింది. వారిద్దరికీ 13ఏళ్లు రావడంతో ఇక వారిని చూసుకోవడం తమవల్ల కాదని నిలోఫర్ వర్గాలు తేల్చి చెప్పాయి. దీంతో వీణా-వాణీల తాజా పరిస్థితులపై నీలోఫర్ వైద్యులు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయానికి వచ్చారు. కాగా ఇప్పటి వరకూ ఏదో ఓ రోజు వీరిద్దరిని విడదీసేందుకు వైద్యులు ప్రయత్నిస్తారన్న చిన్నారుల తల్లిదండ్రులు ఈ వార్తతో అయోమయంలో పడ్డారు. తాము పేదవారిమని, వారిద్దర్ని పోషించే శక్తి తమకు లేదని చెబుతున్నారు.