breaking news
Communication Network
-
ప్రీపెయిడ్ కరెంట్‌కు డెడ్‌లైన్!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ రంగ సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం పదునుపెట్టింది. విద్యుత్ పంపిణీ రంగ ప్రైవేటీకరణే లక్ష్యంగా విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లును ప్రకటించిన కేంద్రం.. బిల్లు ఆమోదానికి ముందే అందులోని లక్ష్యాల సాధన దిశగా చర్యలను వేగిరం చేసింది. విద్యుత్ వినియోగదారులకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విషయంలో రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు గడువులను నిర్దేశిస్తూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కమ్యూనికేషన్ నెట్వర్క్ లభ్యత ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయం మినహా ఇతర అన్ని కేటగిరీల వినియోగదారులకు అంతర్జాతీయ ప్రమాణాల(ఐఎస్–16444) మేరకు కింద పేర్కొన్న గడువుల్లోగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ►అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు, 50 శాతానికి మించి పట్టణ ప్రాంత వినియోగదారులను కలిగి ఉండి 2019–20లో 15 శాతానికి మించిన సాంకేతిక, వాణిజ్యపర(ఏటీఅండ్‌సీ) నష్టాలున్న విద్యుత్ డివిజన్లలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు.. 2023, డిసెంబర్ నాటికి ప్రీపెయిడ్ పద్ధతిలో విద్యుత్ సరఫరా చేయాలి. 2019–20లో 25 శాతానికి మించిన ఏటీఅండ్‌సీ నష్టాలు కలిగిన ఇతర విద్యుత్ డివిజన్లు, మండల(బ్లాక్), ఆపై స్థాయిల్లో కూడా ఇదే గడువులోపు అందరికీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించాలి. ఒక్కోసారి ఆరు నెలలకు మించకుండా నోటిఫికేషన్ ద్వారా రెండు పర్యాయాలు ఈ గడువు పొడిగించడానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి అవకాశం కల్పించింది. అయితే దీనికి సరైన కారణాలు చూపాలి. ►ఇతర అన్ని ప్రాంతాల్లో 2025 మార్చి నాటికి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించడంతో పాటు ప్రీపెయిడ్ పద్ధతిలోనే విద్యుత్ సరఫరా చేయాలి. ►అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల సామర్థ్యానికి మించి అధిక మోతాదులో విద్యుత్ వినియోగించే వినియోగదారులకు ఆటోమేటిక్ మీటర్ రీడింగ్(ఏఎంఆర్) సదుపాయం గల స్మార్ట్ మీటర్లను బిగించాలి. ►అన్ని ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల(డీటీ)కు ఈ కింద పేర్కొన్న గడువుల్లోగా ఏఎంఆర్/ఏఎంఐ సదుపాయం ఉన్న మీటర్లను ఏర్పాటు చేయాలి. ►2022, డిసెంబర్‌లోగా అన్ని ఫీడర్లకు మీటర్లు బిగించాలి. ►50 శాతానికి మించి పట్టణ వినియోగదారులు కలిగి ఉండి... 2019–20లో 15 శాతానికి మించిన ఏటీఅండ్‌సీ నష్టాలు కలిగిన అన్ని డివిజన్ల పరిధిలోని అన్ని డీటీలకు, 2019–20లో 25శాతానికి మించిన ఏటీఅండ్‌సీ నష్టాలు కలిగిన అన్ని డివిజన్ల పరిధిలోని డీటీలకు డిసెంబర్ 2023లోగా మీటర్లు బిగించాలి. ►ఇతర అన్ని డివిజన్లలోని డీటీలకు 2025 మార్చిలోగా మీటర్లు ఏర్పాటు చేయాలి. ►25కేవీఏ కన్నా తక్కువ సామర్థ్యం గల డీటీలు, హెచ్‌వీడీఎస్‌లకు పైన పేర్కొన్న గడువుల నుంచి మినహాయింపు. -
కశ్మీర్లో మొబైల్ నెట్వర్క్ పటిష్టానికి పాక్ వ్యూహం
ఇస్లామాబాద్ /న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్లో తన మొబైల్ కవరేజ్‌ను విస్తరించేందుకు ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ ప్రభుత్వం సన్నద్ధమైంది. కశ్మీర్లోకి చొరబడే పాక్ ఉగ్రవాదులకు ఇది ఉపకరించడంతో పాటు భారత ప్రభుత్వం భవిష్యత్‌లో కమ్యూనికేషన్ల వ్యవస్థను బ్లాక్ చేసినా ఎలాంటి ప్రభావం లేకుండా ఉండేలా పాక్ తన వ్యూహానికి పదును పెడుతోంది. కశ్మీర్లోకి చొరబడే ఉగ్రవాదులకు సాయం చేసేలా మొబైల్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు పాకిస్తాన్ పనిచేస్తోందని భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. భారత భద్రతా దళాలు బ్లాక్ చేయలేని పాకిస్తాన్ టెలికాం సేవలను కశ్మీరీలు వాడుకోవాలని పాక్ కోరుకుంటోందని ఆ వర్గాలు తెలిపాయి. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు ముందు గత ఏడాది భారత ప్రభుత్వం జమ్ము కశ్మీర్లో కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఆందోళనకారులు వదంతులు ప్రచారం చేయకుండా కేంద్రం ఈ నియంత్రణలను చేపట్టింది. పీఓకేతో పాటు గిల్గిట్-బాల్టిస్తన్ ప్రాంతంలో టెలికాం సేవలను అందించాలని ప్రభుత్వ రంగ స్సెషల్ కమ్యూనికేషన్స్ సంస్థ (ఎస్సీఓ)ను పాకిస్తాన్ కోరినట్టు భద్రతా వర్గాలు వెల్లడించాయని ఓ జాతీయ వెబ్సైట్ పేర్కొంది. చదవండి : ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లోనే పాక్! జమ్ము కశ్మీర్లో కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసే ప్రణాళికను పాక్ ప్రభుత్వం ఆమోదించి అమలు చేస్తోందని సీనియర్ అధికారులు వెల్లడించారు. పీఓకేలో భారత స్ధావరాలకు సమీపంలోని ఎస్సీఓ మొబైల్ టవర్స్‌లో సిగ్నల్ శక్తిని పెంచాలని పాక్ ఐఎస్ఐ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. -
ఢిల్లీ పోలీసు వ్యవస్థ బలోపేతానికి రూ. 5,372 కోట్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసు వ్యవస్థ బలోపేతం కోసం కేంద్రం రూ. 5,372.88 కోట్లు కేటాయించింది. 2015-16 ఆర్థిక ఏడాది కోసం లోక్‌సభలో శనివారం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో ఈ మేరకు కేటాయింపులు చేసింది. ఇందులో ప్రణాళికా వ్యయం కింద రూ. 390 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ. 4,979.48 కోట్లుగా పేర్కొంది. జాతీయ రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్, కమ్యూనికేషన్ నెట్వర్క్ అభివృద్ధి కోసం రూ. 7 కోట్లు బడ్జెట్లో చూపింది. మోడల్ ట్రాఫిక్ సిస్టమ్‌లో భాగంగా సిగ్నళ్ల ఏర్పాటు కోసం రూ. 8 కోట్లు కేటాయించింది. బలగాల శిక్షణ కోసం రూ. 3 కోట్లు, నిర్భయ ఫండ్‌కి రూ. 3.40 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పింది.