‘మా పెళ్లి రద్దయింది.. ఎవరూ రాకండి’
శ్రీనగర్: కశ్మీర్ అల్లర్ల కలకలంతో ఆయా పత్రికల్లోని ప్రకటనలు భిన్నంగా దర్శనం ఇచ్చాయి. సాధారణంగా ఆహ్వానాల రూపంలో దర్శనమిచ్చే క్లాసిఫైడ్స్ కశ్మీర్ అల్లర్ల నేపథ్యంలో మాత్రం ఆహ్వానాలు రద్దు అని దర్శనమిచ్చాయి. దాదాపు అన్ని పత్రికల్లో ఇలాంటి వింత క్లాసిఫైడ్స్ కనిపించాయి. ఈ మేనియా గత ఆదివారం నుంచి మొదలైంది. ఈ రంజాన్ నేపథ్యంలోనే కశ్మీర్లో పలు వివాహ కార్యక్రమాలు జరగాల్సి ఉంది.
పలువురు పెళ్లిల్ల తేదీలను కూడా నిర్ణయించారు. బంధువులకు కబుర్లు కూడా చేశారు. అయితే, ప్రస్తుతం అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొని శాంతిభద్రతలు గడ్డుగా ఉన్న నేపథ్యంలో బంధువులకు పెళ్లిల్లు రద్దయ్యాయనే విషయం చెప్పడంకోసం వారంతా ఆయా పత్రికల క్లాసిఫైడ్స్ని ఆశ్రయించారు. దీంతో దాదాపు అన్ని పేపర్లలో ‘పదుల సంఖ్యలో పెళ్లి రద్దయ్యాయి. దయచేసి అర్థం చేసుకోగలరు. మేం ఇచ్చిన ఆహ్వానం ప్రస్తుతానికి రద్దు చేస్తున్నాం. ఇందుకు చింతిస్తున్నాం’ అంటూ పలు ప్రకటనలు క్లాసిఫైడ్స్ రూపంలో ఇచ్చారు.