CII seminar
-
మన ఐటీ కంపెనీలను చూసి నేర్చుకోండి
న్యూఢిల్లీ: భారత ఐటీ కంపెనీలను చూసి దేశంలోని ఇతర కంపెనీలు నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిస్ గోపాలకృష్ణన్ సూచించారు. మన ఐటీ కంపెనీలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని చెప్పారాయన. దేశంలోని పలు కంపెనీలు రుణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా, ఐటీ కంపెనీలు మాత్రం ఎలాంటి రుణభారం లేకుండా ఉన్నాయని తెలిపారు. కంపెనీలన్నీ పరిశోధన, అభివృద్ధిలపై అధికంగా పెట్టుబడులు పెట్టాలన్నారు. ఇక్కడ జరిగిన సీఐఐ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత కంపెనీలు విదేశీ స్టాక్ మార్కెట్లలో కూడా లిస్ట్ కావాలని ఆయన సూచించారు. ‘‘చాలా దేశీయ కంపెనీలకు పోటీ అంటే భయం’’ అన్నారాయన. కంపెనీలు కార్పొరేట్ గవర్నెన్స్‌ను మెరుగుపరచుకోవాలని, అంతర్జాతీయంగా పోటీపడాలని సూచించారు. 1980లో 16,000 కోట్ల డాలర్లుగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 2.8 లక్షల కోట్ల డాలర్లకు ఎగసిందని క్రిస్ తెలిపారు. 2025 కల్లా 5 లక్షల కోట్లడాలర్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేశారు. 2025 లేదా 2030 నాటికి ఈలక్ష్యాన్ని సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. -
పెంకుటింటికి లక్షల కోట్లకు లంకె!
సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో : నిజమే మరి.. ఈ పెంకుటింటికి లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేశాయని చెబుతున్న విశాఖ భాగస్వామ్య సదస్సుకు లింకు ఉంది. ఎందుకంటే ఆ లక్షల కోట్ల ఎంవోయూల్లో ఈ పెంకుటింటికీ భాగస్వామ్యముంది. పక్కనున్న చిత్రంలో సాక్షాత్తు ముఖ్యమంత్రితో ఎంవోయూ కుదర్చుకుంటున్న వ్యక్తి ఉండేది ఇక్కడే!! ఈయన పేరు దొడ్డాల సుధీర్. సీఐఐ సదస్సులో ముఖ్యమంత్రితో ఎంవోయూ కుదుర్చుకుంటున్నాడని ఈయనో పారిశ్రామికవేత్త అనుకునేరు. కనీసం ఓ చిన్న కంపెనీకి షేర్ హోల్డర్ కూడా కాదు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడుకు చెందిన దొడ్డాల చిట్టిబాబు, కోటేశ్వరమ్మ ఏకైక కుమారుడు దొడ్డాల సుధీర్. పాత పెంకుటిల్లుతోపాటు గ్రామంలో కొద్దిపాటి వ్యవసాయ భూమి ఆయనకున్న ఆస్తి. భార్య అంగన్వాడీ టీచర్. లక్షల కోట్లు వచ్చాయని నమ్మించాలని.. ఈవీఎం కాలేజీలో సుధీర్ పీఆర్వోగా పనిచేస్తూ ఇంటర్మీడియెట్, ఇంజినీరింగ్ విద్యార్థులను కాలేజీలో చేర్చించి కమీషన్లు తీసుకుంటుండేవారు. రెండేళ్ల క్రితం నరసరావుపేట మండలం కోటప్పకొండ సమీపంలో విరించి టౌన్‌షిప్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ భూములు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వాళ్లు ప్లాట్లు వేసి అమ్మకాలు మొదలు పెట్టారు. ఈ కంపెనీలో సుధీర్ ప్లాట్లు విక్రయించేందుకు ఏజెం ట్‌గా చేరారు. కమీషన్లే ఆధారం. కానీ రూ.కోట్లు పెట్టుబడులు పెట్టడానికి వీలుగా ప్రభుత్వంతో కుదిరిన అవగాహనా ఒప్పందం మీద సంతకం చేశారు. రూ.కోట్లాది సొమ్ము ఎలా తెస్తారో అని స్థాని కులు చర్చించుకుంటున్నారు. ఇంతకూ అసలు సంగతేంటంటే భారీ సంఖ్యలో ఎంవోయూలపై సంతకాలు చేయడానికి కంపెనీలను తీసుకురావాలని ప్రభుత్వ పెద్దలు మొదట అధికారులకు పురమాయించారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎంవోయూల మీద సంతకాలు చేయడానికి మనుషులను సమకూర్చే బాధ్యతను ప్రైవేట్ కంపెనీకి అప్పగించిం ది. వారు సమకూర్చిన వారిలో సుధీర్ ఒకరు. ఇలాంటి వారు, ఊరూపేరు లేని కంపెనీలు ఎన్నో ఉన్నాయి. -
వైజాగ్ సదస్సులో బాబు గారి మాయ
-
సర్కారు వారి పాట పది లక్షల కోట్లు
-
సర్కారు వారి పాట పది లక్షల కోట్లు
విశాఖ సీఐఐ సదస్సులో ఒప్పందాలు ♦ అందులో సింహభాగం కేంద్ర ప్రభుత్వ సంస్థలతోనే ♦ కేంద్ర పథకమైన గ్రామీణ విద్యుదీకరణకూ ఒప్పందం ♦ టెండర్లు ఖరారైన జెన్కో సోలార్ కేంద్రంపై మళ్లీ ఎంవోయూ ♦ అమరావతి అభివృద్ధి పనులు కూడా సదస్సు ఖాతాలోనే ♦ జాతీయ రహదారులు, రింగురోడ్లపై కూడా ఒప్పందాలు ♦ సదస్సులో కంటికి కనిపించని విదేశీ కంపెనీలు ♦ కన్నెత్తయినా చూడని అంబానీ, అదానీ సంస్థలు ♦ సామర్థ్యం లేని సంస్థలతోనూ రూ.కోట్లకు ఒప్పందాలు ♦ సంతకాలకు నిరాకరించిన పరిశ్రమల శాఖ కార్యదర్శి విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: విశాఖ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో 665 ఒప్పందాలు జరిగాయని, వీటి విలువ రూ.10,54,590 కోట్లని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా 22,34,096 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపింది. అయితే ఈ ఒప్పందాల్లో సింహభాగం కేంద్ర ప్రభుత్వ సంస్థలతోనే జరగడం, ఈ ఏడాది సదస్సులో విదేశీ సంస్థలేవీ కనిపించకపోవడం, ఒప్పందాలు చేసుకున్న ప్రైవేటు సంస్థలేవీ పెద్దవి కాకపోవడంతో ఒప్పందాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో రిఫైనరీలో, పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేస్తామని పదేళ్లుగా చెబుతున్న కేంద్రప్రభుత్వ సంస్థలైన హెచ్‌పీసీఎల్, ఓఎన్‌జీసీలతో ఈ ఏడాది భారీ ఒప్పందాలు జరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పదేళ్లుగా పెట్టుబడులు పెట్టని సంస్థలు ఈ ఏడాది ఎలా పెడతాయని పారిశ్రామిక వేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద ఇప్పటికే టెండర్లు ఖారైన ఏపీ జెన్కో సోలార్ విద్యుత్ కేంద్రానికి కొత్తగా ఎంవోయూ చేసుకున్నట్లు చూపించారు. రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే ప్రకటించిన రెండు రింగు రోడ్లను కూడా ఒప్పందాల్లో చూపించడం విడ్డూరంగా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన, ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అమలవుతున్న గ్రామీణ విద్యుదీకరణ పథకాన్ని కూడా ఎంవోయూల్లో చూపించడంతో రూ.లక్షల కోట్ల ఒప్పందాల్లో నిజమైనవి ఎన్ని అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 91 ఎంవోయూలు చేసుకున్న పరిశ్రమల శాఖ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు ఆ శాఖ కార్యదర్శి సాల్మన్ అలోఖ్యా రాజ్ తిరస్కరించడం సదస్సు జరిగిన, జరిపిన తీరుకు అద్దం పడుతోంది. సదస్సుకు ముందే ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు విదేశాలకు వెళ్ళి పలు కంపెనీలను సదస్సుకు ఆహ్వానించినా స్పందన కనిపించలేదు. దీంతో ప్రతిష్ట దెబ్బతింటోందని గుర్తించిన ప్రభుత్వం తన సర్వశక్తులు ఒడ్డింది. కేంద్ర మంత్రుల చేత ఒత్తిడి తెప్పించి, వారి శాఖల నుంచి భారీగా పెట్టుబడులు వస్తున్నట్టు ఒప్పందాలు చేసుకుందని తెలుస్తోంది. ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్, ఆర్ఈసీ... ఇలా అనేక ప్రభుత్వ రంగ సంస్థలు చేసుకున్న ఒప్పందాలు ఇందులో భాగమేనని సమాచారం. రాష్ట్రానికి ఇప్పటికే వివిధ పథకాల కింద ఇచ్చామని కేంద్రం చెబుతున్న రూ.రెండు లక్షల కోట్లనూ ఈ ఒప్పందాల్లో కలిపేశారు. ఇలాంటి ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రచారానికి పనికి వస్తాయే తప్ప రాష్ట్రాభివృద్ధికి ఏ మాత్రం ఉపయోగపడవని పారిశ్రామిక వర్గాలు పెదవి విరుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో జాతీయ రహదారుల నిర్మాణానికి కేటాయించే నిధులను కూడా ఎంవోయూల్లో చూపించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును కూడా ఈ ఒప్పందాల్లో కలిపేసి ఉంటే ఇంకా భారీగా కనిపించి ఉండేదని ఎద్దేవా చేస్తున్నారు. గత ఏడాదీ ఇదే ఆర్భాటం.. ఫలితం శూన్యం... గత ఏడాది నిర్వహించిన సదస్సులో కూడా 331 సంస్థలతో ఎంవోయూలు కుదిరాయని, రూ. 4.78 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, ఆరు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా ఆర్భాటంగా ప్రకటించింది. ఏడాది గడిచినా ఒక్క ఒప్పందమూ వాస్తవరూపం దాల్చలేదు. ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల్లో 228 కంపెనీలు కనీసం రాష్ట్రం వైపు కన్నెత్తి చూడలేదు. రాష్ట్రానికి ఒక్క భారీ పరిశ్రమా రాలేదని, ఏ ఒక్కరికీ ఉపాధి లభించలేదని ప్రభుత్వమే సమాచార హక్కు చట్టం ద్వారా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు అందించిన వివరాల్లో పేర్కొంది. కేవలం రూ.5,980 కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదుర్చుకోనున్నట్లు గణతంత్ర దినోత్సవంనాడు గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.రెండు లక్షల కోట్లకు పైనే వచ్చేశాయని పదే పదే చెప్పడమే కాకుండా తాజాగా విశాఖ సదస్సులో కూడా ప్రకటించారు. గత ఏడాది సదస్సులో ఒప్పందాలు చేసుకున్న ఆదానీ, అంబానీ, చైనా, జపాన్ కంపెనీల నుంచి కనీసం ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదు. ఈ ఏడాది సదస్సులో ఆ కంపెనీల జాడ కానరాలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ వాస్తవాలను దాచిపెట్టి రాష్ట్రానికి రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. విదేశీ పర్యటనలు, పారిశ్రామిక సదస్సుల పేరిట రూ.కోట్లు వెచ్చిస్తూనే ఉంది. కేంద్రప్రభుత్వ సంస్థలు ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులనే కొత్తగా వచ్చినట్లు మసిపూసి మారేడుకాయ చేస్తోంది. సామర్థ్యంలేని సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకుని అరచేతిలో స్వర్గం చూపిస్తోంది. పాత వాటికే కొత్త రంగు విశాఖ సదస్సులో జరిగిన ఎంవోయూల జాబితాలో సింహభాగం ఇంధన, మౌలిక వసతుల పెట్టుబడులనే చేర్చారు. వీటిల్లో చాలావరకూ ఇప్పటికే ఉన్నాయి. మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వానికే సంబంధం లేనివి. ఇంకొన్ని పట్టుమని వందమందికి కూడా ఉపాధి చూపలేని పరిశ్రమలు కావడం గమనార్హం. ► అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద ఏపీజెన్కో 500 మెగావాట్లతో సోలార్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించిన టెండర్లు ఏడాది కిందటే పిలిచారు. అప్పట్లో టెండర్లలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో వీటిని రద్దు చేసి, మళ్ళీ గత నెల ఖరారు చేశారు. దీన్ని కొత్తగా తీసుకొచ్చినట్టు పేర్కొంటూ సదస్సులో ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. ► గ్రామీణ విద్యుదీకరణ పథకం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినది. గడచిన రెండేళ్ళుగా ఇది అన్ని రాష్ట్రాల్లోనూ నడుస్తోంది. తాజాగా మళ్ళీ ఎనర్జీ ఎఫిషియన్సీ లిమిటెడ్, ఈపీడీసీఎల్ మధ్య ఒప్పందం చేసుకున్నారు. వాస్తవానికి ఈఈఎస్ఎల్ పెట్టుబడి ఇందులో ఉన్నప్పటికీ, ప్రతీ పైసా విద్యుత్ చార్జీల రూపంలో ప్రజలే చెల్లించాలి. ఇది పెట్టుబడి ఎలా అవుతుందో సర్కారుకే తెలియాలి. ► కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన హెచ్‌పీసీఎల్, ఓఎన్జీసీ గత పదేళ్ళుగా రాష్ట్రంలో రిఫైనరీలు, పెట్రో కెమికల్ కాంప్లెక్సులు ఏర్పాటు చేస్తామని చెబుతూనే ఉన్నాయి. అయినా ఇప్పటివరకూ ఒక్కటీ ఏర్పాటు చేయలేదు. తాజాగా కాకినాడలో రిఫైనరీ, కాంప్లెక్స్ పెడతామని ఎంవోయూ చేసుకుంది. గత ఏడాది విశాఖపట్టణంలో రిఫైనరీ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని తెలిపింది. కానీ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలూ లేకపోవడం గమనార్హం. హా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సౌర, పవన విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన ఎంవోయూలు చేసుకున్నారు. వాస్తవానికి ఆ కంపెనీలు ఏమేర ఉత్పత్తి చేస్తాయి? వాటిని ఎలా వాడుకుంటారు? అనే విషయాలను ఏపీఈఆర్సీ పరిశీలించి అనుమతి ఇవ్వాలి. ఇవేవీ లేకుండానే ఊరు పేరు లేని కంపెనీలతో ఎంవోయూలు చేసుకున్నారు. ► గన్నవరం రన్‌వే విస్తరణ, కొత్త టర్మినల్‌కు సంబంధించిన శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమాలు గత నెలలోనే జరిగాయి. దీన్ని కూడా కొత్త ఎంవోయూగా చూపించి, దీని ద్వారా రూ.780 కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ► రాష్ట్రవ్యాప్తంగా మినీ థియేటర్లను ఏర్పాటు చేస్తామని ఒక కంపెనీ ముందుకొచ్చింది. జిల్లాకు రూ.25 కోట్లు వెచ్చి స్తామని తెలిపింది. ఆ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడినప్పుడు, తాము ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలమని, ఎంవోయూ అయిన తర్వాత ప్రతీ జిల్లాలోనూ వేరెవరి ద్వారానైనా పెట్టు బడులు తెస్తామని తెలిపారు. ఈ సంస్థ కూడా ఎంవోయూల జాబితాలో ఉంది. ► విజయవాడలో చిన్న తరహా త్రీడీ ప్రింటింగ్ కంపెనీ రూ.కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు ఎంవోయూ సందర్భంగా ప్రభుత్వం చెప్పడం గమనార్హం. సంతకాలకు నిరాకరించిన పరిశ్రమల శాఖ కార్యదర్శి పరిశ్రమల శాఖ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు ఆ శాఖ కార్యదర్శి సాల్మన్ అలోఖ్యా రాజ్ తిరస్కరించడం పరిశ్రమల వర్గాలను విస్మయ పరిచింది. విశాఖలో జరిగిన పారిశ్రామిక సదస్సులో పరిశ్రమల శాఖ 91 ఎంవోయూలు చేసుకుంది. ప్రతీశాఖలోనూ ప్రభుత్వం తరపున ఆ శాఖ కార్యదర్శులే సంతకాలు పెట్టారు. ఇదే విధంగా సాల్మన్‌ను కూడా సంతకాలు పెట్టాలని ప్రభుత్వం కోరినట్టు తెలిసింది. ఎంవోయూలన్నీ కేపీఎంజీ ఎంపిక చేసినవే కావడం, వీటికి ఎంతమాత్రం విశ్వసనీయత లేదని ఆయన గుర్తించడం వల్లే సంతకాలు చేసేందుకు వెనుకాడినట్టు సమాచారం. కార్యదర్శి ఇష్టపడకపోవడంతో పరిశ్రమలశాఖ డైరెక్టర్ కార్తికేయ మిశ్రాతో ఎంవోయూలపై సంతకాలు చేయించారు. ఈ విషయమై సాల్మన్‌రాజును ‘సాక్షి’ వివరణ కోరగా... ఎంవోయూలపై మిశ్రా సంతకాలు పెడతారని, తనతో పనేమిటని అనడం గమనార్హం. ఎక్కడబడితే అక్కడే ఎంవోయూలు! పెట్టుబడుల ఒప్పందం చేసుకునే సంస్థల ఆర్థిక పరిస్థితిని ముందుగా గమనించాలి. వాటి విశ్వసనీయతను గుర్తించిన తర్వాత ఎంవోయూలకు సిద్ధపడాలి. కానీ ఈ తరహా కసరత్తు జరిగినట్టు ఎక్కడా కన్పించలేదు. అసలు ఎంవోయూలు చేసుకునే పరిశ్రమలను భారత పరిశ్రమల సమాఖ్య, కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ తీసుకురావడం గమనార్హం. సీఐఐ పిలిచింది కాబట్టే తాము వచ్చామని సోలార్ ఎనర్జీలో ఎంవోయూ చేసుకున్న ఓ పారిశ్రామిక వేత్త అన్నారు. నిజానికి రూ. 50 కోట్ల పెట్టుబడి పెట్టే సామర్థ్యం కూడా ఈ సంస్థకు లేదు. మరోవైపు ఎంవోయూలు జరిగిన తీరు చాలా విడ్డూరంగా ఉంది. హాల్లో... నేలపై... ఆరుబయట.... ఇలా ఎక్కడబడితే అక్కడే ఎంవోయూలు చేసుకున్నారు. అధికారులు వాటిని పూర్తిగా పరిశీలించిన పాపాన కూడా పోలేదు. వెయిటింగ్ హాల్లో కొన్ని సంస్థలకు చెందిన ఎంవోయూ పత్రాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. సోలార్ కార్పొరేషన్, నెడ్‌క్యాప్ అధికారులు వాటిని కుదుర్చుకున్నట్టే భావించి సంతకాలు పెట్టి మమ అన్పించారు. -
జనవరిలో సీఐఐ సదస్సు...
► విశాఖలో నిర్వహిస్తాం: ముఖ్యమంత్రి ► రాష్ట్రపతి, పలువురు కేంద్ర మంత్రులు, అమిత్‌షాతో భేటీ సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ భాగస్వామ్య సదస్సు ఒప్పందాల్లో 41 శాతం విజయవంతమైనట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. వచ్చే జనవరి 27, 28 తేదీల్లో విశాఖలోనే సీఐఐ పార్ట్నర్ షిప్ సమ్మిట్-2017 నిర్వహించనున్నట్టు తెలిపారు. గురువారం ఇక్కడి ఉద్యోగ్ భవన్‌లోని వాణిజ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలాసీతారామన్, సీఐఐ ఉపాధ్యక్షుడు రాకేష్ భార్తీ మిట్టల్‌లు కూడా పాల్గొన్నారు. గత ఏడాది 328 ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు వాటి విలువ రూ.4,67,577 కోట్లని 1.60 లక్షల మందికి ఉపాధి లభించిందని చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఐఐ వరసగా రెండోసారి పార్టనర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తోందని నిర్మలాసీతారామన్ చెప్పారు. అపోలో టైర్ల కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో ద్విచక్ర వాహనాల టైర్లను, పికప్ ట్రక్కుల వాహనాల టైర్లను తయారు చేసేందుకు ఒక ప్లాంటును రూ. 525 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేయనుంది. ఈ మేరకు చంద్రబాబు, అపోలో టైర్స్ చైర్మన్ ఓంకార్ ఎస్ కన్వర్ సమక్షంలో ఏపీ ఉన్నతాధికారి కార్తికేయ మిశ్రా, అపోలో ప్రతినిధి సునమ్ సర్కార్ ఎంఓయూపై సంతకాలు చేశారు. కాగా సీఎం ఫిక్కీ ఆధ్వర్యంలో ఇక్కడి విజ్ఞాన్ భవన్లో ఏర్పాటుచేసిన ఉన్నత విద్యా సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. ఇలావుండగా బాబు గురువారం ఇక్కడ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతో సమావేశమయ్యారు. పెండింగ్ అంశాలపై చర్చించారు. చంద్రబాబు ఏపీ భవన్లో ఉన్న సమయంలో విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ వచ్చి ఆయన్ను కలిశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సాయంత్రం రాష్ట్రపతి భవన్లో సీఎం భేటీ అయ్యారు. ఆయన వెంట స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఉన్నారు. వచ్చే ఫిబ్రవరిలో అమరావతిలో జరగనున్న జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు గురించి వారు రాష్ట్రపతికి వివరించారు. రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఆయన నివాసంలో చంద్రబాబు సమావేశమయ్యారు. -
త్వరలో కార్మిక విధానాల సరళీకరణ
సీఐఐ సదస్సులో ‘డిప్’ సంయుక్త కార్యదర్శి సాక్షి, హైదరాబాద్: స్టార్టప్ ఇండియా విధానం ద్వారా దేశంలోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయని కేంద్ర పారిశ్రామిక పెట్టుబడులు, ప్రోత్సాహక సంస్థ(డిప్) సంయుక్త కార్యదర్శి మహేంద్ర బలరాజ్ అన్నారు. కార్మిక విధానాలను సరళీకరించడం ద్వారా పరిశ్రమల యజ మానులు, కార్మికులకు లాభదాయకంగా ఉండే లా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. భారత వాణిజ్య మండలి(సీఐఐ) తెలంగాణ శాఖ చైర్మన్ వనిత దాట్ల అధ్యక్షతన హైదరాబాద్‌లో బుధవారం పారిశ్రామికవేత్తలతో జరిగిన ముఖాముఖిలో బలరాజ్ మాట్లాడారు. రక్షణ రంగ ఉత్పత్తుల పరిశోధనల్లో ప్రైవేటు రంగానికి కూడా అవకాశం కల్పించాలనే సూచనను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. వేగంగా అమ్ముడయ్యే ఉత్పత్తుల(ఎఫ్ఎంసీజీ) కోసం ప్రత్యేక విధానం రూపొందించే యోచనలో ఉన్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్కరాజ్ వెల్లడించారు. ఏరోస్పేస్ విధానంపై అధ్యయనం కోసం నిపుణులు, పారిశ్రామికవేత్తలతో ఇప్పటికే ప్రత్యేక కమిటీ వేశామన్నారు. పరిశ్రమల తనిఖీల విషయంలోనూ పలు మార్పులు చేస్తున్నామని.. స్వయం ధృవీకరణ ఇచ్చే పరిశ్రమల్లో ఐదేళ్లకోమారు మాత్రమే తనిఖీ చేస్తామన్నారు. గతంలో వివిధ నిబంధనల కింద చేయాల్సిన తనిఖీల న్నింటినీ ఒకే పర్యాయం జరిపి.. ఆన్లైన్లో ఆ వివరాలు నమోదు చేస్తామన్నారు. రాష్ట్రంలో పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీ-హబ్‌లో 300కు పైగా స్టార్టప్‌లు పురుడు పోసుకుంటున్నాయన్నారు. లాభాలు లేని పరిశ్రమలను మూసివేసేందుకు అనువైన విధానం ప్రవేశ పెట్టాలని.. మూసివేత సందర్భంగా ఉద్యోగులకు నష్టం జరగకుండా ప్రభుత్వం పాలసీ రూపొందించాలని పలువురు పారిశ్రామికవేత్తలు సూచించారు. చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల ఉత్పత్తులను కొనుగోలు చేసే వ్యాపారులు 15 రోజుల్లోగా డబ్బు చెల్లించని పక్షంలో న్యాయపరమైన అధికారాలు ఉన్న ప్రత్యేక కమిటీకి పిర్యాదు చేయాల్సిందిగా కమిషనర్ సూచించారు. ముంబైలో ఫిబ్రవరి 13 -18 తేదీల నడుమ డిప్, సీఐఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘మేకిన్ ఇండియా వీక్’ను విజయవంతం చేయాలని వనిత పిలుపునిచ్చారు. -
విశాఖపట్నంలో నైపర్
♦ విజయవాడ సిపెట్ సామర్థ్యం పెంపు ♦ సీఐఐ సదస్సులో కేంద్ర మంత్రి అనంతకుమార్ ప్రకటన (విశాఖ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) ఇంజనీరింగ్ విద్యకు ఐఐటీ మాదిరిగా.. ఫార్మా విద్యకు ప్రధాన విద్యాసంస్థగా ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్)ను విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఫార్మా, ఎరువులు-రసాయనాల శాఖ మంత్రి ఎ.అనంతకుమార్ ప్రకటించారు. దీనికోసం రూ. 600 కోట్లు పెట్టుబడి పెడతామని, రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాల భూమి కేటాయించాల్సి ఉంటుందని చెప్పారు. మూడురోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు సమావేశం సందర్భంగా మంగళవారం ఆయన ప్రసంగించారు. తన పూర్వీకులది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ అని, తానూ సగం ఆంధ్రానే అని చమత్కరించారు. విజయవాడలోని కేంద్ర ప్లాస్టిక్ ఇన్స్టిట్యూట్ (సిపెట్)లో ప్రస్తుతం ఉన్న డిప్లొమా కోర్సులకు అదనంగా బీటెక్, ఎంటెక్ ప్రవే శపెడుతున్నట్లు వెల్లడించారు. సీట్ల సంఖ్యను 200 నుంచి 5 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దేశంలో మెడికల్ డివైజ్ తయారీ పార్కుల్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిందని, తొలి పార్క్‌ను గుజరాత్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించామని తెలిపారు. మరో పార్క్‌ను ఏపీలో ఏర్పాటు చేస్తామన్నారు. పెట్రో కెమికల్, పెట్రోలియం ఇన్వెస్ట్మెంట్ కారిడార్‌ను ప్రస్తావించిన మంత్రి... గుజరాత్, తమిళనాడు, ఒడిశాల్లో పెట్రోలియం కాంప్లెక్స్‌లు రాబోతున్నట్లు చెప్పారు. మరో కాంప్లెక్స్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామన్నారు. ‘‘పెట్రోలియం రిఫైనరీ విస్తరణకు కనీసం రూ. 20 వేల కోట్లు కావాలి. అలాగే పెట్రో కాంప్లెక్స్‌కు రూ. 25వేల కోట్లు కావాలి. ఈ రెండూ ఆంధ్రప్రదేశ్‌లో జరగబోతున్నాయి. పెట్రో కాంప్లెక్స్‌ను హెచ్‌పీసీఎల్, గెయిల్ కలిసి ఏర్పాటు చేస్తాయి. కాకపోతే దీనిపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. త్వరలో స్పష్టత రావచ్చు’’ అని చెప్పారు. ఇవన్నీ వచ్చే బడ్జెట్లో పెట్టే అవకాశం ఉందన్నారు. పారిశ్రామిక కారిడార్‌లో ఇంధన ప్రాజెక్టులు సోలార్ రంగంలో 5వేల మెగావాట్లు, పవన విద్యుత్ రంగంలో 4వేల మెగావాట్లు సాధించాలని ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు అనంతకుమార్ చెప్పారు. చెన్నై-విశాఖ పారిశ్రామిక కారిడార్లోను, బెంగళూరు-చెన్నై కారిడార్లోను ఈ ప్రాజెక్టులు వచ్చే అవకాశముందన్నారు. ప్రజల సంతోషమే ప్రగతి సూచిక: గవర్నర్ గజిబిజి గణాంకాల ప్రాతిపదికన కాకుండా ప్రజల సుఖసంతోషాల స్థాయిని కొలమానంగా తీసుకుని అభివృద్ధి సాధించాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. ఆహార, ఆరోగ్య, పర్యావరణ సాధించినప్పుడే దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించినట్లు అవుతుందన్నారు. సీఐఐ 22వ భాగస్వామ్య సదస్సు ముగింపు సమావేశంలో గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ సామాన్యుడికి అంతిమంగా ప్రయోజనం కలిగించగలిగితేనే ఈ సదస్సులో కుదుర్చుకున్న ఎంవోయూలు ఫలవంతమైనట్టని వ్యాఖ్యానించారు. స్విస్ చాలెంజ్ విధానంలో పర్యాటక ప్రాజెక్టులు: స్విస్ చాలెంజ్ విధానం ద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరుస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో ‘టూరిజం ఇన్ ఏపీ - యాన్ ఎకనామిక్ ఏజెంట్’ అనే అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు. ఇందులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సీఐఐ సదస్సులో కుదుర్చుకున్న 27 పర్యాటక ప్రాజెక్టుల ఎంవోయూల ద్వారా 17,840 మందికి ఉపాధి కల్పించనున్నామన్నారు. -
పొలాల మధ్య పంట సంజీవనులు
సాక్షి, విజయవాడ బ్యూరో: పంట సంజీవనుల పేరుతో పొలాల మధ్య చెరువులు తవ్వించి సాగుకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. పది హెక్టార్లకు ఒక చెరువు చొప్పున అనంతపురం జిల్లాలో లక్ష, రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల మెట్ట ప్రాంతాల్లో ఐదు నుంచి ఆరు లక్షల చెరువులు తవ్విస్తామని తెలిపారు. మంగళవారం జలవనరుల శాఖ కార్యాలయంలో.. రాష్ట్రంలో ఆ శాఖకు సంబంధించిన వివరాలతో ముద్రించిన ‘నీరు-ప్రగతి’ పుస్తకాన్ని శ్వేతపత్రం పేరుతో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెరువుల్లో నిల్వ చేసిన నీటిని వర్షాభావం, కరువు సమయాల్లో మొబైల్ స్ప్రింక్లర్లు, డ్రిప్‌ల ద్వారా పంటలకు అందించే ఏర్పాటు చేస్తామని చెప్పారు. తొలుత పైలట్ ప్రాజెక్టు కింద అనంతపురంలోని పది వేల ఎకరాల్లో ఈ చెరువులను తవ్విస్తామని, ఇందుకు రూ.100 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెరువులు తవ్వడానికయ్యే ఖర్చునంతటినీ ప్రభుత్వమే భరిస్తుందని, ఉపాధి హామీ పథకాన్ని దీనికి కలిపి కార్మికులతో ఈ చెరువులను తవ్విస్తామన్నారు. మూడు రకాల చెరువులకు డిజైన్లు రూపొందిస్తామని, రైతులు ముందుకువచ్చి సామూహికంగా లేదా వీలును బట్టి చెరువులు తవ్వుకోవాలని కోరారు. రాష్ట్రంలో 1.99 కోట్ల ఎకరాల సాగు భూమి ఉందని ఇదంతా సాగవ్వాలంటే 2,390 టీఎంసీల నీరు అవసరమని సీఎం చెప్పారు. తాగునీటికి 86, పరిశ్రమలకు 240, ఇతర అవసరాలకు 34 టీఎంసీల నీరు అవసరమవుతుందన్నారు. రాష్ట్రంలో సగటున 940 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని, అనంతపురం జిల్లాలో సగటున 550, కోస్తా జిల్లాల్లో సగటున 1250 మిల్లిమీటర్ల వర్షం కురుస్తుందని తెలిపారు. ఈ వర్షపాతాన్నంతటినీ లెక్కిస్తే 5 వేల టీఎంసీలవుతుందని చెప్పారు. అయితే ఇందులో 40 శాతం ఆవిరైపోతోందని, 9 శాతం భూగర్భంలోకి ఇంకిపోతోందని చెప్పారు. ఇక గోదావరి, కృష్ణ, పెన్న వంటి పెద్ద నదులు నాగావళి, వంశధార, చంపావతి, శారద, వరాహ, తాండవ, ఏలేరు, ఎర్రకాలువ, తమ్మిలేరు, రామిలేరు వంటి 37 చిన్న, మధ్య తరహా నదుల నుంచి 1,916 టీఎంసీల నీరు లభ్యమవుతోందని చెప్పారు. వర్షాలు, నదుల నుంచి వచ్చే నీరు, వినియోగమయ్యే నీటిని లెక్కిస్తున్నామన్నారు. శ్రీశైలం-పెన్నా, నాగార్జున్‌సాగర్-సోమశిల ప్రాజెక్టుల అనుసంధానంపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. ఇవిగాక ఇంకా పలు ప్రతిపాదలున్నట్లు చెప్పారు. వీటన్నింటితో స్మార్ట్ వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. 2018 నాటికి పోలవరం కుడి, ఎడమ కాలువల్లోకి నీటిని విడుదల చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో జలదర్శినిలు నీరు-ప్రగతి పేరుతో రాష్ట్రస్థాయిలో ముద్రించినట్లే జిల్లాస్థాయిలో జలదర్శినిలు ముద్రించామని, త్వరలో మండలస్థాయిలోనూ ముద్రిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతి పది చదరపు కిలోమీటరు పరిధిలో ఒక వర్షపాతాన్ని నమోదు చేసే ఫిజియో మీటర్ ఏర్పాటు చేస్తామని, పడుతున్న వర్షాన్ని కాలువలు, చెరువుల్లోకి మళ్లించే విధానాన్ని రూపొందిస్తామన్నారు. నీరు డబ్బుతో సమానమని డబ్బును బ్యాంకుల్లో దాచుకున్నట్లే నీటిని చెరువుల్లో నిల్వ చేసుకోవాలన్నారు. జలవనరులపై పూర్తిస్థాయిలో చర్చ జరగాలని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, నీటి వినియోగదారుల సంఘాలన్నింటిలోనూ చర్చ జరిపి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. తొలుత జలవనరుల శాఖ కార్యాలయంలో రియల్‌టైమ్ గ్రౌండ్ వాటర్ మానిటరింగ్ ఫిజియో మీటర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. టీడీపీకి కార్యకర్తలే అండ : చంద్రబాబు వేమూరులో జన చైతన్య యాత్ర ప్రారంభించిన సీఎం తెనాలి అర్బన్: తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచింది కార్యకర్తలేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా వేమూరులో జన చైతన్య యాత్రను ఆయన సోమవారం ప్రారంభించారు. టీడీపీని కొందరు నాయకులు వంచించినా కార్యకర్తలు అండగా నిలిచారని చెప్పారు. టీడీపీ పాలనను, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించాలని సూచించారు. జన చైతన్య యాత్రలో పాల్గొని ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. పేదరిక నిర్మూలన కోసం ప్రణాళికబద్ధంగా అనేక కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. నదులను అనుసంధానం చేసిన ఘనత టీడీపీదేనని ఉద్ఘాటించారు. పట్టిసీమ, పులిచింతల ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ‘సాక్షిై’పె విమర్శలు: సాక్షి దిన పత్రికపై చంద్రబాబు అక్కసు వెళ్లగక్కారు. వేమూరు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... ఆ పత్రికను చదవ వద్దని, అన్నీ వక్రీకరించి రాస్తున్నారని ఆరోపించారు. సాక్షి పత్రిక చదువుతుంటే తనకు మతి భ్రమిస్తుందన్నారు. నాటి కాంగ్రెస్ పాలకులు వారి కుటుంబాల సంక్షేమం కోసమే పనిచేశారని విమర్శించారు. తాను మాత్రం ఇచ్చిన హామీలు అమలు పరుస్తూ రైతులను, పేదలను ఆదుకుంటున్నట్లు స్పష్టం చేశారు. సీఐఐ సదస్సు ప్రతిష్టాత్మకం సాక్షి, విజయవాడ బ్యూరో: విశాఖపట్నంలో జనవరి 10 నుంచి 12 వరకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ(సీఐఐ) భాగస్వామ్య సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ సదస్సు ఏర్పాట్లపై ఆయన మంగళవారం విజయవాడలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.