ఈద్ పసంద్
                  
	దీక్షలు, ఉపవాసాలు... నియమాలు, నిష్ఠలు...
	 సహర్లు, ఇఫ్తార్లు.. కొన్ని గంటల్లో ఫలించబోతున్నాయి.
	 నెలవంక కనిపించడమే ఆలస్యం... హ్యాపీ రంజాన్!
	 ఉన్నంతలోనే ఇవ్వడానికి... తిన్నంత తినిపించడానికి...
	 వరమై వచ్చిన తరుణమిది. పసందైన ‘ఈద్’ ఇది. 
	 ఇన్నాళ్లూ ప్రక్షాళన... ఇప్పుడు రుచుల మనోరంజన!
	 
	 గోష్ కా దాల్చా
	 
	 కావలసినవి:
	 శనగపప్పు - 200 గ్రా.; నూనె - పావు కిలో
	 షాజీరా - టేబుల్ స్పూను
	 దాల్చినచెక్క - అర టీ స్పూను
	 లవంగాలు - 10; ఏలకులు - 10
	 ఉల్లితరుగు - 100 గ్రా.; అల్లంవెల్లుల్లి పేస్ట్ - 50 గ్రా.
	 కారం - 100 గ్రా.; కరివేపాకు - నాలుగు రెమ్మలు
	 పసుపు - చిటికెడు; ఉప్పు - తగినంత
	 పచ్చిమిర్చి - 10 (సన్నగా తరగాలి)
	 మిరియాలపొడి - టీ స్పూను
	 కొత్తిమీర - చిన్న కట్ట (సన్నగా కట్ చేయాలి)
	 సొరకాయ ముక్కలు - 500 గ్రా.
	 టొమాటో ముక్కలు - 400 గ్రా.
	 చింతపండు - 100గ్రా. (నానబెట్టి గుజ్జు తీసుకోవాలి)
	 ధనియాలపొడి - రెండు టీ స్పూన్లు
	 జీలకర్రపొడి - రెండు టీ స్పూన్లు
	 పుదీనా - చిన్న కట్ట
	 మటన్ ముక్కలు - 500 గ్రా.
	 
	 తయారి:
	 శనగపప్పును ఉడికించి మెత్తగా చేసుకోవాలి.
	  
	 మటన్‌ను బాగా కడిగి తగినంత నీరు జత చేసి సుమారు అరగంటసేపు ముక్కలు మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి.
	  
	 బాణలిలో నూనె వేసి కాగాక, షాజీరా, దాల్చినచెక్క, లవంగాలు, ఏలకులు వేసి వేయించాలి.
	  
	 ఉల్లి తరుగు జతచేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి.
	  
	 అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి.
	  
	 కారం, కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి.
	  
	 ఉప్పు, మిరియాలపొడి, కొత్తిమీర తరుగు వేసి ఒక నిముషం వేయించాలి.
	  
	 సొరకాయ ముక్కలు, టొమాటో తరుగు, ఉడికించిన మటన్, మెత్తగా చేసిన శనగపప్పు వేసి, అన్నీ ఉడికేవరకు ఉంచాలి.
	  
	 చింతపండు గుజ్జు వేసి పది నిముషాలపాటు ఉడికించాలి.
	  
	 ధనియాలపొడి, జీలకర్రపొడి, పుదీనా ఆకులు వేసి రెండు నిముషాలు బాగా కలిపి దించేయాలి.
	 
	 షీర్ ఖుర్మా
	 
	 కావలసినవి: 
	 నెయ్యి - 100 గ్రా.
	 పాలు - ఒకటిన్నర లీటర్లు
	 పంచదార - 700 గ్రా.; సేమ్యా - 500 గ్రా.
	 ఏలకులు - 15 గ్రా. (పొడి చేయాలి)
	 ఎండు ఖర్జూరాలు - 25 గ్రా.
	 బాదంపప్పులు - 25 గ్రా.
	 జీడిపప్పు పలుకులు - 25 గ్రా.
	 కిస్మిస్ - 25 గ్రా.; చిరోంజీ - 25 గ్రా.
	 నెయ్యి - 150 గ్రా.; పిస్తా - 25 గ్రా.
	 
	 తయారి:
	 బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి, కరిగాక సేమ్యాను వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి పక్కన ఉంచాలి.
	  
	 ఒక పెద్ద పాత్రలో పాలు పోసి అవి సగం అయ్యేవరకు మరిగించాలి.
	  
	 పంచదార, ఏలకుల పొడి జత చేసి ఐదు నిముషాలు ఉంచాలి.
	  
	 సేమ్యా, ఖర్జూరాలు వేసి ఉడికించాలి.
	  
	 బాణలిలో మిగిలిన నెయ్యి వేసి కరిగాక బాదంపప్పులు, జీడిపప్పులు, చిరోంజీ, కిస్మిస్, పిస్తాలను  వేసి వేయించి, ఉడుకుతున్న సేమ్యాలో వేసి బాగా కలిపి దించేయాలి.
	 
	 చికెన్ డ్రమ్‌స్టిక్స్
	 
	 కావలసినవి:
	 సోయా సాస్ - టేబుల్ స్పూన్
	 అల్లంవెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూన్
	 పంచదార - చిటికెడు; చికెన్ డ్రమ్‌స్టిక్స్ - 6
	 మైదా - 2 టేబుల్ స్పూన్లు
	 కార్న్ ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు
	 ఉప్పు - తగినంత
	 మిరియాలపొడి + కారం - పావు టీ స్పూను
	 కోడిగుడ్లు - 2 (పాత్రలో వేసి బాగా గిలక్కొట్టాలి)
	 నూనె - తగినంత; గార్నిషింగ్ కోసం:
	 ఉల్లిచక్రాలు - 10; నిమ్మచెక్కలు - 4
	 
	 తయారి:
	 ఒక పాత్రలో సోయాసాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పంచదార వే సి కలపాలి.
	  
	 చికెన్ డ్రమ్స్టిక్స్కి ఈ మిశ్రమాన్ని బాగా పట్టించి సుమారు అరగంటసేపు పక్కన ఉంచాలి.
	  
	 ఒక చిన్న పాత్రలో మైదా, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, మిరియాలపొడి, కారం, కోడిగుడ్డు సొన వేసి ఉండలు లేకుండా కలపాలి.
	  
	 బాణలిలో నూనె వేసి కాగనివ్వాలి.
	  
	 ఒక్కో ముక్కను పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసి డీప్‌ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి.
	  
	 ఉల్లితరుగు, నిమ్మచెక్కలతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.
	 
	 కర్డ్ - మటన్ బిర్యానీ
	 
	 కావలసినవి:
	 మటన్ - అర కేజీ
	 ఉప్పు - తగినంత
	 అల్లంవెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూను
	 పసుపు - కొద్దిగా
	 పెరుగు - లీటరు
	 ధనియాలపొడి - టీ స్పూను
	 ఏలకులపొడి - టీ స్పూను
	 మిరియాలపొడి - అర టీ స్పూను
	 దాల్చినచెక్కపొడి - కొద్దిగా
	 నెయ్యి - వంద గ్రాములు
	 లవంగాలు - 10
	 నీళ్లు - కప్పు
	 బియ్యం - అర కేజీ
	 
	 తయారి:
	 మటన్‌ను ముక్కలుగా కోసి బాగా కడగాలి.
	  
	 ఒక పాత్రలో మటన్ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి.
	  
	 ఒక పాత్రలో అర లీటరు పెరుగు, ధనియాలపొడి, ఏలకులపొడి, మిరియాలపొడి, దాల్చినచెక్కపొడి, కప్పుడు నీళ్లు వేసి బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని మటన్‌లో వేసి (గంటసేపు) పక్కన ఉంచాలి.
	  
	 పెద్ద పాన్‌లో మటన్ మిశ్రమం వేసి సమానంగా సర్దాలి.
	  
	 బాణలిలో నెయ్యి వేడి చేసి, లవంగాలు వేయించి, నెయ్యితో పాటే మటన్ మీద వెయ్యాలి.
	  
	 బియ్యం కడిగి, మిగిలిన పెరుగును బియ్యంలో కలిపి పాన్‌లో ఉన్న మటన్ మీద వేసి సర్ది మిగిలిన నెయ్యి కూడా వేసి మూత పెట్టి మంట మీద ఉడకనివ్వాలి. ఆవిరి వస్తున్నప్పుడు సిమ్‌లో పెట్టి పావుగంట ఉడకనిచ్చి దించాలి.
	  
	 వేడిగా ఉండగానే పెద్ద ప్లేట్లోకి తిరగదీసి, ఉల్లిచక్రాలతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.
	  
	 (నీళ్లు లేకుండా పెరుగుతో మాత్రమే వండే బిర్యానీ రెడీ).
	 
	 ఖుబానీ కా మీఠా
	 
	 కావలసినవి:
	 ఖుబానీ (ఆప్రికాట్లు) - కేజీ
	 పంచదార - కేజీ
	 రూహ్ అఫ్జా - 250 గ్రా.
	 వెనిలా ఎసెన్స్ - ఆరు చుక్కలు
	 రాస్ప్బెర్రీ ఎసెన్స్ - ఆరు చుక్కలు
	 క్రీమ్ - 50 గ్రా.
	 
	 తయారి:
	 ఆప్రికాట్లను సుమారు అరగంటసేపు నీటిలో నానబెట్టాలి.
	 
	 ఒక పెద్ద పాత్రలో నానిన ఆప్రికాట్లను వేసి, తగినంత నీరు జత చేసి ఆప్రికాట్లు మెత్తబడేవరకు ఉడికించాలి.
	 
	 నీటిని ఒంపేసి, ఆప్రికాట్లు చల్లారాక గింజలను తీసేయాలి.
	 
	 ఒక పెద్ద పాత్రలో పంచదార, ఉడికించిన ఆప్రికాట్లను వేసి రెండూ బాగా కలిసేవరకు ఉడికించాలి.
	 
	 బాగా ఉడికిన తర్వాత వెనిలా ఎసెన్స్, రాస్ప్బెర్రీ ఎసెన్స్, రూహ్ అఫ్జా జత చేసి రెండు నిముషాలు ఉంచాలి.
	 
	 క్రీమ్‌తో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేయాలి.