breaking news
buffellow
-
సింహమే కావచ్చు.. తన కెపాసిటీ ఏంటో చూసుకోవాలి కదా
డొక్క చించి డోలు కట్టడం అంటారు కదా.. ఇక్కడ ఈ సింహానికి జరిగింది అచ్చంగా అదే.. అసలే ఆఫ్రికా అడవి గేదె. చాలా డేంజరస్ అని పేరు.. సర్సరే.. మనం సింహమే కావచ్చు.. కానీ ప్రజెంట్ మన కెపాసిటీ ఏంటి అన్నది చూసుకోవాలి కదా. అసలే వీక్‌గా ఉన్నాం.. పైగా ఇలా దిట్టంగా ఉన్న అడవి గేదెను వేసేయాలంటే.. సాయంగా మరో ఇద్దరిని తీసుకుపోవాలి. అంతే తప్ప.. అదేదో సినిమాలో సింహం సింగిల్‌గా వస్తాది అని చెప్పారు కదా అని.. ముందూవెనకా ఆలోచించకుండా వెళ్తే.. ఏమవుతుంది? రెస్ట్ ఇన్ పీస్ అవుతుంది.. చూశారుగా.. కొమ్ములు ఎలా దిగాయో.. జాంబియాలోని దక్షిణ లాంగ్వా జాతీయ పార్కులో ఆర్మ్‌స్ట్రాంగ్ అనే ఫొటోగ్రాఫర్ ఈ చిత్రాలను క్లిక్‌మనిపించారు. చదవండి: నవ్వులు పూయిస్తున్న డాక్టర్ ‘రౌడీ బేబీ’ పేరడీ సాంగ్ -
పాపం సింహన్ని ఇలా ఎత్తేసి.. అలా పడేసింది!
సాధారణంగా సింహం అడవికి రాజు. దాన్ని చూసిన ఏ జంతువైనా సరే భయంతో వణికి పోవాల్సిందే. దాని కంట్లో పడితే ఎక్కడ బలైపోతామోనని జంతువులు దాని దరిదాపుల్లోకి వెళ్లటానికి కూడా సాహసించవు. అయితే.. ఇక్కడ ఆపదలో ఉన్న దున్నపోతుని కాపాడటానికి, మరో దున్నపోతు సింహంపైనే దాడికి తెగపడింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ సింహనికి చాలా ఆకలివేసినట్టుంది. దాని ఒక దున్నపోతు కనిపించటంతో వేటాడి కిందపడేసింది. దాన్ని ఎటు కదలకుండా పదునైన దాని పళ్లతో గట్టిగా అదిమి పట్టుకుంది. దీంతో పాపం.. ఆ దున్నపోతు ఎటు కదల్లేక దీనంగా అరుస్తొంది. అయితే.. ఈ అరుపులు దూరంగా ఉన్న వేరే దున్నపోతుల చెవినపడ్డాయి. తన మిత్రుడు ఆపదలో ఉన్నాయనుకున్నాయో ఏమో గానీ.. వెంటనే అక్కడికి చేరుకున్నాయి. అవి రెండు కూడా కోపంతో ఆ సింహం పైకి ఒక్కసారిగా దాడిచేశాయి. అందులో ఒక దున్నపోతు తన పదునైన కొమ్ములతో సింహన్ని పొడిచి గాల్లో బంతిలాగా ఎగిరేసింది. అంతటితో దాని కోపం తీరలేదేమో మరోసారి దాన్ని పొడిచి గాల్లో ఇలా ఎగిరేసి.. అలాపడేసింది. ఈ అనుకోని దాడితో సింహనికి పాపం ఏం జరుగుతోందో అర్థంకానట్టుంది. వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. అయితే, సింహం బారినపడి నాపని ఇక అయిపోయిందనుకున్న దున్నపోతు ప్రాణాలతో బయటపడింది... ఈరోజు కడుపునిండా మాంసం తిందామనుకున్న ఆ సింహం బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి జారుకుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు వీటి ఐక్యమత్యానికి తెగ సంబర పడిపోతున్నారు. మనుషుల కన్నా నోరులేని జీవాలే నయం అని కామెంట్లు పెడుతున్నారు. చదవండి: బాల్కనీలో బాలుడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా! -
డెయిరీ పెట్టుకోవటం ఎలా?
పాలకు స్థిరంగా గిరాకీ పెరుగుతూనే ఉంది. అయితే, పాడి పశువుల పెంపకం చెప్పినంత, విన్నంత సులభం కాదు. పశువుల పెంపకంపై ప్రేమ, శాస్త్రీయ అవగాహనతో పాటు సంపూర్ణ నిమగ్నతతో కూడిన ఆచరణ తోడైతే విజయం తథ్యం. మేలు జాతి పాడి పశువుల పెంపకం చేపట్టి, మార్కెటింగ్ అవకాశాలను అందిపుచ్చుకుంటే డెయిరీ ఫారాన్ని లాభదాయకంగా నిర్వహించుకోవచ్చంటున్నారు నిపుణులు.. పాలు, పాల ఉత్పత్తుల అవసరం అనుదినం ప్రతి కుటుంబానికీ ఉంటుంది. పెరుగుతున్న జనాభాతో పాటు పట్టణీకరణ, సగటు కొనుగోలు సామర్థ్యం పెరగడం వల్ల పాలు, పాల ఉత్పత్తులకు క్రమేణా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పాడి రైతులతో పాటు, ఔత్సాహికులు, నిరుద్యోగ యువత అధిక పాల సార కలిగిన మేలు జాతి ఆవులు లేదా గేదెలతో పాడి పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. ఎంత మంది చేపట్టినా గిరాకీ పెరుగుతూనే ఉండే రంగం ఇది. అయితే, పాడి పశువుల పెంపకం చెప్పినంత, విన్నంత సులభం కాదు. పశువుల పెంపకంపై ప్రేమ ఉండాలి. శాస్త్రీయ అవగాహనతో పాటు సంపూర్ణ నిమగ్నతతో కూడిన ఆచరణ తోడైతే విజయం మీ వెంటే ఉంటుంది. మేలు జాతి పాడి పశువుల పెంపకంలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఆశించిన పాల ఉత్పత్తి పొందినప్పుడే పశుపోషణ లాభదాయకమవుతుంది. డెయిరీని ఏర్పాటు చేయదలచిన వారు గమనించాల్సిన ముఖ్యాంశాలు 1 పాడి పశువుల పెంపకంపై ఆసక్తి – ఆశావహ దృక్పథం, 2 వసతులు – వనరులు, 3 మేలుజాతి పాడి పశువులు, 4 పాడి పశువుల మేపు, 5 ఖర్చు తగ్గింపు, ఉత్పత్తి పెంపు, 6 పశు ఆరోగ్య సంరక్షణ, 7 పునరుత్పత్తి యాజమాన్యం, 8 దూడల పోషణ, 9 శుభ్రమైన పాల ఉత్పత్తి, 10 పాలు, పాల ఉత్పత్తుల మార్కెటింగ్. పాడి పరిశ్రమను ఎవరెవరు చేపట్టవచ్చు? డెయిరీ ఫారాన్ని సంపన్నులు, నిరుపేదలు, పురుషులు, స్త్రీలు, ప్రగతిశీల రైతులు, విశ్రాంత ఉద్యోగులు, స్వయం సహాయక బృందాలు, మహిళా సంఘాలు, సహకార సంఘాలు, ప్రభుత్వేతర సంస్థలు, నిరుద్యోగులు.. ఎవరైనా చేపట్టవచ్చు. పాడి పశువుల పోషణపై ఆసక్తి, వాటిని ప్రేమించే స్వభావం కలిగి ఉండాలి. పాడి పశువుల పెంపకం చేపట్టబోయే ముందు కొన్ని డెయిరీ ఫారాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. రెండు నుంచి 10 పాడి పశువుల వరకు నౌకర్లపై ఆధారపడకుండా స్వయంగా రైతు కుటుంబమే నిర్వహించుకునేలా సంసిద్ధులై ఉండాలి. గడ్డి కోయడం దగ్గర నుంచి పాలు పితకడం వరకు అన్ని పనులను నేర్చుకోవాలి. ఒత్తిడులను ఎదుర్కొనే మనో నిబ్బరం కలిగి ఉండాలి. తెలుసుకోవాల్సిన విషయాలు పాడి పరిశ్రమ స్థాపించే ముందు లాభాల బాటలో నడిచే డెయిరీకి స్వయంగా వెళ్లి, అక్కడ పనులు జరుగుతున్న తీరును, సమస్యలను క్షుణ్ణంగా, శ్రద్ధగా గమనించాలి. సందేహాలను తీర్చుకోవాలి. వినడం కన్నా చూడటం ద్వారా త్వరగా విషయ పరిజ్ఞానం కలుగుతుంది. కష్టే ఫలి అని పెద్దలు చెప్పినట్లు.. నౌకర్లపై ఆధారపడకుండా, స్వయంగా కష్టపడి, పర్యవేక్షించి, పూర్తి సమయాన్ని వెచ్చించగలిగినప్పుడే విజయం చేకూరుతుంది. కావల్సిన వసతులు పాడి పరిశ్రమను నెలకొల్పే ప్రదేశాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు అనేక విషయాలను ఆలోచించాలి. రవాణా సౌకర్యం, రోడ్డు సౌకర్యం, విద్యుత్ సదుపాయం ఎలా ఉందో చూసుకోవాలి. నీటి లభ్యత, బోరు, పశుగ్రాసం పెంపకానికి తగినంత భూమి సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇవే కాకుండా చుట్టూ కంచె నిర్మించడం, పని వారి లభ్యతను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో నీటి లభ్యత తగ్గుతుంటే, అవసరం పెరుగుతోంది. ప్రతి సంకరజాతి ఆవు లేదా ముర్రా గేదెకు రోజుకు 75–80 లీటర్ల నీరు అవసరం. వేసవిలో ఇది వంద లీటర్లకు పెరుగుతుంది. ఏడాది పొడవునా పశుగ్రాసం సాగు చేసుకోవడానికి అదనంగా నీరు అవసరం. కాబట్టి, నీటి లభ్యత అనేది అతి ముఖ్యమైన సంగతి. ఎలాంటి పాడి పశువులను కొనుగోలు చేయాలి? పాడి పరిశ్రమను పెట్టాలనుకునే వారు ఆ ప్రాంతంలో ఆవు పాలకు గిరాకీ ఉందా లేదా గేదె పాలకు గిరాకీ ఉందా అనేది ముందుగా తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి. గేదె పాలలో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రుచిగా ఉంటాయి. అందువల్ల కొన్ని ప్రాంతాల్లో గేదె పాలకు గిరాకీ ఉంటుంది. 10 ఆవులు, గేదెలకు ఎంత భూమి అవసరం? ఒక్కో గేదె లేదా ఆవుకు 32 చదరపు అడుగుల స్థలం అవసరమవుతుంది. ప్రతి 5 పాడి పశువులకు పశుగ్రాసాల సాగుకు ఒక ఎకరా భూమి, ఇతర వసతులకు 300 చదరపు గజాల స్థలం అవసరం. 10 ఆవులు లేదా గేదెల పెంపకానికి కనీసం రెండెకరాల భూమి అవసరమవుతుంది. షెడ్డు నిర్మాణానికి, ఇతర అవసరాలకు మరో పది కుంటలు లేదా పావెకరం భూమి అవసరం. సంకర జాతి ఆవులు, గేదెలు ఎక్కడ దొరుకుతాయి? హెచ్.ఎఫ్., జెర్సీ సంకర జాతి ఆవుల్లో పాల సార అధికంగా ఉంటుంది. ఇవి కర్ణాటక, తమిళనాడుల్లోని చింతామణి, కోలార్, బెంగళూరు సబర్బన్ ప్రాంతాలు, చిత్తూరు జిల్లాలో దొరుకుతాయి. ఇవి రోజుకు 12 నుంచి 24 లీటర్ల పాల దిగుబడిని ఇస్తాయి. వీటి ధర మార్కెట్లో రూ. 65 వేల నుంచి లక్షపైన ధర పలుకుతాయి.గ్రేడెడ్ ముర్రా, ముర్రా అనేవి మేలైన సంకర జాతి గేదెలు. ముర్రా జాతి గేదెలు రోజుకు 8 నుంచి 12 లీటర్ల పాలు ఇస్తాయి. వీటి ధర మార్కెట్లో రూ. 75 వేల నుంచి లక్ష పైన పలుకుతాయి. గ్రేడెడ్ ముర్రా గేదెలు భీమవరం, ఉండి, కంకిపాడు, మాచర్ల ప్రాంతాల్లో దొరుకుతాయి. ముర్రా జాతి గేదెలు హరియాణాలోని రోహ్హతక్, గుజరాత్‌లోని మెహసన ప్రాంతాల్లో దొరుకుతాయి. మేలైన పాడి, అనుబంధ వ్యాపార అవకాశాలు ఎలా ఉంటాయి? పాడి పశువులను పెంచే రైతులు ఎక్కువగా పాల వ్యాపారానికి పరిమితం అవుతుంటారు. అయితే, పెరుగు, వెన్న, నెయ్యి, క్రీమ్ వంటి వివిధ రకాల పాల ఉత్పత్తులను తయారు చేసి అమ్మగలిగితే అధికాదాయం పొందవచ్చు. అంతేకాదు.. పేడతో గోబర్ గ్యాస్, వర్మీ కంపోస్టు వంటివి తయారు చేయవచ్చు. పాల శీతలీకరణ, పాల సేకరణ, దూడల పెంపకం చేపట్టవచ్చు. ఎన్ని రకాల పశుగ్రాసాలు పెంచాలి? అనేక రకాల పశుగ్రాసాలు సాగు చేసుకోవడం ద్వారా పోషక లోపం లేకుండా పాడి పశువులను లాభదాయకంగా పెంచుకోవచ్చు. డెయిరీ ఫారం ప్రారంభానికి 2–3 నెలలు ముందు నుంచే పశుగ్రాసాల సాగు చేపట్టాలి. పప్పుజాతి పశుగ్రాసాలు పావు వంతు, ధాన్యపు జాతి పశుగ్రాసాలు ముప్పావు వంతు విస్తీర్ణంలో సాగు చేయాలి. గట్ల వెంబడి పశుగ్రాసంగా పనికి వచ్చే సుబాబుల్, స్టైలో వంటి జాతుల చెట్లు పెంచుకోవాలి. పప్పు జాతి పశుగ్రాసాలు రెండు రకాలు: 1. ఏక వార్షికాలు: లూసర్న్, బెర్సీమ్. వీటిని సాధారణంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో నాటుకోవాలి. 2. బహువార్షికాలు: లూసర్న్ కో, సుబాబుల్, హెడ్జ్ లూసర్న్, స్టైలో, జనుము. ధాన్యపు జాతి పశుగ్రాసాలు రెండు రకాలు: 1. ఏకవార్షికాలు: పిసి–23, ఎస్.ఎస్.జి., జొన్న (మల్టీకట్). 2. బహువార్షికాలు : ఎన్బి–21, కో–4, కో–5, ఎస్ఎన్–ఎపిబిఎన్. వీటిని జూన్–జూలైలలో వర్షాకాలంలో నాటుకోవాలి. చలికాలంలో వీటి ఎదుగుదల తక్కువగా ఉంటుంది. ఎవర్ని సంప్రదించాలి? పాడి పరిశ్రమను స్థాపించదలచిన వారు మొదట బ్యాంకు వారితో, బీమా కంపెనీ వారితో, పశువైద్య నిపుణులతో సంప్రదించి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి. పాల వినియోగదారులైన హాస్టళ్లు, హోటళ్లు, ఆసుపత్రులతోపాటు సమీప ప్రాంతాల్లోని సాధారణ పాల వినియోగదారులతో, పాల ఉత్పత్తిదారుల సంఘాలతో సత్సంబంధాలు పెట్టుకోవాలి. పశుగ్రాస విత్తనాల విక్రయ కేంద్రాలతోనూ మంచి సంబంధాలను పెంపొందించుకోవాలి. డెయిరీ ఫారం పెట్టే రైతులకు శిక్షణ ఎవరిస్తారు? స్థానిక పశు సంవర్థక శాఖ అధికారులు, వెటర్నరీ విశ్వవిద్యాలయాలతోపాటు జాతీయ డెయిరీ పరిశోధనా సంస్థ– కర్నాల్, జాతీయ డెయిరీ అభివృద్ధి బోర్డు – ఆనంద్, భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫెడరేషన్– పుణే వంటి సంస్థలు మేలు జాతి పాడి పశువుల పోషణలో రైతులకు శిక్షణ ఇస్తున్నాయి. పాడి పరిశ్రమలో రికార్డుల నిర్వహణ మేలైన పాడి పశువులను వాణిజ్య స్థాయిలో పెంచి లాభాలు ఆర్జించాలనుకునే వారు కొన్ని వివరాలను క్రమం తప్పకుండా నమోదు చేసుకుంటూ, సమీక్షించుకుంటూ ముందడుగు వేయాలి. మేపు రికార్డులు: పశువులకు ఎంత మేత వేస్తున్నదీ రాసి పెట్టుకోవాలి. ఆరోగ్య సంబంధ రికార్డులు: పశువుల ఆరోగ్య రక్షణకు ఎప్పుడెప్పుడు ఏమేమి మందులు వాడిందీ రాసుకోవాలి. పాల ఉత్పత్తి రికార్డులు: ఒక్కో పశువు రోజుకు ఎన్ని పూటలు, ఎన్నెన్ని పాలు ఇస్తున్నదో రాసుకోవాలి. పునరుత్పత్తి రికార్డులు: ప్రతి పశువు ఎదకు వచ్చిన తేదీ, కృత్రిమ గర్భధారణ చేయించిన తేదీ, ఈనిన తేదీ తదితర వివరాలను రాసి పెట్టుకోవాలి. ఆర్థిక రికార్డులు: రోజువారీగా రాబడి, ఖర్చుల వివరాలను రాసుకోవాలి. రుణాలు.. సబ్సిడీలు.. మేలైన పాడి పశువుల పెంపకాన్ని ప్రారంభించే బలహీన వర్గాల వారు రుణాలు, సబ్సిడీలపై సమాచారం కోసం దగ్గర్లోని సహకార పాల ఉత్పత్తిదారుల సంఘాలను, సంబంధిత ప్రభుత్వ శాఖలు/కార్పొరేషన్ల అధికారులను సంప్రదించవచ్చు. డీఆర్డీఏ, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, ట్రైబల్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన వంటి సంస్థలను సంప్రదించాలి. జనరల్ అభ్యర్థులు బ్యాంకులను సంప్రదించి రుణం పొందవచ్చు. ప్రాజెక్టు వ్యయంలో 75% బ్యాంకు రుణంగా ఇస్తుంది. ఈ విషయాలన్నిటినీ అర్థం చేసుకొని మేలు జాతి పాడి పశువుల పెంపకం చేపట్టి, మార్కెటింగ్ అవకాశాలను అందిపుచ్చుకుంటే డెయిరీ ఫారాన్ని అత్యంత లాభదాయకంగా నిర్వహించుకోవచ్చు. పాడి పశువుల ఎంపిక ఎలా? పాడి పశువు త్రికోణాకారంలో ఉండాలి. చురుకైన కళ్లు, మృదువైన చర్మం కలిగి ఉండాలి. పొదుగు నాలుగు భాగాలూ శరీరానికి అతుక్కొని, మృదువుగా, పెద్దవిగా, సమానంగా ఉండాలి. నాలుగు చనుమొనలు సమానంగా ఉండాలి. తొడలు దృఢంగా, కాళ్లు పొట్టిగా ఉండాలి. పొదుగుకు రక్తం సరఫరా చేసే పాల నరం స్పష్టంగా వకరలు తిరిగి ఉండాలి. కడుపు పెద్దదిగా విశాలంగా ఉండాలి. పశువుల షెడ్డు నిర్మించేదెలా? డెయిరీ ఫారం పెట్టాలనుకునే వారు స్థలాన్ని ఎంపిక చేసుకునే ముందు రవాణా, విద్యుత్తు, నీరు లభ్యత, మార్కెటింగ్ సదుపాయాలను దృష్టిలో పెట్టుకోవాలి. పశువుల షెడ్డు తూర్పు పడమర దిశగా గాలి, వెలుతురు ఉండేలా, కాస్త ఎత్తులో నిర్మించుకోవాలి. డెయిరీ ఫారం చుట్టూ పశుగ్రాసానికి అక్కర వచ్చే చెట్లు పెంచాలి. షెడ్డును సులభంగా కడగడానికి నీళ్లు కొట్టే ప్రెషర్ పంపును సమకూర్చుకోవాలి. మేత వృథా కాకుండా చూసుకోవడానికి పచ్చి మేతను ముక్కలు చేసి వేయాలి. -
తగు చర్యలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: ఆగస్టు 1న పాడి గేదెల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలోని తన చాంబర్లో పశుసంవర్థకశాఖ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, విజయ డెయిరీ, మదర్ డెయిరీ, కరీంనగర్ డెయిరీ, ముల్కనూరు డెయిరీ చైర్మన్లు శ్రీనివాసరావు, గుత్తా జితేందర్‌రెడ్డి, రాజేశ్వరరావులతో పాడిగేదెల పంపిణీ కార్యక్రమంపై సమీక్ష జరిపారు. కలెక్టర్ల ఖాతాలకు ఈ పథకం నిధులు నేడో రేపో జమచేస్తామని మంత్రి తెలిపారు. డెయిరీలు వారి సభ్యుల ఆధ్వర్యంలో గేదెలు కొనుగోలు చేయడానికి కార్యాచరణ ప్రారంభించాలని సూచించారు. లబ్ధిదారుడు కోరుకున్న ప్రాంతం, ఎంపిక చేసుకున్న గేదెను కొనుగోలు చేసి ఇవ్వడం జరుగుతుందని, గేదె ఆరోగ్య పరిస్థితిని వైద్యుడు పరీక్ష చేసి నిర్ధారణ చేసి ఇస్తారన్నారు. యూనిట్ కాస్ట్ రూ.80 వేలుగా నిర్ణ యించామని, ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం సబ్సిడీ, బీసీ లకు 50 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. దీనిపై డెయిరీల ప్రతినిధులు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. విజయ బ్రాండ్‌కు ప్రచారం కల్పించండి విజయ డెయిరీ బ్రాండ్ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లేందుకు అన్ని మార్గాలను అన్వేషించాలని, దీని కోసం భారీ ఎత్తున ప్రచారం కల్పించాలని అధికారులకు మంత్రి తలసాని సూచించారు. విజయ డెయిరీని ప్రైవేటు సంస్థలకు ధీటుగా అభివృద్ధి చేయాలని సూచించారు. సచివాలయంలోని తన చాంబర్లో సందీప్‌కుమార్ సుల్తానియా, విజయ డెయిరీ చైర్మన్లతో దీనిపై మంత్రి సమావేశం నిర్వహించారు. -
గుంటూరుకు మరో గండం!
మంగళగిరిటౌన్: గుంటూరు పట్టణానికి మరో గండం పొంచి ఉంది. విజయవాడ నుంచి తాగునీటిని అందించే పైప్లైన్లకు సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో జంతువులు సంపుల్లో పడి మృత్యువాత పడుతున్నాయి. తాజాగా కాలువ గట్టున పచ్చగడ్డికోసం వెళ్లిన గేదెలు గుంటూరు చానల్లోకి దిగి మంగళవారం ప్రమాదవశాత్తు మృతి చెందాయి. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి గుంటూరు నగరానికి తాగునీరు అందించడానికి గుంటూరు చానల్‌ను ఉపయోగిస్తున్నారు. గుంటూరు చానల్ ద్వారా 2 రకాలుగా నీటిని గుంటూరు పట్టణానికి అందిస్తున్నారు. కాలువ ద్వారా నీటిని వర్షాకాలంలో గుంటూరు పట్టణానికి అందిస్తే, వేసవి కాలంలో గుంటూరు చానల్ వెంట అంతర్గతంగా భూమిలో ఏర్పాటు చేసిన పైప్‌లైన్ ద్వారా నీటిని అందిస్తున్నారు. ఇక్కడ అంతర్గతంగా వేసిన పైప్లైన్లలో పేరుకుపోయిన సిల్ట్, చెత్త, వ్యర్థపదార్థాలను తీసేందుకు కొంత దూరంలో సంప్‌లను ఏర్పాటు చేశారు. ఈ సంపుల్లో పైన ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా గుంటూరు మున్సిపల్ అధికారులు వదిలేశారు. అంతర్గత పైప్లైన్లు ప్రారంభంలో లాకులకు గ్రిల్స్ కాని, ఇనుప చువ్వలు కానీ ఏర్పాటు చేయకుండా పైప్లైన్లు ఏర్పాటు చేశారు. మంగళవారం జరిగిన ప్రమాదంలో మంగళగిరి పట్టణం ద్వారకానగర్ నివాసి దేవరాల నారాయణకు చెందిన 7 గేదెలు తాగునీటికోసం గుంటూరు చానల్ వద్దకు వచ్చాయి. ఎటువంటి రక్షణ చర్యలు లేకపోవడంతో అధికవేగంతో ప్రవహిస్తున్న కాలువలో పడి తూము ద్వారా సంప్‌లోకి వచ్చి ఇరుక్కుపోయాయి. ఈ సంఘటనను గమనించిన పశుకాపరులు, స్థానికులు హుటాహుటిన వచ్చి 7 గేదెల్లో 5 గేదెలను పక్కనే నిర్మాణం జరుగుతున్న సంస్థ క్రేన్ సహాయంతో బెల్టులు కట్టి ఒడ్డుకు చేర్చారు. రెండు మాత్రం సంప్ నుంచి నేరుగా ఏర్పాటు చేసిన పైప్‌లైన్‌లో ఇరుక్కుపోయి నీటి ప్రవాహానికి అర కిలోమీటరు దూరంలో ఉన్న సంప్‌లలో ఒక్కొక్కటి వేరువేరుగా నీటిపై తేలియాడుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మంగళగిరి తహసీల్దార్ వసంతబాబు ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుంటూరు మున్సిపల్ సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి, జరిగిన నష్టం గురించి, రక్షణచర్యల గురించి మాట్లాడకుండా, పశుకాపర్ల మీద కోప్పడటం గమనార్హం. ఈ సంప్ నుంచి గేదెలను తీయాలంటే సంప్‌లను పగలగొట్టి చనిపోయిన గేదెలను తీయాల్సిందే. సాయంత్రానికి గుంటూరు మున్సిపాలిటీ యంత్రాంగం వచ్చి సంపులను పగులగొట్టి మృతిచెందిన గేదెలను వెలికి తీశారు. సుమారు రూ. 2.40 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు పశువుల కాపరి ఆవేదన వ్యక్తం చేశారు. -
విద్యుదాఘాతంతో గేదెలు మృతి
నకిరేకల్ : విద్యుదాఘాతంతో రెండు పాడి గేదెలు మృతి చెందిన ఘటన మండలంలోని ఓగోడు గ్రామ శివారులో సోమవారం జరిగింది. గ్రామ సర్పంచ్ దోరపల్లి యాదగిరిగౌడ్ తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన మాద వెంకన్న, శాంతరాజు రాంబాబులకు చెందిన పాడి గేదెలు మూసీనది ఎగువ ప్రాంతానికి మేతకు తీసుకెళ్లారు. కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి మేత వేస్తున్న పాడి గెదులు అక్కడికక్కడే మృతి చెందాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సర్పంచ్ దోరపల్లి యాదగిరిగౌడ్, బాధితులు ఆరోపించారు. ఒక్కో గేదె విలువ రూ.50 వేలు ఉంటుందని బాధితులు తెలిపారు.