breaking news
blue whale sucide
-
బ్లూవేల్ భూతం : చిరుతకు స్వాతంత్ర్యం..!
పుణె : బ్లూవేల్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. స్వేచ్ఛా జీవిగా మారుతున్నట్టు సూసైడ్ నోట్ రాసిపెట్టి ఉరిపోసుకున్నాడు. ఈ ఘటన పుణెలోని లోనిఖండ్ ప్రాంతంలో వెలుగుచూసింది. వివరాలు.. లోనిఖండ్లో కుటుంబంతోపాటు నివాసముండే దివాకర్ మాలి (20) ఆన్లైన్ గేమ్ బ్లూవేల్కి అడిక్ట్ అయ్యాడు. గంటల తరబడి గేమ్‌లోనే మునిగిపోయేవాడు. గేమ్‌లో భాగంగా టాస్క్‌ని పూర్తి చేసే క్రమంలో ఉరివేసుకుని బుధవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు సూసైడ్ నోట్లో.. ‘బందీగా ఉన్న నల్ల చిరుతను విడిపించాను. దానికిక ఎటువంటి ఆంక్షలు ఉండవు. స్వేచ్ఛగా బతికేయొచ్చు.ఇది ముగింపు’ అని రాసి పెట్టాడు. మరో పేజీలో చిరుత బొమ్మ కూడా గీసి ‘సూర్యుడు మళ్లీ కాంతివంతమవుతాడు’అని మరాఠీ, ఇంగ్లిష్‌లలో రాశాడు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. ‘బ్లూవేల్ చాలెంజ్’పూర్తి చేసే క్రమంలోనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నామని చెప్పారు. తనను తాను నల్ల చిరుతగా భావించి యువకుడు ప్రాణాలు తీసుకున్నాడని వెల్లడించారు. ఇంకెవరూ చావొద్దు.. ప్రపంచంతో సంబంధం లేకుండా దివాకర్ గంటల తరబడి మొబైల్ ఫోన్‌తోనే గడిపేవాడని ఇరుగుపొరుగు, కుటుంబ సభ్యులు తెలిపారు. తన కుమారుడు మొబైల్ వాడకానికి బానిసయ్యాడని అతని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ‘తల్లిదండ్రులందరికి విఙ్ఞప్తి చేస్తున్నా. మీ పిల్లలు సెల్ ఫోన్ వాడకానికి అడిక్ట్ కాకుండా జాగ్రత్త పడండి. నా కొడుకులా ఇంకెవరూ ప్రాణాలు పోగొట్టుకోవద్దు’అని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. ‘బ్లూవేల్ చాలెంజ్’లో ఆటగాళ్లకు వివిధ టాస్క్‌లు ఇచ్చి నిర్ణీత సమయంలో పూర్తి చేయమంటారు. ఒంటికి గాయాలు చేసుకోవడం వంటి ప్రమాదకర టాస్క్‌లు కూడా ఉంటాయి. మరికొన్ని టాస్క్‌లు ఆత్మహత్యకు చేసుకునేందుకు ప్రేరేపిస్తాయి. మొబైల్ గేమ్‌లకు అడిక్ట్ అవడం ‘మానసిక రుగ్మత’ అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
షాకింగ్: భారత్‌లో ఫస్ట్ ‘బ్లూ వేల్’ సూసైడ్
ముంబై: ఆండ్రాయిడ్ గేమ్ ఆదేశాలను పాటిస్తూ 50 రోజులపాటు రకరకాల టాస్క్‌లు చేసిన ఓ టీనేజర్.. చివరి టాస్క్‌గా ఏడంతస్తుల అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రపంచదేశాలను గడగడలాడించిన ఆ గేమ్ పేరు.. బ్లూ వేల్ ఛాలెంజ్. ముంబైకి చెందిన స్కూల్ విద్యార్థి మన్‌ప్రీత్ సింగ్ సహాని శుక్రవారం సాయంత్రం తానుండే అపార్ట్మెంట్ పై నుంచి కిందికి దూకి చనిపోయాడు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తోన్న పోలీసులు.. ఈ ఘటనను భారత్‌లో మొట్టమొదటి బ్లూ వేల్ సూసైడ్‌గా భావిస్తున్నారు. ముంబైలోని అంధేరీలో తల్లిదండ్రులతో కలిసి నివసించే మన్‌ప్రీత్.. స్థానిక స్కూల్లో ఎనిమొదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిన అతను.. ఫ్రెష్ అయి, నేరుగా ఏడంతస్తుల అపార్ట్మెంట్ పై భాగానికి వెళ్లాడు. పిట్టగోడపై కూర్చొని స్నేహితులతో చాటింగ్ చేశాడు. బిల్డింగ్‌పైన కూర్చున్న ఫొటోకు..‘నా గుర్తుగా మీకు మిగిలేది ఈ ఫొటో మాత్రమే’ అని కామెంట్ పోస్ట్‌చేసి కిందికి దూకేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మన్‌ప్రీత్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. దర్యాప్తులో భాగంగా అతను వాడిన గాడ్జెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించగా షాకింగ్ విషయాలు వెలుగుచూశాయని ముంబై డిప్యూటీ పోలీస్ కమిషనర్(ఐదో జోన్) నవీన్‌చంద్రారెడ్డి తెలిపారు. మన్‌ప్రీత్ గత కొంత కాలంగా బ్లూ వేల్ ఛాలెంజ్ టాస్క్‌లు చేస్తున్నాడని, అందులో భాగంగానే బిల్డింగ్‌పైకి ఎక్కి దూకి ఉంటాడని అన్నారు. ఇది ఇండియాలోనే మొట్టమొదటి బ్లూ వేల్ సూసైడ్ కేసుగా భావిస్తున్నట్లు చెప్పారు. ‘నేను సోమవారం నుంచి స్కూల్‌కి రాను’అని మన్‌ప్రీత్ తన స్నేహితులతో చెప్పినగ్లు తెలిందని డీసీపీ రెడ్డి వివరించారు. కాగా, మన్‌ప్రీత్ తండ్రి నేవీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారని, ప్రస్తుతం కుమారుడి అంత్యక్రియల నిమిత్తం కుటుంబమంతా స్వస్థలానికి వెళ్లిందని, వారు తిరిగి వచ్చిన తర్వాత దర్యాప్తును వేగవంతం చేస్తామని పోలీసులు తెలిపారు. ఏమిటీ బ్లూ వేల్ యాప్? బ్లూ వేల్ ఛాలెంజ్ అనేది ఓ ఆండ్రాయిడ్ గేమ్. దీన్ని రిజిస్టర్ చేసుకున్నవాళ్లు 50 రోజల పాటు ఏదో ఒక టాస్క్ చేయాల్సి ఉంటుంది. చేసిన ప్రతి టాస్క్‌కు వీడియో సహిత ఆధారాలను చూపించాల్సిఉంటుంది. గేమ్ ప్రారంభంలో చిన్న చిన్న టాస్క్‌లే ఇస్తారు. కానీ, రోజులు గడిచే కొద్దీ వికృతమైన ఆదేశాలు జారీ చేస్తారు. తెల్లవారుజామునే భయానక వీడియోలు చూడమని, చేతులు, చేతిమీద కోసుకోమని.. రకరకాల టాస్క్‌లు ఇస్తారు. అలా ఏదో ఒక రోజు మీరు చనిపోవాలనుకుంటున్న తేదీ చెప్పమంటారు. చివరికి 50వరోజు వచ్చేసరికి చనిపోమని గేమ్ మనల్ని ఆదేశిస్తుంది. అప్పటికే మానసికంగా ఆయా టాస్కులకు అలవాటు పడిన వారు గేమ్‌లో భాగంగా ఆత్మహత్య చేసుకుంటారు. 2013లో రష్యాలో మొదలైన ఈ బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్.. క్రమంగా యూరప్, అమెరికా, ఆసియాలకు విస్తరించింది. ఇప్పటివరకు వందల మంది యువత ఈ గేమ్‌కు బలైపోయారు. ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తినా, ప్రభుత్వాలు నిషేధించినా, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు మాత్రం కొనసాగుతూనే ఉండటం గమనార్హం.