breaking news
bioluminescent plants
-
కాంతులీనుతున్న సాగరతీరం.. రాత్రి వేళ నీలిరంగులోకి భీమిలి బీచ్
సాక్షి, విశాఖపట్నం: సాగరతీర అందాలకు స్వర్గధామంగా ఉన్న విశాఖలో ఇప్పుడు మరో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. పగలంతా అలల సవ్వడితో పర్యాటకులను అలరిస్తున్న భీమిలి బీచ్.. వారం రోజులుగా రాత్రి సమయంలో నీలివర్ణంతో కాంతులీనుతూ కనువిందు చేస్తోంది. బయోలుమినిసెంట్ తరంగాల కారణంగా అలల పొంగులో కాంతి వెదజల్లుతుండటంతో పర్యాటకులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. వారం రోజుల కిందట భీమిలి బీచ్ వద్ద పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆహ్లాదకరంగా కనిపించే సాగరతీరం... రాత్రి సమయంలో నీలివర్ణంలో వెలిగిపోతోంది. మొదట్లో ఏమవుతుందో అర్థంకాక పర్యాటకులు ఆందోళనకు గురయ్యారు. కానీ.. నీలి అలలు ఎగసిపడుతుంటే.. క్రమంగా వాటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ ప్రాంతంలో ముందెన్నడూ చూడని అద్భుతమైన సహజసిద్ధ సముద్ర అందాలను చూసి పులకించిపోతున్నారు. మరోవైపు సముద్రంలో ఏదో జరిగిందంటూ కొందరు ఆందోళన చెందుతున్నారు. బయోలుమినిసెంట్ కారణంగా... బీచ్‌లో ఈ తరహా మార్పులు చూసేందుకు ఆహ్లాదకరంగా ఉన్నా... ఒకింత ఆందోళన కూడా కలిగిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఫైటో ప్లాంక్టన్ అని పిలిచే చిన్నచిన్న సముద్ర జీవులు విడుదల చేసిన రసాయనాల కారణంగా ప్రకాశవంతమైన నీలి కాంతి విడుదలవుతుంది. దీంతో బయోలుమినిసెంట్ తరంగాలు ఏర్పడుతున్నాయి. అయితే, సముద్రంలోని అతి సూక్ష్మ నీలి, ఆకుపచ్చ శైవలాలే (ఆల్గే) భీమిలి బీచ్ నీలివర్ణంలో మెరిసిపోవడానికి కారణమని నిపుణులు వివరిస్తున్నారు. కొన్నిరకాల ఆల్గేల వల్ల బీచ్‌లు ఆకుపచ్చ వర్ణంలోనూ మెరుస్తుంటాయని, నీటిలో పోషకాలు పుష్కలంగా ఉన్నంతవరకూ బీచ్ ప్రకాశవంతంగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఎక్కువ రోజులు ఉంటే ఆందోళనకరమే... దేశంలో ఈ విధంగా బీచ్‌లు తళుక్కున మెరిసిపోవడం కొత్తేమీ కాదు. లక్షదీవులు, అండమాన్ నికోబార్ దీవుల్లోని హేవ్‌లాక్ ద్వీపం, రాధానగర్ బీచ్, మహారాష్ట్రలోని కొంకణ్ తీరం, మాల్దీవుల్లోని వాధూ ద్వీపంతోపాటు చెన్నైలోని మెరీనా బీచ్లోనూ కొన్నిసార్లు ఈ తరహా బయోలుమినిసెన్స్ కనిపించింది. ఈ గ్లో–ఇన్–డార్క్కు కారణమైన ఆల్గేలు భారీగా ఉంటే చాలా ఆక్సిజన్‌ను తీసుకుంటాయి. దీనివల్ల సముద్రంలో ఆక్సిజన్ కొరత రావొచ్చు. ఎక్కువ పోషకాలు, వ్యర్థాలు ఉన్నచోట ఈ ఆల్గే పోగుపడుతుంది. ఎక్కువ రోజులు ఈ నీలి మెరుపులు ఉంటే ఆ ప్రాంతంలోని సముద్ర జలాల్లో ఆక్సిజన్ తగ్గి సాగరజలాల్లోని జీవరాశులకు కాస్త ప్రమాదకరమైన వాతావరణం ఏర్పడుతుందనే ఆందోళన కూడా ఉంది. ఏది ఏమైనా... భీమిలి బీచ్‌లో ఈ తరహా అద్భుతం మాత్రం ఆహ్వానించదగిన పరిణామం. – సాయి కిరణ్, వాతావరణ నిపుణుడు -
వీధి దీపాలకు బదులు.. కాంతినిచ్చే మొక్కలు..!
వాషింగ్టన్ : త్వరలో రోడ్లపై వీధి దీపాలకు బదులు వెలుగులు అందిస్తున్న మొక్కలు మీకు కనిపించొచ్చు!. అవును. ఈ దిశగా మసాచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు ముందడుగు వేశారు. కృత్రిమ కాంతి(బయో లుమినిసెంట్)ని అభివృద్ధి చేయాలనే యోచనలో భాగంగా చేసిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. వాటర్‌క్రెస్ మొక్కల ఆకులకు ప్రత్యేకమైన నానో పదార్థ తంత్రులను పూసిన పరిశోధకులు చీకట్లో అది వెలుగులు విరజిమ్మడాన్ని గుర్తించారు. నానో పదార్థ తంత్రుల ఎఫెక్ట్‌తో వాటర్‌క్రెస్ మొక్క దాదాపు నాలుగు గంటల పాటు వెలుగును ఇచ్చినట్లు చెప్పారు. మొక్క నుంచి వెలువడిన కాంతితో పుస్తకాన్ని చదవగలిగామని తెలిపారు. ఇదే తరహాలో పెద్ద మొక్కలపై ప్రయోగాలు చేసి పెద్ద ఎత్తున కృత్రిమ కాంతిని సృష్టించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఎలా పని చేస్తుంది? ‘లుసిఫెరాసిస్’ అనే నానో పదార్థ తంత్రువు కృత్రిమ కాంతి సృష్టిలో కీలకపాత్ర పోషిస్తుంది. వాస్తవానికి ఈ లుసిఫెరాసిస్ను స్వయం ప్రకాశిత జీవుల్లో పరిశోధకులు గుర్తించారు. దానిపై అనేక పరిశోధనలు జరిపి కెమికల్ రియాక్షన్ ద్వారా లుసిఫెరాసిస్ను ‘ఆక్సీలుసిఫెరిన్’గా మార్చారు. ఆక్సీలుసిఫెరిన్ నుంచి ఉద్దాతమైన కాంతి వెలువడుతుండటంతో కృత్రిమ కాంతిని సృష్టించొచ్చనే నిర్ధారణకు శాస్త్రవేత్తలు వచ్చారు. అనంతరం వాటర్‌క్రెస్ మొక్కలపై ప్రయోగాలు చేసి సఫలీకృతులయ్యారు. కృత్రిమ కాంతిని మానవాళికి అందుబాటులోకి తెస్తే వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్ శాతాన్ని భారీగా తగ్గించొచ్చు. దీంతో గ్లోబల్ వార్మింగ్ మహమ్మారిని అరికట్టేందుకు మార్గం సుగమం అవుతుంది.