breaking news
Bidis
-
ఆ పెద్దాయన కోరిక ఎంత పని చేసింది..!
సాక్షి, ముంబై: విమాన ప్రయాణ నిబంధనల గురించి ఏ మాత్రం అవగాహన లేని ఓ పెద్దాయన ..ఇబ్బందుల్లో పడ్డారు. అంతేకాదు తోటి ప్రయాణీకుల గుండెల్ని గుభేల్మనిపించారు కూడా. ఆయన చేసిన పనికి అకస్మాత్తుగా విమానంలో గందరగోళం, భయాందోళన వాతావరణం నెలకొంది. వెంటనే సిబ్బంది అప్రమత్తం కావడంతో పరిస్థితి సద్దు మణిగింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే హర్యానాలోని ఇజ్జర్ నివాసి రాజ్‌కుమార్ లక్ష్మీనారాయణ్ గార్గ్(65) మొదటిసారి విమానంలో ముంబై బయలుదేరారు. సమీప బంధువు అంత్యక్రియలకు హాజరయ్యే నిమిత్తం అత్యవసరంగా విమాన ప్రయాణాన్ని ఎంచుకున్నారు. తన కుటుంబసభ్యులతో కలిసి జనవరి 9న రాయ్‌పూర్ నుంచి ముంబైకి ఇండిగో విమానంలో (6ఈ-802) బయలుదేరారు. ఇంతలో బీడీ తాగాలన్న కోరికను నియంత్రించుకోలేని లక్ష్మీనారాయణ్...వెంటనే విమానంలోని టాయ్లెట్లోకి దూరి, పనికానివ్వడం మొదలుపెట్టారు. అంతే..విమానంలో ఫైర్ అలారంలు తమ పని కానిచ్చాయి. దీంతో విమానంలో ప్రయాణీకులు, సిబ్బంది తీవ్ర భయాందోళనతో వణికిపోయారు. సిబ్బంది పరిశీలనతో...పెద్దాయన వ్యవహారం బయటపడింది. వెంటనే వారు కెప్టెన్ రితేష్ మల్హోత్రాకు ఫిర్యాదు చేశారు. ఎయిర్‌లైన్స్ నియమాలు, నిబంధనలు గురించి ఆయనకు కెప్టెన్ వివరించారు. అనంతరం విమానం ముంబై చేరున్నాక.. విమానాశ్రయం పోలీసు స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 336, ఎయిర్‌లైన్ రూల్ ఆఫ్ 25ఎ కింద ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే ఇవి బెయిలబుల్ సెక్షన్లు కావడంతో వెంటనే ఆయనకు బెయిల్ మంజూరైంది. దీంతో లక్ష్మీనారాయణ్, ఆయన కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
బీడీలకు మోక్షం లభించలేదు : ఈటల
న్యూఢిల్లీ : బీడీలపై జీఎస్టీ తగ్గించాలని కోరినా.. కౌన్సిల్ ఆమోదించలేదని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సిగరెట్లతో సమానంగా అంటే 28 శాతం పన్నును బీడీ ఉత్పత్తులపై విధించడం సరికాదని కోరినప్పటికీ, ఫిట్మెంట్ కమిటీ ఒప్పుకోలేదని చెప్పారు. అయితే డ్రిప్ ఇరిగేషన్ వస్తువులకు మాత్రం జీఎస్టీ రేటు 18 శాతం నుంచి 12 శాతం తగ్గింపుకు ఆమోదం లభించిందన్నారు. నేడు జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 25వ సమావేశంలో పన్ను ఎగవేత లేకుండా ఈ-వే బిల్లు అమలు చేయడంపై చర్చ జరిగినట్టు చెప్పారు. జీఎస్టీ చట్టాల సవరణలపై తదుపరి మీటింగ్‌లో చర్చ ఉంటుందని తెలిపారు. అంతేకాక పెట్రోల్, డీజిల్, రియల్ ఎస్టేట్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై నేడు(గురువారం) చర్చ జరుగలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి కేంద్రానికి ప్రతిపాదించిన అభ్యర్థనలు... ప్రోగ్రెసివ్ రాష్ట్రాలకు కేంద్రం మద్దతు ఇవ్వాలి యువతకు ఉపాధి కల్పించే వ్యవసాయం, చిన్నమధ్య తరహా పరిశ్రమలపై దృష్టిపెట్టాలి రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి, గిరిజన విశ్వవిద్యాలయానికి నిధులకు, కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రూ.10వేల కోట్ల బడ్జెట్ కోరాం హైదరాబాద్ మినహా మిగతా 30 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి నిధులు ఇవ్వాలని కోరాం ప్రతి ఎకరానికి, ప్రతి పంటకు పెట్టుబడి చేయూత పథకం కోసం ఆర్ధికంగా సహాయం, కరెన్సీ నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు -
పొగచూరిన బతుకుల పోరుబాట
‘మునీం, సేట్ల దోపిడీతో కార్మికుల్లో అసంతృప్తి పేరుకుపోయిన పరిస్థితి. ఆగ్రహం నివురువుగప్పిన నిప్పులా రాజుకుంటుంది. ఈ అసంతృప్తి...ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. లక్ష్మి అనే పాత్రధారి బయటకు వస్తుంది. బీడీ కార్మికులందరినీ సమీకరించి బతుకు పోరు రాజేస్తుంది.’ 1980లో తెలంగాణ రచయిత బీఎస్ రాములు రాసిన ‘బతుకు పోరు’ పుస్తకం కథా వస్తువు ఇది. ప్రస్తుతం మెతుకు సీమ పల్లెల్లో ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతమవుతోంది. హక్కుల సాధన కోసం బీడీ కార్మికులు రోడ్డు మీదకొస్తున్నారు. సిద్దిపేటలో రాజుకున్న బీడీ కార్మిక పోరాటం... దుబ్బాక...రామాయంపేట.. గజ్వేలు పల్లెలకు అంటుకొంది. ధర్నాలు, రాస్తారోకోలతో కార్మికులు కదం తొక్కుతున్నారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘బీడీలు చుట్టటంలో కష్టం మాది... కష్టార్జితమేమో కంపెనోళ్లది. నెలకు 10 రోజులు కూడా పని ఇవ్వడంలేదు. నెలకు రూ.1000 జీవన భృతి ఇవ్వండి’ అనే డిమాండ్‌తో బీడీ కార్మికులు పోరుబాట పట్టారు. ప్రభుత్వానికి సగటున రూ.100 కోట్ల సెస్సు, కంపెనీ యాజమాన్యాలకు రూ. 200 కోట్లు ఆర్జించి పెడుతున్న బీడీ కార్మికుల కష్టాల మాత్రం ఎవరికీ పట్టడం లేదు. పని దినాలను కుదించి ... వర్ధీ బీడీలు తెచ్చి జిల్లాలో దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, మెదక్ నియోజకవర్గాల్లో ప్రతి కుటుంబంలో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు బీడీ కార్మికులుగా పని చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 1.50 లక్షల మంది వరకు కార్మికులున్నారు. దాదాపు 14 గంటల పాటు నిరంతరాయంగా బీడీలు చుడుతున్నారు. ఇన్ని గంటలు కష్టపడితే సగటున 800 వందల బీడీలు చుడుతున్నారు. 1000 బీడీలకు కంపెనీలు కేవలం రూ.100 నుంచి రూ.120 వరకు కట్టిస్తున్నారు. ఈ లెక్కన దాదాపు 14 గంటలకు పైన కష్టపడితే రూ80 నుంచి 90 వరకు కూలీ పడుతోంది. ఆ పని నెలలో 10 రోజులు మాత్రమే కల్పిస్తున్నారు. ఇంకో పని చేయడం తెలియని బీడీ కార్మికులు మిగిలిన రోజుల్లో పని లేక, తిండికెళ్ల్లక ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయంలో కంపెనీల యాజమాన్యాలు అనధికారికంగా(వర్ధీ) కార్మికులతో బీడీలు చుట్టించి అతి తక్కువ కూలీ రేట్లు కట్టిస్తున్నారు. వర్ధీతో ఒక్కొక్క కార్మికుడు రోజుకు రూ.30, రూ.40 నష్టపోతున్నాడు. ప్రభుత్వానికి కూడా రూ.కోట్లలో సెస్సు ఎగ్గొడుతున్నారు. 30 ఏళ్లకే స్పాండలైటిస్... అరకొర ఆదాయం కార్మికులకు మూడు పూటల కడుపు నింపలేకపోతోంది. ఇక పౌష్టికాహారం అంటే ఏమిటో కూడా తెలియదు. ప్రతి మనిషికి కనీసం 2,800 కాలరీల శక్తినిచ్చే ఆహారం అవసరమని వైద్యులు చెప్తుండగా, ఆర్థిక సమస్యల కారణంగా వీళ్లు కేవలం 1,700 కాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని మాత్రమే తీసుకోగలుగుతున్నారని ఓ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ చేసిన సర్వేలో తేలింది. ఫలితంగా ప్రతి మహిళ రక్త హీనతతో బాధపడుతోంది. ఒకే పనిని ఏకాగ్రతతో 14 గంటల పాటు చేయడం వల్ల బీడీ కార్మికుల్లో 30 ఏళ్లకే మెడ నరాల నొప్పి (స్పాండలైసిస్)తో బాధపడుతున్నారు. పొగాకు కేన్సర్ కారకమని శాస్త్రీయంగానే నిర్ధారణ అయింది. బీడీ కార్మికులు ఏళ్ల తరబడి పోగాకుతోనే గడుపుతారు కాబట్టి కేన్సర్, టీబీ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నట్లు తేలింది. కార్మికులు సంపాదించిన దాంట్లో సగం డబ్బు ఆస్పత్రుల ఖర్చులకే పోతున్నాయి. కార్మికులు రోగాల బారిన పడ్డప్పుడు అండగా నిలబడాల్సిన కంపెనీలు మొఖం చాటేస్తున్నాయి. చట్టాలకు తూట్లు.... కార్మికులకు కనీస వేతనం కింద 1,000 బీడీలు చుడితే రూ.158 కట్టివ్వాలని, వారానికి ఒక రోజు సెలవు, ఇతర అలవెన్సులు కలుపుకొని వెయ్యి బీడీలు చుడితే రూ.170 వరకు గిట్టుబాటు అయ్యేటట్టు రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల కిందట జీఓ 41 విడుదల చేసింది. ఆ త ర్వాత కంపెనీల యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి వెంటనే ఆ జీఓను పెండింగ్‌లో పెట్టారు. దీన్ని అమల్లోకి తేవాలని కార్మిక సంఘాలు పోరాటం చేస్తున్నా, పాలకులు పట్టించుకోవడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం జీవో 41 అమల్లోకి తేవడంతో పాటు, రూ.1000 భృతి కలిపిస్తే బీడీ కార్మికుల బతుకుల్లో వెలుగులు పూస్తాయని సిద్దిపేట చెందిన బీడీ కార్మికులు చెబుతున్నారు. 1965 కార్మిక వేతన చట్టం, 1966 బీడీ కార్మిక చట్టం ప్రకారం వారానికి ఒక రోజు సెలవుతో కూడిన వేతనం ఇవ్వాలి. ఆరోగ్యకరమైన వాతావరణంలో పసి పిల్లలకు ఊయల కట్టించాలి. ప్రసవించిన మహిళలకు 180 రోజులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలి. కానీ ఏ ఒక్క కంపెనీ కూడా వీటిని అమలు చేసినట్లు కనిపించలేదు.