breaking news
Bharat Financial Inclusion
-
భారత్ ఫైనాన్షియల్ ఎండీ, ఈడీల రాజీనామా
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్‌లో భాగమైన భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ (బీఎఫ్ఐఎల్) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), సీఈవో శలభ్ సక్సేనా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.. సీఎఫ్‌వో ఆశీష్ దమానీ తమ పదవులకు రాజీనామా చేశారు. పోటీ కంపెనీ అయిన సూక్ష్మ రుణాల సంస్థ స్పందన స్ఫూర్తిలో (ఎస్‌ఎస్‌ఎఫ్‌ఎల్) వారు చేరనున్నట్లు సమాచారం. సక్సేనా, దమానీ నవంబర్ 25న తమ తమ పదవులకు రాజీనామా చేసినట్లు ఎక్సే్చంజీలకు బీఎఫ్ఐఎల్ సోమవారం తెలియజేసింది. తాత్కాలికంగా ఈడీ హోదాలో జే శ్రీధరన్‌ను, రోజు వారీ కార్యకలాపాల పర్యవేక్షణకు శ్రీనివాస్ బోనం ను నియమించినట్లు పేర్కొంది. సక్సేనా, దమానీల విషయంలో కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. సక్సేనాను ఎండీ–సీఈవోగా, దమానీని ప్రెసిడెంట్–సీఎఫ్‌వోగా నియమించినట్లు ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ఎల్ నవంబర్ 22న ప్రకటించింది. అయితే, వారు తమ సంస్థలో రాజీనామా చెయ్యలేదంటూ ఆ మరుసటి రోజైన నవంబర్ 23న బీఎఫ్ఐఎల్ తెలిపింది. ఒకవేళ చేస్తే.. నిర్దిష్ట షరతులకు అనుగుణం గా వారు వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంది. నోటీసు పీరియడ్, పోటీ సంస్థలో చేరకూడదు వంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుందని వివరించింది. అప్పటికైతే మాత్రం వారిద్దరూ తమ సంస్థలోనే కొనసాగుతున్నారని బీఎఫ్ఐఎల్ స్పష్టం చేసింది. కస్టమర్ల సమ్మతి లేకుండా సాంకేతిక లోపం వల్ల 84,000 రుణాలు మంజూరైన అంశంపై సమీక్షలో సహకరిస్తామంటూ వారు చెప్పినట్లు పేర్కొంది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో సక్సేనా, దమానీకి వర్తింపచేసే నిబంధనల అమలుపై బీఎఫ్ఐఎల్ వివరణ ఇవ్వలేదు. -
భారత్ ఫైనాన్షియల్...ఇండస్ఇండ్ ఖాతాలోకి!
విలీనంపై ఇరు కంపెనీలు ముందుకు... ► సాధ్యాసాధ్యాల పరిశీలనకు ప్రత్యేక ఒప్పందం ► నిర్ధిష్ట గడువును మాత్రం వెల్లడించని సంస్థలు న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఇండస్ ఇండ్ బ్యాంక్‌లో సూక్ష్మరుణాల సంస్థ భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ (ఒకనాటి ఎస్కేఎస్ మైక్రోఫైనాన్స్) విలీనానికి సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. విలీన సాధ్యాసాధ్యాల్ని పరిశీలించేందుకు ఇరు సంస్థలూ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నాయి. నిర్దిష్ట కాలవ్యవధిలో మదింపు ప్రక్రియ పూర్తిచేసేందుకు, విలీన అవకాశాలను పరిశీలించేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుందని స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇరు సంస్థలు తెలియజేశాయి. అయితే, ఒప్పంద గడువు ఎప్పటిదాకా ఉంటుందనేది వెల్లడించలేదు. వ్యాపార కార్యకలాపాల విస్తరణ కోసం పలు సంస్థలతో చర్చలు జరుపుతున్నామంటూ ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ ఏడాది మార్చిలో తెలియజేసింది. భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ (బీఎఫ్ఐఎల్) విలీనంపై అప్పట్నుంచే ఊహాగానాలు నెలకొన్నాయి. బీఎఫ్ఐఎల్ చాన్నాళ్లుగా ఇండస్‌ఇండ్‌కి కర్ణాటకలో బిజినెస్ కరెస్పాండెంట్‌గా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఒకవేళ విలీనం సాకారమైన పక్షంలో ఇండస్ఇండ్ బ్యాంక్‌కి సంబంధించి ఇది మూడో డీల్ కానుంది. 2011లో డాయిష్ బ్యాంక్‌కి చెందిన క్రెడిట్ కార్డ్ పోర్ట్‌ఫోలియోని కొనుగోలు చేసిన ఇండస్ఇండ్ బ్యాంక్ ఆ తర్వాత 2015లో ఆర్‌బీఎస్‌కి చెందిన ఆభరణాల రుణాల వ్యాపార విభాగాన్నీ దక్కించుకుంది. మారుమూల ప్రాంతాల్లోకి కూడా కార్యకలాపాలు విస్తరించే దిశగా ఇప్పటికే కొన్ని ప్రైవేట్ బ్యాంకులు, సూక్ష్మ రుణాల సంస్థల కొనుగోలు డీల్స్ జరిగిన సంగతి తెలిసిందే. ఐడీఎఫ్సీ బ్యాంక్, కోటక్, ఆర్బీఎల్ వంటి బ్యాంకులు గడిచిన 18 నెలల్లో వివిధ సూక్ష్మ రుణ సంస్థలను కొనుగోలు చేయడమో లేదా వాటిలో వాటాలు కొనుగోలు చేయడమో జరిగింది. షేర్లు రయ్.. రయ్... విలీన ప్రతిపాదన పరిశీలనకు ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో సోమవారం ఇండస్ఇండ్ బ్యాంక్, బీఎఫ్ఐఎల్ షేర్లు 5.5 శాతం దాకా పెరిగాయి. బీఎస్ఈలో ఇండస్ఇండ్ షేరు ఒక దశలో ఏడాది గరిష్ట స్థాయి రూ.1,803కి కూడా ఎగిసి చివరికి 5.56 శాతం పెరుగుదలతో రూ. 1,791 వద్ద ముగిసింది. ఇక, బీఎఫ్ఐఎల్ షేరు కూడా ఇంట్రాడేలో 4.59 శాతం పెరిగి ఏడాది గరిష్టమైన రూ. 979 స్థాయిని తాకింది. చివరికి 3.34 శాతం వృద్ధితో రూ. 967 వద్ద క్లోజయ్యింది. ఎస్కేఎస్ మైక్రోఫైనాన్స్గా ఉన్నప్పుడు బీఎఫ్ఐఎల్.. నాలుగేళ్ల క్రితం కీలకమైన ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో.. రీపేమెంట్లపరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆ తర్వాత సంస్థలో నాయకత్వ పోరు తలెత్తింది. చివరికి వ్యవస్థాపకుడు విక్రమ్ ఆకుల నిష్క్రమించాల్సి వచ్చింది. జూన్ 30కి భారత్ ఫైనాన్షియల్ సంస్థకి 68 లక్షల పైగా కస్టమర్లు, రూ. 7,709 కోట్ల రుణాల పోర్ట్‌ఫోలియో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో సంస్థ రూ. 37 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. 2016–17 పూర్తి ఏడాదికి రూ. 290 కోట్ల నికర లాభం నమోదు చేసింది. ఇండస్ఇండ్తో డీల్ సాకారమైన పక్షంలో రెండూ లిస్టెడ్ కంపెనీలే అయినందున షేర్ల మార్పిడి రూపంలో విలీనం జరుగుతుంది. ఇటీవలే ప్రైవేట్ దిగ్గజాలు ఐడీఎఫ్సీ బ్యాం క్, శ్రీరామ్ క్యాపిటల్ విలీనానికి సిద్ధమైన సంగతి తెలిసిందే.