breaking news
Bhagwan Singh
-
ఎదురునిలిచిన మొనగాళ్లు
అప్రతిహత రికార్డున్న కబడ్డీలో పట్టు జారింది... అంచనాలున్న ఆర్చరీలో బాణం గురి తప్పింది... జిమ్నాస్టిక్స్ విన్యాసాల్లోనూ రిక్తహస్తమే మిగిలింది... కానీ, రోయింగ్ బృందం చరిత్ర తిరగరాసింది! ఎవరూ ఊహించని విధంగా త్రివర్ణ పతాకం ఎగురేసింది! పరువు పోయిందన్న చోటే సగర్వంగా నిలిచింది! సాక్షి క్రీడా విభాగం :‘ప్రత్యర్థి గురించి భయపడొద్దు. నిశ్చలంగా నిలిచి, విజయాన్ని ముద్దాడు!’ ... పంజాబీ ప్రసిద్ధ నానుడి ఇది. దీనిని అక్షరాలా ఆచరించింది భారత పురుషుల రోయింగ్ జట్టు. మన సైన్యంలోని సిక్కు రెజిమెంట్‌లో పనిచేసే నాయిబ్ సవర్ణ్ సింగ్, దత్తు బబన్, ఓంప్రకాశ్, సుఖ్మీత్ సింగ్‌లతో కూడిన బృందం... సైనికుల్లానే పోరాడి స్వర్ణం పట్టు కొచ్చింది. సవర్ణ్ సింగ్ సారథ్యంలో క్లిష్ట పరిస్థితులకు ఎదురొడ్డి మరీ త్రివర్ణ పతాకం ఎగురేసింది. ఈ సంచలన గెలుపుతో వారి చుట్టూ మీడియా మూగింది... ఇంటర్వ్యూల కోసం ఎగబడింది! కానీ, ఈ విజయం వెనుక ఉత్కంఠను అధిగమించిన క్షణాలు... శరీరం నియంత్రణ తప్పేంత శ్రమ... అవమానాన్ని దిగమింగిన కసి ఉన్నాయి... అంతటి ఆసక్తికర నేపథ్యం ఏమంటే! ఎదురుగాలికి ఎదురొడ్డి... శుక్రవారం ఉదయం భారత రోయింగ్ బృందం బరిలో దిగేటప్పటికి అన్నీ ప్రతికూలతలే. గురువా రం నాలుగు ఫైనల్స్‌లో ఓడిపోవడంతో భారత రోయింగ్ చరిత్రలో ఇది చీకటి రోజంటూ కోచ్ ఇస్మాయిల్ బేగ్ మండిపడ్డారు. దత్తు... రేసుకు ముందు ఏకంగా లాక్ వేసుకోవడం మర్చిపోవడంతో బోట్ నుంచి పడిపోయాడు. దీంతో అతడు మానసికంగా దృఢంగా లేడంటూ, ఏ దేశంలోనూ ఇలా ఉండరంటూ విదేశీ కోచ్ నికోల్ జియోగా నిందించాడు. ఇదంతా ఒక ఎత్తయితే శుక్రవారం తేమతో కూడిన గాలుల వాతావరణం సవర్ణ్ జట్టుకు మరింత పరీక్ష పెట్టింది. ఇక బరిలో దిగాక ఆతిథ్య దేశం ఇండోనేసియా నుంచి విపరీతమైన పోటీ ఎదురైంది. అయినా... తట్టుకుని నిలిచి గెలిచింది. ఇబ్బందులను తట్టుకుని... 28 ఏళ్ల సవర్ణ్ సింగ్ జట్టులో సీనియర్. భారత గొప్ప రోయర్లలో ఒకడు. గత ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచాడు. అయితే, గాయంతో రెండేళ్లుగా ఆటకు దూరమయ్యాడు. దాన్నుంచి కోలుకున్నాక టైఫాయిడ్ బారిన పడ్డాడు. కొన్నాళ్ల క్రితమే బరిలో దిగాడు. దత్తు గురువారం నీటిలో పడిపోవడంతో జ్వరం, దగ్గు, జలుబు చుట్టుముట్టాయి. అయితే, కీలకమైన వీరిద్దరూ రేసుకు వచ్చేసరికి ఇబ్బందులన్నీ మర్చిపోయారు. ‘జాన్ చలీ జాయేగీ... మర్ జాయేంగే... లేకిన్ హార్ నహీ మానేంగే (ప్రాణం పోయినా ఫర్వాలేదు కానీ ఓటమి ఒప్పుకోం)’ అంటూ కదంతొక్కారు. ఈ క్రమంలో సవర్ణ్... సిక్కుల గురువు గోవింద్ సింగ్ మాటలను జట్టు సభ్యులకు పదేపదే గుర్తుచేశాడు.‘శభాష్... శభాష్’ అంటూ వెన్నుతట్టాడు. దాని ఫలితమే ఈ విజయం. ఎవరికీ తక్కువ కాదని నిరూపించాం... స్వర్ణం నెగ్గాక భారత రోయర్ల స్పందన ఆకాశాన్నంటింది. ‘మా గుండె పేలిపోతుందేమో అన్నంతగా దడదడలాడింది. నేను 2 వేల రేసుల్లో పాల్గొన్నా. అన్నింట్లోకి ఇదే క్లిష్టమైనది. నిన్న నా కారణంగా దేశ గౌరవం పోయింది. నేడు అది తిరిగొచ్చింది. మేం ఏ దేశం వారికీ తక్కువ కాదని నిరూపించాం’ అని దత్తు వ్యాఖ్యానించాడు. ‘తల వెంట్రుకల నుంచి కాలి గోళ్ల వరకు మా శరీరం మొత్తం అలసిపోయింది. రేసులో చివరి 100 మీటర్లయితే నా పేరు అడిగినా తెలియదనే చెప్పేవాడిని’ అని సవర్ణ్ అనడం గమనార్హం. ‘అంత శక్తి మాకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కానీ వచ్చింది. ఇది మా జీవితాలను మార్చే రేస్’ అని ఓంప్రకాశ్ పేర్కొన్నాడు. ఈ ఒత్తిడి ఫలితమో, విజయ గర్వమో ఏమో, రేసు అనంతరం దత్తు, ఓంప్రకాశ్‌లు...సవర్ణ్ భు జంపై అమాంతం వాలిపోయారు. దుష్యంత్‌ది మరో కథ.. రోయింగ్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలిచిన 25 ఏళ్ల దుష్యంత్ చౌహాన్ తీవ్ర జలుబుతో బాధపడుతూనే పోటీకి దిగాడు. ‘నేను మరణానికి దగ్గరగా ఉన్నాననిపించే పరిస్థితి. చివరి 200 మీటర్లలో నా కాళ్లు, చేతుల గురించి ఆలోచించలేని పరిస్థితి. ఎక్కడున్నానో కూడా చూసుకోలేదు. ఇదే చివరి రేసా అన్నట్లున్నాను’ అని చెప్పాడు. రేసు పూర్తయ్యాక దుష్యంత్ కుప్పకూలాడు. అధికారులు వచ్చి బోటు నుంచి బయటకు తీసి అతడి మెదడుకు రక్త ప్రసరణ మెరుగు పడేలా కాళ్లను పైకెత్తారు. తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లి ఆక్సిజన్ మాస్క్ తొడిగి గ్లూకోజ్ పెట్టించారు. ఈ కారణంగానే బహుమతి ప్రదానోత్సవం ఆలస్యమైంది. అన్నింటికంటే విశేషమేమంటే... పతకం తేవడం సంతోషంగా ఉన్నా, విజయానికి సంకేతంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడిన క్షణాన్ని చూడలేనందుకు దుష్యంత్ ఒకింత నిరాశకు లోనవడం. -
రూ. 1.19 కోట్ల నష్టపరిహారం చెల్లించాలి
- మోటార్ ప్రమాదాల క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఆదేశం - బాధిత కుటుంబానికి ఊరట న్యూఢిల్లీ: డీటీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన 27 ఏళ్ల యువకుడి కుటుంబానికి రూ. 1.19 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని మోటార్ ప్రమాదాల క్లెయిమ్ ట్రిబ్యునల్(ఎంసీటీ) శుక్రవారం ఆదేశించింది. అతివేగంగా బస్సు ఢీకొన్న ప్రమాదంలో భగవాన్ సింగ్ మృతి చెందాడు. ఈ కేసు విచారించిన ట్రిబ్యునల్ డీటీసీ బస్సు ఇన్సూరెన్స్ చేసిన యూనెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ లిమిటెడ్ రూ. 19,13,600లను బాధితుడి భార్య, కుటుంబానికి అందజేయాలని సూచించింది. డీటీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగా మోటార్‌బైక్‌పై వెళ్తున్న భగవాన్‌సింగ్ ప్రమాదానికి గురై తీవ్రగాయాలపాలై మృతి చెందినట్లు సాక్షాధారాలు, వివిధ పత్రాలను పరిశీలించిన ట్రిబ్యునల్ ఈ మేరకు నిర్దారించింది. కేసుపూర్వాపరాలిలా.. మే 31, 2013న సుమారు 8.15 గంటలకు సిటీ ఫారెస్ట్ మీదుగా ఎంబీరోడ్డు భద్రాపూర్ మెహరులి వైపు వెళ్లే మార్గంలో సాకెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో యూ టర్న్ తీసుకొనే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. డీటీసీ డ్రైవర్ రాయ్‌సింగ్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు రుజువైందని ఎంఏసీ ప్రిసైడింగ్ అధికారి కేఎస్ మోహి తెలిపారు. ఈ క్రమంలోనే రూ. 3 కోట్ల నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబం ట్రిబ్యునల్‌ను ఆశ్ర యించింది. రాయ్‌సింగ్ నిర్లక్ష్యం కారణంగానే బస్సు ఢీకొని భగవాన్ తీవ్ర గాయాలపాలైయ్యాడు. జేపీఎన్ ట్రామా సెంటర్‌కు తరలించారు. అప్పటికే మార్గమధ్యలోనే చనిపోయినట్లు ఏయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. సాకేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. బాధిత కుటుంబం హర్యానాలోని షిరిషాలో నివాసం ఉంటుంది. మృతుడు ఏడీజీ సుమావి టెక్నికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లోడిజైనర్గా పనిచేస్తున్నాడు.