breaking news
Berny sanders
-
నువ్వు బతికున్నావనే సంగతి మర్చిపోతుంటాను: ఎలన్ మస్క్
వాషింగ్టన్: టెస్లా కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి అమెరికా సెనెటర్ బెర్నీ సాండర్స్‌ని లక్ష్యంగా చేసుకుని సెటైర్లు వేశాడు ఎలన్ మస్క్. ఓ నువ్వు ఇంకా బతికు ఉన్నావనే విషయాన్ని నేను మర్చిపోతుంటాను అంటూ సెటైరికల్‌గా ట్వీట్ చేశాడు ఎలన్ మస్క్. అసలు వీరిద్దరి మధ్య ఈ మాటల యుద్ధం ఎందుకు మొదలయ్యింది అంటే.. కొన్ని రోజుల క్రితం ఎలన్ మస్క్ టెస్లాలో తన పేరిట ఉన్న 6.9 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను అమ్మేసుకున్నాడు. 1.2 మిలియన్ షేర్లను అమ్మేశారు. వీటి విలువ 1.2 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువేనని తెలుస్తోంది. ఈ క్రమంలో అమెరికా సెనెటర్ బెర్నీ సాండర్స్ పరోక్షంగా స్పందిస్తూ ‘‘అత్యంత ధనవంతులు వారి వంతు పన్నులను సక్రమంగా చెల్లించాల్సిందిగా మనం డిమాండ్ చేయాలి’’ అంటూ ట్వీట్ చేశాడు. (చదవండి: Elon Musk: ఎలన్ మస్క్‌కి ఏమైంది, ఎందుకిలా?..) We must demand that the extremely wealthy pay their fair share. Period. — Bernie Sanders (@SenSanders) November 13, 2021 దీనిపై ఎలన్ మస్క్ స్పందిస్తూ.. ‘‘ఓ నువ్వు బతికున్నావనే విషయాన్ని నేను మర్చిపోతుంటాను.. ఇప్పుడేమంటావ్.. నేను మరింత స్టాక్ అమ్ముకోవాలని నువ్వు కోరుకుంటున్నావా.. చెప్పు’’ అంటూ ఎలన్ మస్క్ విరుచుకుపడ్డాడు. టెస్లా సీఈఓ ట్వీట్‌పై సాండర్స్ ఇంకా స్పందించలేదు. Want me to sell more stock, Bernie? Just say the word … — Elon Musk (@elonmusk) November 14, 2021 అయితే ఎలన్ మస్క్ స్టాక్ విక్రయానికి గత వారం నిర్వహించిన ట్విటర్ పోల్ ఫలితాలే ప్రధాన కారణమని అనుమానిస్తున్నారు. ఇక మస్క్ ప్రస్తుతం అతను 13.3 శాతం అత్యధిక పన్ను రేటు కలిగి ఉన్న కాలిఫోర్నియాకు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నాడు. ప్రస్తుతం మస్క్ రాష్ట్ర ఆదాయపు పన్ను లేని టెక్సాస్‌కు మారినప్పటికీ, అతను ఇప్పటికీ కాలిఫోర్నియా రాష్ట్రానికి ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లు ఇటీవలి ట్వీట్లో అంగీకరించాడు. ఎందుకంటే అతను ఇప్పటికీ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. (చదవండి: అన్నంత పని చేసిన ఎలన్‌మస్క్.. టెస్లాలో షేర్ల విక్రయం.. కారణమేంటి?) బిలియనీర్ల విపరీతమైన సంపదపై పన్ను విధించడం సాండర్ విధుల్లో అతి పెద్ద భాగం. సెనేట్ బడ్జెట్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న సాండర్స్ అమెరికాలోని 0.1 శాతం ఉన్న అత్యంత ధనవంతులు కుటుంబాలపై వార్షిక పన్నును ప్రతిపాదించారు. ఇది రాబోయే దశాబ్దంలో సుమారు 4.35 ట్రిలియన్ డాలర్లను సమీకరించగలదని.. అంతేకాక రానున్న 15 సంవత్సరాలలో బిలియనీర్ల సంపదను సగానికి తగ్గించగలదని సాండర్స్ పేర్కొన్నాడు. అధ్యక్షుడు జో బిడెన్ తీసుకువచ్చిన విస్తృత సామాజిక భద్రతా నికర ప్రణాళికకు నిధులు సమకూర్చడానికి డెమొక్రాట్లు బిలియనీర్లపై పన్ను విధించడానికి ప్రయత్నిస్తున్నారు. చదవండి: పేరు మార్చుకున్న ఎలన్‌మస్క్.. కారణం ఇదేనా? -
అమెరికాలో సోషలిజం! విప్లవం!!
పరస్పర విరుద్ధ భావజాల ప్రతినిధులైన బెర్నీ శాండర్స్, డొనాల్డ్ ట్రంప్‌లు అధ్యక్ష అభ్యర్థుల రేస్‌లో దూసుకు పోతుండటం విశేషం. అయితే ఆ ఇద్దరూ అతి కొద్ది మంది ప్రయోజనాల కోసమే పనిచేస్తున్న ప్రస్తుత వ్యవస్థ మరణాన్నే కోరుతున్నారు. అద్భుతాలు సంభవించడం ఎన్నటికీ ముగిసిపోదని ఒకటికి పదిసార్లు విన్నాం. బహుశా ఇప్పుడు మనం మాటలకందని అద్భుతమైన అద్భుతాన్ని చూస్తున్నాం. అమెరికా అధ్యక్ష పదవిని అందుకునే పరుగులో సోషలిస్టునని చెప్పుకునే బె ర్నీ శాండర్స్ విశ్వసనీయతగల అభ్యర్థిగా ఆవిర్భవించారు. విద్యావంతుని నడవడిక, 1970ల నాటి వామపక్షవాది మాటతీరు, ప్రవర్తనగల తల నెరసిన ఆయన, ఉత్సాహం తో సందడి చేస్తున్న శ్రోతలకు తన అభ్యర్థిత్వమే విప్లవానికి నాంది అని చెపుతున్నారు. సోషలిస్టు, విప్లవం! స్వేచ్ఛా విపణి పెట్టుబడిదారీ గడ్డ మీద, ధైర్యవంతుడైన పౌరుని దేశంలో ఏం జరుగుతోంది? సమాధానం క్లిష్టమైనదేమీ కాదు. యువత మరోసారి వెల్లువై విరుచుకుపడుతోంది. దేశ సంపదను విపరీత స్థాయిలో సొంతం చేసుకుంటున్న ఒక్క శాతం జనాభాకు అతిగా అనుకూలంగా ఉన్న ద్రవ్య వ్యవస్థతో వారు విసిగిపోయారు. ఒక్క దశాబ్దానికి ముందు అమెరికన్ రాజకీయవేత్త ఎవరైనా సోషలిజం అనే భయానక భావజాల వ్యాధి తనకు సోకిందని చేప్పేటంతటి మూర్ఖతాన్నిప్రదర్శిస్తే... రాజకీయ పిచ్చాసుపత్రికి సమానార్థక స్థానంలో ఇరుక్కుపోయేవారు. ప్రపంచంలోని అత్యంత ప్రబలమైన ఆర్థిక అగ్రదేశంలో వామపక్షమన్నది ఎన్నడూ లే దని దీనర్థం కాదు. దురదృష్టకరమైన 1970లు, 1980లలో రాల్ఫ్ నాదిర్ వంటి నేతలుండేవారు. కానీ వారు వినియోగదారుల కార్యకర్తలు, ట్రేడ్ యూనియనిస్టులు. వారిది పరిమిత ఎజెండా. జాతీయ అధ్యక్ష పోటీ స్థాయికి చేరగలిగినా, ఎన్నడూ వారికి రెండు శాతానికి మించి ఓట్లు రాలేదు. అయినా వారు, ఉత్పత్తులలో మెరుగుదలను, ఆచరణాత్మక సంస్కరణలను సాధించగలిగారు. దీంతో వారి ఉద్యమ లక్ష్యాలు పాక్షికంగా నెరవేరాయి. అయితే 20వ శతాబ్దంతో పాటే వారు కూడా తెరమరుగైపోయారు. వారి సాఫల్యమే వారికి కాలదోషం పట్టించేసింది. వాల్‌స్ట్రీట్ బడా బాబులు ఆర్థికారణ్యానికి అధిపతులుగానే మిగిలి.... చాకచక్యంతోనే కోటీశ్వరులు కావచ్చనే కలను మధ్యతరగతికి పంచి పెడుతున్నారు. తమ నాయకత్వానికి ముప్పు కలిగే పొరపాటు చేయకుండా, ప్రశాంతంగా పెట్టుబడిదారీ విధానాన్ని పునర్నిర్వచిస్తున్నారు. వారి మంత్రం పారింది. పెట్టుబడిదారీ విధానం అంటే జాతీయ జెండాకు సమానార్థకమనే ఆ పంథాను ఓటర్లు భారీ ఆధిక్యతతో ఆమోదించారు. ఇక వారు ఎవరిని తప్పు పట్టాలి? ఈ పంథా ఒక రికార్డును స్థాపించింది. అవకాశాలు, ఆదాయాల వృద్ధితో సామాన్యుల జీవితాలు మెరుగుపడటం ఇచ్చిన దన్నుతో ఆ మార్గం అమెరికాను ప్రపంచంలోనే సంపన్న దేశంగా మార్చింది. దీంతో అమెరికన్లు సోషలిజం అన్న మాట వినబడితేనే ముప్పుగా భావించే పరిస్థితి నిజంగానే ఏర్పడింది. రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలపు రెండు తరాలు సోవియట్ యూనియన్ వ్యతిరేక ప్రచ్ఛన్న యుద్ధపు ముప్పును ఎదుర్కొన్నాయి. అది ఆ శతాబ్దపు ద్వితీయార్ధ భాగాన్ని నిర్వచించేది. అస్తిత్వవాద ఆందోళన భయం తప్ప మరేదీ కల్పించలేనంతటి ఉద్విగ్నతతో, ఉద్వేగంతో ఆ సంఘర్షణ సాగింది. అణు యుద్ధంతో మానవాళి అంతమైపోతుందనే భయం వెన్నాడుతుండేది. ప్రచ్ఛన్న యుద్ధంలో అమెరికా విజయం సాధించింది. ఇది పరాజయం పాలైన మార్కెట్ తాత్వికతపై నమ్మకాన్ని తార్కికంగా బలోపేతం చేసింది. ఇక అమెరికన్ మితవాద విజయమే దాని పతనానికి కారణమైంది. ఈ శతాబ్ది మొదటి దశాబ్దంలో ద్రవ్య వ్యవస్థ కుప్పకూలడమే ఆ కీలకమైన మలుపు. రోగ నిర్ధారణ జరిగింది. అది, దురాశ లేదా మరింత కచ్చితంగా చెప్పాలంటే నమ్మశక్యం కానంతటి ధన దుర్దాహం. అదాయ వ్యత్యాసాలు నిరాశాజనకమైన అత్యధిక స్థాయిలకు చేరాయి. గృహ రుణాల మార్కెట్ కుప్పకూలడంతో బాహాటంగానే పట్టుబడ్డా, బ్యాంకర్లు తప్పులకు అతీతులన్నారు. కుప్పకూలిన వ్యవస్థ నిర్మాతలను దానికి బాధ్యత వహించమనడానికి బదులు వాల్‌స్ట్రీట్‌కు ఉద్దీపనలను అందించారు. తక్షణమే దీనికి ప్రతిచర్య కలుగలేదు. కానీ అది రాక తప్పనిదే. మొదట పుస్తకాలు దాన్ని రుజువుచేశాయి, తర్వాత సినిమాలు కళ్లకు కట్టాయి. శతాబ్దం పాటూ హీరోగా చలామణి అయిన వాల్‌స్ట్రీట్ విలన్ అయింది. తాజా హిట్ ‘ద బిగ్ షార్ట్’, తమకు తామే చట్టంగా మారిన బ్యాంకర్ల అజరామర త్వాన్ని దుయ్యబట్టేదే. జనబాహుళ్యపు సంస్కృతిలో స్థిరపడ్డ పదం అర్థాన్ని మార్చడం తేలికేం కాదు. ‘సోషలిజం’ ప్రజా చర్చలో ఎలా ఆమోదాన్ని పొందగలుగుతుంది? ‘సీఎస్ఎస్’ టెలివిజన్ చర్చలో దీనికి సమాధానం దొరికింది. అమెరికన్ వార్తా కార్యక్రమాలు కఠినమైనవి. అదృష్టవశాత్తూ ఎవర్నీ కేకలు వేయనివ్వరు. సిగపట్లన్నిటినీ వీక్షకులకే వదిలేస్తాయి. ఎవరు ఏం మాట్లాడుతున్నారో మీరు నిజంగానే వినగలుగుతారు. ‘సోషలిస్టు’ పదం రాజకీయాల్లో శిఖరాగ్రానికి చేరినందుకు అత్యంత మితవాద రాజకీయ శిఖరమైన ‘ఫాక్స్ న్యూస్’ కు కృతజ్ఞతలు తెలుపుకోవాల్సి ఉన్నదని అత్యంత కుశాగ్రబుద్ధియైన ఒక వ్యాఖ్యాత ఒకరు అన్నారు. దాదాపు తొమ్మిదేళ్లుగా ఫాక్స్ న్యూస్ ఒబామానును తిట్టిపోస్తున్నానని అనుకుంటూ, సోషలిస్టుగా అభివర్ణిస్తోంది. కానీ వీక్షకులు మాత్రం ఒబామా చేస్తున్న పనులను మెచ్చుతున్నారు. ఇదే నిజంగా సోషలిజమైతే, దాంతో తమకే సమస్య లేదని భావిస్తున్నారు. అద్భుతం! ఆశ్చర్యకరంగా శాండర్స్‌తో పాటూ ఆయనకు పచ్చి వ్యతిరేకి డొనాల్డ్ ట్రంప్ సైతం ప్రాబల్యం పెంపొందించుకోవడం అత్యంత అసక్తికరమైన మలుపు. సంప్రదాయక అధికారాలకు, అత్యంత ప్రముఖమైన డబ్బు అధికారానికి అంటిపెట్టుకున్న వ్యవస్థకు వ్యతిరేకంగా వారిద్దరూ మధ్యతరగతిని, పేదలను రెచ్చగొడుతున్నారు. ట్రంప్ గావు కేకలు వేసేవాడు, శాండర్స్ మృదుభాషి,. ట్రంప్ జాత్యహంకారి, శాండర్స్ కలుపుకొనిపోయే బాపతు. అయితే ఒకరు మితవాద పక్ష తిరుగుబాటుకు నేతయితే, మరొకరు వామపక్ష తిరుగుబాటుకు నేతృత్వం వహిస్తున్నారు. అతి కొద్ది మంది ప్రయోజనాల కోసమే పనిచేస్తున్న ప్రస్తుత వ్యవస్థ మరణాన్నే ఇద్దరూ కోరుతున్నారు. పదిహేను రోజుల్లో ఈ పరిస్థితి ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. చివరికి ఏమౌతుందనేది అసలే తెలియదు. కానీ ఒక్కటి మాత్రం ఖాయం. అమెరికన్ మారాడు. రాజకీయాలూ తదనుగుణంగా మారాల్సిందే. - వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు బీజేపీ అధికార ప్రతినిధి ఎం.జె. అక్బర్, సీనియర్ సంపాదకులు