హైదరాబాద్లో అక్రమ పశు వధశాలలు
బీఫ్ మాఫియాలో టీఆర్ఎస్ నేతలు: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అక్రమ పశు వధశాలలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని బీజేఎల్పీ నేత కిషన్రెడ్డి విమర్శించారు. వ్యవసాయానికి ఎంతో అవసరమైన ఎద్దులు, పాడికి పనికొచ్చే ఆవులను అక్రమంగా వధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీఫ్ మాఫియాలో గతంలో టీడీపీ, కాంగ్రెస్ వాళ్లు ఉండేవారని, ఇపుడు టీఆర్ఎస్ నాయకులు ఈ మాఫియాలో చేరారని కిషన్రెడ్డి ఆరోపించారు. బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఏటా 10 శాతం పశువులు తగ్గుతున్నాయని, తెలంగాణలో అల్ కబీర్, అల్లాన, చెంగిచెర్లలో రోజుకు పదివేల పశువులను వధించి మాంసం విక్రయిస్తున్నారని మండిపడ్డారు. ఏడాదికి 50 లక్షల పశువులు వధిస్తుండడంతో పంటల సాగు సంక్షోభంలో పడుతోందని, ఫలితంగా సన్న, చిన్న కారు రైతులు నష్టపోతున్నారని, పాడి పరిశ్రమ కూడా దెబ్బ తింటోందని పేర్కొన్నారు. పశుమాంస ఎగుమతిదారులు మాఫియాలా తయారయ్యారని, ప్రశ్నించిన వారిని చంపడానికి కూడా ఈ మాఫియా వెనుకాడడం లేదని ధ్వజమెత్తారు.