breaking news
Aryabhata satellite
-
50 years of Aryabhata ఆర్యభట్ట స్ఫూర్తితో...
విఖ్యాత భారతీయ శాస్త్రవేత్త సతీష్ ధావన్ నాయకత్వంలో 1975 ఏప్రిల్ 19న రష్యాలో కపుస్టిన్ యార్ కేంద్రం నుండి సోవియట్ కాస్మోస్–3 రాకెట్ ద్వారా ప్రసిద్ధ భారతీయ ఖగోళ – గణిత శాస్త్రవేత్త పేరుతో తయారుచేసిన తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట‘ (aryabhata satellite) ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది మన అంతరిక్ష సంస్థ ఇస్రో. ‘ఇండియా ఎంటర్స్ స్పేస్ ఏజ్’ అంటూ ప్రపంచ మీడియా మన ప్రయత్నాన్ని పెద్ద అక్షరాలతో కీర్తించింది. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అయ్యి 50 వసంతాలైన సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా ఆర్యభట్ట గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఇస్రో, ఇండియా స్పేస్ ల్యాబ్ వంటి కొన్ని సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.360 కిలోగ్రాముల బరువు వుండి సౌర ఫలకాల ఆధారంగా పనిచేసే ఆర్యభట్ట ఉపగ్రహాన్ని 96.46 నిమిషాల ప్రదక్షిణ కాలం పట్టే కక్ష్యలో, 611 కిలోమీటర్ల అపోజీ, 568 కిలోమీటర్ల పెరిజీ ఎత్తులో, 50.6 డిగ్రీల ఏటవాలులో ఉండే కక్ష్యలో ప్రవేశ పెట్టారు. ఎక్స్–రే ఖగోళ శాస్త్రం, వ్యవసాయశాస్త్రం, సోలార్ ఫిజిక్స్‌లో ప్రయో గాలు చేయడానికి, సూర్యుడి నుంచి వచ్చే న్యూట్రాన్లు, గామా కిరణాలను కొలవడానికి, భూమి ఐనోస్పియర్‌లోని పరిస్థితులను అన్వేషించడం తదితర లక్ష్యాలతో ఈ ప్రయోగాన్నిఇస్రో సోవియట్ యూనియన్ సహకారంతో చేపట్టింది. 50 ఏళ్ల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణంలో ఎన్నో సమస్యలను సవాళ్లను అధిగమించాం. కొన్ని ఎగతాళి శబ్దాల మధ్య మౌనంగానే శత కోటి గుండెల సాక్షిగా చంద్రుని దక్షిణ ధ్రువపు ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ సాయంతో గర్వంగా మన జాతీయ జెండాను నిలిపాం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అంగారకుడిపై పరిశోధనల కోసం అన్వేషణ ఆరంభించి నవ చరిత్ర సృష్టించాం. సూర్యుని ఉపరితల వాతావరణాన్ని అధ్యయనం కోసం ఆదిత్య–ఎల్1 మిషన్‌ను ప్రయోగించాం. On this day in 1975, India launched its first satellite, Aryabhata, laying the foundation of India’s satellite programme.Today, India stands among the world’s leading spacefaring nations.#Aryabhata #IndianSpaceProgramme #ISRO@IndiaDST @isro @DrJitendraSingh @AshwiniVaishnaw… pic.twitter.com/YZMRazZfpD— Ministry of Information and Broadcasting (@MIB_India) April 19, 2025 నేడు ఆసియా – పసిఫిక్ప్రాంతంలోనే అతిపెద్ద ఉపగ్రహ సమాచార వ్యవస్థను కలిగి ఉన్నాం. డాకింగ్, అన్‌డాకింగ్ వంటి శాస్త్రీయ సామర్థ్యాలు కలిగిన నాలుగో దేశంగా అద్భుతాలు సాధించాం. గగన్‌యాన్ వంటి మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలతో పాటు 2030 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం. కేవలం ఐదు దశాబ్దాల కాలంలో ఒకే ప్రయోగంలో 100కు పైగా ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టగలిగే స్థాయికి ఎదిగాం. ముందు ముందు మరిన్ని అద్భుత విజయాలు మన పరం అవుతాయనడంలో సందేహం లేదు.– పి. అరుణ్ కుమార్, ఫిజిక్స్ రీసెర్చ్ స్కాలర్, పాలమూరు యూనివర్సిటీ(నేడు ఆర్యభట్ట ఉపగ్రహానికి గోల్డెన్ జూబ్లీ వేడుకలు) -
అంతరిక్ష పథికుడి కన్నుమూత
అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన యూఆర్ రావు ► దేశ తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ సూత్రధారి ► ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞాన రూపకల్పనలో విశేష కృషి ► చంద్రయాన్, మంగళ్యాన్ తదితర ఇస్రో ప్రాజెక్టుల్లో కీలకపాత్ర సాక్షి, బెంగళూరు: దేశ అంతరిక్ష చరిత్రలో ఒక అద్భుత శకం ముగిసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మాజీ చైర్మన్, దేశ తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ సూత్రధారి యూఆర్ రావు సోమవారమిక్కడ వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో కన్నుమూశారు. వేకువజామున 3 గంటల ప్రాంతంలో ఆయన నిద్రలోనే మరణించారని ఇస్రో పౌర సంబంధాల డైరెక్టర్ దేవీప్రసాద్ కర్ణిక్ తెలిపారు. 85 ఏళ్ల రావుకు భార్య యశోద, ఒక కుమారుడు మదన్‌రావు, కుమార్తె మాలా ఉన్నారు. రావు మృతి వార్త తెలిసిన వెంటనే శాస్త్రవేత్తలు, కర్ణాటక గవర్నర్ వీ.ఆర్.వాలా, సీఎం సిద్ధరామయ్య, మాజీ ప్రధాని దేవెగౌడ తదితర ప్రముఖులు ఆయన స్వగృహానికి చేరుకుని నివాళి అర్పించారు. అంత్యక్రియలను సాయంత్రం నిర్వహించారు. రావు మృతిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ‘దేశ అంతరిక్ష కార్యక్రమాలకు ఆయన అందించిన సేవలు ఎన్నటికీ మరపురానివి’ అని మోదీ ట్వీట్ చేశారు. 1975లో ప్రయోగించిన ‘ఆర్యభట్ట’ మొదలుకుని ఇటీవల చంద్రుడిపైకి పంపిన చంద్రయాన్–1, అంగరకుడిపైకి పంపిన మంగళ్యాన్, ప్రతిపాదిత ఆదిత్య సోలార్ మిషన్ వంటి దాదాపు అన్ని ఇస్రో ప్రాజెక్టుల్లో రావు వివిధ హోదాల్లో కీలక పాత్ర పోషించా రు. వాతావరణం, కమ్యూనికేషన్లకు సంబంధించిన భాస్కర, రోహిణి, ఇన్శాట్–1, ఇన్శాట్–2, ఐఆర్ఎస్–1ఏ, 1బీ, 1సీ, 1డీ ఉపగ్రహాల ప్రయోగానికి దోహదపడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని చేకూర్చుకోవడంలో ఆయన ముఖ్య భూమిక పోషించారు. చివరిదశ వరకు అంతరిక్ష రంగంతోనే తన జీవితాన్ని పెనవేసుకున్నారు. అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ పాలకమండలి చైర్మన్, తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాన్స్‌లర్ పదవుల్లో కొనసాగుతూనే తుదిశ్వాస విడిచారు. రెండు తరాల శాస్త్రవేత్తల మధ్య వారధిలా పనిచేసిన ఆయనకు దేశంలోని ఎన్నో శాస్త్ర, సాంకేతిక సంస్థలతో సన్నిహిత అనుబంధం ఉంది. శ్రీహరికోటతో అనుబంధం శ్రీహరికోట (సూళ్లూరుపేట): రావుకు శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగ కేంద్రం(షార్)తో విడదీయరాని అనుబంధం ఉంది. దివంగత ప్రధానులు పీవీ నరసింహారావు, రాజీవ్ గాంధీలతో సన్నిహిత సంబంధాలు నెరిపిన రావు.. వారు షార్ సందర్శనకు వచ్చినప్పుడు ఇస్రో కార్యక్రమాలను క్షుణ్ణంగా వివరించేవారు. ఇస్రో చైర్మన్‌గా రిటైరైన తర్వాత కూడా ఆయన షార్‌లో జరిగిన అన్ని ప్రయోగాలకు హాజరై సలహాలు, సూచనలు ఇచ్చారు. సాంకేతిక రథసారథి అంతరిక్ష రంగంలో దేశాన్ని పరుగులు పెట్టించిన ఉడిపి రామచంద్ర రావు 1932 మార్చి 10న కర్ణాటక ఉడిపి జిల్లాలోని కుగ్రామం అడమూరులో పేద రైతు కుటుంబంలో జన్మించారు. పాఠశాల విద్యను ఉడిపిలో, జూనియర్ కాలేజీ విద్యను బళ్లారిలో, బీఎస్సీని అనంతపురంలోని ప్రభుత్వ కాలేజీలో, ఎమ్మెస్సీని బెనారస్ హిందూ యూనివర్సిటీలో పూర్తి చేశారు. తర్వాత అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీలో భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ మార్గదర్శకత్వంలో పీహెచ్డీ చేశారు. కాస్మిక్ రే (విశ్వ కిరణ) శాస్త్రవేత్తగా కెరీర్‌ను ప్రారంభించిన రావు కొన్నాళ్లు అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, టెక్సాస్ వర్సిటీల్లో అధ్యాపకుడిగా చేశారు. ఆ సమయంలో ఉపగ్రహాలు, సౌరశక్తి వినియోగంపై ఎన్నో పరిశోధనలు నిర్వహించారు. 1966లో సారాభాయ్తోపాటు భారత్‌కు తిరిగివచ్చి ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీలో ప్రొఫెసర్‌గా చేరారు. 1972లో ఇండియన్ సైంటిఫిక్ శాటిలైట్ ప్రాజెక్టులో డైరెక్టర్‌గా చేరి.. దేశానికి ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకునే గురుతర బాధ్యత తీసుకున్నారు. 1984లో భారత అంతరిక్ష కమిషన్ చైర్మన్‌గా, అంతరిక్ష విభాగ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి రాకెట్ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిని వేగవంతం చేశారు. జీఎస్ఎల్వీ రాకెట్, క్రయోజనిక్ టెక్నాలజీ అభివృద్ధికీ శ్రీకారం చుట్టారు. ఫలితంగా 2 టన్నుల బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లగల పీఎస్ఎల్వీతోపాటు ఇతర శక్తిమంతమైన రాకెట్లు భారత్ సొంతమయ్యాయి. రావు ఇస్రో అధిపతిగా ఉన్న సమయంలో ప్రయోగించిన ఇన్శాట్ రాకెట్లతో దేశ కమ్యూనికేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. కాస్మిక్ రేస్, ఖగోళ భౌతికశాస్త్రం, ఉపగ్రహాలు తదితర అంశాలపై ఆయన 350 పరిశోధన పత్రాలతోపాటు పలు పుస్తకాలు రాశారు. 25 వర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. ప్రభుత్వం ఆయనను 1976లో పద్మభూషణ్, ఈ ఏడాదిలో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. వాషింగ్టన్‌లోని ప్రఖ్యాత ‘శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్’ తోపాటు మెక్సికోలోని ఐఏఎఫ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సభ్యత్వం పొందిన తొలి భారత అంతరిక్ష శాస్త్రవేత్తగా రికార్డు సృష్టించారు.