breaking news
Architect students
-
కరిగినా కాపాడేస్తాం!
అడవులు అంతరిస్తూంటే... కోట్లకు కోట్ల మొక్కలు నాటాలి. భూగర్భ జల వనరులు ఇంకిపోతూంటే.. ఇంకుడు గుంతలతో పునరుద్ధరించుకోవాలి. మరి.. ధ్రువాల్లో మంచు కరుగుతూంటే...? ఏం చేయాలో తెలియడం లేదు కదూ... దీనికీ ఓ ఐడియా ఉందంటున్నారు ఇండోనేసియా ఆర్కిటెక్ట్‌లు. అదేంటో చూసేయండి మరి! సముద్రపు అడుగుభాగంలోని నీటి ఉష్ణోగ్రత ఎంతో మీకు తెలుసా? ధ్రువ ప్రాంతాల్లోనైతే –2 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉంటుంది. ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువగా ఉన్నా.. అం దులోని లవణాల కారణంగా సముద్రపునీరు గడ్డకట్టదు. ఇండోనేసియా ఆర్కిటెక్ట్‌లు ప్రతిపాదిస్తున్న పథకం ప్రకారం.. మినీ మంచుముద్దల తయారీకి జలాంతర్గాములను వాడతారు. సముద్రపు అడుగు భాగంలో ఉన్న నీటిని నింపుకునే ఈ జలాంతర్గాములు ఉపరితలంపైకి వచ్చి... షట్భుజి ఆకారంలో ఉన్న నిర్మాణంలోకి వదులుతాయి. అదే సమయంలో ఆ నీటిలోని లవణాలను కూడా తొలగిస్తారు. చుట్టూ ఉన్న చల్లటి ఉష్ణోగ్రతలు, సబ్‌మెరైన్ టర్బయిన్ ఫ్యాన్ల గాలి కారణంగా నీరు గడ్డకడుతుంది. ఇందుకు సౌరశక్తి సాయమూ తీసుకుంటారు. ఒక్కోనిర్మాణం దాదాపు 82 అడుగుల వెడ ల్పు, 16 అడుగుల మందం ఉంటుందని, ఒకదాని నిర్మాణం పూర్తయిన తరువాత జలాంతర్గామి మళ్లీ సముద్రపు అడుగుభాగం నుంచి నీరు సేకరించి మరో మంచుముద్ద తయారీని ప్రారంభిస్తుందని వారు వివరిస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ మంచుముద్దలను తయారు చేస్తే.. తెల్లటి ఉపరితలం కారణంగా సూర్యుడి నుంచి వచ్చే రేడియోథార్మికత మళ్లీ అంతరిక్షంవైపు వెళ్లిపోతుందని, తద్వారా భూతాపాన్ని నివారించవచ్చని ప్రాజెక్టు లీడర్ ఆర్కిటెక్ట్ ఫారిస్ రజాక్ తెలిపారు. షట్భుజి ఆకారంలో... పెట్రోలు, డీజిల్ విచ్చలవిడి వాడకం, అడవుల నరికివేత వంటి అనేక కారణాలతో భూమి క్రమేపీ వేడెక్కుతోందని మనకు తెలుసు. ఈ భూతాపం కారణంగా ధ్రువప్రాంతాల్లో యుగాలనాటి మంచు కొండలు కూడా ముక్కలైపోతున్నాయి. ఈ విషయం గురించి కూడా మనం చాలాసార్లు వినే ఉంటాం. భవిష్యత్‌లో సముద్రమట్టాలు పెరిగిపోకుండా... భూతాపాన్ని మన జీవితాలను ఎక్కువ నష్టపరచకుండా ఎన్నోచర్యలు చేపడుతున్నాం కూడా. అయితే, వినూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చారు ఇండొనేసియా ఆర్కిటెక్ట్‌లు. జలాంతర్గాముల సాయంతో సముద్రపునీటిని మినీ మంచుఖండాలుగా మలచవచ్చని, తద్వారా ధ్రువ ప్రాంతాల్లో నష్టాన్ని కొంతమేర నివా రించవచ్చని వీరు ఇటీవలే ముగిసిన అసోసియేషన్ ఆఫ్ సియామీస్ ఆర్కిటెక్ట్స్ వార్షిక పోటీల్లో ప్రకటించారు. సాధ్యమేనా? ఇదంతా కాగితాలపై అద్భుతంగా అనిపిస్తున్నా ఆచరణకు వచ్చే సరికి అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది. చాలామంది శాస్త్రవేత్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంచు ముద్దల తయారీకి వాడే జలాంతర్గాములన్నీ ఏదో ఒక ఇంధనంతో నడవాలి కాబట్టి.. దాని ప్రభావం భూతాపోన్నతిపై ఉంటుందని వీరు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా.. ఏకకాలంలో భారీ సంఖ్యలో జలాంతర్గాములను తయారు చేసుకుని వాడటం కూడా అంత సులువైన పని కాదని చెబుతున్నారు. ఏదేమైనా రాగల ప్రమాదం నుంచి తమని తాము రక్షించుకునేందుకు ఈ ఆర్కిటెక్ట్‌లు తీసుకుంటున్న చొరవ మాత్రం స్ఫూర్తిదాయకమైనవని పలువురు శాస్త్రవేత్తలు కొనియాడారు. -
డ్రోన్లే డెలివరీ బాయ్స్..
న్యూయార్క్: తేనెపట్టులాంటి భవనం.. తేనెటీగలను తలపించే డ్రోన్లు.. సైన్స్ ఫిక్షన్ మూవీని తలపించే ఆకాశహర్మ్యం.. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఉండే బిల్డింగ్ మాదిరిగా కనిపిస్తున్న ఈ ఆకాశహర్మ్యం ఎత్తు 1,400 అడుగులు(423 మీటర్లు). ఇంతకీ ఈ బిల్డింగ్ ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసా.. వస్తువుల డెలివరీకి.. అలాగే డ్రోన్ల డిపోగానూ పనికొస్తుంది. ఈ టవర్ పేరు ‘ద హైవ్’. ప్రస్తుతానికి ఇది ఓ కాన్సెప్ట్ డిజైన్ మాత్రమే. కానీ ఏదో ఒక రోజు వాస్తవ రూపం దాలుస్తుందని దీని రూపకర్తలు చెపుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సుల్వానియాలో చదువుతున్న హదీల్ అయేద్ మహమ్మద్(25), యిఫెంగ్ జావో(24), ఛెంగ్డా జూ(24) అనే ఆర్కిటెక్ట్ విద్యార్థులు తమ యూనివర్సిటీ కోర్సులో భాగం గా ఈ హైవ్ డిజైన్‌ను రూపొందించారు. న్యూయార్క్ నగరంలోని మన్‌హట్టన్ నడిబొడ్డున ఈ టవర్‌ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. అక్కడ ఉన్న ఒక రెసిడెన్షియల్ టవర్‌ను కాస్తా.. సిటీకి సంబంధించి డ్రోన్ డిపోగా మార్చి నగరానికి మణిహారంగా మార్చాలనేది వీరి ప్రధాన ఉద్దేశం. సమీప భవిష్యత్తులో హైస్పీడ్ డెలీవరీలను చేసేందుకు వీలుగా దీనికి రూపకల్పన చేశారు. అమెజాన్, గూగుల్ ప్రస్తుతం డ్రోన్ డెలివరీ సర్వీసుల కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. అమెజాన్ తమ ఉత్పత్తులను 30 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలోనే డెలీవరీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని, ఇది ఒక ఏడాదిలోగా అందుబాటులోకి వస్తుందని గత వేసవిలో కాంగ్రెస్‌కు తెలిపింది. మరోవైపు డ్రోన్ డెలీవరీ సర్వీసులపై ఉన్న నియంత్రణలను త్వరలోనే ఎత్తేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ అవసరాలు.. సమీప భవిష్యత్‌లో అవసరాలు పరిగణనలోకి తీసుకుని ఈ కాన్సెప్ట్ రూపొం దించామని మహమ్మద్ చెప్పారు. వెర్టికల్ హైవే మోడల్లో ఈ టవర్‌ను రూపొందిం చామన్నారు. ఈ ప్లాన్‌లో నో ఫ్లై జోన్స్, హైస్పీడ్ ట్రాన్సిట్ ఏరియాలు, లో స్పీడ్ లోకలైజ్డ్ ట్రాఫిక్ మొదలైన ప్లాన్లను కూడా పొందుపరిచారు. షేప్, సైజ్ ఆధారంగా తొమ్మిది భిన్నమైన డ్రోన్లు ఈ బిల్డింగ్‌పై నిలిపేలా ఈ కాన్సెప్ట్ రూపొందించారు. ఆర్కిటెక్చర్ మ్యాగజీన్ ఈవోలో నిర్వహించిన వార్షిక ఆకాశహర్మ్యాల కాంపిటీషన్లో 489 ఎంట్రీలు పోటీపడగా.. ఈ విద్యార్థులు రూపొందించిన ద హైవ్ కాన్సెప్ట్‌కు సెకండ్ ప్లేస్ దక్కడం విశేషం.