breaking news
The Archaeological Department
-
మమ్మీకి మళ్లీ ప్రాణం!
శిథిలావస్థకు చేరడంతో పరిరక్షణకు పురావస్తు శాఖ ఏర్పాట్లు.. జర్మనీ నుంచి ఆక్సిజన్ ఫ్రీ నైట్రోజన్ షోకేసు తెప్పించి అమరిక - హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో ఉన్న 2 వేల ఏళ్ల నాటి మమ్మీ - ఆక్సిజన్ కారణంగా కొన్నేళ్లుగా దెబ్బతింటున్న వైనం - మరో 500 ఏళ్లు సంరక్షించేలా ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక ఈజిప్టు మమ్మీని సంరక్షించేందుకు పురావస్తు శాఖ అత్యాధునిక ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో ఉన్న ఈ రెండు వేల ఏళ్లనాటి మమ్మీ.. కొంతకాలంగా శిథిలమవుతూ వస్తోం ది. గాలిలోని ఆక్సిజన్ వాయువు మమ్మీకి తగలడం, తద్వారా క్రిమికీటకాలు వృద్ధి చెందడమే కారణం. దీనిని గుర్తించిన పురావస్తు శాఖ జర్మనీ నుంచి ప్రత్యేక ఆక్సిజన్ ఫ్రీ ఎయిర్‌టైట్ షోకేసు తెప్పించి.. మమ్మీని అందులో భద్రపరిచింది. సమస్య ఏంటి? మనిషి చనిపోయిన తర్వాత భౌతికకాయాన్ని వందల ఏళ్లపాటు భద్రపర్చడానికి మమ్మీగా మారుస్తారు. శరీరంలో వెంటనే పాడయ్యే కొన్ని భాగాలను తొలగించి.. ప్రత్యేక రసాయనాలను పూసి, ప్రత్యేక తరహా వస్త్రాన్ని గట్టిగా చుడతారు. ఇది ఈజిప్టులో ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి మమ్మీ హైదరాబాద్‌లోని స్టేట్ మ్యూజియంలో ఉంది. దానికి నేరుగా ఆక్సిజన్ తగిలితే.. క్రిమికీటకాలు వృద్ధి చెంది శిథిలం చేస్తాయి. ఇన్నాళ్లూ ఈ అంశంపై అవగాహన లేక మమ్మీని సాధారణ గాజు పెట్టెలో ఉంచారు. దీంతో ఆక్సిజన్ తగలడం, నేరుగా లైట్ల కాంతి ప్రసరించటం, కాలుష్యంతో క్రమంగా శిథిలమవుతూ వచ్చింది. దాదాపు పదేళ్ల కింద మమ్మీ నుంచి చిన్నచిన్న ముక్కలు ఊడిపోతుండడాన్ని పురావస్తుశాఖ గుర్తించింది. ఈజిప్టు నుంచి నిపుణులను పిలిపించి చూపించగా.. సంరక్షణ చర్యలు తీసుకోకుంటే కొన్నేళ్లలో మమ్మీ పూర్తిగా పాడవుతుందని వారు స్పష్టం చేశారు. ఆక్సిజన్ చొరబడని ప్రత్యేక షోకేసు ఏర్పాటు చేయాలని సూచించారు. తర్వాత ఆ విషయం పెండింగ్‌లో పడిపోయింది. రూ.58 లక్షలు వెచ్చించి.. ఇటీవల పురావస్తు శాఖ డైరెక్టర్‌గా వచ్చి విశాలాచ్చి.. మమ్మీ సంరక్షణపై దృష్టి పెట్టారు. ఢిల్లీలో రాజీవ్‌గాంధీ హత్యకు ముందు చివరిసారిగా ధరించిన వస్త్రాలు, ఇందిర హత్య సమయంలో నేలపై చిమ్మిన రక్తం మరకలను పరిరక్షించేందుకు అనుసరించిన పద్ధతులను తెలుసుకున్నారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో ఉన్న మమ్మీ పరిరక్షణ చర్యలను పరిశీలించారు. విదేశీ నిపుణులతో చర్చించి.. మమ్మీ సంరక్షణ కోసం జర్మనీలోని గ్లాస్ హార్న్బాష్ కంపెనీ నుంచి ఆక్సిజన్ ఫ్రీ షోకేసును కొనుగోలు చేశారు. రూ.58 లక్షల విలువైన ఈ పరికరంలో ఇటీవలే మమ్మీని ఉంచారు. ఈ పరికరం ఆక్సిజన్ చొరబడటాన్ని నియంత్రించడంతోపాటు నైట్రోజన్‌ను పంప్ చేస్తుంది. విద్యుత్ సరఫరా ఆగిపోతే నైట్రోజన్ పంపింగ్ నిలిచిపోకుండా ప్రత్యేక జనరేటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఐదు వందల ఏళ్ల వరకు ఢోకా ఉండదు దేశంలో ప్రస్తుతం ఆరు మమ్మీలు ఉన్నాయి. అందులో స్టేట్ మ్యూజియంలో ఉన్న మమ్మీ ఒకటి. ఆరో నిజాం మీర్ మహమూద్ అలీఖాన్ 1920లో దీనిని ఈజిప్టు నుంచి సేకరించారు. ఈ మమ్మీ క్రీస్తుపూర్వం 100– 300 సంవత్సరాల మధ్య జీవించిన 25 ఏళ్ల యువతిది. ఆమెను ఈజిప్టు చక్రవర్తి కూతురు నౌషుషుగా చెబుతారు. మమ్మీ వస్త్రంపై ఆ వివరాలు పొందుపరిచి ఉన్నాయి. సాధారణంగా మమ్మీగా మార్చే సమయంలో శరీరం నుంచి ఇతర కొన్ని భాగాలతోపాటు మెదడును కూడా పూర్తిగా తొలగిస్తారు. కానీ ఈ మమ్మీ తలలో మూడో వంతు మెదడు భాగం అలాగే ఉంది. దానిపై పరిశోధన చేయగలిగే మంచి స్థితిలో ఉందని తేలింది. మమ్మీని పరిరక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. దీనివల్ల మరో 500 ఏళ్ల వరకు దెబ్బతినకుండా ఉంటుంది.. – విశాలాచ్చి, పురావస్తు శాఖ డైరెక్టర్ -
శకటాలొద్దు.. నిర్మాణాలు చేపట్టొద్దు
నేలపై గోతులూ తవ్వద్దు గోల్కొండ కట్టడానికి నష్టం జరిగే పనులు లేకుండా చూడండి రాష్ట్రప్రభుత్వానికి కేంద్రపురావస్తు శాఖ సూచనలు ఢిల్లీ నుంచి అధికారికంగా రావాల్సిన అనుమతి హైదరాబాద్: చారిత్రక గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర పురావస్తు శాఖ ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చేందుకు సిద్ధమైంది. కోట ప్రాంగణంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, భారీ గుంతలు తవ్వొద్దని, అక్కడి కట్టడాలకు ఇబ్బంది కలిగించేలా మార్పులు చేర్పులు చేయొద్దని సూచించింది. సాధారణంగా ఆగస్టు 15న వివిధ రూపాల్లో అలంకరించిన శకటాలను ప్రదర్శిస్తుంటారు. కోట ప్రాంగణంలోకి వాటిని తీసుకురావద్దని సూచించింది. దీనికి రాష్ట్రప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. కేంద్రపురావస్తు శాఖ నుంచి అధికారికంగా అనుమతి మాత్రం రావాల్సి ఉంది. దీనికోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసింది. దీన్ని పరిశీలిస్తున్న పురావస్తు శాఖ తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉంది.కోట వద్ద ఉత్సవాలను నిర్వహించే ప్రాంతాలను ఎంపిక చేయటానికి ఇటీవల ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అక్కడ పర్యటించడంతో... హైదరాబాద్‌లో ఉన్న కేంద్రపురావస్తు శాఖ అధికారులు కూడా వెళ్లారు. ఈ విషయాన్ని వారు ఢిల్లీలోని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో అక్కడి నుంచి ప్రాథమికంగా కొన్ని సూచనలు అందాయి. వాటిని సీఎం కేసీఆర్ కూడా అంగీకరించారు. చారిత్రక వారసత్వ సంపద జాబితాలో ఉన్న గోల్కొండలోకి సాధారణ పర్యాటకులను మాత్రమే అనుమతిస్తారు. ఆ ప్రాంగణంలో ఎలాంటి ఉత్సవాలకు అనుమతించరు. ప్రభుత్వపరంగా జరిగే కార్యక్రమాలైతే దాని ఉద్దేశం, వివరాలను ముందస్తుగా పరిశీలించి పురావస్తు శాఖ షరతులతో కూడిన అనుమతినిస్తుంది. పంద్రాగస్టు నేపథ్యంలో జాతీయ పతాకాన్ని ఎగుర వేయటం, పోలీసు వందన స్వీకారం, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడంతో అనుమతికి అడ్డంకులు ఉండక పోవచ్చు. గతానుభవాల నేపథ్యంలో... గత ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నగరంలో జరిగిన యునెటైడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్‌డబ్ల్యూటీఓ) సదస్సుల సందర్భంగా కేంద్రపురావస్తు శాఖ అనుమతితో సంబంధం లేకుండా గోల్కొండ కోటలో విదేశీ అతిథులకు రాత్రి విందు ఏర్పాటు చేశారు. నాటి కేంద్రమంత్రి చిరంజీవి ఆధ్వర్యంలో ఇది జరిగింది. ఆ విందులో మద్యం సరఫరా కూడా ఉండనుందన్న సమాచారంతో కేంద్రపురావస్తు శాఖ తీవ్రంగా స్పందించి కార్యక్రమానికి అనుమతి నిరాకరించింది. ఇది అప్పట్లో వివాదాస్పదమైంది. చివరకు మద్యం సరఫరా ఉండదని, కోటలో నిర్మాణాలకు ఇబ్బంది కలగకుండా చూస్తామని కేంద్ర పర్యాటక శాఖ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వటంతో షరతులతో అనుమతి లభించింది. ఆ కార్యక్రమాన్ని వెలుపల ఉన్న లాన్కే పరిమితం చేశారు. ఈ ఉదంతం నేపథ్యంలోనే పురావస్తు శాఖ కచ్చితంగా వ్యవహరిస్తోంది. రాణిమహల్ వద్ద వేడుకలు స్వాతంత్య్ర దినోత్సవాల నిర్వహణకు గోల్కొండ కోటలోని రాణిమహల్ ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎంపిక చేశారు. కోటలోనికి ప్రవేశించాక సౌండ్ అండ్ లైట్ షో నిర్వహించే చోట, సమీపంలోని మసీదు వద్ద లాన్లు ఉండటంతో విశాలంగా ఉన్న ఆ ప్రాంతాన్ని ఆయన ఎంపిక చేశారు. ఉత్సవాల నిర్వహణపై అధికారులతో బుధవారం సాయంత్రం నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. దీంతో అక్కడ అవసరమైన ఏర్పాట్లు మొదలయ్యాయి. ఎంపిక చేసిన కళాకారులతో జెండా వందనానికి రెండు గంటల ముందు నుంచి సాంస్కృతిక కార్యక్రమాలుంటాయని అధికారులు తెలిపారు. డిఫెన్స్ కొర్రీతో..సీఎం వద్దకు పంచాయితీ తాజాగా పతాకావిష్కరణకు ఎటువంటి ఇబ్బందులు లేనప్పటికీ, వేడుకల్లో భాగంగా నిర్వహించే పోలీస్ పరేడ్పైనే ఉత్కంఠ నెలకొంది. కోట వెనుక భాగాన ఉన్న ఖాళీ ప్రదేశంలో పరేడ్ నిర్వహణకు అధికారులు సన్నాహాలు చేస్తుండగా, మంగళవారం ఢిఫెన్స్ అధికారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. పరేడ్ నిర్వహించాలనుకుంటున్న 51ఎకరాల భూమి తమదేనని డిఫెన్స్ వారు చెబుతుండగా, ఆ స్థలం సర్కారుదేనని రెవెన్యూ యంత్రాంగం వాదిస్తోంది. అందుకు సంబంధించి డిఫెన్స్ అధికారులు బుధవారం అందజేసిన ధ్రువీకరణపత్రాలను స్థానిక రెవెన్యూ సిబ్బంది జిల్లా కలెక్టర్ ముఖేష్‌కు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థలాన్ని 1990కి ముందే తమకు కేటాయించినట్లు డిఫెన్స్ అధికారులు ఆధారాలు చూపుతుండడంతో.. హైదరాబాద్ జిల్లా యంత్రాంగం సంశయంలో పడింది. కలెక్టర్ వద్ద పంచాయితీ తేలకపోవడంతో అది కాస్తా సీఎం వద్దకు చేరింది. జిల్లా కలెక్టర్‌తో చర్చించిన సీఎం కేసీఆర్.. గురువారం డిఫెన్స్వారితో కూడా చర్చలు జరపాలనుకుంటున్నట్లు తెలిసింది. పరేడ్ నిర్వహణకు సంబంధించి గురువారం మధ్యాహ్నానికి స్పష్టత రావచ్చని రెవెన్యూ వర్గాలంటున్నాయి.