breaking news
Anthony Amalraj
-
భారత్ ‘డబుల్’ ధమాక
ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్ రెండో డివిజన్ టైటిల్స్ సొంతం కౌలాలంపూర్: భారత పురుషుల, మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లు కొత్త చరిత్ర సృష్టించాయి. ప్రపంచ టీటీ టీమ్ చాంపియన్‌షిప్‌లో రెండో డివిజన్లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాలు సాధించాయి. శనివారం జరిగిన రెండో డివిజన్ ఫైనల్స్‌లో భారత పురుషుల జట్టు 3-2తో బ్రెజిల్‌ను ఓడించగా... భారత మహిళల జట్టు 3-1తో లక్సెంబర్గ్‌పై విజయం సాధించింది. ఫైనల్స్‌కు చేరుకున్న భారత పురుషుల, మహిళల జట్లతోపాటు బ్రెజిల్, లక్సెంబర్గ్ కూడా 2018 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టాప్-24 జట్లు పాల్గొనే ‘చాంపియన్‌షిప్’ డివిజన్‌కు అర్హత సాధించాయి. చాంపియన్‌షిప్ డివిజన్‌కు అర్హత పొందడం భారత టీటీ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. బ్రెజిల్‌తో జరిగిన ఫైనల్లో భారత్ తరఫున హర్మీత్ దేశాయ్ రెండు మ్యాచ్‌ల్లో గెలువగా... సౌమ్యజిత్ ఘోష్ మరో మ్యాచ్‌లో నెగ్గాడు. తొలి మ్యాచ్‌లో సౌమ్యజిత్ 13-15, 4-11, 7-11తో హుగో కాల్డెరానో చేతిలో ఓడిపోగా... రెండో మ్యాచ్‌లో హర్మీత్ 11-3, 8-11, 8-11, 11-8, 11-9తో కజువో మత్సుమోటోపై నెగ్గాడు. మూడో మ్యాచ్‌లో ఆంథోనీ అమల్‌రాజ్ 11-8, 7-11, 11-5, 9-11, 9-11తో థియాగో మోంటీరో చేతిలో పరాజయం పాలయ్యాడు. నాలుగో మ్యాచ్‌లో సౌమ్యజిత్ 11-6, 14-12, 11-9తో కజువో మత్సుమోటోపై గెలవడంతో స్కోరు 2-2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ 4-11, 11-5, 15-13, 11-6తో హుగో కాల్డెరానోపై నెగ్గడంతో భారత విజయం ఖాయమైంది. లక్సెంబర్గ్‌తో జరిగిన మహిళల విభాగం ఫైనల్లో తొలి మ్యాచ్‌లో మౌమా దాస్ 11-1, 11-4, 13-11తో డానియెలాపై, రెండో మ్యాచ్‌లో మనిక బాత్రా 11-6, 11-2, 9-11, 13-11తో టెస్సీ గొండెరింగర్పై గెలిచారు. మూడో మ్యాచ్‌లో షామిని 4-11, 9-11, 9-11తో సారా డు నెట్ చేతిలో ఓడిపోయింది. అయితే నాలుగో మ్యాచ్‌లో మనిక బాత్రా 11-5, 11-4, 11-8తో డానియెలాపై నెగ్గడంతో భారత్‌కు 3-1తో విజయం దక్కింది. ఈ పోటీల్లో భారత మహిళల జట్టు అజేయంగా నిలువడం విశేషం. -
భారత జట్ల శుభారంభం
టీటీ ప్రపంచ చాంపియన్‌షిప్ కౌలాలంపూర్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. గ్రూప్-ఎఫ్ రెండో డివిజన్ తొలి రౌండ్లో భారత పురుషుల జట్టు 3-0తో వియత్నాంపై విజయం సాధించింది. తొలి సింగిల్స్‌లో ఆడిన ఆచంట శరత్ కమల్ 11-8, 11-6, 5-11, 11-6తో టు నగుయెన్‌పై నెగ్గాడు. రెండో సింగిల్స్‌లో ఆంథోని అమల్‌రాజ్ 12-10, 11-5, 11-6తో టియాన్ డాట్ లీని ఓడించడంతో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. మూడో సింగిల్స్‌లో హర్మిత్ దేశాయ్ 11-5, 13-11, 12-10తో బా యువాన్ అన్ డొయాన్‌పై గెలవడంతో భారత్ 3-0తో నెగ్గింది. సోమవారం జరిగే మ్యాచ్‌ల్లో తొలుత టర్కీతో, అనంతరం నైజీరియాతో భారత్ ఆడుతుంది. రెండో డివిజన్లో మొత్తం 24 జట్లు నాలుగు గ్రూప్‌లుగా బరిలోకి దిగుతున్నాయి. ప్రతి గ్రూప్‌లో జట్టు.. మిగతా టీమ్‌లతో రౌండ్ రాబిన్ పద్ధతిలో మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్ టాపర్లు రెండో దశకు అర్హత సాధిస్తారు. గ్రూప్ ‘జి’లో భారత మహిళల జట్టు తొలి రౌండ్లో 3-0తో కొలంబియాను ఓడించింది. తొలి సింగిల్స్‌లో మౌమా దాస్ 11-2, 12-10, 11-2తో పౌలా మెదీనాపై, రెండో సింగిల్స్‌లో మణికా బాత్రా 11-5, 11-5, 11-4తో లేడీ రువానోపై, మూడో సింగిల్స్‌లో 11-4, 11-8, 11-3తో లుసా జులుఆగాపై గెలిచారు. ఫలితం తేలిపోవడంతో మిగతా రెండు మ్యాచ్‌లను నిర్వహించలేదు. సోమవారం జరిగే మ్యాచ్‌ల్లో తొలుత ప్యుర్టోరికో, ఆ తర్వాత పోర్చుగల్‌తో భారత్ ఆడుతుంది.