breaking news
Air Chief
-
చైనా-పాక్ ఐదో తరం యుద్ధవిమానాలు.. భారత వైమానిక దళాధిపతి కీలక వ్యాఖ్యలు
చైనా సహకారంతో పాకిస్థాన్ ఐదో తరం యుద్ధవిమానాలను సమకూర్చుకునే అవకాశం ఆందోళన కలిగించే అంశమేనని భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తెలిపారు. అయితే దీనివల్ల భారత వైమానిక దళం దీటుగా స్పందించలేని పరిస్థితి ఏర్పడదని స్పష్టం చేశారు. అత్యాధునిక యుద్ధవిమానం ఉండటం ఒక్కటే యుద్ధ ఫలితాన్ని నిర్ణయించదని, దాన్ని మొత్తం సైనిక వ్యవస్థతో ఎంత సమర్థంగా అనుసంధానిస్తారనేదే కీలకమని చెప్పారు. “పాకిస్థాన్ ఐదో తరం యుద్ధవిమానాన్ని కొనుగోలు చేయబోతోందని, ఆ దేశ పైలట్లు ఇప్పటికే చైనాలో శిక్షణ పొందుతున్నారని మాకు సమాచారం అందుతోంది. కాబట్టి ఇది కచ్చితంగా ఆందోళన కలిగించే అంశమే. అయితే దీనివల్ల మనకు పూర్తిగా అవకాశం లేని పరిస్థితి ఏర్పడిందా అంటే నేను అంగీకరించను. మన దగ్గర కూడా సామర్థ్యాలు ఉన్నాయి” అని ఏపీ సింగ్ వార్షిక విలేకరుల సమావేశంలో అన్నారు.అత్యాధునిక విమానం ఒక్కటే వైమానిక పోరాట ఫలితాన్ని నిర్ణయించదని ఆయన పేర్కొన్నారు. ఆయుధాలు, విమానాలు సహా అందుబాటులో ఉన్న వనరులను సమగ్ర వ్యవస్థలో సమర్థంగా అనుసంధానించాల్సిన అవసరం ఉందన్నారు. 2025లో జరిగిన ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావిస్తూ, పాకిస్థాన్ వద్ద ఇతర వేదికలు ఉన్నప్పటికీ ఆ సమయంలో అవి చెప్పుకోదగ్గ ప్రత్యేక ప్రభావం చూపలేకపోయాయని అన్నారు.భారత వైమానిక దళంలో యుద్ధవిమానాల సంఖ్య తగ్గుతున్న అంశంపైనా ఎయిర్ చీఫ్ మాట్లాడారు. రాబోయే సంవత్సరాల్లో ఏటా కనీసం 36 నుంచి 40 విమానాలు అవసరమని, వాటి చేరికలో జాప్యం ఇబ్బందులకు దారితీస్తుందని చెప్పారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏటా 24 కంటే ఎక్కువ విమానాలను తయారు చేయగలదని తెలిపిందన్నారు. బహుళ పాత్రల యుద్ధవిమానాల కార్యక్రమం ద్వారా కూడా సంఖ్య పెరగనుందని చెప్పారు.రష్యా తన ఐదో తరం ఎస్‌యూ-57 యుద్ధవిమానాన్ని భారత్‌కు ప్రతిపాదించిందని, అయితే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీ సింగ్ తెలిపారు. భవిష్యత్తులో కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థలు, అంతరిక్ష సామర్థ్యాలు, స్వదేశీ యుద్ధవిమాన ఇంజిన్ అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అక్టోబర్ చివరలో పదవీ విరమణ చేయనున్న ఏపీ సింగ్‌కు ఇదే చివరి వార్షిక విలేకరుల సమావేశం. ఇక ముందు ఐదో తరం యుద్ధవిమానాల చేరికతో పాటు వాటిని భారత రక్షణ వ్యవస్థలో సమర్థంగా అనుసంధానించడం, స్వదేశీ ఉత్పత్తిని పెంచడం కీలక అంశాలుగా ఉండనున్నాయి. -
ఫార్వార్డ్ బేస్‌లకు యుద్ధ విమానాలు
సాక్షి, న్యూఢిల్లీ : డ్రాగన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే దీటుగా బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల ఘర్షణతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో భారత వైమానిక దళ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా శుక్రవారం లీ, శ్రీనగర్‌లో వైమానిక స్ధావరాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో వైమానిక శిబిరాల సన్నద్ధతను సమీక్షించారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమైన క్రమంలో వైమానిక దళం యుద్ధవిమానాలను ఫార్వార్డ్ బేస్‌లకు కదలడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇండో-చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో వైమానిక దళ చీఫ్ లీ, శ్రీనగర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. చైనాతో సరిహద్దు వివాదం నెలకొన్న క్రమంలో ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకే వైమానిక దళ చీఫ్ భదౌరియా పర్యటన సాగిందని చెబుతున్నారు. కాగా తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయలో సోమవారం రాత్రి భారత్-చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. చదవండి : బయటపడ్డ చైనా కుట్ర.. తాజా ఫొటోలు! -
దేశ రక్షణలో యువత ముందుండాలి
- ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహ - ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందిన క్యాడెట్లకు పాసింగ్ అవుట్ పరేడ్ జిన్నారం: ఎయిర్ ఫోర్స్ అకాడమిలోని వివిధ రంగాల్లో శిక్షణ పొందిన క్యాడెట్లు దేశ రక్షణలో భాగస్వాములు కావాలని, యువత దేశం కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడాలని ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్‌రాహ పిలుపునిచ్చారు. శనివారం మెదక్, రంగారెడ్డి జిల్లాలోని సరిహద్దులో గల దుండిగల్ ఎయిర్స్ అకాడమీలో ఆరు నెలలుగా వివిధ రంగాల్లో శిక్షణ పొందిన క్యాడెట్లకు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరూప్‌రాహ హాజరయ్యారు. శిక్షణ పొందిన క్యాడెట్ల నుంచి అరూప్‌రాహ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆరు నెలలుగా వివిధ రంగాల్లో 193 మంది క్యాడెట్లు శిక్షణను పూర్తి చేసుకున్నారు. వీరిలో 41మంది మహిళా క్యాడెట్లు ఉన్నారు. శిక్షణ పొందిన క్యాడెట్లు మార్చ్ఫాస్ట్ను నిర్వహించారు. అన్ని రంగాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన అనిల్‌కుమార్‌ను ‘స్వార్డ్‌ఆఫ్ హానర్’గా గుర్తించి అరూప్‌రాహ ఆయనకు ఖడ్గ ధారణ చేశారు. గ్రౌండ్ డ్యూటీస్‌లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన దుర్గేష్‌కుమార్, నావిగేషన్ కోర్సులో ప్రతిభ కనబర్చిన సతీష్కుమార్లకు అరూప్‌రాహ మెమొంటోలను అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అరూప్‌రాహ క్యాడెట్లను ఉద్దేశించి మాట్లాడారు. గత ఆరు నెలలుగా వివిధ రంగాల్లో శిక్షణ పొందిన క్యాడెట్లు దేశం కోసం సేవ చేయాలని పిలుపునిచ్చారు. యువతులు, యువకులు ఈ శిక్షణలో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. నిస్వార్థంగా దేశానికి సేవలందించాలన్నారు. అనంతరం చేతక్ హెలిక్యాప్టర్, సుఖోయ్ యుద్ధ విమానాలు చేసిన పలు విన్యాసాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.


