అగర్బత్తీ కంపెనీలో అగ్నిప్రమాదం
– సుమారు రూ.50 లక్షలు నష్టం
హిందూపురం అర్బన్ : పట్టణం సమీపంలోని సడ్లపల్లి వద్ద ఉన్న దర్శన్ అగర్బత్తీ కంపెనీలో మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు రూ.50 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు కంపెనీ నిర్వాహకులు చెప్పారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించి నిల్వ ఉంచిన ముడిసరుకులు కాలి దగ్ధమయ్యాయి. సాయంత్రం కంపెనీ గోదాము మూసివెళ్లిన తర్వాత ఉన్నట్టుండి విద్యుత్ తీగలు కాలి మంటలు చెలరేగాయి.
గోదాము నుంచి దట్టమైన పొగలు వస్తుండటంతో స్థానికులు గమనించి కంపెనీ వారికి సమాచారం అందించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే ప్యాకింగ్ కోసం ఉంచిన అగర్బత్తీలు, అట్టపెట్టెలన్నీ కాలిపోయాయి. హుటాహుటిన తహశీల్దార్ విశ్వనాథ్, రూరల్ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.