Achuta rao
-
బాల్యాన్ని సంరక్షిస్తేనే భవిష్యత్తు
రెండు తెలుగు రాష్ట్రాల్లో బాల్యానికి భద్రత లేకుండా పోతోంది. వివిధ కారణాలతో పురిటి బిడ్డను వద్దనుకుని తల్లిదండ్రులు వదిలేసిన సందర్భాలకు సంబంధించి హైదరాబాద్ పరిసరాల్లో కేవలం మూడునెలల కాలంలో 68 ఘటనలు నమోదయ్యాయి. మరోవైపు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లోని ప్రభుత్వ వైద్యశాలలు కళ్లు తెరవకముందే పసిపిల్లలను యమపురికి పంపిస్తున్నాయి. ఏపీలో పసిపిల్లల్ని ఎలుకలకూ, పందులకూ బలి చేసిన ఘనతను అక్కడి ప్రభుత్వాసుపత్రులు దక్కించుకున్నాయి. రెండు వారాల క్రితం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4 ఏళ్ల బాలుణ్ణి అందరూ చూస్తుండగా ఏకంగా కుక్కలన్నీ చుట్టుముట్టి పీక్కుతిన్నాయి. ఈ ఘోరంపై అంతర్జాతీయ మీడియా సహితం ముక్కున వేలేసుకున్నా, మానవ హక్కుల కమిషన్ శ్రీముఖం జారీ చేసినా ఏపీ మున్సిపల్ శాఖ మంత్రికి చీమ కుట్టినట్లయినా లేదు. అలాగే హైదరాబాద్‌లో వీధికుక్కలు స్వైర విహారం చేస్తూ పిల్లల్ని పీక్కుతింటుంటే పట్టించుకున్న నాథుడే లేడు. ఒకవైపు జంతువుల బారిన పడి పిల్లలు ప్రాణాలు కోల్పోతుంటే, మరోవైపు పిల్లల్ని అపహరించడం, బిచ్చగాళ్ల మాఫియా ముఠాలకు తరలిం చడం, అక్రమంగా అమ్ముకోవడం యధేచ్ఛగా జరిగిపోతోంది. తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలను అక్కున చేర్చుకోవడానికి అనే మిషతో ప్రవేశపెట్టిన ఊయల పథకాన్ని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నీరుగార్చడంతో ఆ చిన్నారులు కుక్కలు, పందుల పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా ప్రి స్కూల్, బేబీ కేర్ సెంటర్లలో చేరిన పిల్లలను నిర్వాహకులు జంతువులకన్నా హీనంగా చూస్తూ వారి ఆరోగ్యం, ఎదుగుదల, ఆహారం, నిద్ర వంటి ముఖ్యావసరాలను గాలికి వదిలేస్తున్నారు. పిల్లలు కాస్త పెరిగి పాఠశాలలకు వెళితే అక్కడి గురువులు అభినవ రాక్షసుల్లా మారి నిత్యం దండిం చడం, చచ్చే పరిస్థితి తీçసుకురావడంతో 2017లో దసరా సెలవులకంటే ముందే తెలంగాణలో 28 మంది ఏపీలో 31 మంది ప్రైమరీ, హైస్కూల్ స్థాయి విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. తల్లి కడుపులో నుంచి భూమిపై పడి పెద్దవారయ్యేవరకు పిల్లలు ఇలా రకరకాల దాడులకు గురవుతూ బతుకీడుస్తుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం జైహింద్ అనండి, వందేమాతరం పాడండి, హరితహారంలో రోడ్లపై బారులు తీరండి అంటూ సెలవిస్తున్నారు. కాగా, సమస్త ప్రపంచాన్నీ తానే తీర్చిదిద్దాననే స్థాయిలో మాట్లాడే ఓ నాయకాగ్రేసరుడు ఇటీవల కొత్త గళమెత్తి, ఎక్కువమంది పిల్లల్ని కనండి లేకపోతే రోబోలు రాజ్యమేలుతాయని ఉపదేశిస్తున్నారు. ఇప్పుడున్న పిల్లలకు కనీసం రక్షిత మంచి నీరు అందించడంలో ఘోరవైఫల్యం చెందిన తమరు, ఏపీలోని తల్లులు ఇంకా పిల్లల్ని కంటే వారిని మీ దవాఖానాల్లో నెలవైన ఎలుకలకూ, పందికొక్కులకూ ఆహారంగా వేద్దామనుకుంటున్నారా స్వామీ! చివరగా, పిల్లల భవితవ్యం గురించి ఆలోచించ కుంటే బాల్యం కరువైన ఈ పిల్లలు సమాజంలో భద్రత లేక చనిపోవడమో, సంఘ వ్యతిరేక శక్తులుగా తయారవ్వడమో జరిగి తీరుతుంది. బాల్యాన్ని కాపాడండి... లేకుంటే భవిష్యత్తు లేదని పాలకులు గ్రహించాలి. అచ్యుతరావు, గౌరవాధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం ‘ మొబైల్ : 93910 24242 -
బాల్యాన్ని చిదిమేస్తున్నాం!
విశ్లేషణ ఈ మధ్య ఇళ్ల నుంచీ, బడుల నుంచీ కూడా పిల్లలు పారిపోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ జరుగుతున్న ఈ తరహా దుర్ఘటనలు ఇటు తల్లిదండ్రులను, అటు పోలీసు శాఖను కూడా పరుగులు పెట్టిస్తున్నాయి. కనీస ఆచూకీ తెలుసుకోవడానికి కూడా నెలలు పడుతున్నాయి. శాస్త్ర, సాంకేతిక నైపుణ్యం పెరిగి, అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా ఉంది. రైల్వేస్టేషన్లలో, బస్ స్టేషన్లలో రెప్ప వాల్చకుండా పనిచేసే చైల్డ్‌లైన్ వంటి సంస్థల నిఘా కూడా ఉంది. అయినా పిల్లలు, ముఖ్యంగా కౌమారంలో ఉన్న పిల్లలు ఎలా కన్నుగప్పి మాయం కాగలుగుతున్నారు? పిల్లలు అక్రమ రవాణా, కిడ్నాప్‌లకు గురైతే కొంత ప్రతిఘటన ఉంటుంది. అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు గుర్తించగలరు. కానీ తమంతట తామే వెళ్లే పిల్లలు మొహాలలో ఎటువంటి కంగారు లేకుండా, ఎదుటివారికి అనుమానం కలగకుండా జాగ్రత్త పడుతూ పాఠశాల, కళాశాల పేరుచెప్పి సరిహద్దులు దాటిపోతున్నారు. నిజానికి ఎలా పారిపోతున్నారనేకంటే, ఎందుకు పారిపోతున్నారన్నది ముఖ్యం. పిల్లలు ఎందుకు పారిపోతున్నారు? ఇది తల్లిదండ్రులతో పాటు పాఠశాలల నిర్వాహకులు కూడా వేసుకోవలసిన ప్రశ్న. ఇటీవల హైదరాబాద్ నగరానికి చెందిన పూర్ణిమ సాయి అనే బాలిక ఇలా వెళ్లిపోవడం సంచలనం సృష్టిం చింది. ఓ పూర్ణిమ సాయి, ఓ కాజల్, నర్సాపూర్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి, గాంధీనగర్‌కు చెందిన మరో అబ్బాయి వీరంతా అదృష్టవశాత్తు క్షేమంగా దొరికినా, అసలు వీరు ఇలా చేయడానికి వెనుక ఉన్న పరిస్థితులు ఏవి? పూర్ణిమకు నటన అంటే మక్కువ. కాజ ల్కు సినిమాలంటే ఇష్టం. నర్సాపూర్ పిల్లలకు సవతి తండ్రి వేధింపులు. ఇలా కారణాలు ఏమైనా వీరంతా భౌతి కంగా ఇళ్లలోనే ఉంటున్నారు గానీ, మానసికంగా అక్కడ ఇమడలేని పరిస్థితి. పిల్లలని కన్నాం కానీ, వాళ్ల అవసరాలనీ, ఆశలనీ కనడం లేదు. బడిలో చేర్చాం ఇదీ తల్లిదండ్రుల తీరు. ఫీజులు తీసుకుంటున్నాం, బట్టీయం వేయిస్తున్నాం. ర్యాంకులు రావాలని నిర్దేశిస్తున్నాం, రాకపోతే నిర్దాక్షిణ్యంగా ఉంటున్నాం ఇదీ పాఠశాలల ధోరణి. ఇటు తల్లిదండ్రులు గానీ, అటు పాఠశాలల నిర్వాహకులు గానీ పిల్లలకు బాల్యాన్ని ఇస్తున్నారా? అసలు వారు బాలలని గుర్తిస్తున్నారా? వారికి కూడా మనసూ, ఆశయాలూ ఉంటాయని గమనిస్తున్నారా? లేదంటే పిల్లలంతా నాలుగ్గోడల మధ్యనే బందీలై ఉన్నారనీ, వారికి తామే సంరక్షకులమనీ తలపోస్తున్నారా? ఒకసారి ఒక అమ్మాయి తప్పిపోయి కశ్మీర్లో దుర్భర పరిస్థితుల మధ్య దొరికింది. ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ చక్కటి సందేశం ఇచ్చారు. ఎవరికైనా వంట బట్టిందా ఆ సందేశం? లేకుంటే ఇవి పోలీసులు నేర్పుతున్న సుద్దులనుకుంటూ నిర్లక్ష్యం చేశారా? దీనిని ఎంతమంది అర్థం చేసుకున్నారో మరి! ఎంతమంది ఆచరిస్తున్నారో! ఇదీ ఆ సందేశం సారాంశం ‘మీరు పిల్లలకు ఇవ్వవలసింది అడిగినంత డబ్బు కాదు, కార్పొరేట్ విద్య కాదు, ఎక్కి తిరగడానికి కారు కాదు, డాబూ దర్పాలు అసలే కాదు. వారికి ఇవ్వవలసింది కొంచెం సమయం. అది కేటాయించండి! వారి ఆశలూ, ఆకాం క్షలూ ఏమిటో గ్రహించండి! ఆచరణ సాధ్యమా, కాదా అన్నది విశ్లేషించుకుని వాటి గురించి వివరించండి. పెద్ద పెద్ద స్కూళ్లలో వేశామని కాదు, పిల్లలు చదువుల యంత్రాలు అవుతున్నారా? జ్ఞానవంతులవుతున్నారా? ఇది గమనించండి! ర్యాంకుల కోసం, గ్రేడ్ల కోసం పాకులాడకండి! అవి మీ బిడ్డల జీవితాలను తీర్చిదిద్దడానికి ఉపకరించవు. విద్యాసంస్థలు కేవలం మీ పిల్లల పేర్లు చెప్పుకుని మరిన్ని అడ్మిషన్లు తెచ్చుకోవడానికే ఉపయోగపడతాయి’. తల్లిదండ్రులు ఏది కొనాలన్నా పదిసార్లు ఆలోచిస్తారు. అలాగే బిడ్డలని కనేటప్పుడు కూడా మీ ఆర్థిక స్థోమత, కేటాయించగలిగిన సమయాల గురించి కూడా పదిసార్లు ఆలోచించండి. కడుపున పుట్టిన పిల్లలని శిక్షించడం కాదు, చక్కని శిక్షణ ఇవ్వాలి. అప్పుడే అలాంటి ఘటనలు పునరావృతం కావు. - అచ్యుతరావు వ్యాసకర్త గౌరవ అధ్యక్షులు, బాలల హక్కుల సంఘం మొబైల్ : 93910 24242 -
‘చిన్నారి పెళ్లికూతుళ్ల’ సమస్య పట్టదా?
మహిళల్ని ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటూ ఆకాశానికి ఎత్తుతూ, పొగడ్త లతో ముంచేస్తూ, ఓ నాలుగు అవార్డులు, ఓ పది సభలు జరిపి సరిపెట్టుకుంటున్నారు. కానీ చిన్నతనంలోనే పెళ్లిళ్ల బంధంతో పుస్తెలు మెడలో వేసుకుని జీవితం మొత్తాన్ని పురుష సమాజానికి బలి పెడుతున్న బాలికా వధువుల గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల దృష్టికి వచ్చిన బాల్య వివాహాల సంఖ్య 2016లో 1350 ఉన్నా యంటే అవి ఎంత పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయో బోధపడుతుంది. ఇంత జరుగు తున్నా సంక్షేమ శాఖ అని పేరు పెట్టుకున్న స్త్రీ–శిశు సంక్షేమ శాఖకు నిధులు, నిర్వాహకులు ఉన్నప్పటికీ.. చిన్నారులు కోల్పోతున్న బాల్యం గురించిగానీ, వారి సంక్షేమం గురించిగానీ పట్టడం లేదు. కేవలం హైద రాబాద్లోనో, అమరావతిలోనో ఘనంగా స్త్రీల ఉత్స వాలను లక్షలు వెచ్చించి చేశామని అధికార, అధినాయక గణం ముందు డప్పు కొట్టుకుని సంతృప్తిపడుతూ మళ్లీ వచ్చే సంవత్సరమే కదా మాకు పని అని ఏసీ గదుల్లో సేద తీరుతున్నారు. కేవలం హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లోనే ఈ 2017 జనవరి 14 నుంచి నేటి వరకూ బాలల హక్కుల సంఘం 11 బాల్య వివాహాలను నిరోధించిం దంటే, సమాజంలో బాల్య వివాహాల జోరును అంచనా వేయవచ్చు. ఈ మహిళా దినోత్సవం రోజున కూడా హైదరాబాద్‌లో 3 బాల్య వివాహాలు జరగడం శోచ నీయం. 11 నుంచి 16 ఏళ్ల అమ్మాయిలకు వారికంటే రెండింతల వయస్సు గల పుంగవులకు కట్టబెట్టి అమ్మాయి పెళ్లి చేశామని ఊరందరికీ భోజనాలు పెట్టి తల్లిదండ్రులు సరిపెట్టుకుంటున్నారు. కానీ వారి జీవి తాన్ని చేజేతులా నాశనం చేశామని గ్రహించడం లేదు. దారిద్య్రం, అవిద్యలో కొట్టుమిట్టాడుతున్న తల్లిదం డ్రులు ఒకవైపు.. తమ అమ్మాయిలు ప్రేమ అనే నూతిలో పడతారని, వివాహం అనే చదువులో తోసే తల్లిదం డ్రులు మరోవైపు. వీరందరికీ అవగాహన కల్పించి, బాలికలను బాల్య వివాహాల నుంచి రక్షించాల్సినవారు మొద్దునిద్ర పోతున్నారు. బంగారు తెలంగాణలోని రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్‌లలో బాల్య వివాహాలు తీవ్రస్థాయిలో జరుగుతుంటే, స్వర్ణాంధ్రప్రదేశ్‌లో కర్నూలు, అనంత పురం, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, నెల్లూరు, విజ యనగరం జిల్లాల్లోని ప్రతి మండలంలో కనీసం ఎనిమిది గ్రామాల్లో బాల్య వివాహాలు జరుగుతుంటే అమాత్యులకూ, అధికారులకూ చీమకుట్టినట్లయినా లేదు. బాల్య వివాహాలు ఆపకుండా, స్త్రీ, శిశు సంక్షేమ అధికారులు, బాల్య వివాహ బాధితులకు అండగా నిలవకుండా స్త్రీ–శిశు సంక్షేమం మా ధ్యేయం.. వారిని ఉద్ధరిస్తామని ఉపన్యసించే అధికారులను, అధి నాయకులను, బాల్య వివాహాలు నిరోధిం చకుండా స్త్రీ జనోద్ధరణ ఎలా చేస్తారని నిలదీయాల్సి ఉంది. - అచ్యుతరావు గౌరవాధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం ‘ మొబైల్ : 93910 24242