ఖైదీల అప్పీలును ఆపడం తప్పు | Right to information:plea of Prisoners also should consider | Sakshi
Sakshi News home page

ఖైదీల అప్పీలును ఆపడం తప్పు

Feb 19 2016 12:58 AM | Updated on Sep 3 2017 5:54 PM

ఖైదీల అప్పీలును ఆపడం తప్పు

ఖైదీల అప్పీలును ఆపడం తప్పు

జీవిత ఖైదీకి కూడా సమాచార హక్కు ఉందని, రెండో అప్పీలుకు హాజరు కావడానికి కూడా వీలు కల్పించవలసి ఉంటుందని..

విశ్లేషణ
 జీవిత ఖైదీకి కూడా సమాచార హక్కు ఉందని, రెండో అప్పీలుకు హాజరు కావడానికి కూడా వీలు కల్పించవలసి ఉంటుందని, భద్రతా కారణాల వల్ల ఇబ్బందులు ఉంటే వేరే తేదీ కోరడమో లేక వీడియో సమావేశమో ఏర్పాటు చేయాలని కమిషన్ నిర్ధారించింది.

జైలు కూడా ప్రభుత్వ విభాగమే. అయితే అక్కడ బంధితులుగా ఉన్న ఖైదీలకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు పెట్టుకునే వీలుందా? అనే ప్రశ్న చాలా సార్లు వచ్చింది.

 భారత రాజ్యాంగం ప్రకారం కారాగార వాసు లకు, జీవిత ఖైదీలకు కూడా వాక్ స్వాతంత్య్రం ఉంటుంది. అంతే కాదు ఉరిశిక్షకు గురైన వ్యక్తి కూడా చట్టం ప్రకారం ప్రాణం  తీసే వరకు జీవించే హక్కు, వాక్ స్వాతంత్య్రం తదితర స్వాతంత్య్రాలు కలిగి ఉంటాడు. 2005 చట్టం ప్రకారం వారందరికీ సమా చార హక్కు కూడా ఉంటుంది.

 జైలు అధికారులకు ఆర్టీఐ కింద దరఖాస్తులు పెట్టుకోవచ్చు, మొదటి అప్పీలు, రెండో అప్పీళ్లు వేసు కోవచ్చు. ఆ అప్పీళ్ల విచారణలో తన కేసు చెప్పు కోవడానికి సరైన అవకాశాలు పొందే హక్కు కూడా వారికి ఉంటుంది. ఆ అవకాశాన్ని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపైన ముఖ్యంగా జైలు అధికా రులపైన ఉంటుంది. సహజ న్యాయసూత్రాల మేరకు, ఆర్టీఐ చట్టం, రాజ్యాంగం గుర్తించిన ప్రాథ మిక హక్కులతోపాటు, నిందితుడికి మొత్తం అవకా శాలు ఇవ్వాలని, సమాచారం కూడా పూర్తిగా ఇవ్వా లని నేర న్యాయ విచారణా సూత్రాలు కూడా వివరిస్తున్నాయి. కేంద్ర సమాచార కమిషన్ ముందు అప్పీలు దాఖలు చేసిన జీవిత ఖైదీ రవీందర్ కుమార్‌కు అనుమతి ఇవ్వకపోవడం అతని సమాచార హక్కు చట్టం ఉల్లంఘనే అవుతుంది.

 సర్టిఫైడ్ కాపీలు పొందే హక్కు
 వరకట్నం హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న రవీందర్ కుమార్ తను జైలుకు రాగానే వైద్యపరీక్షలు నిర్వహించారని తనకు ఆ వైద్యపరీక్షా రికార్డులు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు పెట్టుకున్నారు. అతనికి కావలసిన మొత్తం కాగితాల ప్రతులు ఇచ్చారు. కాని వాటిని సర్టిఫై చేయలేదు. కనుక మరొక ఆర్టీఐ దరఖాస్తు ద్వారా సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలని కోరాడు. ఆ రికార్డులను ధ్వంసం చేశామని, కనుక ఇవ్వడానికి కాగితాలేమీ లేవని అధికారులు జవాబిచ్చారు. మొదటి అప్పీలు అధికారి ఈ జవాబు సరైనది కాదని అడిగిన సమాచారం పదిరోజుల్లో ఇవ్వాలని తీహార్ జైలు అధికారులను ఆదేశించారు. అయినా వారు సమాచారం ఇవ్వలేదు.

 తన భార్యను హత్యచేశాడన్న ఆరోపణ రుజువై రవీందర్ తన తల్లిదండ్రులతో సహా జైల్లో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. జైలులో చేరగానే అతనికి వైద్యపరీక్షలు నిర్వహిస్తే కంటిచూపు విష యంలో లోపాలున్నట్లు తేలిందని, ఈ విష యానికి సంబంధించి ధ్రువీకరించిన పత్రాలు దొరికితే అప్పీలులో తాను నిర్దోషినని రుజువు చేసుకోగలుగు తానని రవీందర్ నమ్మకం. బందిపోట్ల దాడిలో తన భార్య మరణించిందని తన అత్తవారింటి వారు తనను ఇరికించారని రవీందర్ ఆరోపించాడు. తనకు వైద్య పరీక్ష పత్రాలు చాలా ముఖ్యమని అతను సమాచార కమిషన్ ముందు విన్నవించాడు.

 రికార్డుల ధ్వంసం
 తాను ఇచ్చిన దరఖాస్తు అందుకున్న 14 రోజుల తరువాత వైద్యపరీక్షల రికార్డులను ధ్వంసం చేశారని రవీందర్ ఆరోపించారు. విజేందర్ కుమార్ యాదవ్ (అడిషనల్ డీసీపీ 1 నార్త్ డిస్ట్రిక్ట్ ) హోదాలో రికార్డులు ధ్వంసం చేయడానికి ఉత్తర్వులు జారీ చేశారని, ఆయనే పీఐఓ హోదాలో 14 రోజుల ముందు ఆర్టీఐ దరఖాస్తు స్వీకరించారని రవీందర్ వివరించారు. ఈ అంశం అధికారులు ఇచ్చిన పత్రాలలో రుజువ వుతున్నాయని కమిషన్ భావించింది.  సమాచార దరఖాస్తు పెండింగ్‌లో ఉండగా రికార్డులు ధ్వంసం చేయడం చట్ట విరుద్ధమని, సమాచార హక్కుకు భంగకరమని ఇదివరకే ఢిల్లీ హైకోర్టు వివరమైన తీర్పు ఇచ్చింది.

 రికార్డుల తొలగింపు విధానం ప్రకారం గడువు తీరిన దస్తావేజులు సమాచార అభ్యర్థన వచ్చేనాటికి పొరబాటున తొలగించకుండా మిగిలి ఉంటే, ఆ సమాచారం దరఖాస్తు విచారణ ముగిసేలోగా కూడా తొలగించకూడదని సీఐసీ ఒక కేసులో నిర్ధారించింది.  ఈ విధంగా రికార్డులు తొలగించినందుకు సెక్షన్ 20 కింద తీహార్ జైలు అధికారిపైన ఎందుకు చర్య తీసుకో కూడదో వివరించాలని పీఐఓకు షోకాజ్ నోటీసు జారీ చేయవలసి వచ్చింది. ధ్వంసం చేశారు కనుక దొరకలేదని చెబుతున్న రికార్డులను వెతక డానికి, ప్రత్యామ్నాయమార్గాలు అన్వేషించి సమా చారం ఇవ్వడానికి ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత కూడా జైలు అధికారుల మీద ఉంది.  సమాచార నిరాకరణకు గురైన రవీందర్‌కు సరైన నష్టపరిహారం ఎందుకు ఇవ్వకూడదో వివరించాలని కూడా నోటీసు జారీ చేశారు.

హాజరు అనుమతి నిరాకరణ
 రెండో అప్పీలు విచారణకు హాజరు కావడానికి తనకు జైలు అధికారులు అన్యాయంగా అనుమతి నిరాకరిం చారని, కనుక తాను ఆరోజు రాలేకపోయానని ఖైదీ రవీందర్ ఆరోపించారు. జైలు న్యాయాధికారి ముందు అనుమతి కోరుతూ తాను పిటిషన్ వేసుకోవలసి వచ్చిందని, వారి అనుమతితో కమిషన్ ముందుకు రాగలిగానని రవీందర్ వివరించారు.

 జీవిత ఖైదీకి కూడా సమాచార హక్కు ఉందని, రెండో అప్పీలుకు హాజరు కావడానికి కూడా వీలు కల్పించవలసి ఉంటుందని, భద్రతా కారణాల వల్ల ఇబ్బందులు ఉంటే వేరే తేదీ కోరడమో లేక వీడియో సమావేశమో ఏర్పాటు చేయాలని కమిషన్ నిర్ధారిం చింది. రెండో అప్పీలులో హాజరు కావడానికి అను మతి నిరాకరించి సమాచార హక్కుకు అవరోధం కలిగించినందుకు వివరణ ఇవ్వాలని కూడా కమిషనర్ ఆదేశించారు. (రవీందర్ కుమార్ వర్సెస్ తీహార్ జైలు, CIC/SA/A/2015/001408, 15.2.2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా)

 వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
 professorsridhar@gmail.com
 మాడభూషి శ్రీధర్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement