పాలమూరు జిల్లా ప్రముఖ సాహితీ వేత్తలలో డాక్టర్ ముకురాల రామారెడ్డి (1929–2003) ముఖ్యులు.
∙నివాళి పుస్తకం
పాలమూరు జిల్లా ప్రముఖ సాహితీ వేత్తలలో డాక్టర్ ముకురాల రామారెడ్డి (1929–2003) ముఖ్యులు.
దేవరకొండ దుర్గం(ఖండకావ్యం), మేఘదూత (గేయానువాదం), నవ్వే కత్తులు (జాతీయ విప్లవ కావ్యం), హృదయశైలి (ఖండ కృతులు), సాహిత్య సులోచనాలు (వ్యాస సంపుటి) ఆయన రచనలు. ‘సాహితీ ప్రక్రియలన్నింటిలో రచనలు సాగించడం, విశేషించి పద్యకవిత, ఆంగ్ల సంస్కృత భాషల అధ్యయనం, విమర్శ, మానసిక శాస్త్రం పట్ల అభిరుచి ఆయనకు మెండుగా ఉండేవి’. ‘జీవితకాలమంతా రచనలు చేసిన ఈ మహానుభావుడు అనామకుడు కావడానికి వీలు లేదనే సంకల్పంతో’ ఆయన రచనలన్నింటిపై సమీక్షగా ఈ పుస్తకాన్ని ‘కల్వకుర్తి సాహితీ సమితి’ వెలువరించింది. సంపాదకుడు జి.యాదగిరి.
‘ఈ కొట్టకొన కొండ/ దాక రాళ్ళెత్తి, యెం/ దరి కండలిట కరిగి పోయెరా?/ ఎన్ని భీ/ కర గ్రీష్మములు తిరిగి పోయెరా?’ అంటూ సాగే దేవరకొండ కావ్యాన్ని యాదగిరి సమీక్షించారు. ‘ఒక్కొక్క గేయపాదం వెనుక నిబిడ చారిత్రకాంశాలున్నాయి. దాట వేసుకొని పోయే అవకాశం లేదు. పద్మ నాయక రాజుల చరిత్రలు సమకూర్చుకొని’ సమీక్ష సాగించానంటారు యాదగిరి. కాళిదాసు మేఘదూతము(మేఘ సందేశము)నూ, దాని అనుసృజన అయిన ముకురాల ‘మేఘదూత’నూ సంబరాజు రవిప్రకాశరావు తులనాత్మకంగా పరిశీలించారు. ‘ఒకే విషయానికి సంబంధించిన శ్లోకాలు ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కోసారి రెండు శ్లోకాలను కలిపి ఒకే గేయంగా, మరోసారి మూడింటిని కలిపి ఒకే గేయంగా రాశారు ముకురాల. దీనివల్ల పాఠకునికి కొంత విసుగు తప్పింది. అనువాదానికి ఎంచుకున్న ప్రక్రియ గేయం కావడం వలన శ్లోకార్థాలను సులభంగా వారు కలిపివేశారు,’ అంటారాయన. అలాగే, మూలంలో లేని ‘ఔచిత్యపు చేర్పు’లను కూడా పేర్కొన్నారు.
ఇంకా, కపిలవాయి లింగమూర్తి, శ్రీరంగాచార్య, కసిరెడ్డి వెంకటరెడ్డి, వై.రుక్మాంగద రెడ్డి, గిరిజా మనోహర్ బాబు, అప్పం పాండయ్య వంటివారు రామారెడ్డి ఇతర రచనలపై చేసిన సమీక్ష వ్యాసాలు ఇందులో ఉన్నాయి. అలాగే, ముకురాల రాసిన ‘విడిజోడు’, ‘క్షణకోపం– కోపక్షణం’, ‘సర్కారు కిస్తు’ కథలను అనుబంధంగా ఇచ్చారు.
డాక్టర్ ముకురాల రామారెడ్డి సాహితీ సమీక్ష; సంపాదకుడు: జి.యాదగిరి; పేజీలు: 288; వెల: 250; ప్రతులకు: బొజ్జ కిష్టారెడ్డి, శ్రీసాయి రెసిడెన్సీ, 12–104/4/ఒ, ప్లాట్ నం.9, కళ్యాణ్‌నగర్ ఎదురుగా, కల్వకుర్తి, మహబూబ్‌నగర్. ఫోన్: 9441228499