హోదాపై కపట నాటకం

హోదాపై కపట నాటకం - Sakshi


 విశ్లేషణ

చంద్రబాబు ఒక విషయంలో పట్టుదలతో ఉన్నారు. రాష్ట్రానికి న్యాయం జరగకున్నా ఆయన ఎన్డీఏను వీడి రారు. అధికారం వదులుకోరు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు వైఖరి గురించి ప్రజలకు పూర్తి అవగాహన వచ్చింది.

 

 ‘కంట్రోల్ యువర్‌సెల్ఫ్’ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునా యుడు ఆగస్టు 2న తన కార్యాలయంలో జరిపిన మీడియా సమావేశంలో ఒక ప్రశ్న వేసిన పత్రికా రచయి తను ఉద్దేశించి చేసిన హెచ్చ రిక ఇది. ప్రత్యేక హోదా అంశం మీద ఆరోజునే ఏపీలో విపక్షాలన్నీ బంద్ నిర్వహించాయి. దీనిని విఫలం చేయాలని చంద్ర బాబు ప్రభుత్వం తన వంతు కృషి చేసింది. ఆ సాయంత్రమే ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి, బంద్ విజయవంతం కాలేదని ప్రకటించారు. బంద్‌తో ఆర్టీసీకి జరిగిన నష్టం గురించి ఏకరువు పెట్టారు. అప్పుడే ‘కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో మాట్లాడానని అంటున్నారు కదా, ఆయన సమాదానానికి మీరు తృప్తి చెందారా?’ అని ఒక విలేకరి ప్రశ్నించాడు. సీఎంకు ఉక్రోషం వచ్చింది. ‘నువ్వు ఢిల్లీ రా, అక్కడకొచ్చి వ్యాసాలు రాయి, దేశమంతా తెలుసుకుంటారు’ అని అసహనం ప్రక టించారు. విలేకరులు సొంత అజెండాతో, పత్రికల అజెండాతో మాట్లా డుతున్నారని, తాను మాత్రం రాష్ట్ర శ్రేయస్సునే దృష్టిలో ఉంచుకుంటానని అన్నారు. మీడియాను ఆయన అవమానకరంగా, అభ్యంతర కరంగా మాట్లాడడం కొత్తకాదు.

 

ప్రత్యేక హోదా డిమాండ్‌తో బంద్ జరిపితే, కీర్తంతా విపక్షాలకు వెళ్లిపోకుండా ఒకరిద్దరు తెలుగు దేశం నేతలు కూడా దీక్షలు చేశారు. పార్లమెంట్‌లో వైఎస్‌ఆర్‌సీపీ, తెలుగుదేశం నేతలు ప్లకార్డులతో నిర సన తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు చట్టప్రకారం ఇవ్వవ లసినదంతా ఇస్తాం. చంద్రబాబుతో నేను మాట్లా డాను’ అని కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ చెప్పారు. అంటే పాత వాదనే వినిపించారు. జూలై 31న చంద్రబాబు పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించి, మీడియా ముందుకు వచ్చారు. ‘ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రా నికి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నా’ అన్నారు. అన్ని విషయాలలోనూ కేంద్రం వివక్ష, అలసత్వం చూపుతోందని విమర్శించారు. ఎంపీల సమావేశంలో ఆయన ఆవేదనతో మాట్లాడా రనీ, తన రక్తం మరిగిపోతోందనీ, మోదీ రెండు గంటలు దృష్టి పెడితే  మొత్తం సమస్యలు పరిష్కార మవుతాయనీ ఆక్రోశించారనీ వార్తలొచ్చాయి. గల్లీ నేతల చేత కూడా విమర్శలు గుప్పించారు. ఇంత హంగామా చేసిన చంద్రబాబు 48 గంటలు తిరిగే సరికి మళ్లీ అసలు స్వరూపం ప్రదర్శించారు. ముల్లు, అరిటాకు అంటూ అసంబద్ధమైన పోలిక కూడా తెచ్చారు. ఆయన దృష్టిలో ఢిల్లీ ముల్లు. ఆంధ్రప్రదేశ్ అరిటాకు. మోదీ, బీజేపీ నేతలు ఇచ్చిన హామీలను అమలు జరపాలంటూ నిలదీసే హక్కు కలిగిన ఏపీని ఆయన అరిటాకుతో పోల్చారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నేతల కాళ్ల దగ్గర తాకట్టు పెట్టడమంటే ఇదే. ఇంకొక కొత్త భాష్యం కూడా విని పంచారాయన. విపక్షాలు ఆందోళన చేయవల సింది రాష్ట్రంలో కాదట, ఢిల్లీలోనట. ఆయన విపక్ష నేతగా ఉన్న పదేళ్లలో చేసిన బంద్‌లు ఎన్ని? వరి కనీస మద్దతు ధర పెంపు కేంద్రానిదేనని తెలిసినా అప్పట్లో ఆయన అసెంబ్లీని స్తంభింపచేసి, ఆదర్శ్‌నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆమరణ నిరశన పేరుతో ఎని మిది రోజులు ఎందుకు దీక్ష చేశారు? అరిటాకులా తయారైనది టీడీపీయే తప్ప రాష్ట్రం కాదు.

 

మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2014, 15,16 బడ్జెట్‌లలో ప్రత్యేక హోదాకు సంబంధించి ఒక్క మాట లేదు. రైల్వే బడ్జెట్‌లోనూ అన్యా యమే. హుద్‌హుద్ తుపాను నష్టం రూ. 22,000 కోట్లు. కేంద్రం ప్రక టించినది రూ. 1,000. ఇచ్చినది రూ. 830 కోట్లు. కరువు నివారణకు రూ. 2,270 కోట్లు కోరితే, అన్ని రాష్ట్రాల కంటే తక్కువగా రూ. 347 కోట్లు ప్రకటించి, చివరికి రూ.280 కోట్లు విదిలించారు. ఇవికాకుండా, ఇస్తామన్న ప్రత్యేక హోదా మీద మళ్లీ దాగుడు మూతలు. రెండేళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతి మరే ఇతర రాష్ట్రాలలోను జరగలేదు. పట్టిసీమ మొదలు, పుష్కరాల వరకు సమస్తం అవినీతి మయం. రెవెన్యూలో 45 శాతం అవినీతి, మొత్తంగా ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి 24 శాతం పెరిగాయి. మోదీ చేయించిన సర్వేలో చంద్రబాబుకు 13వ స్థానం వచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మొదటి స్థానం లభించింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లయిడ్ ఎననమిక్ రిసెర్చ్ సంస్థ చేసిన సర్వేలోనూ ఆంధ్రప్రదేశ్‌కు అవినీతి విషయంలో ప్రథమ స్థానం దక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి బీజేపీ నేతలు నిర్దిష్టమైన కొన్ని హామీలు ఇచ్చారు. వాటిని నెరవేర్చ వలసిన రాజ్యాంగ, చట్టపర, నైతిక బాధ్యత వారి మీద ఉన్నది. కానీ చంద్రబాబు ఒక విషయంలో పట్టుదలతో ఉన్నారు. రాష్ట్రానికి న్యాయం జరగ కున్నా, అవమానాలు ఎదురవుతున్నా ఆయన ఎన్డీ ఏను వీడి రారు. అధికారం వదులుకోరు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి గురించి ప్రజలకు పూర్తి అవగాహన వచ్చింది.
(వ్యాసకర్త : సి.రామచంద్రయ్య, ఎమ్మెల్సీ, కౌన్సిల్‌లో విపక్షనేత)

 మొబైల్ : 8106915555

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top