రైతుకు ‘ఆదాయ విధానం’

రైతుకు ‘ఆదాయ విధానం’ - Sakshi


విశ్లేషణ

దేశ రైతాంగంలో 6 శాతానికి మాత్రమే కనీస మద్దతు ధరల వల్ల మేలు జరుగుతుంది. మిగతా వారంతా మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిందే. పైగా, సేకరణ ధరలు మొత్తం పంటల విలువలో 10 శాతం పరిమితికి మించరాదని ప్రపంచ వాణిజ్య సంస్థ సుస్పష్టంగా నిర్దేశించింది. కాబట్టి కనీస మద్దతు ధరను మరింత పెంచడానికి ఉన్న అవకాశం బాగా కుదించుకు పోతోంది. దీనితో ‘ధరల విధానానికి’ కాలం చెల్లిపోయింది. దాని స్థానే ‘ఆదాయ విధానం’ రావాల్సి ఉంది అనే అవగాహన అవసరం.

 

 ప్రభుత్వం ఈ సెప్టెంబర్‌లో వ్యవసాయేతర కార్మికుల కనీస వేతనాలను 42 శాతం పెంచింది. దీంతో  ప్రస్తుతం రోజుకు రూ. 246 గా ఉన్న కనీస వేతనం రోజుకు రూ. 351కి పెరు గుతుంది. అంటే నెలకు రూ. 9,100 అవుతుంది.  కార్మిక సంఘాలు మాత్రం ఈ విషయంలో అసంతృప్తితోనే ఉన్నాయి. ‘సి’ కేటగిరీ కార్మికుల కనీస చట్టబద్ధ వేతనం రూ. 18,000గా ఉండాలని అవి కోరుతున్నాయి. అదలా ఉంచితే, ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల పెంపుదల వ్యవసాయేతర కార్మి కులకు మాత్రమేనని గమనించే ఉంటారు. ప్రభుత్వం ప్రకటిం చిన ఈ కనీస వేతనాలను వ్యవసాయ కార్మికులకు ఎందుకు వర్తింప చేయకూడదు? అని ప్రశ్నించాల్సి ఉంది. ఏదేమైనా వ్యవ సాయ కార్మికులు కూడా కష్టించి పనిచేస్తున్నారు. తర చుగా రోజుకు 12 గంటలకు పైగా కూడా పనిచేస్తుంటారు. వ్యవసాయ కార్మికులకు లభించే అత్యుత్తమ వేతనం ఏదైనా ఉన్నదంటే అది మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులలో సంపాదించేదే.

 


ఇది న్యాయం కాదనేది స్పష్టమే. నిజానికి దేశంలోని రైతులలో 50 శాతానికి పైగా భూమిలేని వారేనని 2011 జనాభా లెక్కలు తెలుపుతున్నాయి. అంటే వారు వ్యవసాయేతర కార్మికుల వర్గం కిందికే వస్తారు. అయినా వారికి చట్టబద్ధమైన కనీస వేతనాన్ని నిరాకరిస్తున్నారు. 2017 ఆర్థిక సర్వే ప్రకారం 17 రాష్ట్రాలలోని రైతు కుటుంబాల సగటు ఆదాయం ఏడాదికి రూ. 20,000 లేదా నెలకు రూ. 1,667 మాత్రమే. అలాంటప్పుడు భూమిలేని రైతులకు ఏమి లభిస్తోందా అని ఆశ్చర్యం వేస్తుంది. బహుశా రోజుకు రూ. 50 కావచ్చు. మనిషి జీవన వేతనమేనా ఇది?

 

కాలం చెల్లిన ‘ధరల విధానం’

రైతాంగానికి ప్రత్యేకంగా ఒక ఆదాయ కమిషన్ అవసరమని నేను కోరేది ప్రాథమికంగా అందుకే. అదే వ్యవసాయేతర కార్మికుల కనీస వేతనాలను కూడా లెక్కగడుతుంది. రైతుల కోసం ఇప్పటికే కనీస మద్దతు ధరల యంత్రాంగం (ఎమ్‌ఎస్‌పీ) ఉండగా, ఇంకా రైతులకు విడిగా ఒక ఆదాయ కమిషన్ కావాలనడంలోని హేతుబద్ధత ఏమిటో వివరించమని తరచుగా నన్ను అడుగుతుంటారు. అదీ కూడా దేశవ్యాప్తంగా రైతాంగమంతా... ఉత్పత్తి వ్యయంపై 50 శాతం లాభాన్ని సూచించిన స్వామినాథన్ కమిటీ సూచనలను అమలు చేయమంటుండగా మనకు విడిగా కమిషన్ అవసరం ఏమిటి? అదే సరిపోదా? అని అడుగుతుంటారు.

 

ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధరలో భాగంగా రైతులకు 50 శాతం లాభం లభించాలనే విషయాన్ని నేనూ అంగీకరిస్తున్నాను. కాకపోతే దేశ  రైతాంగంలో 6 శాతానికి మాత్రమే ఈ కనీస మద్దతు ధరల వల్ల మేలు జరుగుతుంది. మిగతా వారంతా మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలపై ఆధార పడాల్సిందేననే వాస్తవం అలాగే నిలిచి ఉంటుంది. పైగా, సేకరణ ధరలు మొత్తం పంటల విలువలో 10 శాతం పరిమితికి మించరాదని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) సుస్పష్టంగా నిర్దేశించింది. కాబట్టి కనీస మద్దతు ధరను మరింత పెంచడానికి ఉన్న అవకాశం బాగా కుదించుకు పోతోంది. కాబట్టి ‘ధరల విధానానికి’ కాలం చెల్లిపోయింది. దాని స్థానే ‘ఆదాయ విధానం’ రావాల్సి ఉంది అనే విషయంలో సుస్పష్టంగా ఉందాం.   

 

వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ సేకరణ ధరలను లెక్కించే పద్ధతిని పరిశీలిస్తే నాకో విషయం తెలిసి వచ్చింది. ఆ ధరలు బొటాబొటిగా ఉత్పత్తి వ్యయమూ,  దానిలో 10 శాతం లాభానికీ మాత్రమే సరిపోతుంది. ఆ కొద్దిపాటి లాభం కూడా నిర్వహణా వ్యయంగానే లెక్క. మరోవంక, వ్యవసాయేతర కార్మికుల వేతనాలను 1957 నాటి ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సూచనల ఆధారంగా లెక్కిస్తారు. వాటి ప్రకారం, కనీస వేతనానికి కనీస మానవ అవసరాలు ప్రాతిపదికగా ఉండాలి.  ఆ



కనీస అవసరాలకు కొన్ని ప్రమాణాలను నిర్దేశించారు:

 1. ప్రామాణిక కార్మిక కుటుంబం అంటే.. మహిళలు, పిల్లలు, కౌమార్యంలోని పెద్ద పిల్లల ఆర్జనను లెక్కలోకి తీసుకోకుండా ఒక సంపాదనాపరునికి మూడు వినియోగ యూనిట్లు.

 2. ఓ మోస్తరు పనిపాట్లు చేసే సగటు భారత వయోజనుడు నికరంగా వినియోగించాల్సింది 2,700 కేలరీలు.

 3. ఏడాదికి తలసరి వస్త్ర వినియోగం 18 గజాలు. అంటే నలుగురు     సభ్యుల సగటు కార్మిక కుటుంబానికి ఏడాదికి  72 గజాలు.

 4. అల్ప ఆదాయ వర్గాలకు సబ్సిడీ పారిశ్రామిక గృహ పథకం కింద అందించే కనీస వైశాల్యపు వసతికి సమానమైన ఇంటి అద్దె.

 5. ఇంధనం, దీపాలు తదితర చిల్లర మల్లర ఖర్చులు కనీస వేతనంలో 20 శాతంగా ఉంటాయి.

 

రైతులకు కనీస అవసరాలు ఉండవా?

కనీస వేతనాన్ని లెక్కించడానికి 1991లో సుప్రీంకోర్టు మరో ఆరు ప్రాతిపది కలను చేర్చిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక నివేదికలో తెలిపింది. అవి: పిల్లల విద్య, వైద్యపరమైన అవసరాలు, పండుగలు, ఆచార వ్యవహారాలు సహా కనీస వినోదం, వృద్ధాప్యానికి పొదుపు, పెళ్లి. ఇవి కనీస వేతనంలో 25 శాతంగా ఉండాలని సుప్రీంకోర్టు కోరింది. వీటికి తోడు కనీస వేతనంలో కరువు భత్యం భాగంగా ఉండాలి. మూడేళ్లకు ఒకసారి కరువు భత్యాన్ని మూల వేతనంలో కలిపేయాలి.


ఏటా 23 పంటలకు కనీస మద్దతు ధరలను సూచించే వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ (సీఏసీపీ) సుప్రీం కోర్టు పేర్కొన్నట్టుగా ఆరు కనీస ప్రాతిపదికలను ఎందుకు ప్రకటించడం లేదు. ఈ భత్యాలలో వేటినైనా రైతులకు చెల్లిస్తున్నట్టు మీరు ఎన్నడైనా విన్నారా? రైతుల ఆదాయాన్ని లెక్కించ డానికి ఉన్న మార్గం ఒక్క కనీస మద్దతు ధర మాత్రమే. కాబట్టి కనీస మానవ అవసరాలను రైతులకు నిరాకరించడానికి లేదా వాటిని సేకరణ ధరలో చేర్చాల్సిన అవసరాన్ని గుర్తించక పోవడానికి కారణం నాకైతే ఏమీ కనిపించడం లేదు.

 

ఏడవ పే కమిషన్‌ను అనుసరించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందనున్న 108 అలవెన్సులను నేనేమీ కోరడం లేదు. కేవలం రైతులకు విద్య, వైద్యం, గృహ వసతి, ప్రయాణ భృతులను మాత్రమే ఇవ్వాలని కోరు తున్నాను. 1966లో హరిత విప్లవాన్ని ప్రారంభించిన నాటి నుంచి వరుసగా 50 ఏళ్లుగా రైతులకు జీవన వేతనాలకు నిర్దేశించి ఆరు ప్రాతిపదికలతో కూడిన అవసరాలపై ఆధా రపడిన సేకరణ ధరలను నిరాకరిస్తున్నారు. ఏటేటా వ్యవసాయరంగం కష్టాలు పర్వతంలా ఎలా పేరుకు పోతున్నా యంటే, అవి గత 20 ఏళ్లుగా ఏటా 3 లక్షల మంది రైతులను ఉరి కంబం ఎక్కించడంలో ఆశ్చర్యమేం లేదు.

 

రైతుల ఆదాయ, సంక్షేమ కమిషన్ కావాలి

స్వామినాథన్ కమిటీ నివేదికను అమలు చేయాలని కోరడం వల్ల న్యాయం జరగదని రైతు నేతలు అర్థం చేసుకుని తీరాలి. ఒకటి, స్వామినాథన్ నివేదిక అమలు వల్ల కనీస మద్దతు ధరకు తమ ఉత్పత్తులను అమ్ము కోగలిగిన 6 శాతం రైతులకు మాత్రమే మేలు కలుగుతుంది. మిగతా 94 శాతం నష్ట పోయిన వారిగానే మిగిలిపోతారు. రెండు, కనీస మద్దతు ధరను డబ్ల్యూటీఓ నిర్దేశించిన అనుమతించదగిన పరిమితికి మించి పెంచలేక పోవడం వలన ప్రభుత్వం రైతులకు నిజ ధరలను చెల్లించకుండా నిరాకరిస్తూనే ఉంటుంది. అందువల్లనే రైతు కుటుంబానికి కనీస నెలసరి ఆదాయానికి హామీని ఇచ్చే ప్యాకేజీని రూపొందించే రైతు ఆదాయ కమిషన్ ఏర్పాటు అవసరం.



కనీస వేతనాల చట్టం, 1948కి సవరణను చేసి కాంట్రాక్టు కార్మికులకు కూడా ఆ ప్రయోజనాలను విస్తరింపజేయాలని కార్మిక సంఘాలు కోరు తున్నాయి. పది కార్మిక సంఘాలు ఒక్కటై కార్మిక హక్కుల కోసం పోరాడిన తీరును చూసి రైతు నేతలు నేర్చుకోవాలి. వారు కూడా ఈ ఆదాయ సమస్యలపై ఒకే అవగాహనను రూపొందించుకుని సీఏసీపీ పరిగణనలోకి తీసుకునే అంశాల ప్రాతిపదికలను మార్చేలా ఒక సవరణను కోరాలి. సీఏసీపీ ఇకపై వివిధ పంటల ఉత్పత్తి వ్యయాలను లెక్కించడానికి మాత్రమే పరి మితం కారాదు. రైతులకు కనీస మానవ అవసరాల ప్రాతిపదికపై ఆధారపడ్డ నెలసరి ఆదాయ ప్యాకేజీని లెక్కగట్టే దిశగా దృష్టిని కేంద్రీకరించాలి. కాబట్టి  వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ (సీఏసీపీ) పేరును ‘రైతుల ఆదాయ, సంక్షేమ కమిషన్’గా మార్చాలి.

 


దేవిందర్‌శర్మ

వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు

 ఈమెయిల్ : hunger55@gmail.com

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top