నాటి దురాగతాలకు నేటి ప్రాయశ్చిత్తం

నాటి దురాగతాలకు నేటి ప్రాయశ్చిత్తం - Sakshi


సందర్భం

జనజీవన స్రవంతికి దూరంగా శాపగ్రస్త జీవితం గడిపిన దళితులకు ప్రాయశ్చిత్తంగా అదనపు సౌకర్యాలు ఇచ్చి ముందుకు తీసుకురావడం సమంజసమే. సబ్‌ప్లాన్‌ రూపంలో అధిక నిధులు కేటాయిస్తే దళిత వికాసం సాధ్యపడుతుంది



ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ ద్వారా కొన్ని డిమాండ్ల సాధనకు ఈ మధ్య కొన్ని ప్రజా సంఘాలు, ఆ వర్గం నుంచి ఎదిగిన ఉన్న తాధికారులు, మాజీ అధికారులు ఏర్పాటు చేసిన ఒక సమావేశానికి వెళ్లాను. ప్రస్తుతం ఈ సబ్‌ ప్లాన్‌ కింద ఎస్సీ, ఎస్టీ అభ్యున్నతికి వినియోగించిన నిధులు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే వినియోగించాలి. ఒకవేళ మిగిలిపోతే మరుసటి సంవత్సరానికి బద లాయించే అవకాశం లేదు. అవి అలాగే మురిగిపోతాయి. ఇలా కాకుండా మిగిలిన నిధులను మరుసటి ఏడాదికి మిగిల్చి, కొత్త సంవ త్సరంలో మళ్లీ కేటాయించే నిధులను వీటికి కలపాలన్న డిమాండ్‌ వ్యక్తమయింది.



ఈ ప్లాన్‌ కింద జనాభా నిష్పత్తి ఆధారంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మొత్తం బడ్జెట్‌లో వాటాను కేటాయిస్తున్నారు. దీనితో పాటు ఈ వర్గాలకు తరతరాల నుంచి జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది వారిని ఇప్పటికైనా ప్రధాన జీవన స్రవంతిలో కలిపేందుకు అదనపు నిధులు కేటాయించాలన్న మరో డిమాండ్‌ వచ్చింది. వీటిపై వక్తలు తమ, తమ అభిప్రాయాలు చెబుతున్నారు. అయితే నేను ఈ సమావేశంలో పెద్దగా మాట్లాడలేదు. మౌనంగా వింటూ కూర్చున్నాను. సాధారణంగా నేను  పాల్గొన్న ఏ సమావేశంలోనైనా నేను అభిప్రా యాలు చెప్పి వస్తాను. కానీ ఎందుకో ఈ సమావేశంలో మాట్లాడ లేకపోయాను. బహుశా నేను మాట్లాడని సమావేశంగా ఇది మిగిలి పోయిందేమో కానీ నాలో సుడులు తిరిగిన జ్ఞాపకాల నుంచి బయ టపడలేక నేను గళం విప్పలేదు. అయితే సమావేశంలో చర్చకు వచ్చిన రెండు డిమాండ్లు నాకు సమంజసంగానే అన్పించాయి. ముఖ్యంగా ఈ వర్గాలకు తరతరాల నుంచి జరిగిన అన్యాయానికి నేను ప్రత్యక్ష సాక్షిని.



వరంగల్‌ జిల్లా ఘనపూర్‌కు 12 మైళ్ల దూరంలో ఉంది మా ఊరు. మా ఊరుకు పోస్ట్‌ ఘనపూర్‌ నుంచే వచ్చేది. అవి 1940 దశ కంలో రోజులు. ఏదైనా దుర్వార్త ఉంటే దానిని దళిత కులానికి చెందిన మనిషి గంట కొట్టుకుంటూ మా ఊరుకు మోసుకొచ్చేవాడు. అలా మా ఊరికి గంట కొట్టుకుంటూ ఒక మనిషి వచ్చాడు అంటే అది దుర్వార్త కింద ఊరంతా ఉలిక్కి పడేది. ఆ మనిషి ఏ గడప దగ్గర ఆగుతాడన్న కలవరపాటుకు గురయ్యేవారు. నిమ్న కులానికి చెందిన మనుషులు దుర్వార్తలను తీసుకొస్తూ అశుభానికి గుర్తుగా నిలిచే వారు. వారి నివాసం ఊరి చివరే. ఒకవేళ ఊళ్లోకి వస్తే చెప్పులు చేత్తో పట్టుకు నడవాలి. రహదారిపై ఉన్నత కులాల వారికి ఎదురు రాకూ డదు. సామాజికంగా మిగతా ఉన్నత కులాల వారితో ఎక్కడా సమా నంగా లేకుండా ఆచార వ్యవహారాలుండేవి. వాటిని ధిక్కరిస్తే  కఠిన శిక్షలుండేవి. అలాగే దళితులు ఫత్తేదారు కావడానికి అవకాశం లేదు. ఫత్తేదారు అంటే భూయజమాని. ఆ అవకాశం ఉన్నత కులాల వారికే. కుంట నేలకైనా వీరు సొంత దారులు కాలేరు. భూ రిజిస్ట్రేషన్లకు వారు అర్హులు కారు. అందుకే వారికి సొంత ఆస్తి అనేది ఉండేది కాదు. ఆ విధంగా ఆర్థికంగా దళితులు సొంత కాళ్లపై నిలబడే అవ కాశం లేదు. ఎంతకాలమైనా ‘బాంచను దొర నీ కాల్మొక్తా’ అంటూ ఇతరులపై ఆధారపడి అశుద్ధ పనులకే అంకితం కావాలి.



ఈ విధమైన అమానుష, దురాగతాలను ఈ జాతి ఎన్నో శతాబ్దాల పాటు మౌనంగా భరించింది. మేమప్పుడే స్కూలు చదువు పూర్తి చేసుకొని ఉన్నాం. అస్పృశ్యతా నివారణకు గాంధీజీ పిలుపునకు యావత్‌ జాతి స్పందించే కాలం. ఆ సమయంలో మా ఊళ్లో నేను కొంత మందితో కలసి మాదిగ వాడలలోకి వెళ్లి వారి యోగ క్షేమాలు తెలుసుకొనేవాళ్లం. అయితే వాళ్లు చాలా భయపడేవారు ‘వద్దు! మా ఇండ్లకు రావద్దు’ అని వారించేవారు ‘ ఏం పాపం చేశామో! మా బతుకులు ఇంతే. మీరు మా కొంపలకు వచ్చి పాపం అంటిం చుకోవద్దు’ అనేవారు అయినా మేము వారిని కలుపుకునేందుకు ప్రయత్నించే వాళ్లం.



ఈ విషయం తెలిసి ‘కులం కట్టుబాటు తప్పావు’ అంటూ మా కుటుంబాన్ని వెలివేసారు. అదే సమయంలో మా ఇంట్లో ఒక శుభకార్యం వచ్చింది కానీ నేను అంటరాని వాళ్ల ఇంటికి వెళ్లానన్న నెపంతో మా ఇంటికి ఎవరూ రాలేదు. మా అమ్మ చాలా బాధ పడింది. అప్పటికే నాన్న చనిపోయాడు. అమ్మ బాధ చూడలేని వయస్సు నాది కానీ నేను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. నేను బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టి ఉండవచ్చు కానీ తోటి మనుషుల ఇళ్లకు వెళ్లడంలో తప్పేమిటి? ఇదే విషయం మా అమ్మ అడిగింది– ‘నా కొడుకు చేసిన పాపం ఏమిటి?’ అని ‘అస్పృశ్యుల ఇళ్లకు వెళ్లడమే నీ కొడుకు చేసిన అపరాధం’ అంటూ ‘పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తం చేయించుకోవాలంటే బంగారు తీగను బాగా కాల్చి నాలుకపై అడ్డంగా కొద్దిసేపు ఉంచాలి. అదే శిక్ష’ అంటూ కుల పెద్దలు చెప్పారు. మా అమ్మ ‘నా కొడుకు ఏ తప్పు చేయలేదంటూ’ నాకు అండగా నిల బడింది.



జనజీవన స్రవంతికి దూరంగా శాపగ్రస్త జీవితం గడిపిన దళి తులకు ప్రాయశ్చిత్తంగా అదనపు సౌకర్యాలు ఇచ్చి ముందుకు తీసుకురావడం సమంజసమే. ఇందుకు అనుగుణంగా డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ రాజ్యాంగంలో ఈ వర్గాలకు కొన్ని వెసులుబాటు కల్పిం చడం వల్ల విద్యా, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు, సబ్‌ప్లాన్‌ వంటివి కార్యరూపం దాల్చాయి. ఫలితంగా సివిల్‌ సర్వీసెస్‌ నుంచి వివిధ రంగాలలో ఉన్నత స్థానాలలోకి దళిత ప్రతిభ వికసిస్తోంది. మాధ వరావు, మాజీ ఐఏఎస్‌ వంటి వారు పాలనా వ్యవస్థలో ఉన్నత స్థాయికి చేరారు. సబ్‌ప్లాన్‌ రూపంలో అధిక నిధులు కేటాయిస్తే  దళిత వికాసం సాధ్యపడుతుంది. నిధులు రెండు రకాలుగా ఉంటాయి. సాధారణ అభివృద్ధికి ఉద్దేశించిన నిధి. రెండోది వేగవంతమైన అభి వృద్ధికి నిర్దేశించిన నిధి. ఈ రెండు మార్గాల్లో నిధులు కేటాయిస్తే దళితులకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుంది. ప్రస్తుత అవకాశాలు వినియోగించుకునేందుకు మద్దతు ఇవ్వడం ఒక మార్గమైతే గత తప్పులు, పాపాల దిద్దుబాటుకు మరికొంత అదనపు సహకారం అందివ్వడం ద్వారా వివక్ష లేని సమాజ అవతరణకు దారి ఏర్పడు తుంది. అందుకు సబ్‌ప్లాన్‌ బలమైన ఆయుధం కావాలి.





- చుక్కా రామయ్య


వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త,

శాసనమండలి మాజీ సభ్యులు.

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top