రుచుల పిచికారీ... | today holi special sweets | Sakshi
Sakshi News home page

రుచుల పిచికారీ...

Mar 14 2014 10:26 PM | Updated on Sep 2 2017 4:42 AM

రుచుల పిచికారీ...

రుచుల పిచికారీ...

రంగులు పూసుకుని పండగ చేసుకునేది మనుషులేనా...? పాపం... మానవులు ఒక రోజే రంగేసుకుంటారు గానీ... స్వీట్లకు నిత్యం హోలీయే! రంగులతో మోళీయే!!

రంగులు పూసుకుని పండగ చేసుకునేది మనుషులేనా...?
 పాపం... మానవులు ఒక రోజే రంగేసుకుంటారు గానీ...
 స్వీట్లకు నిత్యం హోలీయే! రంగులతో మోళీయే!!
 జీవితం ఎప్పుడూ పచ్చగా వెలిగిపోవాలనే పర్వాల్ స్వీట్.
 బ్రౌన్‌తో షైనవుతూ లవ్ చేయాలనిపించేలా లవంగ్ లతిక.  
 రుచికి హి‘మలాయ్’లాంటిదే తెల్లటి మలాయ్ శాండ్‌విచ్.
 క్రీమ్ కలర్‌తో రుచుల డ్రీమ్‌లో తేలియాడేలా చేసే మలాయ్ ఖీర్.
 గుల్‌కండ్ స్టఫ్‌డ్ మలాయ్ పేడా... శ్వేతసౌధం లాంటి తెల్లటి మేడ.
 ఇలా రంగులన్నీ స్వీట్ల సొంతం... స్వీట్లకే సొంతం...
 టింగురంగా అంటూ మీ టంగుకు రుచి నేర్పడానికి...
 ఈ రంగుల పండగనాడు మీ కిచెన్‌లో హంగు చేయడానికి...
 వస్తున్న, మేం అందిస్తున్న హోలీ స్వీట్లకు స్వాగతం పలకండి.
 మీ మేనితో పాటు మీ నాలుకకూ రుచిరంగులద్దండి.

 
 మలాయ్ ఖీర్
 
 కావలసినవి:
 సేమ్యా - ముప్పావు కప్పు; పాలు - 2 లీటర్లు; కండెన్స్‌డ్ మిల్క్ - టిన్; పచ్చికోవా - 50 గ్రా.; మీగడ - అర కప్పు
 (100 గ్రా.); పంచదార - కప్పు (200 గ్రా.)
 ఏలకులపొడి - టీ స్పూను; కుంకుమపువ్వు - టీ స్పూను; బాదం పలుకులు - 50 గ్రా.
 పిస్తా పప్పులు - 50 గ్రా.
 
 తయారి:
 ఒకపాత్రలో నీరు మరిగించి, సేమ్యా వేసి ఉడికించాలి  
 
 పాత్రలో పాలు మరిగాక, మంట తగ్గించి, ఉడికించి ఉంచుకున్న సేమ్యాను ఇందులో వేయాలి  బాగా ఉడికాక, కండెన్స్‌డ్ మిల్క్, పచ్చి కోవా వేసి పది నిమిషాలు ఉంచాలి  
 
 మీగడ, పంచదార, ఏలకులపొడి, కుంకుమపువ్వు, బాదం పలుకులు, పిస్తా పప్పులు వేసి కలిపి దించేయాలి. వేడివేడిగా వడ్డించుకోవాలి.
 
  పర్వాల్ స్వీట్
 
 కావలసినవి:
 పర్వాల్ (చిన్నగా ఉండే కీర దోస) - అర కిలో; పంచదార - 300 గ్రా.;
 స్టఫింగ్ కోసం; పచ్చి కోవా - 250 గ్రా.; పంచదార - 50 గ్రా.; బాదం పప్పులు - 50 గ్రా.; పిస్తా పప్పులు - టేబుల్‌స్పూను; ఏలకుల పొడి - టీ స్పూను
 
 తయారి:
 పర్వాల్‌లను శుభ్రంగా కడిగి పైన చెక్కు తీసి, మధ్యకి నిలువుగా గాటు పెట్టి, గింజలు తీసేయాలి. (విరిగిపోకుండా జాగ్రత్తపడాలి. లేదంటే స్టఫింగ్ చేయడం కుదరదు)  
 
 ఒక పాత్రలో నీరు పోసి మరిగించాలి
 
 మరుగుతున్న నీటిలో పర్వాల్ వేసి మూడు నిమిషాలయ్యాక, స్టౌ ఆర్పేసి, గిన్నె మీద మూత ఉంచి, అరగంటసేపు పక్కన ఉంచాలి
 
 నీళ్లు పూర్తిగా వడపోసేయాలి  
 
 ఒక పాత్రలో నీళ్లు, పంచదార, ఏలకులపొడి వేసి స్టౌ మీద ఉంచి, తీగపాకం వచ్చేవరకు మరిగించాలి  
 
 పర్వాల్‌ను పాకంలో వేసి, రంగు మారేవరకు ఉంచి కిందకు దించి, మూత పెట్టి, సుమారు గంటసేపు అలాగే ఉంచాలి
 
 స్టౌ మీద పాన్ ఉంచి, అందులో పచ్చికోవా వేసి లేత గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి, దించి చల్లార్చాలి  
 
 బాదంపప్పులను, పిస్తా పప్పు లనుమిక్సీలో వేసి పొడి చేసి, పంచదారం పాకంలో వేసి బాగా కలపాలి  
 
 పాకంలో ఉన్న పర్వాల్‌లను బయటకు తీసి, మధ్యకు జాగ్రత్తగా కట్ చేసి తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని అందులో స్టఫ్ చేసి, దగ్గరగా నొక్కాలి
 
 వీటిని ఫ్రిజ్‌లో ఉంచితే, సుమారు వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి.
 
 మలాయ్ పూరీ
 
 కావలసినవి:
 మీగడ - కప్పు; మైదాపిండి - కప్పు; పాలు - కొద్దిగా; నూనె - డీప్ ఫ్రైకి సరిపడేంత; నీళ్లు - 3 కప్పులు; పంచదార - 3 కప్పులు; కుంకుమపువ్వు - చిటికెడు; ఏలకుల పొడి - టీ స్పూను; పిస్తా పప్పులు - టీ స్పూను; నెయ్యి - టీ స్పూను
 
 తయారి:  
 ఒక పెద్ద పాత్రలో మీగడ, మైదా, పాలు వేసి బాగా మెత్తగా అయ్యేవరకు కలిపి 20 నిముషాలు పక్కన ఉంచాలి  
 
 ఒక పాత్రలో పంచదార, నీళ్లు, ఏలకుల పొడి వేసి స్టౌ మీద ఉంచి పాకం తయారుచేయాలి
 
 స్టౌ మీద బాణలిలో టీ స్పూను నెయ్యి వేసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న మీగడ + మైదా + పాలు మిశ్రమం టీ స్పూనుడు వేసి వేయించి, తీసి పంచదార పాకంలో వేయాలి  
 
 ఇలా అన్నీ తయారుచేసుకుని, ఐదు నిమిషాల తర్వాత సర్వింగ్ డిష్‌లోకి తీసుకోవాలి  
 
 మిగిలి ఉన్న పాకాన్ని వీటి మీద పోసి, పిస్తాలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
 
 గుల్‌కండ్స్టఫ్‌డ్ మలాయ్ పేడా
 
 కావలసినవి:
 పాలపొడి - కప్పు; మీగడ - అర కప్పు; పంచదార - 3 టేబుల్ స్పూన్లు; గుల్‌కండ్ - 3 టేబుల్ స్పూన్లు (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది); ఏలకుల పొడి - కొద్దిగా; నెయ్యి లేదా వెన్న - పావు టీ స్పూను; గులాబీ రేకలు - కొద్దిగా
 
 తయారి:  
 పాన్‌లో నెయ్యి వేసి కరిగించాలి  
 
 పొలపొడి, మీగడ, గుల్‌కండ్ వేసి బాగా కలిపి మంట తగ్గించి, ఆపకుండా కలుపుతుండాలి  ఈ మిశ్రమం నెమ్మదిగా పాత్రను విడిచిపెట్టి, గట్టిపడుతుండగా దింపి, ఒక పళ్లెంలో పోయాలి. (మరీ ఎక్కువ గట్టిపడితే బాగుండదు)  
 
 బాగా చల్లారాక పంచదార, ఏలకుల పొడి వేసి కలపాలి  
 
 ఫ్రిజ్‌లో ఉంచి 10 నిమిషాల తర్వాత బయటకు తీసేయాలి  
 
 ఈ మిశ్రమాన్ని పది సమాన భాగాలుగా చేసి, అచ్చులలో ఉంచాలి  
 
 ఒక్కో పేడాలోకి, పావు టీ స్పూను గుల్‌కండ్ మిశ్రమం ఉంచి, అచ్చును మూసేసి, జాగ్రత్తగా తీయాలి
 
 గులాబి రేకలతో గార్నిష్ చేయాలి.
 
 లవంగ్ లతిక
 
 కావలసినవి:
 మైదా - కప్పు; నూనె - 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు - పావు టీ స్పూను; నీరు - తగినంత స్టఫింగ్ కోసం: పచ్చికోవా తురుము - కప్పు; పంచదారపొడి - అర కప్పు; కొబ్బరితురుము - 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు పలుకులు - 2 టేబుల్ స్పూన్లు; బాదంపప్పు పలుకులు -  2 టేబుల్ స్పూన్లు; పిస్తా తరుగు -  2 టేబుల్ స్పూన్లు; ఏలకులపొడి - పావు టీ స్పూను; నూనె - డీప్‌ఫ్రైకి తగినంత
 
 పంచదారపాకం కోసం:

 పంచదార - ఒకటిన్నర కప్పులు; నీరు - కప్పు; కుంకుమపువ్వు - చిటికెడు; లవంగాలు - 3;
 
 తయారి:
 ఒక పాత్రలో మైదాపిండి, నూనె, ఉప్పు వేసి కలపాలి
 
 నీళ్లు జత చేస్తూ చపాతీపిండిలా కలుపుకుని, పైన తడి వస్త్రం వేసి అరగంటసేపు పక్కన ఉంచాలి
 
 ఒక పాత్రలో పచ్చి కోవా తురుము, పంచదారపొడి, కొబ్బరి తురుము, జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు, పిస్తా తరుగు, ఏలకులపొడి వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచాలి  ఒక పెద్ద గిన్నెలో పంచదార, నీళ్లు, కుంకుమపువ్వు, లవంగాలు వేసి స్టౌ మీద ఉంచి పంచదార కరిగాక మంట తగ్గించాలి  
 
 మైదాపిండిని చపాతీలా పల్చగా ఒత్తి, అందులో టేబుల్ స్పూన్ కోవా మిశ్రమం ఉంచి, రోల్ చేసి, రెండుపక్కల మడతలు వేసి (బొమ్మలో చూపిన విధంగా), లవంగాలు గుచ్చాలి
 
 బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచుకున్న లవంగ్ లతికలను వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి
 
 పంచదార పాకంలో వేసి సుమారు 20 నిమిషాల తరవాత తీసి, సర్వ్ చేయాలి.
 
 సేకరణ: డా. వైజయంతి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement