అనువైన రకాలను ఎంచుకోండి

అనువైన రకాలను ఎంచుకోండి - Sakshi


పాడి-పంట: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే కంది పైరు వేసుకున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను ఆసరాగా చేసుకొని మరికొందరు ఇప్పుడిప్పుడే విత్తనాలు విత్తుకుంటున్నారు. కంది దీర్ఘకాలిక పంట కావడంతో పలు రకాల పురుగులు, తెగుళ్లు ఆశించి దిగుబడులపై ప్రభావం చూపుతుంటాయి. కాబట్టి చీడపీడలను తట్టుకుని, మంచి దిగుబడులను అందించే అనువైన రకాలను ఎంచుకోవాలని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన పరిష్కారం కాల్ సెంటర్ కో-ఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎ.ప్రతాప్ కుమార్ రెడ్డి, శాస్త్రవేత్తలు డాక్టర్ పి.స్వర్ణశ్రీ, డాక్టర్ యస్.హేమలత, డాక్టర్ వై.సునీత (వీరిని తెలంగాణ రైతులు 1800-425-1110, ఆంధ్రప్రదేశ్ రైతులు 1800-425-4440 మొబైల్ ఫోన్ నెంబర్లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సంప్రదించవచ్చు) సూచిస్తున్నారు. ఆ వివరాలు...

 

 కాయలను తొలుస్తాయి


 కాయలను తొలిచే శనగపచ్చ పురుగులు పూత, పిందె దశల్లో కంది పైరును ఆశిస్తాయి. ఇవి కాయలకు రంధ్రాలు చేసి, గింజలను తినేస్తాయి. ఈ పురుగుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఐసీపీఎల్-332 (అభయ), ఎల్‌ఆర్‌జీ-41 రకాలు వేసుకోవడం మంచిది. పురుగు ఆశించినప్పటికీ తిరిగి పూతకు వచ్చే ఎల్‌ఆర్‌జీ-30 (పల్నాడు), 38 రకాలు కూడా అనువైనవే. విత్తనాలు వేసిన 90-100 రోజులకు చిగుళ్లను ఒక అడుగు మేరకు కత్తిరించాలి. ఎకరానికి 4 లింగాకర్షక స్థావరాలను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు పురుగు ఉనికిని గమనిస్తూ తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఎకరానికి 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేస్తే పక్షులు వాటిపై వాలి, పురుగులను పట్టుకొని తినేస్తాయి. బాగా ఎదిగిన పురుగులు కన్పిస్తే వాటిని ఏరేయాలి. లేదా చెట్టు కింద దుప్పటి పరిచి, చెట్టును బాగా ఊపితే పురుగులు ఆ దుప్పటిలో పడతాయి. అప్పుడు వాటిని నాశనం చేయాలి.

 

  పురుగు గుడ్లను, తొలి దశ పురుగులను నాశనం చేయడానికి 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేసుకోవాలి. ఎకరానికి 200 లీటర్ల నీటిలో 200 లార్వాలకు సమానమైన ఎన్‌పీవీ ద్రావణాన్ని కలిపి వారం రోజుల వ్యవధితో రెండుసార్లు సాయంకాలం వేళ పిచికారీ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ మందులను సకాలంలో ఉపయోగించనట్లయితే పురుగు ఉధృతిని బట్టి లీటరు నీటికి 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్‌ఫాస్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అయినప్పటికీ పురుగుల తాకిడి తగ్గకపోతే చివరిగా లీటరు నీటికి ఒక మిల్లీలీటరు ఇండాక్సాకార్బ్ లేదా 0.3 మిల్లీలీటర్ల స్పైనోశాడ్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి.

 

 ఇవి కూడా...

 మరుకా మచ్చల పురుగులు మొగ్గ, పూత, పిందె దశల్లో పైరును ఆశిస్తాయి. పూత దశలో పూలను గూడుగా చేసుకొని లోపలి పదార్థాలను తింటాయి. కాయలకు రంధ్రాలు చేసి, లోపలి గింజలను తినేస్తాయి. ఈ పురుగుల నివారణకు లీటరు నీటికి 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా ఒక గ్రాము ఎసిఫేట్/థయోడికార్బ్ లేదా ఒక మిల్లీలీటరు ల్యాండా సైహలోత్రిన్/డైక్లోరోవాస్ చొప్పున కలిపి వారం రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారీ చేయాలి. ఆకుచుట్టు పురుగులు ఆకులు, పూతను చుట్టగా చుట్టుకొని లోపలి పదార్థాలను గీరి తినేస్తాయి. వీటి నివారణకు లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్‌ఫాస్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

 

 ఈ తెగుళ్లు దాడి చేస్తాయి

 ఫ్యూజేరియం ఎండు తెగులు సోకిన కంది మొక్క పూర్తిగా లేదా పాక్షికంగా ఎండుతుంది. ఎండిన మొక్కను పీకి కాండం మొదలు భాగాన్ని చీల్చి చూస్తే గోధుమ రంగులో నిలువు చారలు కన్పిస్తాయి. ఐసీపీఎల్-87119 (ఆశ), 8863 (మారుతి) రకాలు ఈ తెగులును తట్టుకుంటాయి. తెగులు సోకిన తర్వాత దానిని నివారించేందుకు మందులేవీ అందుబాటులో లేవు. వెర్రి (స్టెరిలిటీ మొజాయిక్) తెగులు సోకిన మొక్కకు లేతాకుపచ్చ రంగులో అనేక చిన్న చిన్న ఆకులు వస్తాయి.

 

 మొక్కలకు పూత రాదు. ఈ తెగులు నల్లి ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి దాని నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల గంధకం (నీటిలో కరిగే) లేదా 4 మిల్లీలీటర్ల కెల్‌థేన్ చొప్పున కలిపి వారం రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారీ చేయాలి. ఐసీపీఎల్-87119, 85063 (లక్ష్మి), బీఎస్‌ఎంఆర్-853, 736 రకాలు ఈ తెగులును తట్టుకుంటాయి. మాక్రోఫోమినా ఎండు తెగులు సోకితే కాండం పైన నూలు కండె ఆకారంలో ముదురు గోధుమ రంగు మచ్చలు కన్పిస్తాయి. తెగులు సోకిన మొక్క లేదా మొక్కలోని కొన్ని కొమ్మలు ఎండిపోతాయి. ఎంఆర్‌జీ-66 రకం ఈ తెగులును తట్టుకోగలదు.

 

 అదుపులో ఉంచాలి

 కంది పైరును నష్టపరిచే చీడపీడల్లో కాయ తొలుచు పురుగు, ఆకుచుట్టు పురుగు, మరుకా మచ్చల పురుగు, ఎండు తెగుళ్లు, వెర్రి తెగులు ప్రధానమైనవి. పైరు పూతకు వచ్చే వరకూ పురుగు మందులు వాడాల్సిన అవసరం లేదు. అయితే పూత, పిందె సమయంలో దాడి చేసే శనగపచ్చ, మరుకా, కాయ తొలుచు పురుగులను ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకుంటే మంచి దిగుబడులు వస్తాయి.

Read latest Vanta-Panta News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top