సేంద్రియ చెరకు రసం ఏడాది పొడవునా అధికాదాయం!

సేంద్రియ చెరకు రసం ఏడాది పొడవునా అధికాదాయం! - Sakshi


పాలేకర్, చోహన్‌ క్యూ ప్రకృతి సేద్య పద్ధతులను

అనుసరిస్తున్న తూ. గో. జిల్లాకు చెందిన యువ కౌలు రైతు

చెరకు సాగులో అధిక దిగుబడులు.. రసం తీసి

విక్రయించడంతో ఏడాది పొడవునా అధిక నికరాదాయం

టన్ను చెరకుకు మిల్లు ధర రూ. 1,800.. సేంద్రియ చెరకు రసంతో ఐదు రెట్ల ఆదాయం




గతంలో పంట బాగా పండితే చాలు రైతుకు అదృష్టం కలిసి వచ్చినట్టేనని భావించేవారు. కానీ ప్రపంచీకరణ నేపథ్యంలో మంచి ధర లభించక రైతుకు చెరకు సాగు చేదవుతోంది. అందుకే  కొత్తపోకడలను ఆకళింపు చేసుకున్న ఓ యువ కౌలు రైతు ఏడాది పొడవునా లాభాల తీపిని రుచిచూస్తున్నాడు. తన పొలం దగ్గరే రసాయనిక అవశేషాల్లేని నాణ్యమైన, పరిశుభ్రమైన చెరకు రసాన్ని విక్రయిస్తూ అధిక నికరాదాయం గడిస్తున్నాడు.



తాను పండించిన చెరకును తోటి రైతుల్లా కంపెనీకి విక్రయించకుండా రసం తీసి విక్రయించటం ద్వారా అధికంగా నికరాదాయం ఆర్జిస్తున్న ఆ ఆదర్శ రైతు పేరు మేడపాటి వీరారెడ్డి. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలంలోని గోపాలపురం ఆయన స్వగ్రామం. ఇంటర్‌ వరకు చదివిన ఆయన కిరాణా దుకాణం నడిపేవారు. వ్యవసాయం చేసిన అనుభవం లేకపోయినా.. ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుల విజయగాథలను గురించి పత్రికలు, ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకొని స్ఫూర్తి పొంది, ప్రకృతి వ్యవసాయం చేపట్టారు.

 

ఆ క్రమంలో బెంగళూరులో ప్రకృతిసేద్యంలో సాగవుతున్న చెరకు తోటల సందర్శనకు ఉద్యానశాఖ అధికారులు వీరారెడ్డిని తీసుకువెళ్లారు. అక్కడ పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయ పితామహుడు పాలేకర్‌ సూచించిన పద్ధతిలో చెరకు సాగు చేయటాన్ని స్వయంగా చూశాడు. 2015లో జాతీయ రహదారికి ఆనుకొని తన ఇంటి పక్కనే ఉన్న ఐదు ఎకరాల నల్లరేగడి పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు.



పెట్టుబడిలేని ప్రకృతి సేద్య విధానంతోపాటు దక్షిణ కొరియాకు చెందిన ప్రకృతి సేద్య నిపుణుడు చోహన్‌క్యూ పద్ధతులను న్యూలైఫ్‌ ఫౌండేషన్‌ ద్వారా తెలుసుకొని చెరకును సాగు చేస్తున్నారు. ఫిష్‌ అమైనో ఆసిడ్, లాక్టిక్‌ ఆసిడ్‌ బ్యాక్టీరియా, పొగాకు ద్రావణం, మట్టి ద్రావణం, నువ్వు మోళ్ల ద్రావణం, అరటి బోదెల ద్రావణం, అల్లం+బెల్లం, వెల్లుల్లి+ బెల్లం ద్రావణం వంటి అనేక ద్రవరూప ఎరువులను నిపుణుల సూచన మేరకు సొంతంగా స్వల్ప ఖర్చుతోనే తయారు చేసుకొని తగిన మోతాదులో చెరకు పంటకు వాడుతున్నారు. వీటితోపాటు క్రమం తప్పకుండా జీవామృతం, పంచగవ్యలను పంటకు అందిస్తున్నారు.

 

30 వరకు పిలకలు..

తొలి ప్రయత్నంగా 2016 ఫిబ్రవరిలో ప్రయోగాత్మకంగా ఎకరాలో చెరకు సాగుకు వీరారెడ్డి ఉపక్రమించారు. పొలాన్ని దుక్కి చేసి 20 టన్నుల పశువుల ఎరువు వేశారు. రసం అధికంగా ఉండే వీ–46 చెరకు రకాన్ని సాగు చేస్తున్నారు. 21 రోజుల వయసున్న మొక్కలను నాటారు. ఎండ, గాలి బాగా తగిలేలా సాళ్ల మధ్యలో 6 అడుగులు, మొక్కల మధ్య 2 అడుగుల ఎడంలో.. ఎకరాకు పాతిక వందల మొక్కలు నాటారు.  నాటిన 45 రోజుల తర్వాత పక్క పిలకలు వచ్చేందుకు మొక్క మొవ్వును కత్తిరించారు.



 2017 జనవరి నుంచి పక్వానికి వచ్చిన గడలను వచ్చినట్టు ఏరోజుకారోజు నరికి రసాయనిక అవశేషాల్లేని తాజా చెరకు రసం తీసి విక్రయిస్తున్నారు. ఒక్కో చెరకు గడ 2 కిలోల బరువుంది. ఒకసారి గడలు నరికిన దుబ్బులో పెరిగే పిలకలు 3 నెలల్లో పెరిగి పక్వానికి వస్తున్నాయి. ఒక్కో దుబ్బుకు 25–30 పిలకలు వస్తున్నాయి. తొలుత ఐదారు గడలు మాత్రమే ముదిరి పక్వానికి వస్తాయి. వీటిని నరికిన తరువాత మిగిలిన పిలకలు గడలుగా పెరుగుతాయి. ఎండిన చెరకు ఆకును తగులబెట్టకుండా పొలంలోనే నేలపై ఆచ్ఛాదనగా వేస్తున్నారు. బోరు నీటిని బిందు సేద్య పద్ధతిలో అందిస్తున్నారు.



ఎకరానికి 70 టన్నుల దిగుబడి

సాధారణ విధానంలో దుబ్బుకు ఐదారు గడలు వస్తాయి. అయితే ప్రకృతి సేద్య పద్ధతిలో దూరంగా నాటిన మొవ్వు కత్తిరించిన మొక్కకు మాత్రం 20–30 పిలకలు వచ్చి, దిగుబడి రెట్టింపైంది. మొదటి ఆరు నెలల్లోనే 30 టన్నుల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం పొలంలో మరో 20 టన్నుల పంట ఉంది. రానున్న ఆరు నెలల్లో కొత్తగా పెరిగే చెరకు గడల వల్ల మరో 20 టన్నుల పంట దిగుబడి వస్తుంది. ఈ లెక్కన ఎకరాలో ఏడాదికి 70 టన్నుల వరకు దిగుబడి వస్తున్నది. రసాయన సేద్యంలో 30–40 టన్నుల దిగుబడి మాత్రమే వస్తుందని వీరారెడ్డి చెప్పారు. చెరకులో అంతర పంటగా నేలలో నత్రజనిని స్థిరీకరించే ద్విదళ పంట అయిన మినుమును సాగు చేశారు. క్వింటాన్నర దిగుబడి వచ్చింది. రూ. 15 వేల ఆదాయం లభించింది.



రెండు స్టాళ్ల ద్వారా చెరకు రసం విక్రయం

గోపాలపురంలోని తన పొలం వద్ద, సమీపంలో ఉన్న రావులపాలెం సెంటరులోనూ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ముందుగా చెరకు గడలను ఉప్పు నీటి ద్రావణంలో కడుగుతారు. గడలను ముక్కలు చేసి ట్రేలలో పెట్టుకొని స్టాల్స్‌కు తరలించి రసం తీస్తారు. 300 మి. లీ గ్లాసు రసం రూ. 20 చొప్పున, లీటరు రూ. 60 చొప్పున విక్రయిస్తున్నారు. రుచికరమైన చెరకు రసం లభిస్తుండటంతో ఈ స్టాల్స్‌ ప్రజాదరణను చూరగొన్నాయి. లాభసాటిగా ఉండటంతో రానున్న రోజుల్లో సాగు విస్తీర్ణం పెంచడంతోపాటు వేరువేర్వు ప్రాంతాల్లో స్టాల్స్‌ ఏర్పాటు చేస్తానని వీరారెడ్డి తెలిపారు.

 

కూలీలు, మొక్కల కొనుగోలు, బోదెలు ఏర్పాటుకు ఎకరాకు రూ. లక్ష ఖర్చయింది. రసాయనిక సేద్యంలో పండించి ఫ్యాక్టరీకి అమ్మితే టన్ను చెరకుకు వచ్చే ధర రూ. 1,800 మాత్రమే. బెల్లం తయారుచేసినా రైతుకు నికరంగా మిగిలేది ఎకరాకు రూ. 30 వేలు మాత్రమే. ఈ విషయాన్ని అవగాహన చేసుకోవటం వల్ల వీరారెడ్డి తాను పండించిన చెరకును తానే రైతు రసం తీసి విక్రయిస్తున్నారు. ఐదు రెట్ల అధికంగా నికరాదాయం  పొందుతున్నాడు.



జడలు అల్లే పని లేదు..

అచ్చు పద్ధతిలో సాళ్లు, మొక్కల మధ్య దూరం పెరగటం వల్ల గాలి, వెలుతురు అధికంగా లభించి ఎలాంటి  చీడపీడలు, తెగుళ్లు పంటను ఆశించలేదు. మొక్కలు దూరంగా ఉండటం వల్ల జడలు అల్లాల్సిన అవసరం తప్పి కూలీల ఖర్చు రైతుకు ఆదా అయింది. సాధారణంగా చెరకు పంటకాలం రెండేళ్లు. ప్రతి రెండేళ్లకోసారి పంటను విత్తుకునేందుకు ఎకరాకు రూ. 25 వేల వరకు రైతుకు ఖర్చవుతుంది. అయితే, వీరారెడ్డి అనుసరిస్తున్న అచ్చు పద్ధతిలో తొలి ఏడాది రూ. 10 వేలు ఖర్చు చేస్తే చాలు..  10–12 ఏళ్ల వరకు పంట తీసుకోవచ్చు.



 సాధారణంగా చెరకు సాగు చేసే రైతులకు ఏడాదిలో ఒక్కసారే ఆదాయం వస్తుంది. ఈ విధానంలో రైతుకు ఏడాదంతా పంట, ఆదాయం వస్తుంది. చీడపీడలు, తెగుళ్ల బెడద తగ్గి రైతుకు నికరాదాయం పెరుగుతుంది. ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది. అన్నింటికి మించి ఆరోగ్యకరమైన సేంద్రియ చెరకు రసం ఉత్పత్తులు లభిస్తున్నాయి. లా సాటిగా ఉండటంతో 2017 ఫిబ్రవరిలో ఎకరాలో, జులైలో మరో 2 ఎకరాల్లో చెరకు మొక్కలు నాటారు.



రైతులు సంశయం వీడాలి..

చెరకును ఆరుగాలం పండించినా రైతుకు గిట్టుబాటు కావటంలేదు. ఏడాదంతా కష్టపడితే రైతు పొందే ఆదాయానికన్నా, దాన్ని కొనుగోలు చేసిన వ్యాపారి 10 రెట్ల లాభంపొందుతున్నాడు. రైతులకు గిట్టుబాటుకావాలంటే ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలి. మొదట్లో కొంచెం కష్టంగా ఉండొచ్చు. రైతులు ధైర్యం చేసి.. సంశయం వదిలి రంగంలోకి దిగాలి. లేకుంటే ఎన్నాళ్లైనా అప్పుల తిప్పలు తప్పవు.  రైతులు పంట పండించడమే కాదు. దిగుబడులను నేరుగా అమ్మకుండా .. ఉత్పత్తులుగా మార్చి తమ ప్రాంతంలో వినియోగదారులకు నేరుగా విక్రయించాలి. ఇది కూడా దేశసేవే. శీతల పానీయాల కంపెనీల వ్యాపారంలో పదో వంతును చేజిక్కించుకున్నా రైతులు స్థిరమైన నికరాదాయం పొందగలరు.

– మేడపాటి వీరారెడ్డి (98497 95139),

సేంద్రియ చెరకు రైతు, గోపాలపురం, రావులపాలెం మండలం, తూర్పు గోదావరి జిల్లా



– కొవ్వూరి ఆదినారాయణరెడ్డి, సాక్షి,

రావులపాలెం, తూ. గో. జిల్లా

Read latest Vanta-Panta News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top