అది భారత్ విజయమా, పాక్ విజయమా?

అది భారత్ విజయమా, పాక్ విజయమా?


(సాక్షి వెబ్ ప్రత్యేకం)

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌తో 1965లో జరిగిన యుద్ధం 50వ వార్షికోత్సవాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ఎందుకు ఘనంగా జరపాలని నిర్ణయించింది. ఇంతవరకు ఎప్పుడు కూడా, ఏ భారత ప్రభుత్వం కూడా 1965 నాటి యుద్ధమే కాకుండా 1971లో మరోసారి పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధాన్ని కూడా విజయోత్సవంగా జరుపుకోలేదు. కేవలం ఆ యుద్ధాల్లో మరణించిన అమర జవాన్లకు నివాళులు అర్పించేందుకు మాత్రమే పరిమతమైంది. మరి ఇప్పుడు  ఆగస్టు 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 23వ తేదీ వరకు దాదాపు పాతిక రోజుల పాటు విజయోత్సవాలు జరుపుకోవాలని ఎందుకు నిర్ణయించింది?1965లో పాకిస్తాన్, భారత్ మధ్య కేవలం 17 రోజులపాటే హోరాహోరీ యుద్ధం జరిగితే, ఎందుకు పాతిక రోజులు విజయోత్సవాలు జరుపుతున్నారనే అనుమానం ఎవరికైనా రావచ్చు. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి సెప్టెంబర్ 23వ తేదీ వరకు ప్రత్యక్ష యుద్ధం జరగ్గా, ఎందుకు ఆగస్టు 28వ తేదీనే భారత విజయోత్సాహంగా పరిగణిస్తున్నాం? పాకిస్తాన్ సెప్టెంబర్ ఆరవ తేదీని భారత్‌పై విజయంగా కాకుండా ‘డిఫెన్స్ డే’గా జరుపుకుంటోంది. ఎందుకు ఇరు దేశాలు 1965లో జరిగిన యుద్ధంలో తాము గెలిచామంటే తామే గెలిచామంటూ ఈ రోజు వరకు భుజాలు ఎగరేస్తున్నాయి. ఇరు దేశాల మధ్య జరిగినది యుద్ధమేనా? అసలేం జరిగింది?ఏ దేశాల మధ్య యుద్ధం జరిగిన ముందుగా ఆయా దేశాల మధ్య దౌత్య కార్యాలయాలు మూతపడతాయి. గోప్యంగా ఉంచాల్సిన ఫైళ్లను వీలుంటే మాతృదేశాలకు తరలిస్తారు. అలాంటి అవకాశం లేనప్పుడు వాటిని తగల పెడతారు. 1965లో ఇటు భారత్‌లో పాకిస్థాన్ ఎంబసీగానీ, అటు పాకిస్థాన్‌లో భారత ఎంబసీగానీ మూతపడలేదు. సరిహద్దుల్లో జరుగుతున్నది సాధారణంగా జరిగే కాల్పులా లేక యుద్ధమా అన్న విషయం సంధి కుదిరినాకా కూడా ఇరు దేశాల రాయబారులకు తెలియదు.యుద్ధ సమయంలో పాకిస్తాన్‌లోని కరాచీలో భారత హై కమిషనర్‌గా పని చేసిన కేవల్ సింగ్ ఇలాంటి సందేహాలే వ్యక్తం చేశారు. యుద్ధం విషయంలో తనకు ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడంతో తన డిప్యూటీ కమిషనర్‌ను పాకిస్తాన్ విదేశాంగ శాఖ వద్దకు పంపించారు. ఆశ్చర్యంగా తాము కూడా పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉందన్న సమాధానం వచ్చింది. ఎప్పటికీ సమాధానం రాలేదు. ఈ విషయాన్ని కేవల్ సింగ్ ‘పార్టిషన్ అండ్ ఆఫ్టర్‌మాథ్: మెమర్స్ ఆఫ్ ఎన్ అంబాసిడర్’ అనే పుస్తకంలో రాశారు. అదే సమయంలో ఢిల్లీలో డిప్యూటీ హైకమిషనర్‌గా వున్న అఫ్జల్ ఇక్బాల్ కు కూడా ఇలాంటి సందేహాలే వచ్చాయి. వాటిని నివృత్తి చేసిన వాళ్లు ఎవరూ లేరు. తర్కం కోసం నాడు జరిగింది యుద్ధమే అనుకున్నా....అందుకు కారణం ఏమిటి? భారత్ ఎందుకు ఆగస్టు 28వ తేదీని యుద్ధం విజయోత్సాహంగా జరుపుకుంటోంది ? ఈ ప్రశ్నలకు కూడా చరిత్ర సమాధానం చెబుతోంది. కాశ్మీర్‌లోని ‘హాజి ఫిర్ పాస్’ వ్యూహాత్మకంగా భారత్‌కు కావాల్సిన ప్రాంతం. ఆ ప్రాంతాన్ని ఆక్రమించకున్నట్టయితే కాశ్మీర్, శ్రీనగర్ మధ్య ఎందో దూరం తగ్గుతుంది. అంతేకాకుండా 'హాజి ఫిర్ పాస్’ పాక్ తీవ్రవాదులకు అడ్డాగా ఉండేది. 'హాజి ఫిర్ పాస్’ను ఆగస్టు 28వ తేదీన భారత సైన్యం ఆక్రమించుకుంది. దీనికి ప్రతిచర్యగా పాకిస్తాన్ సెప్టెంబర్ ఒకటవ తేదీన ఎదురుదాడిని ప్రకటించింది.  ఆరవ తేదీన భారత సైనిక దళాలకు వ్యతిరేకంగా ప్రత్యేక పోరుకు దిగింది. అందుకనే ఆ దేశం ఇప్పటికీ విజయోత్సవ దినోత్సవంగా కాకుండా ‘డిఫెన్స్ డే’గా జరుపుకుంటోంది. అప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రిగా వున్న హెచ్‌బీ చవాన్ సెప్టెంబర్ ఆరవ తేదీన లోక్‌సభలో మాట్లాడుతూ హాజీ ఫిర్ పాస్‌లో భారత సైనికులు ఉన్నట్లు అంగీకరించారు.సంఘర్షణ లేదా యుద్ధం కారణంగా ఇరు దేశాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుండడంతో రష్యా, అమెరికా దేశాలు మధ్యవర్థిత్వం వహించి ఇరు దేశాల మధ్య ‘తాష్కంట్ ఒప్పందం’ కుదుర్చాయి. ఈ ఒప్పందం కింద ఆక్రమించుకున్న ‘హాజి ఫిర్ పాస్’ను తిరిగి పాకిస్థాన్‌కు అప్పగించేందుకు అప్పుడు ప్రధాన మంత్రిగా ఉన్న లాల్ బహుదూర్ శాస్త్రీ అంగీకరించి డిక్లరేషన్‌పై సంతకం చేశారు. అలాంటప్పుడు ‘హాజి ఫిర్ పాస్’ను  భారత్ ఆక్రమించుకున్న రోజు మనకు ఎలా విజయోత్సవ దినం అవుతుంది. సంఖ్యల విషయంలో మనదే విజయమని చెప్పుకోవచ్చు. ఆ నాటి యుద్ధంలో 2,862 మంది భారత సైనికులు, 5,800 మంది పాకిస్తాన్ సైనికులు మరణించగా, భారత్ 97 యుద్ధ ట్యాంకులు, పాకిస్తాన్ 450 యుద్ధ ట్యాంకులు నష్టపోయాయి.  భారత్ కోల్పోయిన 2,862 మంది అమర వీరులకు శుక్రవారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు.-నరేందర్ రెడ్డి

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top